వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది?
గత తరువాయి…
2) బృహత్ మైదానం: దీనిని గంగా-సింధూ-బ్రహ్మపుత్ర మైదానం అని, ఉత్తర మైదానం అని పిలుస్తారు.
# దీని మొత్తం పొడవు పశ్చిమం నుంచి తూర్పునకు 3,400 కి.మీ.. దీని సరాసరి వెడల్పు అత్యధికంగా పంజాబ్ వద్ద 500 కి.మీ., అసోం వద్ద 90 కి.మీ. ఉంది.
# ఈ మైదానం మందం సరాసరి 1300 నుంచి 1400 మీ. వరకు ఉంటుంది.
# పూర్వం ప్లీస్టోసీస్ యుగంలో (1.8 మిలియన్ సంవత్సరాల క్రితం) దక్షిణ టెథిస్ నుంచి ఏర్పడింది.
#మొదటగా టెథిస్ నుంచి హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత వీటిపై వివిధ నదులు (గంగా, సింధూ, బ్రహ్మపుత్ర వంటివి) జన్మించి, ఇవి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపం వల్ల ఈ ఉత్తర మైదానం ఏర్పడింది.
#దేశంలో ద్వీపకల్ప పీఠభూమి, హిమాలయాల తర్వాత ఈ బృహత్ మైదానం చివరలో ఏర్పడింది. కాబట్టి ఈ మైదానాన్ని తక్కువ వయస్సు కలిగిన మైదానంగా పిలుస్తారు.
# ఈ మైదానాన్ని భౌగోళికంగా ఐదు భాగాలుగా విభజించారు.
1) బాబర్ మైదానం: ఇది శివాలిక్ పర్వత పాదాల వద్ద విసనకర ఆకారంలో(Fan Shaped), గులకరాళ్లతో కూడిన సచ్చిధ్ర మండలం (Porous).
#ఈ మైదానంలోకి హిమాలయాల నుంచి నదులు, సెలయేర్లు ప్రవేశించగానే వీటి వేగం తగ్గుతుంది. ఫలితంగా నదుల రవాణా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇవి తీసుకువచ్చిన గులకరాళ్ల వంటి అవక్షేపాలను శివాలిక్ పాదాల చెంత నిక్షేపణ చేస్తాయి.
# ఈ మైదానం సరాసరి వెడల్పు పశ్చిమాన 16 కి.మీ. ఉండగా, తూర్పునకు వెళ్లేకొద్ది తగ్గుతూ 8 కి.మీ. వెడల్పు ఉంటుంది.
# ఇక్కడ గులకరాళ్లు ఉండటం వల్ల నీటి ప్రసరణ గుణం అధికంగా ఉండి, హిమాలయ నదుల ఉపరితలం మీద ప్రవహించ లేక అంతర్భాగాన ప్రవహిస్తాయి. హిమాలయ నదులు అదృశ్యమయ్యే ప్రదేశంగా ఈ బాబర్ మైదానాన్ని పిలుస్తారు.
#ఈ మైదానం వ్యవసాయానికి పనికిరాదు. కానీ ఇక్కడ గుజ్జర్లు అనే పశుపోషకులు ఉంటారు.
2) టెరాయ్ మైదానం: తడి ప్రాంతం (Wet Region) అని పిలిచే ఈ మైదానంలోకి బాబర్ ప్రాంతంలో అదృశ్యమయ్యే నదులు పునరుజ్జీవం జరిగే క్రమంలో నదీ ప్రవాహాలు విస్తరించడం వల్ల చిత్తడి ప్రాంతాలు ఏర్పడ్డాయి.
# దట్టమైన అడవులను కలిగిన ఈ ప్రాంతం తడిగా, దోమలు, కీటకాలు ఉండే ప్రాంతం, సహజ వృక్ష, జంతు సంపదకు నిలయం.
#ఇది తూర్పున 30 కి.మీ., పశ్చిమాన 15 కి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది. కారణం తూర్పున అధిక వర్షపాతం.
# ఈ మైదానంలోనే జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్), జలదపారా, మానస్, కజిరంగా నేషనల్ పార్క్ (అసోం), దుద్వా నేషనల్ పార్క్ (ఉత్తరప్రదేశ్), వాల్మీకి టైగర్ రిజర్వ్ (బీహార్) ఉన్నాయి.
# 1947లో దేశ విభజన తర్వాత దేశంలోకి వచ్చిన కాందిశీకులకు భూమి, ఆహారం, ఆవాసం, ఉపాధి కల్పించడం కోసం ఇక్కడి అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చారు. ప్రస్తుతం దేశంలో చెరుకు, వరి, గోధుమ వంటి పంటలు పుష్కలంగా టెరాయ్లో పండిస్తున్నారు.
3) బంగర్ మైదానం: ఇది నదీ తీరాలకు దూరంగా, పాల ఒండ్రు మట్టితో అరుదుగా వరదలు సంభవించే ప్రాంతం.
#పురాతన ఒండ్రు మైదానాలనే బంగర్ అంటారు. ఇవి సాధారణంగా సారవంతంగా ఉండి ముదురు వర్ణాన్ని కలిగిన మృత్తికలు.
#ఈ మైదానంలో కాల్షియం కార్బోనేట్ అధికంగా గల మృత్తికలను కాంకర్ మైదానం అని పిలుస్తారు.
# దీనిలో పశ్చిమ ప్రాంతాన పొడిగా ఉన్న ప్రాంతాల్లోని క్షార, లవణ మృత్తికలను ‘రే లేదా కల్లార్ లేదా థర్ లేదా ఉసార్’ అంటారు.
# ఉత్తర భారతదేశ మైదానాల్లోనే అత్యధిక విస్తీర్ణం కలిగినది బంగర్ మైదానం.
4) ఖాదర్ మైదానం: నదీ తీరాలకు దగ్గరగా, ప్రతి సంవత్సరం వరదలు సంభవించే ప్రాంతాల్లో ఈ నవీన ఒండ్రు మట్టి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి.
#దీనిని పంజాబ్‌లో ‘బెట్ ల్యాండ్’ అంటారు.
#ప్రతి సంవత్సరం వచ్చే వరదల వల్ల ఖాదర్ ఎప్పటికప్పుడు సారవంతం అవుతూ ఉంటాయి. ఈ మైదాన ప్రాంతం సాంద్ర వ్యవసాయానికి (Intensive Agriculture) అత్యంత అనుకూలం.
5) డెల్టా మైదానం: ఖాదర్ భూభాగం కొనసాగింపే డెల్టా మైదానం.
#ఇది సాధారణంగా పురాతన, నూతన ఒండ్రు మట్టి నిక్షేపాలను కలిగి చిత్తడి (Marshy)గా ఉండే ప్రాంతం.
# ఈ మైదాన ఎగువ భాగాన్ని చార్స్, దిగువ భాగాన్ని బిల్స్ అని పిలుస్తారు.
#ఈ డెల్టా గంగానదితో ఏర్పడింది. కాబట్టి దీనిని గంగా డెల్టా అని, ఇక్కడ సుందరి వృక్షం పెరగడంతో సుందర్బన్ డెల్టా అని కూడా పిలుస్తారు.
బృహత్ మైదాన ప్రాంతీయ విభజన
# దీనిని ఉపరితల, శీతోష్ణస్థితి లక్షణాల ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించారు.
1) పంజాబ్-హర్యానా మైదానం: దీనిని బాగా అభివృద్ధి చెందిన మైదానం (Aggradational Plain) అని పిలుస్తారు. ఇది ఈశాన్యం నుంచి నైరుతికి వాలి ఉంటుంది.
#దీనిని సింధూ మైదానం అని కూడా పిలుస్తారు. దీనిని గంగా మైదానంలో ఢిల్లీ-అంబాల ఉన్నతి (Ridge) వేరు చేస్తుంది.
#ఈ ప్రాంతంలోని బంగర్ భూములను దయా అని, ఖాదర్ భూములను బెట్ ల్యాండ్స్ అని పిలుస్తారు.
# ఈ ప్రాంతంలో తీవ్ర క్రమక్షయానికి కారణమయ్యే తాత్కాలిక నదీ ప్రవాహాలను చోస్ అంటారు. ఈ నదీ ప్రవాహాలు సట్లెజ్ నదికి దక్షిణాన మాల్వా మైదానంలో కలిసిపోతాయి.
# ఘగ్గర్, యమునా నదుల మధ్య ఉన్న హర్యానా ప్రాంతాన్ని హర్యానా ట్రాక్ట్ అంటారు.
#యమునా, సట్లెజ్ నదుల మధ్య ఉన్న ఘగ్గర్ నదిని ఒకప్పటి ప్రఖ్యాతిగాంచిన సరస్వతి నది అవశేషంగా పరగణిస్తున్నారు.
# దోబ్ అంటే అంతర్వేది. అంటే రెండు నదుల మధ్య ప్రాంతం. పంజాబ్, హర్యానా మైదానాలను 6 భాగాలుగా విభజించారు.
1) సింధ్ సాగర్ (తాల్) అంతర్వేది: ఇది సింధూ, జీలం మధ్య విస్తరించి ఉంది.
#దీనిలో ముజఫరాబాద్, రావల్పిండి, తక్షశిల పట్టణాలు ఉన్నాయి.
#అలాగే సాల్ట్ రేంజ్ పర్వతం, తాల్ ఎడారి కూడా దీనిలో ఉంది.
2) ఛాజ్ (జెచ్) అంతర్వేది: ఇది చీనాబ్, జీలం నదుల మధ్య ఉంది.
3) రేచ్నా అంతర్వేది: ఇది రావి, చీనాబ్ నదుల మధ్య ఉంది.
#ఇక్కడ జమ్ము, ఫైసలాబాద్ పట్టణాలు ఉన్నాయి.
4) బారి అంతర్వేది: ఇది రావి, బియాస్‌ల మధ్య ఉంది.
# దీనిలో అమృత్సర్, గురుదాస్‌పూర్, ముల్తాన్ పట్టణాలున్నాయి.
#దీనిని మాజో మైదానం అని కూడా అంటారు.
5) బిస్త్ అంతర్వేది: ఇది బియాస్, సట్లెజ్ నదుల మధ్య ఉంది.
#ఇక్కడ జలంధర్, కపుర్తలా పట్టణాలున్నాయి.
# ఇది భారతదేశంలో మాత్రమే విస్తరించింది.
6) మాల్వా మైదానాలు: ఇది సట్లెజ్, ఘగ్గర్ నదుల మధ్యలో ఉంది.
# ఇక్కడ పాటియాలా, లూథియానా పట్టణాలున్నాయి.
#ఘగ్గర్ ప్రస్తుతం తాత్కాలిక నదిగా కొద్దికాలం ప్రవహిస్తుంది.
# దీని ఎగువ భాగాన్ని ‘సర్హింద్ మైదానం’ అంటారు.
2) రాజస్థాన్ మైదానాలు: ఇవి భారతదేశ వాయవ్య భాగంలో 1.75 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఈశాన్యం నుంచి నైరుతికి వంగి ఉన్నాయి.
# దీని సరిహద్దులు- తూర్పున ఆరావళి పర్వతాలు
ఉత్తరాన ఘగ్గర్ నది శుష్కలోయలు
దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ ఉన్నాయి.
#ఈ బృహత్ మైదానంలో రాజస్థాన్ మైదానం తప్ప మిగతావన్నీ బాగా అభివృద్ధి చెందాయి. ఇది మాత్రం సముద్రం తిరోగమనం (Recession of the sea) చెందడం వల్ల అభివృద్ధి చెందలేదు. ఫలితంగా ఇక్కడ సాంబార్, దిద్వానా, లుంకరన్సర్, పచ్‌పద్ర వంటి ఉప్పునీటి సరస్సులు ఏర్పడ్డాయి.
# అలాగే ఇక్కడ సరస్వతి, దృశ్యవతి వంటి శుష్క నదీ మైదానాలు (Dry Bed of Rivers) ఏర్పడ్డాయి.
#రాజస్థాన్ మైదానంలో ప్రాంతీయ భూస్వరూపాలు ఉన్నాయి. అవి..
1) రోహి స్వరూపం: ఇవి సారవంత మైదానాలు.
# ఇవి ఆరావళి పర్వతాల పశ్చిమ భాగాన, లూని నదిలోకి ప్రవహించే అనేక చిన్న నదుల ప్రవాహక ప్రాంతంలోని సారవంతమైన మైదానాలు.
2) భాగర్ స్వరూపం: ఇది అర్ధ శుష్క ప్రాంతం.
# ఇది రోహిల తర్వాత ఇంకొంచెం పశ్చిమ భాగాన ఉంది.
#ఇది ఉష్ణమండల గడ్డి భూముల ప్రాంతం.
3) మరుస్థలి స్వరూపం (Land of Dead): భాగర్ పక్కనగల ప్రాంతం.
# ఇది సంపూర్ణ థార్ ఎడారి ప్రాంతం.
4) సర్ స్వరూపం: భాగర్ ప్రాంతంలో ప్లయా సరస్సుల ప్రాంతం.
# ప్లయాలు ఎడారుల్లో ఏర్పడిన తాత్కాలిక సరస్సులు.
5) డ్రెయిన్ స్వరూపం: మరుస్థలి ప్రాంతంలోని సంచార ఇసుక తిన్నెలు.
6) తాలి స్వరూపం: ఇవి ఇసుక మైదానాలు లేదా స్థిరీకరించిన ఇసుక తిన్నెలు.
7) ధండ్స్ స్వరూపం: రాజస్థాన్‌లోని ఉప్పునీటి సరస్సుల ప్రాంతం.
మాదిరి ప్రశ్నలు
1. కింది దోబ్‌లో (Doab) ఒక్కటి మాత్రమే పూర్తిగా భారతదేశంలో విస్తరించి ఉంది. దానిని గుర్తించండి?
1) రేచ్నా అంతర్వేది 2) ఛాజ్ అంతర్వేది
3) బిస్త్ అంతర్వేది 4) ఏదీకాదు
2. రాజస్థాన్ మైదానం గుండా ప్రవహిస్తున్న నదుల్లో సరస్వతి నది అవశేష నదిగా దేనిని పిలుస్తారు?
1) లూని 2) బాని 3) బనాస్ 4) ఘగ్గర్
3. డెల్టా మైదానం, గంగానది ఒండ్రు మట్టితో ఏర్పడింది. ఈ మైదాన ఎగువ ప్రాంతాన్ని కింది విధంగా పిలుస్తారు. దానిని గుర్తించండి?
1) ఛార్స్ మైదానం 2) చోర్స్ మైదానం
3) బిల్స్ మైదానం 4) నాళి మైదానం
4. కింది ఏ మైదానంలో ‘కాల్షియం కార్బోనేట్’తో ఏర్పడిన కాంకర్ మృత్తికలు ఉన్నాయి. గుర్తించంది?
1) బంగర్ మైదానం
2) ఖాదర్ మైదానం
3) టెరాయ్ మైదానం
4) బాబర్ మైదానం
5. కింది ఒక మైదాన ప్రాంతం సముద్ర తిరోగమనం వల్ల ఏర్పడింది. గుర్తించండి?
1) గంగామైదానం
2) బ్రహ్మపుత్ర మైదానం
3) సింధూమైదానం
4) రాజస్థాన్ మైదానం
6. మరుస్థలి అంటే థార్ ఎడారి. ఇది భారత్, పాకిస్థాన్‌లో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో ఏ దిశలో విస్తరించి ఉంది?
1) పంజాబ్‌కు దక్షిణాన
2) ఉత్తరప్రదేశ్‌కు పశ్చిమాన
3) గుజారత్‌కు ఉత్తరాన
4) పైవన్నీ సరైనవే
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?