మానుల రక్షణే… మానవ మనుగడ ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
పర్యావరణ ఉద్యమాలు
పర్యావరణం సకల జీవజాతులకు ఆవాసం. దీన్ని నాశనం కాకుండా కాపాడుకుంటేనే జీవుల మనుగడ సాధ్యం. ఆధునిక సమాజంలో అభివృద్ధి పేరిట పారిశ్రామికీకరణ పెరిగి అడవులను పెద్ద ఎత్తున నరికివేస్తున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరిగి అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. అడవుల నరికివేత, పర్యావరణ పరిరక్షణకు సామాజికవేత్తలు, ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల తీరుతెన్నులపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం..
కావాలి మన జీవితం
పర్యావరణ సహితం.
ప్రకృతితో మమేకమైన జీవనం
సకల ప్రాణులకు హితం..
బిష్ణోయ్ ఉద్యమం
-ఇది దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ ఉద్యమం.
– 1730లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఖేజర్లీ గ్రామానికి చెందిన అమృతాదేవి నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది.
– బిష్ణోయ్ ప్రజల ఆరాధ్య వృక్షం ఖేజ్రీ వృక్షం.
– అప్పటి మార్వాడ్ పాలకుడు మహరాజా అభయ్‌సింగ్ ఈ ఖేజ్రీ వృక్షాలను నరికివేయమని సైనికులను ఆదేశించాడు. దీనికి వ్యతిరేకంగా బిష్ణోయ్ ప్రజలు అమృతాదేవి నాయకత్వంలో ఉద్యమం చేసి చెట్లను నరకనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో 363 మంది ప్రాణాలు కోల్పోయారు.
– దీంతో మహరాజా అభయ్‌సింగ్ చెట్లను నరికివేయడంపై నిషేధం విధించాడు.
జంగిల్ బచావో ఆందోళన
-బీహార్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న సాల్ చెట్లను నరికివేసి వాటి స్థానంలో టేకు చెట్లను పెంచాలని ప్రయత్నించడంతో 1982లో ఈ ఉద్యమం ప్రారంభమైంది.
– సింగ్భం జిల్లా గిరిజనులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జంగిల్ బచావో పేరుతో ఆందోళన చేపట్టారు. సాల్ వృక్షాలను హత్తుకొని నిరసనలు చేపట్టారు. తర్వాత ఈ ఉద్యమం ఒడిశా రాష్ట్రానికి విస్తరించింది.
సైలెంట్ వ్యాలీ ఉద్యమం
– కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అంటారు.
– పెరియార్ నదికి ఉపనది అయిన కుంతీపూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి కేరళ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆర్.ఈ విటేకర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది.
– ఈ నిర్మాణం వల్ల సైలెంట్ వ్యాలీ బయోస్పియర్ మొత్తం నీట మునిగిపోవడమేగాక 4 మిలియన్ సంవత్సరాల వయస్సున్న సతత హరిత అడవులు నాశనం అవుతాయి.
-సేవ్ సైలెంట్ వ్యాలీ పేరుతో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు.
– ఈ ఉద్యమం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టును రివ్యూ చేయడానికి ఎం.జి.కె. మీనన్ కమిటీని నియమించారు.
-ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కమిటీ నివేదికలో పేర్కొనడంతో ఈ ఉద్యమం ఆగిపోయింది.
– 1984వ సంవత్సరంలో ఈ వ్యాలీని ప్రభుత్వం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుగా ప్రకటించింది.
నవధాన్య ఉద్యమం
-నవధాన్య అనేది భారతదేశంలో ఒక ఎన్జీవో సంస్థ. దీని వ్యవస్థాపకురాలు వందనా శివ. జీవరాశులు అంతరిస్తున్నాయనే ఉద్దేశంతో జీవ వైవిధ్య సంరక్షణకు, సేంద్రియ వ్యవసాయానికి రక్షణ కల్పించేందుకు ఈ ఉద్యమం చేపట్టారు.
-ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 50కి పైగా విత్తన నిల్వల బ్యాంకులను భారతదేశంలో స్థాపించారు. కొన్ని వేల మంది రైతులకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయాన్ని సాధించడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తుంది.
-జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతకు ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాలను కాపాడుకొని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ నవధాన్య ఆందోళన ప్రారంభించారు.
అప్పికో ఉద్యమం
– చిప్కో ఉద్యమం ద్వారా ప్రభావితులైన ఉత్తర కన్నడ జిల్లాలోని ప్రజలు అడవుల సంరక్షణ కోసం 1983 సెప్టెంబర్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
-పాండురంగ హెగ్డే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కన్నడంలో అప్పికో అంటే ‘కౌగిలించుకోవడం’ అని అర్థం.
– సల్కాని గ్రామంలోని పిల్లలు, పెద్దలందరూ కలిసి అడవిలోని చెట్లను హత్తుకొని ప్రైవేటు కాంట్రాక్టర్ల బారి నుంచి వాటిని కాపాడటానికి కృషి చేశారు.
– ఈ ఉద్యమం 38 రోజులపాటు నిరాటంకంగా జరిగింది.
– దీంతో ప్రభుత్వం ఉత్తర కన్నడ జిల్లాలోని అడవుల్లో చెట్లను నరికే కార్యక్రమాన్ని విరమించుకుంది.
నర్మదా బచావో ఆందోళన్
– మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో నర్మదానది ప్రవహిస్తుంది.
-పర్యావరణానికి హానికలిగిస్తూ ఈ నదిపై చేపట్టే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమం ప్రారంభమైంది.
– ముఖ్యంగా గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్‌కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగింది.
– ఈ ఉద్యమాన్ని 1985లో మేధాపాట్కర్ ప్రారంభించారు. బాబా ఆమ్టే, అరుంధతీరాయ్ లాంటివారు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు.
-ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జీవోల సహాయంతో మేధాపాట్కర్ ఈ ఉద్యమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు ఇస్తానన్న రుణాన్ని విరమించుకోవడంతో నిర్మాణం ఆగిపోయింది.
-ఇప్పటికీ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
-ఈ ఉద్యమం పర్యావరణ పరిరక్షణ, పునరావాసం వంటి విషయాల్లో దేశ ప్రజల్ని చైతన్యం చేసింది.
గంగా పరిరక్షణ ఉద్యమం
– గంగానది దేశంలో అతిపెద్దది.
– గంగానది స్వచ్ఛత కోసం, పవిత్రత కోసం కాలుష్య నివారణ కోసం రమారౌట ఆధ్వర్యంలో 1986లో కాన్పూర్‌లో ఒక సమావేశం జరిగింది. అదే ఉద్యమంగా మొదలైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, వైజ్ఞానిక సంస్థలు ఈ ఉద్యమానికి ప్రోత్సాహాన్ని అందించాయి.
బీస్-నౌ ఉద్యమం
– ఈ ఉద్యమాన్ని శ్రీజంబేశ్వర్ అనే మత గురువు ప్రారంభించారు. ఈయన పర్యావరణ పరిరక్షణకు 29 సూత్రాలను ప్రతిపాదించారు. దీని ఆధారంగా ఈ ఉద్యమానికి బీస్-నౌ అనే పేరు వచ్చింది.
– ఈ ఉద్యమం ఉద్దేశం పంజాబ్, సింధూనది ప్రాంతాల్లో విస్తరించిన థార్ ఎడారి ప్రాంత వృక్ష, జంతు జాతుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ.
– శ్రీజంబేశ్వర్ ప్రతిపాదించిన 29 సూత్రాల్లో 10 ఆరోగ్య పరిరక్షణకు, 7 సామాజిక ప్రవర్తన మెరుగుపరచడానికి, దైవభక్తిని ప్రబోధించడానికి సంబంధించినవి కాగా మిగిలిన సూత్రాలన్నీ జీవ వైవిధ్యతను పరిరక్షించడం, పశు సంవర్థక పెంపుదలకు సంబంధించినవి.
-తరువాతి కాలంలో ఈ ఉద్యమం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ జిల్లాలో మహా ఉద్యమ రూపం దాల్చి అమృతాదేవి నాయకత్వంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరిగింది.
ప్రాక్టీస్ బిట్స్
1. జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ అనుఘటకాలు, వాటి మధ్య జరిగే అంతఃచర్యలను ఏమని పిలుస్తారు?
1) పర్యావరణం
2) సాంఘిక పర్యావరణం
3) జలావరణం 4) వాతావరణం
2. పర్యావరణ దినోత్సవాన్ని ఏరోజున జరుపుకొంటారు?
1) జూన్ 5 2) ఏప్రిల్ 22
3) అక్టోబర్ 16 4) మార్చి 22
3. ఆవరణశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త?
1) టేలర్ 2) కార్ల్ రైటర్
3) ఎ.జి. థామ్స్లే 4) ఎర్నెస్ట్ హెకెల్
4. ప్రపంచంలోని మడ అడవులు, సరస్సులు చెరువులు చిత్తడి నేలల సంరక్షణ కోసం ఏర్పడిన ఒప్పందం?
1) పారిస్ ఒప్పందం
2) రామ్సార్ ఒప్పందం
3) బాలీ ఒప్పందం
4) బాన్ ఒప్పందం
5. జీవ వైవిధ్యత అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు?
1) డబ్ల్యూజీ రోసెన్ 2) లౌజాయ్
3) ఈవో విల్సన్ 4) విట్టేకర్
6. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1981 2) 1988
3) 1986 4) 1990
7. స్టోన్ లెప్రసీ అంటే ఏమిటి?
1) నేలల్లో ఆమ్లత్వం పెరిగి బీటలు ఏర్పడటం
2) జలాశయాల్లో శైవల మొక్కలు పెరగడం
3) వృక్షాల్లో పత్రహరితం నశించే స్థితి
4) చారిత్రక కట్టడాలపై పగుళ్లు, గుంతలు ఏర్పడి అందవిహీనంగా మారడం
8. అరుదైన అంతరించిన జాతుల గురించి సమాచారాన్ని ప్రచురించే సంస్థ ఏది?
1) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
2) వరల్డ్ వైల్డ్ లైఫ్ యూనియన్
3) వరల్డ్ యానిమల్ రిసోర్స్ ప్రోగ్రాం
4) యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం
9. అడవులను నరకడాన్ని ప్రపంచంలో మొదటగా నిషేధించిన దేశం ఏది?
1) నార్వే 2) డెన్మార్క్
3) స్వీడన్ 4) ఫిన్లాండ్
10. సుందర్‌లాల్ బగుణ ఏ ఉద్యమంతో ముడిపడి ఉన్నారు?
1) అప్పికో ఆందోళన
2) వన సంరక్షణ సమితులు
3) నర్మదా బచావో
4) చిప్కో ఉద్యమం
11. ‘పర్యావరణ పరిరక్షణ’ అనే అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటిసారిగా భారత రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?
1) 1975 2) 1976
3) 1977 4) 1978
12. ‘కిగాలి ఒప్పందం’ 2016 అక్టోబర్‌లో ఎక్కడ జరిగింది?
1) రువాండా రాజధాని కిగాలిలో
2) ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో
3) బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో
4) జపాన్ రాజధాని టోక్యోలో
13. కిగాలి ఒప్పందంలో పాల్గొన్న సభ్య దేశాలను 3 గ్రూపులుగా విభజించారు. భారతదేశం ఏగ్రూపులో ఉంది?
1) మొదటి గ్రూపు
2) రెండో గ్రూపు
3) మూడో గ్రూపు
4) పై మూడు గ్రూపుల్లో
14. పర్యావరణ సమతుల్యాన్ని నిలపడానికి దేశంలో ఎంత శాతం అరణ్యాలు ఉండాలి?
1) 23 శాతం 2) 31 శాతం
3) 33 శాతం 4) 47 శాతం
సమాధానాలు
1. 1 2. 1 3. 2 4. 2
5. 2 6. 3 7. 4 8. 1
9. 1 10.4 11.1 12.1
13.3 14.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?