కాకతీయుల కాలంలో ఎన్ని రకాల దుర్గాలుండేవి? ( తెలంగాణ హిస్టరీ)
# 1294లో దేవగిరిపై దండెత్తి అల్లాఉద్దీన్ విజయం సాధించాడు. 1303లో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాడు.
#అల్లాఉద్దీన్ మాలిక్ ఫక్రుద్దీన్ జునా, జా నాయకత్వంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యం కాకతీయ రాజ్యంపై దండెత్తింది. కాకతీయ సైన్యం ఖిల్జీ సైన్యాన్ని ఓడించింది. ప్రతీకారంతో అల్లాఉద్దీన్ ఖిల్జీ రెండోసారి దండయాత్ర చేస్తే ప్రతాపరుద్రుడు ధనరాశులు, ఏనుగులు ఇచ్చి సంధి చేసుకున్నాడు.
#1316లో అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణిస్తే అతడి మూడో కుమారుడు ముబారక్ షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణించడంతో ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం మానేశాడు. దీంతో ముబారక్ షా ఖిల్జీ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేయమని ఖుస్రూఖాన్‌ను సైన్యంగా పంపాడు. ఖుస్రూ, ప్రతాపరుద్రుని నుంచి కప్పం వసూలుచేసి దండయాత్ర చేశాడు. ఇంతలో ముబారక్ షాను చంపి నాజీరుద్దీన్ ఖుస్రాన్షా ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ల అధికారి ఘజిమాలిక్, ఖుస్రాన్ను వధించి ఘియాజుద్దీన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. ఈయన ప్రతాపరుద్రుడిని లొంగదీసుకోడానికి తన పెద్ద కొడుకు ఫక్రుద్దీన్ మహ్మద్‌ను ఓరుగల్లుపై దండయాత్రకు పంపాడు. కోటను ముట్టడించాడు. కానీ స్వాధీనం కాలేదు. ఓడిపోయి దేవగిరికి చేరిన ఫక్రుద్దీన్ ఢిల్లీ నుంచి వచ్చిన కొత్త సైన్యంతో తిరిగి ఓరుగల్లుపై దండెత్తాడు. ఫక్రుద్దీన్ అంత త్వరగా దండెత్తుతాడని ఊహించని ప్రతాపరుద్రుడు తగిన యుద్ధ సన్నాహాలు చేయలేదు. ఆహారం లేని తన సైనికుల కష్టాలు చూడలేక స్వయంగా లొంగిపోయాడు. లొంగిపోయిన ప్రతాపరుద్రుడిని ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహజీ అనే సేనానుల రక్షణలో ఢిల్లీకి పంపాడు. ముస్లిం సైనికుల అవమానాలను భరించలేక నర్మదానది ఒడ్డున ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది.
న్యాయపాలన
# సాధారణంగా సామాన్య వివాదాలన్నీ గ్రామసభల్లో గ్రామ ప్రభుత్వం పరిష్కరించేది. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత ‘తలారి’ అనే గ్రామోద్యోగిది. అంతిమ న్యాయ నిర్ణేత రాజు. యాజ్ఞవల్క్య స్మృతి మొదలైన ప్రాచీన స్మృతి గ్రంథాల్లో చెప్పిన సూత్రాలననుసరించి ధర్మాసనాలు ఏర్పర్చేవారు. మహాజనులు అనే ఒకరిద్దరు రాజాధికారులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సభల్లో న్యాయ సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇవి పరిష్కారమైన వెంటనే సభ రద్దయ్యేది అంటే మొన్నమొన్నటిదాకా గ్రామాల్లో పెద్దమనుషులు చేసే పరిష్కారం వంటిది ఇది. ఈ మహాజనులు పెద్దమనుషుల్లాంటి వారన్నమాట. తెగల్లో వివాదాలను సమయాలే పరిష్కరించేవి.
# సైనిక వ్యవస్థ : కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు దళాలుండేవి. కాకతీయ చక్రవర్తులు సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించేవారు. కాకతీయ రాజ్యంలో స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలు ఉన్నట్లు తెలుస్తుంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానగల్లు కోటలు శత్రు దుర్భేధ్యమైనవిగా పేరు పొందాయి.
# ఆర్థిక పరిస్థితులు : కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర్‌ఖుస్రూ, అబ్దుల్ వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది.
#వ్యవసాయం : తెలంగాణలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడంలో తగినంత కృషి జరిగింది కాకతీయుల కాలం నుంచే. కాకతీయులు చెరువులు తవ్వించి నీటిపారుదలమీద శ్రద్ధ వహించారు. రెండో బేతరాజు సెట్టి సముద్రం, కెరె సముద్రం, కేసరి సముద్రాలను తవ్వించాడు. గణపతి దేవుడు నలుమూలలా ఎన్నో చెరువులను తవ్వించాడు. గణపతి సేనాని రేచర్ల రుద్రుడు మానేరు మీద 12 చ.మీ. విస్తీర్ణం కలిగి 17,258 ఎకరాలు సాగుచేయగల పాకాల చెరువును తవ్వించాడు. రేచర్ల రెడ్లు 35 నీటి వనరులను ఏర్పాటు చేశారు. కాటచమూపతి కాట సముద్రాన్ని, డచమూపతి డ సముద్రాన్ని, నామిరెడ్డి సబ్బి సముద్రం, గౌరసముద్రం, కోమటి చెరువులను, ఎరకసాని ఎరకసముద్రాన్ని తవ్వించారు. ఇంకా చింతల సముద్రం, నామా సముద్రం కూడా ఉండేవి. చెరువుల నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులకు రోజువారి వేతనాలు చెల్లించేవారు.
చెరువులతోపాటు ఊట కాలువల తవ్వకం కూడా జరిగింది. మూసీ నది నుంచి సాగే మూసేటి కాలువ, ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ, కూచినేని కాలువ, రావిపాలు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉటుం కాలువ, చింతల కాలువల గురించి పిల్లలమరి శాసనాలు చెబుతున్నాయి. ఏతం మోటలతో కూడా వ్యవసాయం చేసేవారు. కొత్త పొలాలను సాగుచేయడానికి కాకతీయ రాజులు కృషిచేశారు. ప్రతాపరుద్రుని కాలంలో అడవులను నరికించి విశాల భూభాగాలను సాగులోకి తెచ్చారు. నేటి రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని ఎక్కువ గ్రామాలు ప్రతాపరుద్రుని కాలంలో రూపొందినవేనని ఆ గ్రామ కైఫీయత్తులు చెబుతున్నాయి. తెలంగాణలోని మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ భాగం కాకతీయుల కాలంలోనే ఏర్పడినట్లు శాసనాలు చెబుతున్నాయి. గణపవరం, ఘన్పూర్, మహదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం, కుందవరం మొదలైన అనేక గ్రామాలు కాకతీయ రాజులు, రాణులు, బీడు భూములను అటవీ భూములను వ్యవసాయ యోగ్యం చేయగా వారి పేరుమీదనే ఏర్పడినవి గ్రామాలు. గ్రామం నిర్మించడం, చెరువు నిర్మించడం ఆనాడు పుణ్యకార్యం. గ్రామాలను ఏర్పర్చడానికి అన్ని వృత్తులవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. భూమి మీద ప్రాథమిక స్వామ్యం రాజుది కాగా, ద్వితీయ స్వామ్యం వ్యక్తిదిగా ఉండేది. రైతులు వరి, గోధుమలు, కొరలు, జొన్నలు, మొక్కజొన్నలు, నీలిమందు, ఆముదాలు, నువ్వులు, పెసలు, కందులు, చెరకు, నూనెగింజలు, ఆవాలు, సజ్జలు, మినుములు, ఉలవలు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి వంటి పంటలను పండించేవారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించినట్లు సాహిత్యం వల్ల తెలుస్తుంది. కొబ్బరి, చెరకు, మామిడి, జామ, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. బెల్లం గానుగలు సాధారణంగా ప్రతి గ్రామంలో ఉండేవి.
# పరిశ్రమలు : నాడు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఉండేవి. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో ఇరవైకి మించిన రకరకాల వసా్త్రలను పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖ్మల్ వసా్త్రలు నేసేవారు. ఓరుగల్లులో ‘చిత్తరువులు’ రాసే ఇండ్లు 1500 ఉన్నాయని ఏకామ్రనాథుడు రాసినదాన్ని బట్టి ఆనాడు చిత్రకళకు మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తుంది. పాల్కురికి ‘బసవపురాణం’లో యాభై రకాల బట్టల పేర్లను పేర్కొనడాన్ని బట్టి, ‘కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్నని వసా్త్రలు నేసేవారని ఆ బట్టలు సాలెపురుగు జాలెవలే ఉండేవని మార్కోపోలో ప్రశంసించడాన్ని బట్టి ఆనాటి పద్మశాలీలు గొప్ప నైపుణ్యం గలవారని తెలుస్తుంది. పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణను బట్టి ఆ నాటి వడ్రంగులు మంచి నైపుణ్యంగలవారని తెలుస్తుంది. పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారుచేసేవారు. నిర్మల్‌లో తయారైన కత్తులకు డెమాస్కస్‌లో కూడా మంచి పేరుండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులున్నట్లు మార్కోపోలో రాశాడు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలు గ్రామాల్లోనే తయారయ్యేవి. దేవాలయాల్లో ఉపయోగించే కంచుగంటలు, పళ్లాలు, పాత్రలు పానగల్లు, చండూరుల్లో తయారయ్యేవి.
కాకతీయుల పాలనా విధానం
# కాకతీయుల ప్రభుత్వం సంప్రదాయ రాజరికం. సాధారణంగా రాజ్యం తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కుమార్తెకు కూడా ఆ హక్కు కల్పించడం కాకతీయ వంశంలోనే జరిగింది. సిద్ధాంతరీత్యా అధికారం అంతా రాజుదే. రాజ్య పాలనలో రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. వర్ణ ధర్మం, కుల ధర్మం, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు ఎంతటి ప్రభువైనా ఆచరించాల్సిందే. నాటి శాసనాల్లో ‘చాతుర్వర్ణ సముద్ధరణ’ అనే బిరుదు తరచుగా కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వాలని రుద్రదేవుని ‘నీతిసారం’ తెలుపుతుంది. కాకతీయులు ఆరోగ్యశాలలు, పురుళ్ల ఆస్పత్రులు, కళాశాలలు, మఠాలు, సత్రాలు, చలివేంద్రాలను నెలకొల్పారు.
# కాకతీయుల మంత్రుల్లో అన్ని కులాలవారు ఉండేవారు. కాకతీయులు కులాన్ని బట్టికాక వ్యక్తుల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. గణపతిదేవ చక్రవర్తికి రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల హేమాద్రిరెడ్డి ప్రధానులు. ప్రతాపరుద్రునికి ముప్పడి నాయకుడు మహా ప్రధాని. ప్రతాపరుద్రుని కాలంలో ‘నాయంకర విధానం’ అమలు చేయబడింది. ఇది ఒకవిధమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే ‘నాయంకరులు’ అనేవారు. నాయంకరులు దుర్గాధ్యక్షులు వారి మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుని కాలంలో 75 మంది నాయంకరులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నాయంకర విధానం కాకతీయ రాజ్యపతనం తరువాత విజయనగర రాజులచేత అనుసరించబడి, ఆంగ్లేయ రాజ్యనిర్మాణం వరకూ కొనసాగింది. కాకతీయులకు ముందున్న చోళ, చాళుక్యులు కేంద్రీకృత పాలనావిధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలు పర్చారు. అందుకే మాండలికులకు, నాయంకరులకు సైనిక విషయాల్లో తప్ప సర్వ స్వాతంత్య్రమిచ్చారు. వారిపైన అధికారాన్ని రుద్దలేదు. అణచి ఉంచే పద్ధతిని విడిచిపెట్టారు. వీరు తమను ‘మహామండలేశ్వరులు’గానే భావించారు తప్ప రాజాధిరాజుగా చక్రవర్తిగా భావించలేదు. ఒకరకంగా ఇది ప్రజాస్వామిక భావన. ఈ నాయంకరుల్లో తెలంగాణకు సంబంధించిన కొందరి పేర్లు.. యాదవ విశ్వనాథదేవుడు, గణపతి దేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అక్షయ చంద్రదేవుడు కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని పాలించాడు.
# పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యం స్థలం, సీమ, వాడి, నాడు, పాడి, భూమి అనే ప్రాంతీయ భాగాలుగా విభజించబడింది. 10 నుంచి 60 గ్రామాల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. కొన్ని స్థలాల సముదాయమే ‘నాడు’. అనుకొండనాడు, కందూరునాడు, సబ్బినాడు, అయిజనాడు మొదలైనవి అటువంటి నాడులు.
1) గ్రామ పాలనను ‘ఆయంగార్లు’ నిర్వహించేవారు. గ్రామసేవ, రాజ్యసేవ చేసినందుకు పన్నులేకుండా భూమిని పొందినవారే ‘ఆయంగార్లు’. ఆయం అంటే ‘పొలం వైశాల్యం’. సాధారణంగా ఆయంగార్ల సంఖ్య పన్నెండు. వారు 1) కరణం 2) రెడ్డి 3) తలారి 4) పురోహితుడు 5) కమ్మరి 6) కంసాలి 7) వడ్రంగి 8) కుమ్మరి 9) చాకలి 10) మంగలి 11) వెట్టి 12) చర్మకారుడు. వీరిలో మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు. మిగిలినవారు గ్రామ సేవకులు. గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, పోరంబోకు, తోటభూమి, గడ్డిభూముల విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తుల లెక్కలు, దేవాలయ ఆస్తుల లెక్కలు మొదలైన వాటి నిర్వహణ కరణం బాధ్యత. కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా రాజ్యభాగం (పన్ను)ను వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేక పెదకాపుది. గ్రామ రక్షణ బాధ్యత తలారిది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్థులను పట్టుకోవడం, అపహరించిన సొత్తుని తెచ్చి ఇవ్వటం అతని విధి. అష్టాదశవర్ణాలవారికి సంఘాలుండేవి. వీటిని సమయాలనేవారు.
పన్నులు: స్థూలంగా ఐదు రకాల పన్నులుండేవి. అవి. 1) భూమి పన్ను 2) పారిశ్రామిక ఆస్తి పన్ను 3) వృత్తిపన్ను 4) వ్యాపార పన్నులు. భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం. వర్తకం, పరిశ్రమలు, వృత్తులపై విధించే పన్నులు రెండో ఆదాయమార్గం. పశుగ్రాసానికి పనికివచ్చే పచ్చిక బయళ్లపై వసూలు చేసే పన్ను, అడవుల కలపపై వేసే పన్ను మూడో ఆదాయ మార్గం. వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్నును ‘సుంకం’ అనేవారు. సుంకాలు వసూలుచేసే అధికారం సాధారణంగా వర్తక శ్రేణులకు ఇచ్చేవారు.
రాజకీయ పార్టీల పాత్ర: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, ఆయా పార్టీలు అవలంభించిన విధానాలు, రాష్ట్రంకోసం జరిగిన ఆత్మహత్యలు-రాజకీయ పార్టీలపై వాటి ప్రభావం, మొదలైన అంశాలను చదవాలి.
పార్లమెంటరీ ప్రక్రియ
#తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వ విధానం, అఖిలపక్ష సమావేశం, ఆంటోనీ కమిటీ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు అంశంపై కేంద్ర హోంమంత్రి ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు-దాని సిఫారసులు, రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు అంశాలను అధ్యయనం చేయాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు