కాకతీయ సామ్రాజ్యం- రెండో ప్రతాపరుద్రుడు
రెండో ప్రతాపరుద్రుడు (1289-1323)
-రుద్రమదేవి మరణానంతరం ఆమె మనుమడు ప్రతాపరుద్ర-2 అధికారంలోకి వచ్చాడు. ఇతనికాలంలో కాకతీయ మహాసామ్రాజ్యం ఉన్నత శిఖరాలను అందుకొని మహావైభోగాలను అనుభవించి ఢిల్లీ దాడులతో హఠాత్తుగా అస్తమించింది. రుద్రమదేవి ప్రతాపరుద్రునికి అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పించింది. (యుద్ధరంగం, పరిపాలనలో) రుద్రమదేవి మరణించేనాటికి పాలనాదక్షతలోనూ, శౌర్యప్రతాపాల్లోనూ, యుద్ధ నిర్వహణలో, వ్యూహాలు పన్నడంలో ఆరితేరాడు. రాయగజకేసరి బిరుదు కూడా ధరించాడని పరబ్రహ్మశాస్త్రి పేర్కొన్నారు.రుద్రమదేవి చివరికాలంలో తిరుగుబాటు చేసిన అంబదేవున్ని యువరాజుగా ఉన్న ప్రతాపరుద్రుడు ఓడించాడు. దీంతో యావత్ ఆంధ్రదేశం (ముల్కినాడు, కాయస్త రాజ్యం మినహా) రుద్రమదేవి ఆధీనంలోకి వచ్చింది.
ప్రతాపరుద్రుని గొప్పతనం
-ప్రతాపరుద్రుడు రాజు కాగానే కాయస్త రాజ్యాన్ని అంతంచేయాలని తలంచాడు. ముల్కినాడుపైకి కాకతీయ సైన్యాన్ని మహారాయ పట్టసాహిణి (సోమనాయుని) నాయకత్వంలో అతని సహాయంగా ఇందులూరి అన్నయసేనానులు కూడా వెళ్లి మోపూరు వద్ద కాయస్త సైన్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు. ఆ ప్రాంతానికి కాకతీయ ప్రతినిధిగా సోమనాథున్ని నియమించాడు. ఈ విజయంతో కాకతీయ రాజ్యం పరాకాష్టనందుకుంది. యావదాంధ్ర దేశానికి ప్రతాపరుద్రుడు తిరుగులేని చక్రవర్తి అయ్యాడు.
ఓరుగల్లుపై ముస్లింల దాడులు
-ఇలాంటి ఉచ్ఛదశలో ఉన్న కాకతీయ సామ్రాజ్యం ఎంతోకాలం నిలువలేదు. కాకతీయ రాజ్యపు ఉత్తర ప్రాంతాలపై ముస్లింల దాడులు ప్రారంభమైనాయి. (రుద్రమదేవి కాలంలో దక్షిణ భారతదేశంపై ముస్లిం దాడులు ప్రారంభమైనట్లు, రుద్రమదేవి సామంతుడు క్రి.శ. 1267నాటి పానగల్లు శాసనంలో పేర్కొన్నాడు). కానీ అప్పటికి ముస్లింలు దక్షిణ భారతదేశంపై దండెత్తలేదు. ప్రతాపరుద్రుని తొలికాలంలో మాలిక్గుర్షప్ (అల్లావుద్దిన్ ఖిల్జీ) జలాలొద్దిన్ ఖిల్జీ సుల్తాన్‌గా ఉన్న కాలంలో యాదవుల రాజధాని అయిన దేవగిరిపై దండెత్తి అనేక సంపదలను కొల్లగొట్టినట్లు ఖజాయిస్-ఉస్-ఫుతులత్ గ్రంథంలో పేర్కొనబడింది. అది తెలుసుకున్న ప్రతాపరుద్రుడు దూరదృష్టితో కాకతీయ సైన్యాన్ని పునఃనిర్మించాడు.
నాటి ఢిల్లీలోని రాజకీయ చరిత్ర
-క్రీ.శ.1296 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మాయోపాయంతో దేవగిరి రాజ్యాన్ని (రామచంద్రదేవున్ని, అతని కుమారుడు శంకరదేవున్ని ఓడించి) జయించి రత్నాలను, బంగారాన్ని, ధనాన్ని కొల్లగొట్టి ఢిల్లీకి చేరాడు. మరో కుట్రలో ఢిల్లీ సుల్తాన్ జలాలొద్దీన్ ఖిల్జీని చంపి అధికారాన్ని సంపాదించాడు. జలాలొద్దీన్ ఖిల్జీ 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతనికి పెదనాన్న. పెదనాన్న కుమార్తెను వివాహం చేసుకొని అల్లావుద్దిన్ అల్లుడిగా మారాడు. చివరకు మామను చంపి 2వ అలెగ్జాండర్ బిరుదుతో ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. ప్రజలకు తను దేవగిరి నుంచి కొల్లగొట్టిన ధనరాశులను వెదజల్లి ఢిల్లీ ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. ఢిల్లీ సుల్తానులందరిలో ఇతను అగ్రగణ్యుడు. (మామను చంపి అధికారంలో కి రావడంతో ఇతన్ని చరిత్రకారులు అతిక్రూరుడిగా పేర్కొన్నారు. అలా అంటే భారతదేశ చరిత్రలో తండ్రులనే చంపి రాజ్యానికి వచ్చిన వారున్నారు. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీని క్రూరుడని పేర్కొనడం సమంజసం కాదు. రాజ్యానికి రావడానికి ఏ పద్ధతినైనా అనుసరించడం తప్పుకాదని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు)
-కాకతీయ రాజ్యంలో ప్రతాపరుద్రుడు, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్‌ఖిల్జీ ఇంచుమించు ఒకేకాలంలో సింహాసనం అధిష్ఠించారు. ఖిల్జీకి సామ్రాజ్యవాద లక్షణాలు కలవు. తన బిరుదునే 2వఅలెగ్జాండర్ అంటే హిందుస్థాన్ అంతటినీ తన అధికారం కిందికి తెచ్చుకోవాలని, ప్రపంచ విజేత కావాలని కలలుకన్నాడు. అందుకు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. దానిని సిద్ధసైన్యం (స్టాండింగ్ ఆర్మి) అనిపిలిచేవారు. ఆ సైన్యంతో ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు, మంగోళులతో పోరాడవలసి వచ్చింది. దాని పోషణకు ఎంతో ధనం కావాల్సి వచ్చింది. అందుకు అతనికి ఏకైక మార్గం కాకతీయ రాజ్యాన్ని జయించడం. దక్షిణ భారతదేశంలో సంపన్న రాజ్యాలలో ఇది ఒకటి. దీనిని కొల్లగొట్టి తద్వారా మిగతా దక్షణాన గల రాజ్యాలు దేవగిరి, ద్వారాసముద్రం, మధురైలను కూడా కొల్లగొట్టాలని భావించాడు. ఈ విధంగా దక్షిణ భారతంపై దండెత్తిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ.
-రెండో ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యంపై ముస్లింలు 8 సార్లు దండెత్తారని, అందులో ప్రతాపరుద్రుడు 7 సార్లు ముస్లింలను ఓడించి తరిమివేశాడని 8వ సారి జరిగిన దాడిలో ఓడిపోయి పట్టుబడ్డాడని ప్రోలయనాయకుని విలాసశాసనం తెల్పుతుంది. (ఇస్లాం చరిత్రకారులు 5 సార్లే దాడులు చేశారని రెండు విఫలం అయ్యాయని, మిగిలిన దాడుల్లో ముస్లిం సైన్యాలు విజయం సాధించాయని పేర్కొన్నారు)
ఓరుగల్లుపై ముస్లింల తొలి దాడి
-అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీ.శ.1303 సంవత్సరంలో తన తొలి దండయాత్రకు సైన్యాన్ని పంపాడు. ఈ దండయాత్రలకు జునామాలిక్ ఫక్రుద్దీన్, జూజామహ్మద్లు నాయకత్వం వహించారు. బెంగాల్ నుంచి ఈ దండు బయలుదేరి కాకతీయ రాజ్యంపై దండెత్తింది. మార్గమధ్యలో వరదలు వచ్చాయి. దీంతో అతికష్టం మీద కాకతీయ రాజ్యంలో ఉప్పరపల్లి (వుప్పరిపల్లి) అనే ప్రదేశంలో కాకతీయ సైన్యం వారిని అడ్డగించింది. ఈ యుద్ధంలో కాకతీయులు ఖిల్జీ సైన్యాన్ని పూర్తిగా ఓడించి, తెలంగాణ భూభాగం నుంచి తరిమేశాయి. ఈ యుద్ధ ఫలితం, పరాభవంతో ముస్లిం సైనికులు ముఖ్యంగా 2వ అలెగ్జాండర్ ఖిన్నుడైనాడు. కాకతీయులు సాధించిన ఈ విజయం గురించి ఇస్లాం చరిత్రకారులు క్లుప్తంగా వివరించారు. కాకతీయులు గొప్ప విజయం సాధించారని వెలుగోటివారి వంశావళి, పోతుగంటి మైలి ముస్లిం గర్వం అణిచారని రేచర్ల ప్రసాదిత్యుని కుమారుడు వెన్నమనాయుడు ముస్లింలను ఓడించాడని వెలుగోటివారి వంశావళిలో వర్ణించాడు. 1305వ సంవత్సరం నాటి ఓరుగల్లు కోటలోని స్తంభశాసనంలో కూడా పై వివరాలు ఉన్నాయి.
తొలిదాడి విఫలం చెందినప్పటికీ ప్రతీకారజ్వాలతో తిరిగి 1309లో మాలిక్‌కపూర్, ఖ్వాజాహాజీల నాయకత్వంలో దక్షిణ దేశాలను జయించడానికి పెద్దసైన్యాలను పంపాడు. (తొలిపరభవానికి ప్రతిగా దాడిచేసి విజయం సాధించడానికి 2వసారి ఈ సైన్యం పంపబడినది). ఈ సైన్యం మొదట ఢిల్లీ నుంచి భయలుదేరి దేవగిరి చేరినది. అక్కడి నుంచి కాకతీయ రాజ్యాల సరిహద్దుల్లోని సర్పర్కోటను ముట్టడించినది. ఆ కోటకు రక్షకుడిగా ఉన్న కాకతీయ సేనాని ఓడిపోయి అవమానం భరించలేక చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మాలిక్ కపూర్ అతని తమ్ముడైన అన్నవీడు అను సేనానికి కోటను తిరిగి అప్పగించి ముస్లిం సామంతుడిగా మార్చినాడు. సర్పర్కోటలో ఓడిపోయిన విషయం కొంతమంది వేగుల ద్వారా ప్రతాపరుద్రుడికి తెల్సింది. వెంటనే ప్రతాపరుద్రుడు తన సామంతులను సైన్యాలతో రావాలనే ఆదేశాలను పంపాడు. సామంత సైన్యాలు కాకతీయ రాజ్యం చేరకముందే మాలిక్ కపూర్ తన సైన్యంతో ఓరుగల్లుపై దాడిచేశాడు. 1310 జనవరి 20న హన్మకొండను స్వాధీనం చేసుకున్నాడు. హన్మకొండలో తన సైనిక స్కందావారం ఏర్పాటు చేసుకొని చుట్టూ కత్ఖర్ అనగా కొయ్యగోడ నిర్మించి రక్షణ కల్పించుకున్నాడు. తర్వాత ఓరుగల్లు కోటను ముట్టడించినాడు. (ఓరుగల్లు చుట్టూ లోపల రాతికోట ప్రహరీగా కలదు) రాతికోట లోపలినుంచి కాకతీయ సైనికులు విరోచితంగా పోరాడారు. కానీ వారికి కోటలోపల ఆయుధాలు, ఆహార పదార్థాలు అయిపోయాయి.
మాలిక్‌కపూర్ వారికి బయట నుంచి ఎట్టి సహాయం అందకుండా చుట్టూ కట్టదిట్టమైన కాపాలాపెట్టి పరిసరాల్లో ఉన్న ప్రజల ఇళ్లు తగులబెట్టి ప్రజలను హింసించసాగాడు. తప్పనిసరి పరిస్థితిలో ప్రతాపరుద్రుడు యుద్ధవిరమణ చేసి సంధి చేసుకున్నాడు. నష్టపరిహారం, ప్రతి ఏడాది కప్పంగట్టే షరతులకు అంగీకరించాడు.
-రెండో దాడిలో ప్రతాపరుద్రుడు ఓడి అల్లావుద్దీన్కు సామంతుడై కప్పం తీసుకెళ్లిన పోతుగంటిమైలి, ఆలింగబిజ్జన్నలు గొప్ప యోధులని కత్తిసాములలో వీరు అజేయులని తెలుసుకున్న సుల్తాన్ తమ కత్తి యుద్ధపాటవాన్ని ప్రదర్శించమని కోరాడు. వారిద్దరూ తమ కత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించి సుల్తాన్ ప్రశంసలు అందుకున్నారట. అల్లావుద్దీన్, ప్రతాపరుద్రుని సంబంధాలు తర్వాత ఎట్టి ఘర్షణలు లేకుండానే సాగిపోయాయి.
రుద్రమదేవి చేసిన యుద్ధాల్లో ముఖ్యమైనవి
దేవగిరి యాదవ రాజైన మహాదేవునితో జరిగిన యుద్ధం. ఇందులో రుద్రమదేవి మహాదేవున్ని ఓడించినట్లు…ఇదే రుద్రమదేవి చివరి యుద్ధమని విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్రీయం (ప్రతాపరుద్రయశోభూషణం) గ్రంథంలో పేర్కొన్నాడు.
రుద్రమదేవి కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇటలీదేశ యాత్రికుడు (వెనీస్ నగరానికి చెందినవాడు) మార్కోపోలో (నా యాత్రలు గ్రంథం) ఓరుగల్లును సందర్శించి రుద్రమదేవి కీర్తిని దేశదేశాలకు వ్యాపింపజేశాడు. రుద్రమదేవికి అనేకమంది ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. అందులో..
1) ఇందలూరి అన్నయ్య దేవుడు (మహాప్రధాని)
2) పొంకల మల్లయ్య ప్రెగడ (మహాప్రధాని)
3) గంగి దేవయ్య (మహాప్రధాని) ముఖ్యమైనవారు.
మహారాణి రుద్రమకు ఇద్దరు కుమార్తెలు. కుమా రులు లేరు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ, మహాదేవుడులకు ప్రతాపరుద్రుడు జన్మించాడు. మగ సంతానం లేనందున మనువడైన ప్రతాపరుద్రున్ని తన వారసునిగా తనతండ్రి గణపతిదేవుని కోరికపై దత్తత తీసుకున్నది. ఆమె ఇతన్ని యుద్ధవీరునిగా, సకల కళాపారంగతునిగా తీర్చి దిద్దింది. రుద్రమదేవి 1289లో మరణించింది. ఆమె మరణించిన వివరాలు చందుపట్ల (నల్లగొండ) శాసనంలో వివరించబడ్డాయి. ఒక వనిత రాజ్యాధికారం చేపట్టి దక్షిణ భారతదేశంలోనే ఏకైక హిందూరాణిగా పేరుగడించింది. తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయక వీరనారిగా, గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచింది.
మాలిక్‌కపూర్ : మాలిక్‌కపూర్ ఘనత ఇక్కడ మనం చెప్పుకోకతప్పదు. ఇతడు మొదట హిందూ బానిస. అసలు పేరు అర్దహాజారిమల్. గుజరాత్లో కాంబే వద్ద నస్రత్‌ఖాన్ అనే ఖిల్జీ సేనాని ఇతని 1000 దినారలకు (బంగారు నాణేలు) కొనుగోలు చేసి ఢిల్లీ పంపించాడు.అల్లావుద్దీన్ ఇతని గొప్పతనం గుర్తించి మాలిక్-ఇ-నాయబ్ అను బిరుదునిచ్చి దక్షిణ భారతదేశ దండయాత్రలకు సైన్యాధిపతిగా పంపించాడు. ఇతడు వరుసగా…
దేవగిరి (యాదవ) రాజ్యం
కాకతీయ) రాజ్యం
హోయసాళ రాజ్యం
మధురై(పాండ్య) రాజ్యాలను జయించినట్లు తెలియు చున్నది.
నాయంకర పద్ధతి ప్రవేశం
పునఃనిర్మాణం చేసిన సైన్యానికి నాయంకర సైన్యం అని పేరు (అసలు నాయంకర పద్ధతి అంటే? దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు? దీనికి ఢిల్లీ సుల్తా నుల కాలంనాటి ఇక్తాపద్ధతికి, విజయనగర కాలంలోని అమరనాయక విధానానికి మొగల్స్ కాలంలోని మున్సబ్దారి విధానికి ఏమైనా సారుప్యత ఉన్నదా? ఉంటే ఎలా? ఈ నాయంకర విధానంతోనే కాకతీయ సామ్రా జ్యం పతనం చెందినదా! అని చరిత్రకారులు పేర్కొన్నారా?. మరి మున్సబ్దారి విధానంతో మొగల్ సామ్రాజ్యం ఒక బలిష్టమైన రాజ్యంగా రూపొందించబడినది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కాకతీయల కాలంలో నాయంకర విధానం వైఫల్యం చెందడానికి కారణం ఏమిటి? ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు తెలుసుకోవాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు