భారతదేశంలో దళిత ఉద్యమాలు..
సామాజిక అసమానతలు, వివక్షతలు కులతత్తపు గులాంగిరీ అంటరానితనం నుంచి అస్పృశ్యులకు విముక్తి కల్పించడం కోసం శతాబ్దాల పాటు జరుగుతున్న దళితోద్యమాలు భారతీయ సంప్రదాయిక, సంకుచిత సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా అన్ని సామాజిక ఉద్యమాలు సాధించిన విజయాలు ఒక ఎత్తయితే, దళిత ఉద్యమాలు సాధించిన విజయాలు వాటికి రెండింతలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మలివేద కాలంలోని రుగ్వేదంలో పురుషసూక్తంలోని పదో మండలంలో పేర్కొన్న చతుర్వవర్ణ వ్యవస్థ సృష్టించిన సామాజిక అంతరాలు, అసమానతల్లో ఎక్కువగా నష్టపోయింది దళితులే. సమాజం మొత్తం ఒకవైపు, దళితులంతా ఒకవైపు ఉండి జరుగుతున్న దళితోద్యమాలు భారతదేశ చరిత్రలో విభిన్న రూపాల్లో కొనసాగాయి. సంస్కరణాత్మక దళిత ఉద్యమాలను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. మత మార్పిడి ఉద్యమం( Conversion Movements)
2. మత లేదా లౌకిక ఉద్యమాలు ( Riligious or Secular Movements)
పటాంకర్, గైల్ ఓమ్వేద్లు దళిత ఉద్యమాలను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. కులప్రాతిపదిక దళిత ఉద్యమాలు
2. వర్గప్రాతిపదిక దళిత ఉద్యమాలు
-దళితులను కులవ్యవస్థలో అంతర్భాగంగా చేయడంతో తలెత్తిన అస్పృశ్యత తొలగించడానికి భక్తి, నవ్యవేదాంతిక ఉద్యమాలు ప్రయత్నించాయి.
-ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం హిందూమతంలో అస్పృశ్యత అంతర్భాగం కాదు. కులవ్యవస్థ అంటే నాటి పాలకులు సృష్టించిందే, సమాజంలో అంటరానితనం, సహజమైన మతపరమైన విభేదం కాదని పేర్కొన్నారు.
దళితులు అంటే ఎవరు?
-దళ అంటే సంస్కృతంలో విచ్ఛిన్నమైన, పగిలిన, బాహ్యపరమైన అని అర్థం ఉంది.
-జర్మన్ భాషలో దళ్ అంటే ముక్కలైన, నరికిన, తీసివేసిన అని అర్థం.
-హిబ్రూ భాషలో దళ్ అంటే అధమ, బలహీన, పేద అని అర్థం.
-ఇతులు అంటే నివసించేవారు లేదా ఆశ్రయం పొందేవారని అర్థం
-దళ్+ ఇతులు = దళితులు
-ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు నాలుగో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించినప్పుడు కొన్ని జాతులు, వివక్షతతో మిగతా సమాజానికి వెలుపల నివసించేవారని, వారిని చండాలురని పేర్కొన్నాడు. చండాలురు అనే పదం వజనసేయ సంహిత లేదా మనుచరిత్రలో కూడా ప్రస్తావించారు. రుగ్వేదంలో చండాలురనే అంత్యజులుగా పేర్కొన్నారు. చతుర్వర్ణ వ్యవస్థలో భాగం కాని ఈ సమూహాన్ని పంచములుగా పేర్కొన్నారు.
-అమెరికాలోని నీగ్రోలను ఆఫ్రికన్ అమెరికన్స్ అని ఏ విధంగా పిలుస్తారో అదే విధంగా చండాలురు, పంచములను మొదటిసారిగా దళితులు అని పేర్కొన్నది జ్యోతిబాయి ఫూలే.
-1933లో గాంధీ దళితులను హరిజనులని సంబోధించారు.
-2008లో షెడ్యూల్డ్ కులాలు జాతీయ కమిషన్ దళితులు అనే పదాన్ని వాడకూడదని వారిని షెడ్యూల్డ్ కులాలు అని పిలవాలని ప్రతిపాదించింది.
దళిత ఉద్యమాలకు ప్రధాన కారణాలు
-ఆర్యులు సృష్టించిన వర్ణవ్యవస్థలోని సామాజిక అసమానతలు, వివక్షతలకు వ్యతిరేకంగా సామాజిక స్థిరీకరణలో అట్టడుగున ఉన్న దళితులు తమ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం చేసిన పోరాటాలే దళిత ఉద్యమాలు.
1. సామాజిక వివక్షత, దోపిడీ, అవమానాలు
2. సామాజిక, ఆర్థిక, రాజకీయ వెలి
3. సామాజిక సదుపాయాలకు దూరంగా నెట్టివేయబడటం
4. కనీస మానవ హక్కులు లేకపోవడం
5. విద్యకు, ఉపాధికి దూరం
6. మిగతా సమాజానికి దూరంగా అంటరాని విధంగా ఊరి చివరన నివసించటం.
7. శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ
8. మాలిన్యవృత్తులను చేపట్టడం
ముఖ్యమైన దళిత ఉద్యమాలు
19వ శతాబ్దపు చివరిభాగంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నవ్యవేదాంతిక్, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలు కుల వ్యతిరేక, హిందూమత వ్యతిరేక దళిత ఉద్యమాలకు దోహదం చేశాయి. వీటిల్లో ముఖ్యమైనవి. 1. సత్యశోధక్ సమాజ్ 2. ఆత్మగౌరవ ఉద్యమం 3. ఆదిధర్మ, ఆది ఆంధ్ర ఉద్యమాలు
దళితుల ఆరాధ్యదైవం- అంబేద్కర్
భారతీయ సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్యదైవంగా పిలిచే అంబేద్కర్ దళిత ఉద్యమాలను తారాస్థాయికి చేర్చడంలో ఎనలేని పాత్ర పోషించారు. దళితులకు అన్ని రకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను అందించిన మహనీయుడు, గొప్పనాయకుడు. బాల్యంలో కులపరంగా అనుభవించిన అవమానాలు, ఛీత్కారాలు మరే ఇతర దళితబిడ్డ అనుభవించకూడదని తన జీవితం మొత్తాన్ని దళితులు, ఇతర బడుగు, బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప ఉద్యమ నేత అంబేద్కర్.
-1919లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం తొలి బహిరంగ ప్రకటన చేయడంతో పాటు అదే ఏడాది నాత్బర్ కమిటీ ముందు హాజరై దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ వ్యవస్థలో సముచితస్థానం ఉండాలని వాదించాడు.
-భారతదేశంలో జరిగిన దళిత ఉద్యమాల్లో అంబేద్కర్ పాత్ర అనిర్వచనీయం. ప్రముఖ చరిత్రకారిణి జిలియట్ అభిప్రాయం ప్రకారం అంటారాని కులాన్ని ఆధునిక భారతీయ సమాజంలో అంతర్భాగం చేయడం అంబేద్కర్ తలపెట్టిన దళిత ఉద్యమాల అంతిమలక్ష్యం.
-1920లో డాక్టర్ అంబేద్కర్ అంటరానితానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దళిత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం అనతికాలంలోనే దేశవ్యాప్త ఉద్యమంగా మారింది
-దళితులు, శ్రామికుల ప్రయోజనాలను కాపాడటానికి స్వతంత్ర శ్రామిక పార్టీ (The Independent Labour Party)ని స్థాపించి మహర్ కులస్థుల సమస్యల కోసం ఎక్కువగా కృషి చేశారు.
-ఈ పార్టీ మహారాష్ట్రలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించారు.
-అంబేద్కర్ 1927లో చేసిన మహర్ నీటి పోరాటం, 1946లో పుణెలో చేసిన కమ్యూనిటీ సత్యాగ్రహం దళితుల్లో ధైర్యాన్ని నింపింది.
-ఎన్నికల్లో పోటీ చేయడానికి, దళితుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ 1954లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ (The Scheduled Cast Federation) అనే పార్టీని స్థాపించారు. ఇది ప్రధానంగా ఎస్సీలవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం కోసం పోరాడటానికే పరిమితమైంది.
-ఈ పార్టీని 1956లో రిపబ్లికన్ పార్టీ (Republicon Party)గా మార్చారు. ఈ పార్టీ ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన కులాలను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడటం.
-అంటరానికులాల స్థితిగతుల మెరుగుపడాలంటే ముందు హిందూ మతాన్ని వదులకోవడమే ఏకైక మార్గమని బలంగా నమ్మిన అంబేద్కర్ 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఈ సంఘటనలో వేలాదిమంది మహర్ అనుచరులు కూడా హిందూ మతాన్ని వదిలి బౌద్ధమతాన్ని స్వీకరించారు.
దళిత్ పాంథర్స్ ఉద్యమం
-1970 దశాబ్దం ప్రారంభంలో మహారాష్ట్రలోని దళితులు అమెరికాలోని నల్లజాతీయులు నిర్వహించిన బ్లాక్పాంథర్స్ ప్రేరణతో దళిత్ పాంథర్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
-ఈ ఉద్యమం క్రమంగా గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలకు విస్తరించింది.
-ఈ పాంథర్లు పీడిత వర్గాలకు ప్రత్నామ్నాయ సామాజిక, సాంస్కృతిక, గుర్తింపును సాధించడానికి ప్రధానంగా కృషి చేశారు.
-అగ్రవర్ణాల, ప్రాబల్యకులాల సంస్కృతి, సంప్రదాయాలను దుయ్యబట్టడమేకాకుండా దళితులు వీటి జోలికి పోవద్దని విస్త్రృతంగా ప్రచారం చేశారు.
-దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అన్యాయాలు, అక్రమాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.
-ఈ ఉద్యమకారులు దళిత సాహిత్యాన్ని ప్రచురించి హిందూమత సంప్రదాయాలను, నైతిక సిద్ధాంతాలను విమర్శించారు.
ఆదిహిందూ ఉద్యమం
-భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన ఆదిహిందూ ఉద్యమం దళితుల్లో చైతన్యాన్ని నింపింది. ఈ దేశంలో దళితులే మూలవాసులని వారికి అది హిందువులని పేరుపెట్టి దళిత సమస్యలకు పోరాటం చేశారు.
-నిజానికి అంబేద్కర్, గాంధీలకన్నా ముందు అంటరాని వ్యవస్థ నిర్మూలన కోసం భాగ్యరెడ్డి వర్మ ఉద్యమించాడు.
-దళితుల్లో చైతన్యం తెచ్చేందుకు 1906లో జగన్మిత్ర మండలినా స్థాపించి హరిదాసులు, మాలజంగాలచే దళిత చైతన్యానికి సంబంధించిన హరికథలను చెప్పించారు.
-ఈ సంస్థ ద్వారా సభలు, సమావేశాలు నిర్వహించడం విద్యావ్యాప్తి, పుస్తకాల ముద్రణ, పంపకం ద్వారా దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేశారు.
-1910లో ఇసామియా బజార్, లింగంపల్లిలో దళితుల కోసం పాఠశాలలను ప్రారంభించాడు. అనంతరం మరో 25 పాఠశాలలను స్థాపించి, 2,600 మంది దళిత పిల్లలకు విద్యనందించిన మహామనిషి భాగ్యరెడ్డి వర్మ.
-1911లో జగన్మిత్ర మండలి మాన్యసంఘంగా మారింది.
-ఈ సంస్థ బాల్యవివాహాలను నిర్మూలించడం, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించడం, వర్ణవ్యవస్థను, వైదికధర్మాన్ని నిరసిస్తూ బౌద్ధధర్మాన్ని ప్రచారం చేశారు.
-అంతేకాకుండా 1911లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ సోషల్ స్టడీస్లీగ్ను స్థాపించి ఆది హిందువుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టాడు.
-భాగ్యరెడ్డి వర్మ 1912లో స్వస్తిక్ వాలంటీర్ల సంఘాన్ని, 1915లో సంఘ సంస్కార నాటక మండలిని, 1916లో ఇంటి పనిమనుషుల కోసం విశ్వగృహ పరిచారిక సమ్మేళాన్ని స్థాపించాడు.
-ఆదిహిందువుల్లో చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల ప్రదర్శనను వర్మ నిర్వహించారు.
-1930, నవంబర్ 16న అలహాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సభకు హాజరైన భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులకు కేంద్రంలో, ప్రాంతీయ శాసనమండలిలో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని తీర్మానం చేశాడు.
-1927 నుంచి 1931 వరకు జరిగిన జాతీయ నిమ్నవర్గాల మహాసభలకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. అంతేకాకుండా చివరి సమావేశంలో ప్రవేశపెట్టిన లక్నో తీర్మానంలో దేశంలోని ఏడు కోట్ల దళితుల సమస్యలను బ్రిటీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్‌ను ప్రతినిధిగా పంపించాలని నిర్ణయించారు.
-1931, నవంబర్‌లో వర్మ అధ్యక్షతన బొల్లారంలో జరిగిన నిజాం రాష్ట్ర ఆదిహిందూ రాజకీయ సదస్సు దళిత హక్కుల సాధనలో మరో విజయంగా చెప్పవచ్చు.
-భాగ్యరెడ్డి వర్మ డిమాండ్‌కు అంగీకరించిన ఆనాటి నిజాం ప్రభుత్వం 1931లో హిందువులుగా నమోదు చేసింది.
-ఉత్తర భారతదేశంలో అంబేద్కర్ చేసిన ప్రతి ఉద్యమానికి హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ చేసిన దళిత ఉద్యమాల ప్రేరణ అనేక విధాలుగా దోహదపడ్డాయి.
-అంటరానితనం, జోగిని, దేవదాసీ, బాల్యవివాహాల నిర్మూలనకు జీవితాంతం పోరాడిన వర్మ 1939, ఫిబ్రవరి 18న మరణించారు.
సత్యశోధక్ సమాజ్- 1873
-మహారాష్ట్రలో మాలికులంలో జన్మించిన జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడు. ఈ సంస్థ
1. కులవ్యవస్థను, అంటరాని తనాన్ని పూర్తిగా వ్యతిరేకించింది.
2. మహిళలు, అస్పృశ్యుల కోసం పాఠశాలను ఏర్పాటు చేసింది.
3. బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకిస్తూ, బ్రాహ్మణ పూజారులు లేకుండానే వివాహాలు జరిగే విధంగా పాటు పడింది.
-జ్యోతిరావ్ ఫూలే 1. గులాంగిరి, 2. సర్వజనీక్ సత్యధర్మ పుస్తక్ , 3. ధర్మతృతీయరత్న,
4. ఈశ్వర అనే గ్రంథాలను రచించారు.
మహర్ ఉద్యమం -1894
-మహారాష్ట్రలో అంటరానితనానికి, సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా గోపాల్ బాబా వాలంగేకర్ మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
-మహారాష్ట్రలో దళిత కులాల నుంచి వచ్చిన తొలిపోరాట యోధుడిగా పేరుతెచ్చుకున్న గోపాల్ బాబా ఆచార్య దోష పరిహారక మండలిని స్థాపించి సామాజిక, ఆర్థిక వివక్షత, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని దళితులకు పిలుపునిచ్చాడు.
-గోపాల్ బాబా అనంతరం మహర్ ఉద్యమాన్ని నడిపించింది శివరాం జాంబకాంబ్లే
మహర్ ఉద్యమం చేపట్టిన కార్యక్రమాలు
1. నాగపూర్‌లో అప్రెస్సెడ్ ఇండియా అసోసియేషన్ సంస్థ స్థాపన
2. పుణెలో సోంవంశిమిత్ర అనే పత్రికను ప్రారంభం
3. పుణెలో దళితుల్లో విద్యావ్యాప్తి కోసం రాత్రి పాఠశాలను, గ్రంథాలయాల ఏర్పాటు
-అంబేద్కర్ మహర్ ఉద్యమాన్ని మహోన్నత స్థాయికి చేర్చి దళిత సమస్యలపై జాతీయస్థాయిలో విస్త్రృతస్థాయి ప్రచారం కల్పించారు.
తెలంగాణ అంబేద్కర్- భాగ్యరెడ్డి వర్మ
-పంచవర్ణ భూమిలో చిక్కుకున్న అభాగ్యులను ఆధిపత్యం అణచివేత రూపంలో శాసించింది. అంటరానితనం అడుగడుగునా అవమానించింది. కులం పేరుతో కారుచీకట్లు కమ్ముకున్నాయి. అయితే ఈ చీకట్లను తరిమికొట్టేందుకు హైదరాబాద్ గడ్డపై ఒక సూర్యుడు జన్మించి దళితుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఆ భాస్కరుడే భాగ్యరెడ్డి వర్మ. మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించిన భాగయ్య(భాగ్యరెడ్డి వర్మ) దళిత కులంలో పుట్టినందుకు పసితనం నుంచే తీవ్రమైన వివక్షతకు, అవమానాలకు గురైనా చదువు, సామాజిక చైతన్యం ద్వారా అంటరానితనం నుంచి బయటపడొచ్చని బలంగా నమ్మాడు.
-ఆర్యులకు ముందే ఈ దేశంలో నిజమైన మూలవాసులు భూమిపుత్రులు దళితులేనని నిర్ణయించుకున్న భాగయ్య పేరుతోనే సామాజిక హోదాను ఇచ్చే సంస్కృతిని వెక్కిరించే విధంగా తనపేరును భాగ్యరెడ్డిగా తనుకుతానే మార్చుకోగా ఆర్యసమాజం ఇచ్చిన బిరుదుతో భాగ్యరెడ్డి వర్మగా పిలువబడ్డాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు