వైదికాన్ని ఆచరించి… బౌద్ధాన్ని ప్రేమించి.. ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
ఇక్ష్వాకులు నాగార్జునకొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలిం చారు. వీరి రాజ చిహ్నం సింహం. వీరి చరిత్రకు పురావస్తు, సాహిత్య ఆధారాలున్నాయి. నాగార్జునకొండ తవ్వకాల్లో ఇక్షాకుల కాలంనాటి కోట, బౌద్ధ స్థూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి బయటపడ్డాయి. ఇక్ష్వాకుల జన్మస్థలంపై చరిత్ర కారులపై ఏకాభిప్రాయం లేదు. వీరు శాతవాహనుల కాలంలో మహాతలవరులుగా, మహాసేనాపతులుగా పనిచేశారు.
# శాసనాలను అనుసరించి శాంతమూలుడు కనీసం 13 సంవత్సరాలు పాలించాడని, తర్వాత అతని కుమారుడు వీరపురుష దత్తుడు 20 సంవత్సరాలు, అతని కుమారుడు ఎహూవల శాంతమూలుడు 24 సంవత్సరాలు పాలించాడు. ఫణిగిరి శాసనాన్ని బట్టి రుద్ర పురుషదత్తుడు 18 సంత్సరాలు పాలించినట్లు తెలుస్తుంది.
# ఇక్షాకుల శాసనాల ఆధారంగా నలుగురు రాజుల గురించి మాత్రమే సమాచారం లభిస్తుంది.
1. వాసిష్టీ పుత్ర శాంతమూలుడు (క్రీ.శ. 220 -233)
2. మాఠరీ పుత్ర వీరపురుష దత్తుడు (క్రీ.శ.233-253)
3. ఎహూవల శాంతమూలుడు (క్రీ.శ. 253-277)
4. రుద్ర పురుష దత్తుడు (కీ.శ. 283-301)
వాసిష్టీ పుత్ర శాంతమూలుడు
ఇతడు స్వతంత్ర ఇక్షాక రాజ్య స్థాపకుడు. హిరణ్యకులు, పూగియ వంశీయులతో కలిసి నాలుగో పులోమావిని తొలగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. తెలంగాణ- కోస్తాంధ్ర ప్రాంతాన్ని తన పరిపాలనలోకి తెచ్చాడు. ఇతడి శాసనాలు రెంటాల, కేతన పల్లి వద్ద దొరికాయి.
# వీరపురుష దత్తుడు వేయించిన నాగార్జునకొండ శాసనాల్లో ‘అనేక గో హలశత సహస్ర పద యిశ’ అని రాసి ఉంది. అంటే కోట్ల బంగారు నాణేలు, వేలకొద్దీ ఎద్దులను, నాగళ్లను, భూమిని దానంగా ఇచ్చాడని అర్థం. ఇద్దరు సోదరీమణులైన శాంతిశ్రీ, హర్మ్యశ్రీ తమ శాసనాల్లో శాంతమూలుడి ఘనతను ప్రస్తావించారు. శాంతమూలుడికి మహారాజ అనే బిరుదు ఉంది. ఇతను వైదిక మతావలంబికుడు.
మాఠరీ పుత్ర వీరపురుష దత్తుడు
వీరపురుష దత్తుడు శాంతమూలుని కుమారుడు. ఇతడి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరులో దొరికాయి. ఇతడు ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు. సమాకాలీన రాజవంశాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు.
#ఇతడు తన మేనత్తల ముగ్గురి కూతుర్లతోపాటు శక క్షాత్రప రాజకుమారి రుద్ర భట్టారికను, ఐదోభార్యగా మహాదేవి భట్టిదేవను వివాహం చేసుకున్నాడు.
# ఇతడి ఏకైక కుమార్తె కొడబలిశ్రీ కుంతలదేశ మహారాజైన విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేసినట్లు కొడబలిశ్రీ వేయించిన శాసనం వల్ల తెలుస్తుంది. వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాన్ని తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అతని పాలనా కాలాన్ని ఆంధ్రదేశ బౌద్ధమత చరిత్రలో ఉజ్వలఘట్టంగా పేర్కొనవచ్చు.
# అతని మేనత్త శాంతిశ్రీ బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించింది. శాంతిశ్రీ వల్లనే ఇక్ష్వాక రాణులు, వీరపురుషదత్తుడు, అతని ఐదుగురు భార్యలు బౌద్ధమతాన్ని ఆదరించి పోషించారు.
ఎహూవల శాంత మూలుడు
#ఇతడిని వాసిష్టీపుత్ర బబల శాంతమూలుడు, రెండవ శాంతమూలుడని అంటారు. ఇతడు వాసిష్టీ భట్టిదేవ, వీరుపురుషదత్తుల కుమారుడు. శాంతమూలుని 11వ పాలనా సంవత్సరంలో ఎలిశ్రీని వేయించాడు. 11 సంవ త్సరం కంటే ముందే ఒక ముఖ్యమైన యుద్ధం చేసినట్లు శాసనంలో ఉంది.
# ఎలిశ్రీ ‘ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించి సర్వదేవాలయం అనే శివాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఇతని కాలానికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజ్య భాషగా స్థిర పడింది.
రుద్ర పురుష దత్తుడు
#గురజాల, నాగార్జునకొండ, ఫణిగిరిలో దొరికిన నాణేలపై గల లిపి ఆధారంగా రుద్ర పురుష దత్తుడు చివరి ఇక్షాక రాజని చరిత్రకారులు గుర్తించారు. ఇతడు ఎహూవల శాంతమూలుని కుమారుడు.
# ఇతడి నాలుగో పాలనా సంవత్సరంలో నోదుక శ్రీ అనే అతడు తన దైవం హలంపురస్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడని శాసనంలో ఉంది. దీనిని గుంటూరు జిల్లాలోని నాగులాపురంలో గుర్తించారు.
రెండో వీర పురుష దత్తుడు
# ఇతడు రుద్ర పురుషదత్తుడి సోదరుడు. యువరాజుగా ఉన్నప్పుడే మరణించినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. కంచి పల్లవుల విజృంభణ వల్ల ఇక్ష్వాకుల రాజ్యం పతనమైంది. ఇక్షాక రాజ్యం పతనమైన తర్వాత వారి సామంతులు కృష్ణాలోయలో బృహత్పలాయనులు, గుంటూరు మండలంలోని ఆనంద గోత్రజులు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు.
పరిపాలనా వ్యవస్థ
# శాతవాహనుల పాలనా విధానాన్నే కొద్ది మార్పులతో ఇక్షాకులు అనుసరించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజు సర్వాధికారి. అన్ని అధికారాలు అతని చేతుల్లోనే ఉండేవి. ధర్మశాసా్త్రలు, స్మృతులు వివరించిన విధంగా పరిపాలన సాగించేవారు.
#శాతవాహనుల కాలంలో సూత్రప్రాయంగా ఉన్న దైవదత్త రాజ్యాధికారం వీరి కాలంలో స్థిరపడింది.
అమాత్యులు, అధికారులు
# ఇక్షాకుల శాసనాలు మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక అనే అధికారులను పేర్కొన్నాయి. ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదవులను నిర్వహించేవారు. మహాతలవరులు సామంతస్థాయి అధికారులు. వీరు శాంతిభద్రతలను కాపాడేవారు.
# మహాదండనాయకుడు నేర విచారణ చేసి శిక్షలను విధించేవాడు. అంటే న్యాయపరమైన విధులను నిర్వహించేవాడు. అధికారులతో రాజకుటుంబాలకు వైవాహిక సంబంధాలుండేవి.
స్థానిక పాలన:
# ఇక్ష్వాకులు తమ పరిపాలనను కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. కొన్ని గ్రామాల సముదాయమే రాష్ట్రం. పూగి, హిరణ్య, ముండ రాష్ట్రాల పేర్లు శాసనాల్లో ఉన్నాయి.
వీరి కాలంలో రథికుడు అంటే రాష్ట్ర పాలకుడు అని అర్థం. వీరు రాష్ట్రాలను వివిధ పేర్లతో, వివిధ స్థాయిల్లో విభజించారు. 5 గ్రామాలను ‘గ్రామపంచక’ అని పిలిచేవారు.
# మహాగ్రామిక అనే ఉద్యోగి ఆధీనంలో మహాగ్రామ అనే విభాగం ఉండేది. గ్రామ పాలనాధికారం వంశపారంపర్యంగా జరిగేది. గ్రామాధికారిని తలవర అనేవారు. అనేక గ్రామాధికారులపై అధికారం కలిగినవాడు మహాతలవరి. రాజులు గ్రామాలను, భూము లను దానం చేసినపుడు ఆ గ్రామాధికారిని, గ్రామ ముఖ్యలను సమావేశపరిచి తెలియజేసేవారు.
న్యాయపాలన:
న్యాయపాలనలో రాజే అత్యున్నతాధికారి. మహాదండనాయకుడు కేంద్రంలో నేరాలను విచా రణ చేసి శిక్షలను విధించేవాడు. న్యాయవిచారణకు ప్రత్యేకంగా ధర్మాసనాలు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. రాజద్రోహం, దేశద్రోహం నేరాలకు మరణశిక్ష విధించేవారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల్లో చేతివృత్తులు సాగుతున్నట్లు వివరించిన శాసనం?
ఎ) విళపట్టి బి) ఎలిశ్రీ
సి) నాగార్జునకొండ డి) ఏదీకాదు
2. ఇక్ష్వాకుల కాలంలో కింది వాటిలో ప్రధాన ఓడరేవుగా అభివృద్ధి చెందినది?
ఎ) మైసోలియా బి) కల్యాణి
సి) బరుకచ్చం డి) ఘంటసాల
3. రాజ్యాదాయాన్ని ఎన్ని భాగాలుగా ఖర్చు చేసేవారు?
ఎ) మూడు బి) నాలుగు
సి) ఐదు డి) ఆరు
4. కేంద్రంలో నేరాలను విచారణ చేసి శిక్షలను విధించే బాధ్యత ఎవరిది?
ఎ) మహా సేనాపతి
బి) మహా దండనాయకుడు
సి) మహా తలవరి డి) మహారాజు
5. గురజాల, నాగార్జునకొండ, ఫణిగిరిలో దొరికిన నాణేలపై ఉన్న లిపి ఆధారంగా, శాసనాల ఆధారంగా ఇక్ష్వాకులలో చివరి రాజు ఎవరని చరిత్రకారులు గుర్తించారు?
ఎ) వీర పురుష దత్తుడు
బి) మఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుడు
సి) రుద్ర పురుష దత్తుడు డి) ఎహూవల శాంతమూలుడు
6. స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) ఎహూవల శాంతమూలుడు
బి) మాఠరీ పుత్ర వీర పురుష దత్తుడు
సి) వాసిష్టీ పుత్ర శాంతమూలుడు
డి) రుద్ర పురుష దత్తుడు
7. వాసిష్టీ పుత్ర శాంతమూలుడి శాసనాలు ఎక్కడ లభించాయి?
ఎ) రెంటాల, కేశనపల్లి
బి) నాగార్జునకొండ
సి) ఫణిగిరి డి) గురజాల
8. ఇక్ష్వాకుల కాలంలో స్థానిక పాలకులు వసూలు చేసుకొని అనుభవించే శిస్తును ఏమనేవారు?
ఎ) హిరణ్యం బి) దేయం
సి) మేయం డి) భోగ
9. ధన రూపంలో చెల్లించే పన్నులను ఏమనేవారు?
ఎ) హిరణ్యం బి) దేయం
సి) మేయం డి) ఎ, బి
10. పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారంపై విధించే పన్ను?
ఎ) మేయం బి) కర
సి) భాగ డి) దేయం
సమాధానం
1-ఎ 2-డి 3-బి 4-బి
5-సి 6-సి 7-ఎ 8-డి
9-డి 10-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?