నిజాం రాజ్యంలో పత్రికలు
# తెలుగులో 1920లో వారపత్రికలు ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఆయన సోదరుడు రాఘవ రంగారావు 1922, ఆగస్టు 27 ఆదివారం నాడు ‘తెనుగు’ అనే వారపత్రికను ప్రారంభించారు.
# ఒద్దిరాజు సోదరులుగా పేరుగాంచిన వారు అనేక నవలలు, నాటకాలు రాసి సాహితీ ప్రముఖులుగా ప్రసిద్ధిచెందారు.
#ఈ పత్రికలో శైవ మత సంబంధమైన సాహిత్యం, సమకాలీన వార్తలు, వాటిపై సంపాదకీయాలు ఉండేవి.
# ఇదే ఏడాది ‘శైవమణి’ అనే పత్రికను ముదిగొండ బుచ్చయ్య శాస్త్రి’ ప్రారంభించారు. ఇందులో మతానికి సంబంధించిన సమాచారమే కాకుండా ఇతర విషయాలు కూడా ప్రచురించేవారు.
#1925లో ‘అహాకాం సుబే వరంగల్’ పేరుతో వరంగల్ నుంచి ఒక పక్ష పత్రిక వెలువడింది. దీన్ని రెవెన్యూ అధికారులు నడిపేవారు. గ్రామాల్లోని పట్వారీలతో బలవంతంగా కొనిపించేవారు. దీన్ని తెలంగాణ నుంచి వెలువడిన మొదటి పక్షపత్రికగా పరిశోధకులుగా భావిస్తున్నారు.
#1925లో ‘నేడు’ అనే పత్రికను సికింద్రాబాద్లో భాస్కర్ అనే అతను ప్రాంభించారు. వారానికి రెండుసార్లు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వెలువడే ‘నేడు’ పత్రిక హైదరాబాద్ రాజకీయాలను బాగా ప్రభావితం చేసింది.
#సుబాహ్ దక్కన్‘, ‘నిజాం గెజిట్ సైఫా’ పత్రికలు 1924, 25లలో ప్రారంభమయ్యాయి. ఇవి ముస్లిం అనుకూల వార్తలకు ప్రాధాన్యం ఇచ్చాయి.
# ‘రాహబరే దక్కన్’ పత్రిక నిజాంకు అనుకూలమైన ఉర్దూ పత్రిక.
# ఆధునిక భావాలుగల ఖాజీ అబ్దుల్ గఫార్ ‘వయామ్’ పత్రిక సంపాదకులు. ఇందులో ప్రగతిశీల భావాల ప్రచారం జరిగేది.
# హైదరాబాద్ రాజ్యంలో సహకార ఉద్యమానికి బాసటగా నిలవడానికి ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో 1926లో ‘సహకారి’ పత్రికను హైదరాబాద్లో స్థాపించారు.
#నేటి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ దగ్గర ఉన్న మక్తా వడ్డేపల్లి గ్రామం నుంచి బెల్లంకొండ రామానుజాచార్యులు తన సోదరులు నరసింహాచార్యులతో కలిసి తమ స్వీయ సంపాదకత్వంలో 1926 నుంచి ‘దేశబంధు’ పత్రికను వెలువరించారు.
#ఇందులో రాజకీయ, ఆర్థిక విషయాలు ప్రచురించినప్పటికీ ధార్మిక, సాహిత్య విషయాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు.
# నిజాం రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం కానీ సమావేశ స్వాతంత్య్రం కానీ లేని ఆరోజుల్లో ఈ పత్రిక నిర్భయంగా తన అభిప్రాయాలను ప్రకటించేది.
# దీంతో పాటు గ్రామాలు, తాలూకా, జిల్లా కేంద్రాల నుంచి వార్తలు రాసి పంపాలని చదువుకున్నవారిని ప్రోత్సహిస్తూ తెలంగాణలో మొదటి విలేకరులను సృష్టించిన ఘనత కూడా ఈ పత్రికకు దక్కుతుంది.
#ఈ పత్రిక మొదటి నుంచి ఉద్యమాలకు అండగా ఉండేది. ఇందులో గ్రంథాలయోద్యమానికి, రాత్రి పాఠశాల ఉద్యమాలకు తగినంత ప్రోత్సాహాన్నిస్తూ వ్యాసాలు, వార్తలు ప్రచురించేవారు. ముఖ్యంగా గ్రంథాలయోద్యమానికి గోలకొండ పత్రిక ఇచ్చిన ప్రోత్సాహం ఎనలేనిది.
# తెలంగాణలో కవులు లేరన్న అపవాదుపై స్పందించి తెలంగాణకు చెందిన కవులు రాసిన కవితలతో ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించిన ప్రజ్ఞాశీలి సురరవం ప్రతాపరెడ్డి.
#ఈ గోలకొండ కవుల సంచిక ఆధునిక కాలంలో వెలువడిన మొదటి తెలుగు కవితా సంకలనం. ఎన్నో నిర్బంధాలు, నిషేధాలు, ఫర్మానాలను విజయవంతంగా ఎదుర్కొని ప్రజాశ్రేయస్సే పరమావధిగా ప్రచురితమైన గోలకొండ పత్రిక చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. 1966లో ఇది ప్రచురణను నిలిపివేసింది.
# ప్రముఖ దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ 1931లో ‘భాగ్యనగర్’ అనే పక్షపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది.
#ఈ పత్రిక ముఖచిత్రంపై హైదరాబాద్ రాజ్యంలోని చార్మినార్, మక్కామసీదుతోపాటు అజంతా, ఎల్లోరా చిత్రాలు కూడా ఉండేవి.
# ఈ పత్రిక ద్వారా అంటరానితనం నిర్మూలన, ఆదిహిందువుల అభివృద్ధిని, బుద్ధిజం వ్యాప్తిని ప్రోత్సహించారు. 1937, డిసెంబర్ నుంచి భాగ్యనగర్ పత్రిక పేరును ఆదిహిందు’గా మార్చారు.
# 1927లో మందుముల నరసింగరావు సంపాదకత్వంలో ‘రయ్యత్’ పేరుతో ఉర్దూ వారపత్రిక ప్రారంభమైంది.
# దీని ద్వారా ఉత్తర భారతీయులకు హైదరాబాద్ రాష్ట్ర విషయాలు తెలిసేవి. 1929లో నిజాం ప్రభుత్వ నిషేధానికి గురవడంతో దీన్ని నిలిపివేశారు. తిరిగి 1932లో ప్రారంభించి 24 ఏండ్లు నడిచి తిరిగి నిషేధానికి గురైంది.
# 1927, జనవరిలో హైదరాబాద్ నుంచి ‘సుజాత’ పేరుతో మాసపత్రిక ప్రారంభమైంది. పసుమాముల నరసింహశర్మ, మాడపాటి హన్మంతరావు, కొండా వెంకటరంగారెడ్డి, అక్కినేపల్లి జానకీరామారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుల సహకారంతో ఈ పత్రికను స్థాపించారు.
# 1927లో ఈ తెనుగు పత్రిక మూతపడింది. దాని తరువాత ఒద్దిరాజు సోదరులు అదే కాలంలో స్థాపించిన ‘సుజాత పత్రిక’లో తమ రచనలు ప్రచురించారు. తెలంగాణ గ్రంథాలయాలు, పత్రికలపై వీరు చాలా విలువైన వ్యాసాలు రాశారు.
# దాదాపు ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన ‘నీలగిరి’ వారపత్రిక ప్రభుత్వ నియంతృత్వ పోకడలను తీవ్రంగా నిరసించింది. ఈ పత్రికకు ‘షబ్నవీసు వెంకటరామ నరసింహారావు’ సంపాదకులు. ఈ పత్రికలో వృత్తాంతాలను, నిజాం దేశ వార్తలను క్లుప్తంగా ప్రచురించేవారు.
#సారస్వతం నుంచి సభలు, సమావేశాలు, హత్యలు, అనూహ్య విషయాలన్నీ ఇందులో ప్రచురించేవారు.
# 1926లో నీలగిరి పత్రిక కూడా మూతపడింది.
#హనుమకొండ ఉపాధ్యాయ శిక్షణ కాలేజీలో తెలుగు పండితులుగా ఉన్న ‘గుండు రాఘవదీక్షితులు’ 1922లో ‘ప్రకటన’ అనే పత్రికను స్థాపించారు.
# ఇందులో కేవలం వ్యాపార ప్రకటనలు మాత్రమే ప్రచురించేవారు.
#తర్వాత 1923, జూన్లో కోకల సీతారామశర్మ హన్మకొండ నుంచి ‘సర్వ విషయ’ మాస పత్రిక, ‘ఆంధ్రాభ్యుదయం’లను ప్రారంభించారు. దీనిలో ఆనాటి చారిత్రక పరిస్థితులను వర్ణిస్తూ విలువైన వ్యాసాలు ప్రచురించేవారు.
# శైవ మత ప్రచారం కోసం 1923లో కొడిమెల రాజలింగయ్య, ముదిగొండ చినవీరభద్రయ్య ఇంకా మరికొంత మంది సహకారంతో ముదిగొండ వీరేశలింగ శాస్త్రి సంపాదకత్వంలో ‘శైవమత ప్రచారిణి’ అనే పత్రికను వరంగల్ నుంచి ప్రారంభించారు.
#తెలంగాణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘గోలకొండ’ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకునిగా 1926, మే 10న ప్రారంభమైంది.
# పత్రిక నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల కోసం ‘గోలకొండ’ పత్రిక ద్వారా సురవరం ప్రతాపరెడ్డి తీవ్రంగా కృషిచేశారు.
#జాతి, కుల మతాలకు అతీతంగా తెలంగాణ సమాజాభివృద్ధి, సాహిత్య కృషి లక్ష్యాలుగా ఈ పత్రిక పనిచేసింది.
# ఈ పత్రిక ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లేది. హైదరాబాద్ రాజ్యంలో జరిగే రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విశేషాలను వార్తలుగా, వ్యాఖ్యలుగా ప్రచురించేది.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు