విష్ణుకుండినుల శిల్పకళాసేవ
నాగార్జున కొండ శిథిలాలను బట్టి గర్భగుడి, అంతరాళం, మంటపం, ధ్వజ స్తంభం, ప్రాకారం అనే విభాగాలతో దేవాలయ వాస్తు పరిపుష్టమైంది. ఈ ఆల యాలు అగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించారని తెలుస్తోంది. ఏలేశ్వరం, చేజర్ల, ఉండవల్లిలో ఉన్న ఉద్దేశిక ఆలయాలను బట్టి నాటి ఆలయాలకు వృత్త, శాలా (గజవృష్ణ) శిఖరాలుండేవి. వృత్త శిఖరాలు ద్రావిడ శైలిలో ఏక తలములై శిఖర ముఖంలో చైతన్య వాతాయనాలంకరణ ఉండేదని తెలుస్తోంది.
బొజ్జన బౌద్ధక్షేత్రంలో దొరికిన గుప్త రాజుల నాణెంవల్ల ఈ క్షేత్రం నాలుగైదు శతాబ్దాల్లో ప్రసిద్ధి వహించిందని చెప్పవచ్చు. భూమి స్పర్శముద్రతో బుద్ధ ప్రతిమలు ప్రజావస్తువులుగా ఉన్న ఈ మహాయాన బౌద్ధాలయాల్లో వజ్రాయాన చిహ్నాలు సహితం కనిపిస్తాయి. ఈ కొండ సమీపంలోనే లింగాలమెట్ట ఉంది. ఇక్కడి కొండను భక్తులు అనేక ఉద్దేశిక స్తూపాలుగా మలిచారు.మొఘల్ రాజపురంలోని ఐదు గుహల్లో మూడు అతిసామాన్యమైనవి. నాలుగోది దుర్గ గుహ. దీనిలో వెనుక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని చెక్కారు. ఐదోది శివతాండవ గుహ. ముఖంపై నటరాజ విగ్రహంవల్ల ఈ గుహకు ఆపేరు వచ్చింది. బెజవాడ దుర్గం కొండకు దిగువన ‘అక్కన్న మాదన్న’ గుహలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి ఎగువన ఉన్న పెద్ద గుహ సైతం త్రిమూర్తులకు అంకితమే. కానీ ఇందులో క్రీ. శ. రెండు మూడు శతాబ్దాల లిపిలోనున్న శాసనం ఈ గుహ చాలా ప్రాచీనమైందనడానికి నిదర్శనం. బహుశా ఇది బౌద్ధుల, జైనుల విహారమై ఆ తర్వాత 5, 6 శతాబ్దాల్లో హిందువులాక్రమించి ఉంటారు.
ఉండవల్లిని మూడు గుహల్లో అనంతశాయి గుడి అనే పేరుతో మధ్యస్థమై ఉన్న గుహ పెద్దది, ముఖ్యమైంది. ఇది నాలుగు అంతస్తుల గంభీర నిర్మాణం. రెండో అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఉన్న పెద్ద అనంతశాయి విగ్రహంవల్ల దీనికీ పేరు వచ్చింది. దీని నిర్మాణం పల్లవుల మహా మల్లపుర రాతి రథాలను అనుసరించిందనే అభిప్రాయంతో అంగీకరించేవారు నేడు అరుదు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో గుంటుపల్లిలో ప్రారంభమైన గుహవాస్తు ఉండవల్లిలో పరిపక్వతనొందడమేగాక పల్లవుల శైలికి వరవడి పెట్టిందని చాలా మంది (గంగూలి, శివరామమూర్తి) అభిప్రాయం. విష్ణుకుండినుల నాణెలపై కనిపించే సింహం ప్రతిరూపం ఈ గుహాలయ స్తంభాలపై ప్రత్యక్షమవుతున్నది. గుహ ముఖంపై క్రీ. శ. 6వ శతాబ్ద లిపిలో ‘ఉత్పత్తి పిడుగు’ అనే లేఖనం ఉంది. భైరవకొండ (నెల్లూరు జిల్లా)లో ఎనిమిది గుహాలయాలు ఉన్నాయి.
ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన’ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు. ఇందులో కుంభ శీర్షం ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి.
విష్ణుకుండినుల కాలంలో నూతన వాస్తుశిల్ప రీతి వృద్ధి చెందింది. ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి (విజయవాడ), అక్కన్న, మాదన్న గుహలు, భైరవకొండ గుహల్లో వాస్తు, శిల్పకళకు సంబంధించిన ఆధారాలు లభించాయి. 2015 మే 6న నల్గొండ జిల్లాలోని ఇంద్రపాలనగరంలో ప్రాచీన కాలంనాటి బుద్ధుడి శిల్పకళకు చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి 2000 ఏళ్ల కిందటివిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
విష్ణుకుండినుల కాలంలో బౌద్ధం…శైవం…జైనం
విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమతంలో వజ్రయాన శాఖ కృష్ణానదికి దక్షిణాన ఏర్పడింది. ఈ శాఖ ప్రచారం వల్ల బౌద్ధమతానికి ఉన్న కీర్తి, ప్రతిష్టలు, ప్రజాభిమానం నశించాయి. బౌద్ధులు అహింస పరమధర్మంగా భావించేవారు. కానీ ఈ వజ్రయాన శాఖకు చెందిన కొంత మంది వ్యక్తులు శక్తి పూజలు, తాంత్రిక పూజలు, రహస్య కలసాలు, మధుమాంస వినియోగం లాంటివాటిని ఆచరించారు. బౌద్ధ సంఘారామ విహారాలు (విశ్రాంతి మందిరాలు) నీతి బాహ్యమైన చర్యలకు నిలయం అయ్యాయి. దీంతో బౌద్ధమతం క్రమంగా ఆదరణ కోల్పోయింది. ఈ సమయంలో విష్ణుకుండిన పాలకులు బౌద్ధాన్ని ఆదరించి పోషించారు.
ఇక్ష్వాకు వంశం అంతరించిన తర్వాత పల్లవులు ఆంధ్రదేశాన్ని ఆక్రమించి వైదిక మత విస్తరణకు కారణమయ్యారు. బౌద్ధం రాజాదరణ కోల్పోయింది. బౌద్ధ సన్యాసులు ప్రజలను ఆకర్షించడానికి ఊరేగింపులు, సేవలు, పూజలు, ఆరాధనలు ప్రవేశపెట్టినా అంతగా ప్రభావం చూపలేదు. బౌద్ధారామ విహారాలు విలాస గృహాలుగా మారాయి. స్వదేశంలో ఆదరణలేకపోయినా బౌద్ధమతం ఖండాంతరాల్లో వ్యాపించింది.
విష్ణుకుండినుల్లో మొదటి మాధవవర్మ, మొదటి గోవిందుడు బౌద్ధమతాన్ని ఆదరించారు. ఇంద్రపాలనగర తామ్ర శాసనాల ద్వారా విష్ణుకుండినులు బౌద్ధమతం అనుసరించారని తెలుస్తోంది. గోవిందవర్మ బౌద్ధాన్ని ఆదరించాడని, బౌద్ధ సంఘాలకు అగ్రహారాలు ఇచ్చాడని, తన పట్టమహిషి మహాదేవి పేరుతో విహారం నిర్మించాడని ఈ శాసనాల్లో పేర్కొన్నారు.
శైవం: రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు.
జైనం: విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం క్షీణించడానికి కాపాలిక జైనులు కారకులు. పల్లవులు వైదిక మతాన్ని ఉద్ధరించి జైన మతానికి నీడ లేకుండా చేశారు. జైనాలయాలు, బౌద్ధరామ విహారాలు రాజుల ప్రోత్సాహంతో శైవక్షేత్రాలుగా రూపుదిద్దుకున్నాయి.
విద్య, సాహిత్యం
విష్ణుకుండినులు మొదట ‘ప్రాకృత’ భాషను ఆదరించారు. గోవిందుడు తన పాలనా కాలంలో సంస్కృతాన్ని రాజభాషగా ప్రవేశపెట్టాడు. విక్రమేంద్ర భట్టారక వర్మ మహాకవి, పండిత పోషకుడు. విష్ణుకుండినులు సంస్కృతాంధ్ర భాషలను ప్రోత్సహించారు. తెలుగులో చంధోగ్రంథం ‘జనాశ్రయచ్చంధో విచ్ఛిత్తి’ వీరి కాలంలోనే వెలువడింది.
‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యాసంస్థలను ప్రారంభించారు. ఈ కాలం నాటి ప్రసిద్ధ విద్యాకేంద్రం ‘ఘటికేశ్వర్’. ఈ విద్యాకేంద్రాన్ని ఇంద్రభట్టారక వర్మ స్థాపించాడు. గోవిందరాజు విహార (చైతన్యపురి) శాసనంలో ప్రాకృత భాషను ఉపయోగించారు. వీరి శాసనాల్లో తెలంగాణా పదాలు కనిపిస్తాయి.
బౌద్ధ పండితుల్లో ‘దశబలబలి’ సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.
జనాశ్రయచ్చంధో విచ్ఛిత్తి: ఇది శాస్త్ర గ్రంథం. తెలంగాణ తొలి లక్షణ గ్రంథం ఇదే. కానీ ఇది అసంపూర్ణంగా ఉంది. అవతారిక పద్యాలు లేవు. దీన్ని ‘గుణస్వామి’ రచించి మాధవవర్మ పేరుతో ప్రకటించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. జనాశ్రయుని కాలంలో వ్యాప్తిలో ఉన్న కవితలకు, పద్యాలకు వివరణ గ్రంథం ఇది. మాధవవర్మకు తప్ప ఆ కాలంలో ఏ రాజుకు ‘జనాశ్రయ’ అనే బిరుదు లేదు. ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలు.
1) వివిధ జాతుల పద్యాలున్నాయి.
2) శీర్షికను ఏడు విధాలుగా పేర్కొన్నారు.
3) శీర్షిక అంటే ‘సీసం’. పద్యాంతంలో ‘గీత’ పద్యం ఉంది.
4) ‘ద్విపద’, ‘త్రిపదలు’ కూడా ఉన్నాయి
.
న్యాయపాలన
మాధవవర్మ వేయించిన ‘పాలమూరు’ శాసనంలో న్యాయపాలనకు సంబంధించిన ప్రస్తావన ఉంది. న్యాయ శాస్త్రాలను అధ్యయనం చేసి దివ్యమార్గాలను అనుసరించిన విష్ణుకుండిన రాజు మూడో మాధవవర్మ. రాజే న్యాయపాలనకు ‘అత్యున్నత అధికారి’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు