తెలంగాణ ఉద్యమ ప్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పోరాటం ప్రత్యేకమైనది. సబ్బండ వర్ణాలు సంఘటితమై ఒకే మాటగా ముందుకు సాగి విజయాన్ని ముద్దాడిన అపూర్వ ఘట్టం. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భుజంభుజం కలిపి శక్తిమంతమైన శత్రువును లొంగదీసిన తీరు అసాధారణం. ప్రజా ఉద్యమాలకు కొత్త మార్గాలను చూపిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీది విశిష్ట స్థానం. ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను ఏకతాటిపై నడిపించిన ఘనత జేఏసీది. అంతటి బృహత్తర పాత్ర పోషించిన జేఏసీకి మొదటి అడుగు నుంచీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు నాయకత్వం వహించి సకల జనులను సమన్వయం చేసిన ఘనత ప్రొఫెసర్ కోదండరాంకు దక్కుతుంది. మలిదశ ఉద్యమంలో ప్రతి మలుపులో, ప్రతి ఘట్టంలో ఆయన ఉన్నారు. తన ఉద్యమ ప్రస్థాన అనుభవాలను తెలంగాణ రాష్ర్టోదయం పేరుతో అక్షరబద్దం చేశారు. నేడు పుస్తకావిష్కరణ సందర్భంగా నిపుణ పాఠకుల కోసం ప్రొ. కోదండరాం రాసిన ప్రత్యేక వ్యాసం…
మలిదశ తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర పాలకులు 1980 వ దశకంలో లేవనెత్తిన తెలుగుజాతి నినాదానికి నిరసనగానే తలెత్తింది. ఆంధ్ర పాలకులు రూపకల్పన చేసి ప్రచారంలో పెట్టిన ఈ తెలుగు జాతి భావనలో తెలంగాణకు ఎక్కడ కూడా స్థానం దొరకలేదు. 1969 ఉద్యమంలో పాల్గొని ఇంకా తెలంగాణ వాదాన్ని బలంగా కలిగి వున్న వ్యక్తులందరూ కలిసి ఈ నేపథ్యంలోనే 1989లో హైదరాబాద్‌లోని బసంత్ టాకీస్‌లో ఓ మీటింగు ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌ను నిర్వహించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆ తర్వాత తెలంగాణపై చాలా సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రత్యేకించి ఫజల్ అలీ కమిషన్ నివేదికలో హైదరాబాద్ రాష్ట్ర భవితవ్వంపై రాసిన అంశాలను పునర్ముద్రించి విరివిగా వ్యాప్తిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో, బయట తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై అనేక సమావేశాలు జరిగాయి. అయితే ఈ అస్థిత్వ ఆరాటం మాత్రం మధ్యతరగతి వర్గానికే పరిమితమైంది.
1996 తర్వాత ఉద్యమ విస్ఫోటనం
1996 దాకా తెలంగాణ నినాదం జనబాహుళ్యంలోకి వెళ్లనేలేదు. 1996లో వరంగల్‌లో ప్రొ॥ జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, కేశవరావ్ జాదవ్ కలిసి నిర్వహించిన నిరసన సభ ఒక విస్ఫోటనంలా పెల్లుబికి తెలంగాణ ఉద్యమం బలంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత అనేక సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ వంటి అనేక సంఘాలు ఏర్పడి విస్తృతంగా తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ ఆందోళనలు, భావవ్యాప్తి కార్యక్రమాలు చేపట్టాయి. ఇంత బలంగా ప్రజలు కదలటానికి కూడా కారణాలు లేకపోలేదు. 1996 వరకు తెలంగాణ డిమాండ్ అనేది నిజానికి కేవలం సాంస్కృతిక అస్థిత్వానికి మాత్రమే సంబంధించిన అంశంగా మిగిలింది. 1996 తర్వాత ఆనాటి పాలకులు తెచ్చిన సరళీకరణ విధానాల ఫలితంగా తెలుగుజాతి నినాదానికి ఉన్న ఆర్థిక పార్శ్వం బహిర్గతం అయింది. ఈ విధానాలు తెలంగాణ ప్రజలకు నామమాత్రంగానైనా దక్కుతున్న సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దుచేసి ఉన్న వనరులన్నింటిపైన సీమాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నెలకొల్పాయి. ఫలితంగానే సీమాంధ్ర పాలక శ్రేణుల నుంచి రియల్ ఎస్టేట్ డీలర్లు, కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, కార్పొరేట్ విద్యా వైద్య సంస్థలు బలంగా పుట్టుకువచ్చాయి. ప్రభుత్వం నుంచి కనీస సహకారం కూడా లేక ప్రజలు బతుకుదెరువు అవకాశాలను కోల్పోయారు. చాలామంది రైతులు, చేతివృత్తులపై ఆధారపడే కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా తెలంగాణ నినాదం బతుకును, బతుకుదెరువును పొందటానికి ఒక మార్గంగా రూపాంతరం చెందింది. బతుకుదెరువు మార్గంగా తెలంగాణ నినాదాన్ని ప్రజలు ఆదరించటం మొదలయ్యింది. రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములయ్యారు.
టీఆర్ఎస్ ఆవిర్భావంతో రాజకీయ ఉద్యమం తీవ్రం
తెలంగాణ అస్థిత్వం బయటపడ్డ తర్వాత ఇందుకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం కావటంతో ఆ పార్టీ నేతృత్వంలో బలమైన ఉద్యమాలు తలెత్తి రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయగలిగింది. టీఆర్ఎస్ ఏర్పాటు వల్ల మరొక లాభం కూడా కలిగింది. అప్పటికే ఉన్న ప్రజా సంఘాలను, సీమాంధ్ర పాలకులు నక్సలైట్ల పేరుతో అణచివేయగలిగారు. పనిచేయకుండా కట్టడిచేసే యత్నాలు చేశారు. కానీ ఎన్నికల ద్వారా తెలంగాణ తెస్తానన్న టీఆర్ఎస్పైన అదే వ్యూహం అమలుచేయలేకపోయారు. ప్రజాసంఘాల భావవ్యాప్తి ఆందోళన కార్యక్రమాలతో టీఆర్ఎస్కు బలమైన పునాది ఏర్పడితే, టీఆర్ఎస్ ఏర్పాటుతో కొంత స్వేచ్ఛగా తెలంగాణలో తిరిగేందుకు, ప్రజాసంఘాలు, పనిముమ్మరం చేసుకునేందుకు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అవకాశం కలిగింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఒక తీర్మానాన్ని చేసింది. వీటన్నింటి ఫలితంగా 2004లో తెలంగాణ నినాదం ఎన్నికల ఎజెండాగా మారింది. 2004 ఎన్నికల్లో తెలుగుజాతి రాజకీయాలు ఓడిపోయి తెలంగాణ అస్తిత్వ పోరాటాలు గెలిచాయి. దీంతో సీమాంధ్ర పాలకులు అమ్ములపొదిలోని కీలక ఆయుధం కోల్పోయారు. ఇక తెలుగుజాతి పేరుతో రాజకీయాలకు అవకాశమే లేకుండా పోయింది. ఈ మొత్తం పరిణామాల ఫలితంగానే తెలంగాణను ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో ప్రకటించింది.
ఢిల్లీలో తెలంగాణకు పెరిగిన మద్దతు
అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించటానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రణబ్ కమిటీ తుది నివేదికను ఇవ్వలేదు. అయితే కమిటీ ఏర్పడటంతో అన్ని పార్టీల అభిప్రాయాలను కూడగట్టటానికి అవకాశం లభించింది. ఢిల్లీలో అనేక పార్టీల అభిప్రాయాలను కూడగట్టటంతో తెలంగాణ ఉద్యమానికి జాతీయ స్థాయిలో బలం పెరిగింది. 2009 తర్వాత ఈ పరిస్థితి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రావటానికి తోడ్పడింది. రాజకీయంగా తెలంగాణ నినాదం బలంగా వ్యక్తమైనప్పటికీ ఆంధ్రా పాలకుల పలుకుబడి కారణంగా యూపీఏ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. 2009 వరకు తెలంగాణ నిర్ణయాన్ని నాన్చి చివరకు మళ్లీ రాష్ట్ర స్థాయిలో పార్టీల అభిప్రాయాలను బేరీజు వేసే పేరుతో రోశయ్య కమిటీని నియమించింది. అందువల్లనే కేసీఆర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమ నిర్మాణానికి 2006లో క్షేత్రస్థాయికి రావాల్సి వచ్చింది. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ప్రజలను మరింత కదిలించే వేదికగా చేశారు.
తెలంగాణ జేఏసీ ఏర్పాటు
2009 డిసెంబర్ 23న యూపీఏ ప్రభుత్వం రెండో ప్రకటన వచ్చాక తెలంగాణ సమాజమంతా ఏకమైంది. రాష్ట్ర సాధనకు ప్రతినబూని ముందుకు సాగింది. కేసీఆర్ చొరవ తీసుకుని అన్ని పార్టీల నాయకులను సంప్రదించారు. 2009 డిసెంబర్ 24వ తేదీ నాడు అన్ని పార్టీలు కలిసి కళింగభవన్‌లో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు హాజరై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని తీర్మానించాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. జేఏసీ ఏర్పడిన నాటికి అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాజీనామా చేశారు. జేఏసీ తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం శాసనసభ్యుల రిలే దీక్షలు. ఈ దీక్షా కార్యక్రమాలు 16 జనవరి 2010 నుంచి దాదాపు నెలరోజులు గడిచాయి. దానికి కొనసాగింపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రతి గ్రామం నుంచి కులాల వారీగా ప్రజలు పాల్గొని దీక్షలను విజయవంతం చేశారు.
అఖిల పక్ష భేటీ.. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు
ఈ ఆందోళనా కార్యక్రమాలు బయట సాగుతుండగా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉస్మానియా క్యాంపస్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు తీవ్రతరమైన తరువాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. ఇద్దరేసి ప్రతినిధులతో 5 జనవరి, 2010 నాడు జరిగే సమావేశానికి హాజరు కావలసిందిగా కేంద్ర హోంమంత్రి ఎనిమిది పార్టీలను ఆహ్వానించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆంధ్ర నుంచి ఒకరిని, తెలంగాణ నుంచి ఒకరిని పంపించాయి. ఆ పార్టీల నుంచి హాజరైన ఆంధ్రా ప్రతినిధులు సమైక్యవాదాన్ని వినిపించారు. తెలంగాణ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర డిమాండును బలపరిచారు. సీపీఐ, తెరాస ప్రతినిధులు తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టంగా తేల్చిచెప్పాయి. సీపీఎం సమైక్య రాష్ర్టాన్ని కొనసాగించాలన్నది. ఎంఐఎం తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. చర్చల తరువాత కేంద్రం తెలంగాణ డిమాండును పరిష్కరించడానికి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. కమిటి విధి, విధానాలు ఆశించిన విధంగా లేవు. శ్రీకృష్ణ కమిటీకి 1956 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని సమీక్షించి, రాజకీయ పరిస్థితిని బేరీజు వేసే బాధ్యతను అప్పగించారు. జేఏసీకి ఈ విధివిధానాలు ఆమోదయోగ్యంగా లేవని భావించింది. అందుకని రాజీనామాలను ఆమోదింప చేసుకోవాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. కానీ స్టీరింగ్ కమిటీ నిర్ణయాన్ని అందరూ గౌరవించలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వారు ఏవో సాకులు చూపించి రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. వాళ్లు వెనుకడుగు వేసినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. చెన్నమనేని రమేశ్ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలు ఉద్యమాన్ని కాపాడాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానానికి వచ్చిన ఉప ఎన్నికలు ఉద్యమ వేదికలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితంగా తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ ముఖం ఏర్పడింది. ఉద్యమం రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయగల శక్తిని పొందింది. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణలో తన పట్టును పెంచుకోవడానికి 2010లోనే ప్రచారయాత్రలు ప్రారంభించాడు. మొదటి యాత్ర ఖమ్మంలో జరిగింది. నిరసనలు వ్యక్తమైనా యాత్ర పూర్తిచేసుకోగలిగాడు. అదే ధైర్యంతో తన రెండో యాత్రను వరంగల్‌లో నిర్వహించాలనుకున్నాడు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా నిరసన తీవ్రతరమైంది. 2010 మే 28 నాడు మానుకోట నుంచి జగన్ తలపెట్టిన యాత్ర ప్రజా ఉద్యమం కారణంగా భగ్నమైంది.
సబ్బండ వర్ణాలు సంఘటితం
సహాయ నిరాకరణ ఉద్యమంలో మొత్తం పాలనను అడ్డుకునే బాధ్యతను ఒక్క ఉద్యోగులే నిర్వహించారు. మిగతా సమాజాన్ని ఉద్యమంలో భాగం చేయలేకపోయాము. దీంతో ఉద్యోగులపై చాలా భారం పడింది. ఆ లోటును మిలియన్ మార్చ్ కార్యక్రమం పూడ్చగలిగింది. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో వేల మంది ప్రజలు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటి అనుకున్న సమయానికి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకొని అక్కడ ఆంధ్ర ఆధిపత్యానికి ప్రతీకగా భావించిన విగ్రహాలను నిమజ్జనం చేశారు. మిలియన్ మార్చ్ ప్రజలను ఉద్యమంలో భాగం చేసింది. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్ అనుభవాలను సమీక్షించుకొని జేఏసీ సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చింది. సకల జనులు కలిసి ప్రభుత్వ పాలనను స్థంభింప చేయడమే ఉద్యమ లక్ష్యం. ఈ సమ్మె 13 సెప్టెంబర్ 2011 నుంచి 24 అక్టోబర్ 2011 వరకు 42 రోజులపాటు జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, కార్మికులు, సకల వృత్తులు, సబ్బండ వర్ణాలు, విద్యార్థులు, యువకులు ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆ సమ్మెతో తెలంగాణ సమాజం సంఘటితమైంది. సీమాంధ్ర పాలకులు తెలంగాణలో తమ ఉనికిని కోల్పోయారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు చట్టపరంగా కలిసే ఉన్నాయి కానీ సకలజనుల సమ్మెతో రాజకీయ, సామాజిక రంగాల్లో విభజన జరిగిపోయింది. ఇక ఉపేక్షించకుండా తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆంధ్ర నాయకులే డిమాండ్ చేయడం ప్రారంభించారు.
భిన్న రీతుల్లో ఉద్యమ హోరు
తెలంగాణ సాధనకు వినూత్న రూపాలలో ఆందోళనా కార్యక్రమాలు కొనసాగించాము. సకలజనుల సమ్మె మళ్లీ చేయలేము. కాబట్టి ఓ భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చి దాని చుట్టూ అల్లుకొని ర్యాలీలు, సభలు, సదస్సులు, ప్రదర్శనల రూపంలో విస్తృతంగా ప్రజలను కదిలించాలని జేఏసీ భావించింది. ఆ క్రమంలో జరిగిన మొదటి కార్యక్రమం సాగరహారం. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నా, టియర్ గ్యాస్ పేల్చుతున్నా, విపరీతంగా వర్షం కురుస్తున్నా సమరోత్సాహంతో కదిలివచ్చిన ప్రజలు క్రమశిక్షణతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగరహారంలో జరిగిన భారీ ప్రదర్శనను చూసిన తరువాత ఇక తెలంగాణ ఏర్పాటు అనివార్యమనే భావన అందరిలోనూ వచ్చింది. కేంద్రప్రభుత్వం కూడా 28 డిసెంబర్ 2012 నాడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. నెలలోపే తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపుతామని కేంద్ర హోంమంత్రి ప్రకటన చేశారు. ప్రకటన ఇవ్వవలసిన తేదీనాడు హైదరాబాద్‌లో జేఏసీ సమరదీక్షను నిర్వహించింది. ప్రకటన రావటానికి సమయం పడుతుందని కేంద్రం ప్రకటించటంతో సమరదీక్షలో నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వరుసగా సడక్‌బంద్, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి. చివరకు జూలై 30, 2013 నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యూపీఏ కమిటీని సంప్రదించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రా అడ్డంకులను అధిగమించి..
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిన సమయానికి ఆంధ్ర నాయకులు ఢిల్లీలో గందరగోళాన్ని సృష్టించారు. పార్లమెంటరీ వ్యవస్థకు, ప్రజాస్వామిక పద్ధతులకు తూట్లు పొడిచి బిల్లును నిలువరించడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. చిన్న పార్టీలను కదిలించి పార్లమెంటులో అలజడి సృష్టించి బిల్లుపై చర్చను నివారించాలని ప్రయత్నించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల మధ్య అగాధాన్ని పెంచి బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో తెలంగాణ నాయకత్వం పార్టీలకు అతీతంగా సంఘటితంగా వ్యవహరించింది. బిల్లుకు మద్దతుగా అన్ని శక్తుల మధ్దతును కూడగట్టడంలో చాలా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా వ్యవహరించారు. ఆ విధంగా తెలంగాణ సమాజం తమకున్న పోరాట పటిమను ప్రదర్శించి, సంఘటితంగా నిలవడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
1969 ఉద్యమానికి భిన్నంగా..
1969 ఉద్యమంలో అన్నీ కలిసిపోయాయి. ప్రజలను కదిలించగల ప్రజా సంఘాలు, రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వగల రాజకీయ పార్టీ కలిసి 1969లో ఒకే వేదికగా మారిపోయాయి. అందువల్ల ఈ రాజకీయ ప్రక్రియ నుంచి విడిగా ప్రజలను చైతన్యపరిచి నిలబెట్టగల వేదికలు లేకుండా పోయాయి. మలిదశ ఉద్యమంలో అందుకు భిన్నంగా ప్రజాసంఘాలు, రాజకీయపార్టీ విడివిడిగానే నిలిచాయి. పరస్పర సహకారంతో సాగాయి. రాజకీయ నాయకత్వానికి ప్రజా సంఘాలు ఒక పునాదిని ఏర్పాటు చేయగలిగితే, ఆ సంఘాలు పనిచేయటానికి కావల్సిన రాజకీయ వాతావరణాన్ని రాజకీయపార్టీ ఏర్పాటు చేయగలిగింది. 2009 నాటికి ఉద్యమ ఫలితంగా టీడీపీ, సీపీఎం, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి. 2009 నాటికి తెలంగాణ ఆకాంక్ష బలంగా వున్నా బలమైన ఉద్యమ నిర్మాణం జరగకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మాత్రం నివురుగప్పిన నిప్పులా బలంగా ఉన్నది. ఏ అవకాశం దొరికినా అది భగ్గుమని దావానలంలా వ్యాపించే సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత ఆ అవకాశం మళ్లీ తలెత్తింది. అది విస్ఫోటనంగానే మారింది.
బలిదానాలతో ఉద్యమానికి ఊపిరి
మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్యలతోపాటు దాదాపు 650 మంది యువతీ యువకులు బలిదానాలు చేసుకుని ఉద్యమానికి ప్రాణం పోశారు. 1969 ఉద్యమంలో పోలీసు తూటాలకు యువతీ యువకులు బలయ్యారు. కానీ, మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానం ఒక నిరసన రూపంగా ముందుకు వచ్చింది. అమరవీరులు రాసిన సూసైడ్ నోట్స్ చూసి కూడా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం, అధికార, ప్రతిపక్ష తెలంగాణ నాయకులు స్పందించక పోవటం వల్ల ఆంధ్రా నాయకుల సూటిపోటి మాటలకు నిరసనగా ఆత్మ బలిదానాలు చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు