ఉపశుష్క శీతోష్ణ స్థితి ( తెలంగాణ జాగ్రఫీ)
ఒక ప్రాంత ప్రజా జీవనాన్ని ఆ ప్రాంత శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. ఒక ప్రాంత శీతోష్ణస్థితి ఆ ప్రాంతం భౌగోళిక స్థానం, సౌరపుట పరిమాణం, ఆర్దత, పీడనం, వీచేగాలులపై ఆధారపడుతుంది. తెలంగాణలో ఉపశుష్క వాతావరణం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో భిన్నంగా ఉంటుంది.
శీతోష్ణస్థితి
-తెలంగాణ ప్రాంతం భూ పరివేష్టిత రాష్ట్రంగా ఉండి, సముద్ర ప్రాంతానికి దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో ఉపశుష్క ప్రాంతానికి చెందిన వాతావరణం ఉంటుంది. వాతావరణం పొడిగాను, వేడిగాను ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర శీతోష్టస్థితి భారతదేశ శీతోష్ణస్థితిని పోలి ఉంటుంది. కొప్పన్ వర్గీకరణ ప్రకారం ఉపశుష్క లేదా ఉప ఆర్ద వాతావరణానికి చెందుతాయి.
– తెలంగాణ ప్రాంతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఖండాతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంది.
– తెలంగాణ ప్రాంతం కర్కాటకరేఖకు దిగువన ఉండటం, పీఠభూమి ప్రాంతంలో ఉండి సముద్ర తీరానికి దూరంగా ఉండటం వల్ల సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
– ఆయనరేఖ మండలంలో ఉన్నందున ఉష్ణ మండల ప్రాంతంలో ఉన్నదని చెప్పవచ్చు. అందువల్ల ఈ ప్రాంతంలో ఉష్ణమండల వర్షపాత, ఉష్ణ స్టెప్పీల శీతోష్ణస్థితులు కనిపిస్తాయి.
– సముద్ర మట్టానికి 536 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో వేసవిలో ఉష్ణోగ్రతలు మిగతా జిల్లాలకంటే తక్కువగా ఉంటాయి.
– రాష్ట్రంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు, డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రామగుండం, కొత్తగూడెంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
– ప్రసిద్ధ శాస్త్రవేత్త రాయ్ ప్రకారం తెలంగాణలో రెండు రకాల పవనాలు వీస్తాయని వర్గీకరించారు. అవి 1. నైరుతి రుతుపవనాలు, 2. ఈశాన్య రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు
– వీటి కాలం జూన్ – సెప్టెంబర్. జూన్ రెండోవారంలో తెలంగాణలోకి ప్రవేశించి, జూన్ నెల చివరి నాటికి విస్తరించి రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో 80 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల కలుగు తుంది.
– ఈ కాలంలో సంభవించే సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు. బంగాళాఖాతం నుంచి గంగా మైదానం వరకు పయనించే అల్పపీడనాల ప్రభావం వల్ల ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురుస్తుంది.
– ఈ వర్షపాతం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.
– నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం జోగులాంబ గద్వాల జిల్లాలో కురుస్తుంది.
ఈశాన్య రుతుపవనాలు
– వీటి కాలం అక్టోబర్ – డిసెంబర్. అక్టోబర్ నెల వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య వారధి. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. అత్యధిక ప్రాంతాల్లో అల్ప వర్షపాతమే నమోదవుతుంది. ఈశాన్య రుతుపవనాల వల్ల నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.
– ఈశాన్య రుతుపవనాలను తిరోగమన నైరుతి రుతుపవనాలు అని కూడా అంటారు.
వేసవికాలం: తెలంగాణ ప్రాంతంలో 34oC నుంచి 48oC వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలో సంవాహన ప్రవాహాల వల్ల కొద్దిపాటి వర్షాలు పడతాయి. ఈ కాలంలో క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. వీటిని ‘తొలకరి జల్లులు’ ‘మ్యాంగోషవర్స్’ ముంగారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చెడగొట్టువాన అని కూడా అంటారు.
శీతాకాలం: డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఈ కాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ అంతటా చల్లని గాలులు వీస్తాయి. రాత్రిపూట మంచు కురుస్తుంది. కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో మిగతా జిల్లాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
వర్షపాతం :
-జిల్లాలవారీగా సాధారణ వర్షపాతం అనేది ఆ జిల్లా నిమ్నోన్నత స్వరూపం, సముద్ర సామీప్యత, ఎత్తు, అక్షాంశాలు, సహజ వృక్ష సంపద, స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ నిర్ధారించారు.
-తెలంగాణ సాధారణ వర్షపాతం 907 మి.మీ. సాధారణంగా దక్షిణం నుండి ఉత్తరానికి పోయే కొద్ది వర్షపాతం పెరుగుతుంది. నైరుతి రుతుపవనాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతుపవనాల వల్ల 20 శాతం వర్షపాతం సంభవిస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. 2020-21లో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు ఏవి?
1) ములుగు 2) భద్రాద్రి కొత్తగూడెం
3) హనుమకొండ
4) జయశంకర్ భూపాలపల్లి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 4 డి) 1, 2, 3, 4
2. అతి తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలు ఏవి?
ఎ) జోగులాంబ గద్వాల
బి) నాగర్ కర్నూల్
సి) వనపర్తి డి) పైవన్నీ
3. వేసవిలో కురిసే వర్షాలను తెలంగాణలో ఏమని పిలుస్తారు?
1) మ్యాంగోషవర్స్ 2) తొలకరి జల్లులు
3) చెడగొట్టువాన 4) ముంగారు వర్షాలు
ఎ) 1, 3 బి) 1, 2, 3, 4
సి) 2, 3 డి) 2, 4
4. నైరుతి రుతు పవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవించే జిల్లా?
ఎ) హైదరాబాద్
బి) ఉమ్మడి ఆదిలాబాద్
సి) ఉమ్మడి వరంగల్ డి) ఉమ్మడి రంగారెడ్డి
5. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలేవి?
1) కొత్తగూడెం 2) రామగుండం
3) హైదరాబాద్ 4) నిజామాబాద్
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 4 డి) 1, 2, 3, 4
6. భారతదేశంలో తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా ఏ ప్రాంతానికి చెందుతుంది?
ఎ) శుష్క ప్రాంతం
బి) ఉపశుష్క ప్రాంతం
సి) ధ్రువ ప్రాంతం
డి) అతి ధ్రువ ప్రాంతం
7. తెలగాణలో ఈశాన్య రుతుపవనాల వల్ల ఎంత శాతం వర్షపాతం కురుస్తుంది?
ఎ) 80 శాతం బి) 20 శాతం
సి) 25 శాతం డి) 30 శాతం
8. తెలగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఎంత శాతం వర్షపాతం కురుస్తుంది?
ఎ) 80 శాతం బి) 70 శాతం
సి) 60 శాతం డి) 50 శాతం
9. తెలంగాణలో సంభవించే సగటు వర్షపాతం ఎంత?
ఎ) 619.7 మిల్లీ మీటర్లు
బి) 783.6 మిల్లీ మీటర్లు
సి) 905.4 మిల్లీ మీటర్లు
డి) 830.7 మిల్లీ మీటర్లు
10. రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పొందే ప్రాంతం ఏది?
ఎ) హనుమకొండ బి) రామగుండం
సి) జగిత్యాల డి) పరకాల
11. తెలంగాణలో ఏ సంవత్సరంలో అత్యధిక వర్షపాతం సంభవించింది?
ఎ) 2014-15 బి) 2011-12
సి) 2013-14 డి) 2018-19
12. తెలంగాణలో ఏ సంవత్సరంలో అత్యల్ప వర్షపాతం సంభవించింది?
ఎ) 2014-15 బి) 2004-05
సి) 2013-14 డి) 2015-16
13. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎక్కువ వర్షపాతం వేటివల్ల కురుస్తుంది?
ఎ) హిందూ మహా సముద్రంపై వీచే గాలుల వల్ల
బి) అరేబియా సముద్రంలో సంభవించే అల్ప పీడనం వల్ల
సి) పసిఫిక్ మహా సముద్రంపై నుంచి గంగామైదానానికి వీచే అల్ప పీడనాల వల్ల
డి) బంగాళాఖాతంపై నుండి గంగా మైదానానికి వీచే అల్పపీడనాల వల్ల
14. వార్షిక వర్షపాత అస్థిరతలు తెలంగాణలో ఏ ప్రాంతంలో తక్కువగా ఉంటాయి?
ఎ) తెలంగాణ ఉత్తర వాయవ్య ప్రాంతాలు
బి) తెలంగా తూర్పు వాయవ్య ప్రాంతాలు
సి) తెలంగాణ తూర్పు ప్రాంతం
డి) తెలంగాణ దక్షిణ ప్రాంతం
15. 2020-21లో సంభవించిన సాధారణ వర్షపాతం ఎంత?
ఎ) 720.4 మిల్లీ మీటర్లు
బి) 824.2 మిల్లీ మీటర్లు
సి) 877.4 మిల్లీ మీటర్లు
డి) 789.6 మిల్లీ మీటర్లు
16. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్లుతున్న కొద్ది పార్షపాతం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) సమానంగా ఉంటుంది.
డి) పైవేవీకావు
17. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమెదవుతుంది?
ఎ) హైదరాబాద్ బి) వికారాబాద్
సి) ఆదిలాబాద్ డి) వనపర్తి
18. జిల్లాలవారీగా సాధారణ వర్షపాతం దేనిపై ఆధారపడుతుందని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది?
ఎ) జిల్లా నిమ్నోన్నత స్వరూపం
బి) సముద్ర సామీప్యత, ఎత్తు
సి) స్థానిక వాతవరణ పరిస్థితులు
డి) పైవన్నీ
19. ఈశాన్య రుతుపవనాలకు మరొక పేరు?
1) తిరోగమన నైరుతి రుతుపవనాలు
2) ఆగ్నేయ రుతుపవనాలు
ఎ) 1 సరైంది బి) 2 సరైంది
సి) 1, 2 రెండూ సరికాదు
డి) 1, 2 రెండూ సరైనవి
20. 2020-21లో ఈశాన్య రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం ఎంత?
ఎ) 124.9 మిల్లీ మీటర్లు
బి) 48.6 మిల్లీ మీటర్లు
సి) 177.4 మిల్లీ మీటర్లు
డి) 89.6 మిల్లీ మీటర్లు
జవాబులు
1-డి 2-డి 3-బి 4-బి 5-ఎ 6-బి 7-బి 8-ఎ 9-సి 10-బి 11-సి 12-బి 13-డి 14-ఎ 15-ఎ 16-బి 17-సి 18-డి 19-ఎ 20-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు