మౌర్యానంతర స్వదేశీ, విదేశీరాజ్యాలు
క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 300 వరకు కాలం భారతదేశ చరిత్రలో అత్యంత విశిష్టమైనది. ఇది రెండు మహా సామాజ్య్రాలైన మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యాల మధ్య ఉన్న యుగం. రాజకీయ రంగంలో అనైక్యత, అనిశ్చితి పరిస్థితులున్నప్పటికీ రాజకీయేతర రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిన కాలమిది.
రాజకీయ చరిత్ర
– మౌర్యానంతర యుగంలో అనేక విదేశీ, స్వదేశీ రాజ్యాలు అవతరించి భారతదేశంలో రాజకీయ అనైక్యత రాజ్యమేలింది. మౌర్యుల అనంతరం భారతదేశంపై విదేశీ దాడులు జరిగి తద్వారా అనేక విదేశీ రాజ్యాలు అవతరించాయి. ఈ కాలంలో రాజకీయ అధికారాన్ని విదేశీ, స్వదేశీ రాజులు పంచుకొన్నారు.
విదేశీ రాజ్యాలు
-భారతదేశంలోని అనేక ప్రాంతాలు మౌర్యుల తదనంతరం విదేశీయుల ఆధీనంలోకి వెళ్లాయి. వివిధ ప్రాంతాల నుంచి దండెత్తి వచ్చిన విదేశీ తెగలు భారతదేశంలో అనేక రాజ్యాలను స్థాపించాయి. ఇందులో ముఖ్యమైనవి.
-ఇండో గ్రీకులు/ ఇండో బ్యాక్టియన్లు/యవనులు
స్కిథియన్లు/శకులు,
పార్థియన్లు/పహ్లవులు
కుషాణులు
ఇండో గ్రీకులు/ ఇండో బ్యాక్టియన్లు/యవనులు
l బ్యాక్ట్రియన్లకు (ఉత్తర అఫ్గానిస్థాన్) చెందిన గ్రీకులు వాయవ్య భారత్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ఇక్కడే శాశ్వతంగా స్థిరపడి, భారత సంస్కృతిలో విలీనమయ్యారు. తమ విదేశీయతను కోల్పోయి భారతీయులయ్యారు. కాబట్టి వీరిని ఇండో-గ్రీకులు అని పిలుస్తారు. భారత్‌లో ఇండో-గ్రీకులను యవనులు అని పిలుస్తారు. వీరు గ్రీకుల్లో అయోనియన్ తెగకు చెందినవారు కాబట్టి వీరిని యవనులు అంటారు.
స్కిథియన్లు/శకులు
– మధ్య ఆసియాలోని గిరిజన తెగకు చెందిన స్కిథియన్లను భారత్‌లో శకులు అంటారు. వీరు భారత్‌లో బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించి అనేక ప్రాంతాలను జయించి ఐదు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. పతంజలి రాసిన మహాభాష్యంలో శకుల గురించి తొలి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథం శకులను నిర్వాసిత శూద్రులు ( Excluded Shudras) అనిర్వాసిత శూద్రులు ( Cleaned Shud ras)గా విభజిస్తుంది. శకులు భారత్‌లో స్థాపించిన ఐదు రాజ్యాలు. అవి.
కపిస రాజ్యం- అఫ్గానిస్థాన్‌లోని కపిస రాజధానిగా ఒక శక రాజ్యం స్థాపన.
తక్షశిల రాజ్యం- పాకిస్థాన్‌లోని తక్షశిల రాజధానిగా మరొక శక రాజ్యం కొనసాగింది. ఈ శకులు గౌతమ బుద్ధుడు, శివుడు, అభిషేక లక్ష్మితో కూడిన నాణేలు ముద్రించారు. ఈ వంశానికి చెందిన మొగ అనే రాజుకు ‘మహారాజ మహాత్మ’ అనే బిరుదు కలదు.
మధుర రాజ్యం- ఉత్తరప్రదేశ్‌లోని మధుర రాజధానిగా మూడవ శక రాజ్యం వెలిసింది. ఈ రాజ్యస్థాపకుడైన రంజువులు అప్రతిహతచక్ర అనే బిరుదు పొందాడు
ఉజ్జయిని రాజ్యం- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా, గుజరాత్‌లను కార్ధమాక శక వంశం పరిపాలించింది. ఛస్తన ఈ వంశ స్థాపకుడు. రుద్రదమనుడు ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు.
దక్కన్ రాజ్యం-మాండసోర్ రాజధానిగా ఐదో శక రాజ్యం దక్కన్ పాలించింది. ఈ వంశాన్ని క్షహరాట వంశం అంటారు. భూమకుడు ఈ వంశ స్థాపకుడు. నహపాణుడు క్షహరాట శకుల్లో అందరికంటే గొప్పవాడు.
పార్థియన్లు/పహ్లవులు
-క్రీ.పూ మూడో శతాబ్దంలో సెల్యుసిడ్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఉత్తర ఇరాన్ ప్రాంతం పార్థియాను వీరు పాలించారు. పార్థియన్లు భారత్‌పై దండెత్తి శకులను అంతంచేసి వాయవ్య భారత్‌లో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. భారత్‌లో వీరిని పహ్లవులు అంటారు. ఈ వంశంలో గండోఫర్నిస్ (క్రీ.శ. 19-45) సుప్రసిద్ధుడు. .
కుషాణులు
– కుషాణులు మధ్య ఆసియాలోని యూచి లేదా తొచారియన్ తెగకు చెందినవారు. చైనాపై నిరంతరంగా దాడులు చేస్తూ దోచుకోవడం ద్వారా జీవనోపాధి పొందేవారు. క్రీ.పూ 220లో చైనా చక్రవర్తి షి-హంగ్-టి మహాకుడ్యం (Great Wall)ను నిర్మించడంతో వీరు జీవనోపాధి కోల్పోయి భారత్‌వైపునకు తమ దృష్టిని మరల్చారు. కుషాణులు మధ్య ఆసియాలోని ఆక్సస్ నది నుంచి భారత్‌లోని గంగానది వరకు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు భారత్‌లో పార్థియన్, శకుల పాలనను అంతం చేశారు. వీరికి వాయవ్య భారత్‌లోని పురుషపురం (పెషావర్) మొదటి రాజధాని కాగా, యుమునా తీరంలోని మధుర రెండో రాజధానిగా కొనసాగింది.
– కుజులక్యాడఫిసిస్ (క్రీ.శ 15-64) – ఇతను ఈ వంశ స్థాపకుడు. ధర్మస్థిత, సచధర్మస్థిత, మహారాజాధిరాజ అనే బిరుదులు పొందాడు.
– విమక్యాడఫిసిస్ (క్రీ.శ 64-78 )- ఇతను దినార్లు అనే బంగారు నాణేలను ముద్రించాడు. ఇతని నాణేంపై శివుడు, నంది, త్రిశూలం ముద్రించబడ్డాయి. ఇతను మహేశ్వర, మహారాజాధిరాజ బిరుదులను పొందాడు. పాశుపత శైవాన్ని అవలంబించాడు.
కనిష్కుడు (క్రీ.శ. 78)
– కుషాణుల్లో అందరికంటే గొప్పవాడు.
-ఇతను రాగి, బంగారు నాణేలను అధిక సంఖ్యలో ముద్రించాడు. గ్రీకు దేవతలు, భారత దేవతల ప్రతిమలను నాణేలపై ముద్రించాడు. బుద్ధుని ప్రతిమ, శాక్యబుద్దో అనే పేరుతో నాణేలను ముద్రించాడు.
-కశ్మీర్లో కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించాడు.
-కైజర్, దేవపుత్ర బిరుదులు పొందాడు. కనిష్కుడు మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతని ఆస్థానంలో ఇద్దరు మహాయాన పండితులు ఉన్నారు.
-వసుమిత్రుడు- ఇతడు నాల్గో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు.
-అశ్వఘోషుడు- నాల్గో బౌద్ధ సమావేశానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు.
– కనిష్కుడి ఆస్థానంలో సుప్రసిద్ధ వైద్యుడు చరకుడు కూడా ఉన్నాడు. ఇతడు చరకసంహిత గ్రంథం రాశాడు. భారత వైద్య శాస్త్రానికి ఇది విజ్ఞాన సర్వస్వం లాంటింది.( encyc lopedia of Indian Medicine)
స్వదేశీ రాజ్యాలు
-మౌర్యానంతర యుగంలో విదేశీ రాజ్యాలతో పాటుగా అనేక స్వదేశీ రాజ్యాలు కొనసాగాయి. వాటిలో ముఖ్యమైనవి.
శుంగరాజ్యం (క్రీ.పూ.184-75)
-శుంగులు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. మౌర్యుల పాలనలో ఉన్నతాధికారులుగా పనిచేస్తూ మౌర్యులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ వీరి రాజధాని. పురాణాల ప్రకారం ఈ వంశంలో పది మంది రాజులు ఉన్నారు.
పుశ్యమిత్ర శుంగ
-ఇతను శుంగవంశ స్థాపకుడు. చివరి మౌర్య చక్రవర్తి బృహద్రద దగ్గర సేనాపతిగా పనిచేస్తూ అతన్ని హత్యచేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేశాడు.
-యవనులను (ఇండో-గ్రీకులు) రెండు సార్లు ఓడించాడని తెలుస్తోంది..
– అయోధ్యలో అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.
-పుష్యమిత్ర శుంగ ఆస్థానంలో సుప్రసిద్ధ పండితుడు పతంజలి ఉన్నాడు. ఇతడు మహాభాష్యం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇది పాణిని రాసిన అష్టాధ్యాయి పైన వ్యాఖ్యానం.
అగ్నిమిత్ర
-ఈ వంశంలో ఇతడు రెండో పాలకుడు. కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం నాటకంలో ఇతడు కథానాయకుడు. అగ్నిమిత్రుడు మాళవిక అనే యువరాణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ నాటకంలో కథాంశం.
కాశిపుత్ర భాగభద్ర
– ఈ వంశంలో ఇతడు ఆరో రాజు. హీలియోడోరస్ గ్రీకు రాయబారి ఇతని ఆస్థానానికి వచ్చాడు. ఇతడు విదిశ సమీపంలో వేసిన బేసనగర్ స్తంభ శాసనం ద్వారా గ్రీకు రాజైన ‘యాంటియల్సీడస్’ ఇతన్ని శుంగ రాజ్యానికి రాయబారిగా పంపించాడని తెలుస్త్తుంది. ఈ శాసనం ప్రాకృత భాష, ఖరోష్టి లిపిలో ఉంది. భాగభద్రుని నాణేలు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో లభ్యమయ్యాయి.
దేవభూతి
– శుంగ వంశంలో చివరివాడు. ఇతని సేనాపతి వాసుదేవ కణ్వ ఇతన్ని హత్యచేసి కణ్వవంశాన్ని స్థాపించాడు.
కణ్వరాజ్యం (క్రీ.పూ. 75-27)
– వీరు కణ్వాయణ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. పాటలీపుత్రం వీరి రాజధాని. మత్స్య, వాయు పురాణాల ప్రకారం వాసుదేవ కణ్వ తొలి రాజు, సుశర్మ చివరివాడు. ఒక ఆంధ్రరాజు పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను చంపి కణ్వవంశాన్ని అంతం చేసినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.
శాతవాహనులు
-మౌర్యానంతర యుగంలో దక్కన్‌ను ఏకం చేసి అనేక శతాబ్దాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించినవారు శాతవాహనులు. వీరి పాలన ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించింది. వీరికి అనేక రాజధానులు ఉన్నట్లుగా శాసనాలు, సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అవి.
– కోటిలింగాల (జగిత్యాల జిల్లా-తెలంగాణ)
– ప్రతిష్ఠానపురం (ఔరంగాబాద్ జిల్లా పైథాన్- మహారాష్ట్ర)
-శ్రీకాకుళం (కృష్ణా జిల్లా- ఆంధ్రప్రదేశ్)
-ధాన్యకటకం (గుంటూరు జిల్లా- ఆంధ్రప్రదేశ్)
– మత్స్యపురాణ సంప్రదాయం ప్రకారం శాతవాహన వంశంలో 30 మంది రాజులు 450 ఏండ్లు (క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ. 225 వరకు) పాలించారు.
శ్రీముఖ/సిముక
– పురాణాల ప్రకారం ఇతడు మొదటిరాజు. ఇతని 8నాణేలు కోటిలింగాలలో లభ్యమయ్యాయి.
శాతకర్ణి-I
ఇతడు మూడో రాజు
ఇతడి భార్య నాగానిక వేసిన నానాఘాట్ శాసనం ఇతడి విజయాలను తెలియజేస్తుంది. (శాతవాహనుల శాసనాలు ప్రాకృత భాష, బ్రాహ్మిలిపిలో ఉన్నాయి)
– ఇతడికి దక్షిణాపదాపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి.
సమాధానాలు
1-4, 2-1, 3-2, 4-1,
5-4, 6-3, 7-3, 8-4, 9-2, 10-1,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు