హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఎప్పుడు మారింది?
అఫ్జల్ ఉద్దౌలా (1857-1869)
# ఇతని కాలంలోనే హైదరాబాద్ రాజ్యంలో సిపాయిలకు అనుకూలంగా నిజాం రాజులకు , బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. నిజాంరాజుకు సహాయం గా సాలార్జంగ్-I (తురాబ్ అలీఖాన్) బ్రిటీష్ రెసిడెంట్స్, కల్నల్ డేవిడ్సన్లు సమర్థవంతమైన పాత్ర పోషించారు. నిజాం, బ్రిటీష్ రాజ్యాలను తిరిగి నిలబెట్టడంలో సఫలమయ్యారు. దక్షిణ భారతదేశంలోనే నిజాం రాజ్యం బలమైనది. సువిశాలమైనది, సంపన్నమైనది. అందువల్ల నిజాం రాజు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం మన బ్రిటీష్ పాలకులు ఎంతైన ఉంది. లార్డ్ కానింగ్ బొంబాయి గవర్నర్‌కు ఈ విధంగా లేఖ రాశాడు. నిజాం రాజు మన చేతుల్లోంచి జారిపోయినట్లయితే బ్రిటీష్ రాజ్యం కూడా జారిపోతుంది (IF NIZAM GOES ALL GOES). నిజాం చేజారినట్లయితే అంతా జారిపోయినట్లే అని దాని అర్థ్ధం. దీనిని బట్టి నిజాంపై బ్రిటీష్ వారికి ఉన్న విశ్వాసం అర్థ్ధమవుతోంది.
1839లో దక్కన్లో వచ్చిన వహాబి ఉద్యమ నేపథ్యం వల్ల స్థానిక ప్రజలు బ్రిటీష్ వారిపై విమర్శనా భావంతో, వ్యతిరేక దృక్పథంతో ఉన్నారు. కాబట్టి 1. నిజాం అఫ్జలుద్దౌలా 2. ప్రధాని సాలార్జంగ్-I 3. షమ్ షల్ఉమ్రా నాయకత్వంలోని సర్దార్లు నిజాంకు కావాల్సిన వరాలు ఇచ్చారు. రాజ్యభివృద్ధికి నిధులు, గతంలో కోల్పోయిన (బీరార్ మినహా) ప్రాంతాలు, కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ హైదరాబాద్ రాజ్య ప్రజలు దీనికి భిన్నంగా ఉన్నారు. మొగలు రాజుకు నిజాం సహాయం చేయాలనీ, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు వేశారు. ఇబ్రహీం అనే మౌల్వి ప్రజలకు నాయకత్వం వహించాడు. ఇంకా అక్బర్, మౌల్వీ, బ్రిటీష్ రెసిడెంట్ డేవిడ్సన్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేల్గావ్, చోటాపింపల్గాం వద్ద అబ్బాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. హైదరాబాదులో తురేభాజ్ఖాన్ పాత్ర మరువలేనిది. చార్లెస్బాల్ అనే చరిత్రకారుడు ‘ఏ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ’ గ్రంథంలో హైదరాబాద్‌లోని సైనికుల గురించి ఇలా రాశాడు. హైదరాబాద్‌లోని సైనికులు మంచి దేహదారుఢ్యం, అంగసౌష్టవం కలవారని, అద్భుతమైన పోరాటపటిమ గల వారని, ప్రతివారిలో నాయకత్వ లక్షణాలు కలవని చెప్పాడు. అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్ రాజ్యంలో సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు బ్రిటీష్ వారు అతనికి ‘స్టార్ ఆఫ్ ఇండియా’ (భారతదేశానికి వేగుచుక్క) అనే బిరుదును ప్రదానం చేశారు. ఇతని హయాంలోనే సాలార్జంగ్-I అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇతని తర్వాత నిజాం కుమారుడు మహబూబ్ అలీఖాన్ సింహాసనం అదిష్టించాడు.
మహబూబ్ అలీఖాన్ (1869-1911)
#మహబూబ్ అలీఖాన్‌కు మీర్‌లాయక్ అలీఖాన్ (రెండో సాలార్జంగ్) ప్రధానిగా పనిచేశాడు. అస్మాజాదివాన్, వికారే ఉల్- ఉమ్రా, సర్ కిషన్ప్రసాద్లు కూడా ప్రధానులుగా పని చేశారు. 3 ఏండ్ల వయస్సులోనే ఆరో అసఫ్‌జాగా ఎన్నికయ్యాడు. బ్రిటీష్ వాళ్లు సాలార్జంగ్-I, షమ్సల్ ఉమ్రాను సంరక్షకుడిగా నియమించారు. మహబూబ్ అలీఖాన్ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. హిందువులు ఇతన్ని ఆరాధ్య దైవంగా కొలిచారు. ఎందుకంటే 1908లో మూసీ నది వరదల కారణంగా మునిగిపోయి 80 వేల మంది ప్రజలు రోడ్డున పడ్డారు. అప్పుడు నిజాం వీరందరికి 3 నెలలు నెయ్యితో కూడిన వంటలు వండించి భోజన, వసతి సదుపాయాలు కల్పించాడు. మక్కామసీదులోని ఇతని సమాధిని హిందువులు దర్శించుకోవడం ఇప్పటికీ ఆనవాయితీగా చూడవచ్చు. ఇతని కాలంలో ఫలక్నామా ప్యాలెస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చంచల్‌గూడ జైలు, బాగ్-ఏ-ఆలం (పబ్లిక్‌గార్డెన్-నాంపల్లి), నాంప ల్లి రైల్వేస్టేషన్, నిజాం కళాశాల, ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్ మొదలైన నిర్మాణాలు జరిగాయి. మహబూబ్ అలీఖాన్ కాలంలో ‘కొరైరే’ అనే బ్రిటీష్ అధికారి రెసిడెంట్‌గా పని చేశాడు.
రెండో సాలార్జంగ్ (మీర్‌లాయక్ అలీఖాన్) పాత్ర
# రెండో సాలార్జంగ్ నిజాంకు ఎలాంటి ప్రాధాన్యతను ఇచ్చేవాడు కాదు. రాజుపైనే జోకులు వేసేవాడు. నిజాంకు ఎదురుగానే సిగరెట్స్ కాల్చేవాడు. మీర్‌లాయక్ అలీఖాన్ వ్యవహార శైలిని గ్రహించిన నిజాం రాజు చివరికి 1887లో ప్రధాని పదవి నుంచి తొలగించాడు.
# మహబూబ్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్‌లో కాస్మోపాలిటన్ సంస్కృతి ప్రారంభమైంది. సయ్యద్ బిల్గ్రామి, సయ్యద్ మోమిన్ అలీ, అఘోరనాథ్ చటోపాధ్యాయ, రామచంద్ర పిళ్లెలతో నూతన సామాజిక చైతన్యానికి నాంది పలికినాడు. ఇతని కాలంలో సాల్మన్జాబ్, రికార్డర్ పత్రిక స్థాపించాడు. ఈ పత్రిక హైదరాబాద్‌లో ఉన్న బ్రిటీష్ రెసిడెంట్స్‌ను స్థానిక సీజర్స్‌తో పోల్చింది. 1888లో రాజామురళి మనోహర్, హిందూ సోషల్ క్లబ్లో సనాతన ఆచారాలు, సాంఘిక దురాచాలను ప్రశ్నిస్తూ స్థాపించిన పత్రికలో సముద్రయానం చేయరాదనే బ్రాహ్మణుల వాదనను ఖండించాడు. రామస్వామి అయ్యర్ రాజకీయ దుష్పరిణామాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రమాత పత్రికను స్థాపించాడు.
#మహారాష్ట్రకు చెందిన వాసుదేవ బలవంతఫడ్కె 1879లో హైదరాబాద్‌కు వచ్చి అరబ్ రోషిల్లాలతో సైనికవ్యవస్థ ఏర్పాటు చేశాడు. భారత రాజప్రతినిధి రిప్పన్ (స్థానిక స్వపరిపాలన పిత) హైదరాబాద్‌ను సందర్శించి మహబూబ్ అలీఖాన్‌కు పదవీ బాధ్యతలు అప్పగించాడు. మైనర్‌గా ఉన్న నిజాం మేజర్ కావడంతో బ్రిటీష్ ప్రభుత్వం తరపున హైదరాబాద్‌ను సందర్శించాల్సిన అవసరం ఏర్పడింది. లార్డ్ రిప్పన్ హైదరాబాద్‌ను సందర్శించిన తొలి రాజప్రతినిధిగా ప్రసిద్ధి చెందాడు. తర్వాత కాలంలో 1902లో లార్డ్కర్జన్ కూడా సందర్శించాడు. ఇద్దరు రాజప్రతినిధులు మహబూబ్ అలీఖాన్ పరిపాలన కాలంలోనే భాగ్యనగరాన్ని సందర్శించారు. 1892లో ఖానూన్ ముబారిక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగపరమైన సంస్కరణలు నిజాం చేశాడు. దీనితోనే రాజ్యవిధాన సభ ఏర్పడింది. ఇతని కాలంలోనే 1888 లో హైదరాబాద్‌లో ముల్కీ నిబంధనలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నగరానికి అనేక ప్రాంతీయేతరులు రావడం వలన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని నిజాం ‘ముల్కీ’ నిబంధనలు ఏర్పాటు చేశాడు.
#మహబూబ్ అలీఖాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వాల్డ్రూమ్ను ప్రారంభించాడు. తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా జాకబ్ డైమండ్ (దాదాపు రూ. 200 కోట్ల విలువైన వజ్రం)ను ఉపయోగించాడు. ఇతని కాలంలోనే అసఫియా లైబ్రెరీ (అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ) నిర్మించాడు. అబ్దుల్ ఖయ్యూం, ఇఖ్వాఉన్స్ షా సొసైటీని స్థాపించాడు. 1885లో ముంబైలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ఏకైక హైదరాబాదీ అబ్దుల్ ఖయ్యూం. ఇదే సమావేశానికి అఘోరనాథ ఛటోపాధ్యాయ కూడా హాజరయ్యాడు. అఘోరనాథ ఛటోపాధ్యాయ బెంగాల్ నుంచి వలసవచ్చాడు. ఇతనే 1887లో స్థాపించిన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా పని చేశాడు. ఇదే కళాశాల తర్వాత కాలంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఉస్మానియాకు మార్చబడింది. (1947లో మద్రాస్ నుంచి ఉస్మానియాకు అనుసంధానం చేశారు).
# మీర్జా ఘజ్జత్ అలీఖాన్ ‘సాహసవంతుడు’ అనే తన కలంతో అనేక ఉర్దూ కవితలు రాశాడు. మహబూబ్ అలీఖాన్ కాలంలోనే పర్షియా రాజభాషను తొలగించి ఉర్దూను అధికార భాషగా చేశారు. హైదరాబాద్ రాజ్యంలో ‘ధర్మరాజు, సంతోషజీవి’ లాంటి కలం పేర్లతో చాలా మంది కవులు ప్రసిద్ధులయ్యారు. నాటి అసఫియా గ్రంథాలయంలో వేలకొద్ది అరుదైన పుస్తకాలు ఉన్నాయని, మరెక్కడ ఇవి లభించవనీ, కొత్వాల్
(పోలీస్ కమిషనర్) పోలీసు వ్యవస్థను ఆధునీకరణ చేసిన బ్రిటీష్ ఆఫీసర్ హామ్కిన్ పేర్కొన్నాడు.
#చివరకు మహబూబ్ అలీఖాన్ చిన్న వయస్సులోనే మరణించాడు. తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య మీర్ఉస్మాన్ అలీఖాన్ రాజ్యానికి వచ్చాడు.
నిజాం నిర్మించిన భవనాలు స్థాపించిన పరిశ్రమలు
1. సాలార్జంగ్ మ్యూజియం 1. వజీర్‌సుల్తాన్ టుబాకో (1919)
2. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2. సిర్పూర్ కాగితపు పరిశ్రమ (1939) (కాగజ్‌నగర్,)
3. హైకోర్టు భవనం 3. ఆల్విన్ మెటల్స్
4. సిటీ కళాశాల 4. బహదూర్ రాంగోపాల్ మిల్స్
5. ఉస్మానియా హాస్పిటల్ 5. బోధన్‌లో చక్కెర పరిశ్రమ
6. రాజ్‌భవన్ 6. ఆజంజాహి బట్టల మిల్లు
మీర్ఉస్మాన్ అలీఖాన్( 1911-1948)
# ప్రపంచంలోనే సంపన్నుడుగా, భారతదేశ సంస్థానాలన్నింటిలో విశాలమైన రాజ్యధిపతిగా మీర్ఉస్మాన్ అలీఖాన్ ప్రసిద్ధి చెందాడు. మీర్ఉస్మాన్ అలీఖాన్‌పై పరస్పర విరుద్ధభావాలు తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి. గొప్ప పాలకుడిగా, హైదరాబాద్‌ను ఆధునికంగా, పారిశ్రామికంగా, ఉన్నతస్థానానికి తీసుకెళ్లిన ఘనతను దక్కించుకున్నాడు. రెండోది నిరంకుశుడిగా, మత ఛాందస్సుడిగా (హిందూమత వ్యతిరేకి) అనే అపవాదులు ఎదుర్కొన్నాడు. అయితే మహా ఘనత వహించిన చివరి నిజామ్కు సంబంధించిన వాస్తవమైన అంశాలు ఏమిటి? నిరంకుశుడా? ప్రజారక్షకుడా? ఏది నిజం? ఏది అవాస్తవం? ఎందుకు నిజామ్ను ఇలా వక్రీకరించారు? పాఠ్యాంశాల్లోగాని, చరిత్రలోగాని, నిజాం రాజుకున్న ప్రాధాన్యత ఎంత? ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలు ఎన్నింటికో సరైన సమధానం మీర్ఉస్మాన్ అలీఖాన్ జీవితం పూర్తిగా చదివిన వారికే తెలుస్తుంది.
వ్యవయాభివృద్ధికై చేసిన చర్యలు
1. ఉస్మాన్‌సాగర్ (గండిపేట) 2. హిమాయత్ సాగర్
3. నిజాం సాగర్ 4. అలీసాగర్ (బోధన్), 5. పాడేరు చెరువు
#వ్యవసాయ అభివృద్ధి-చెరువులు: పాడేరు చెరువుతో పాటు ప్రసిద్ధి చెందిన వాటిని మంచినీటి కోసం తవ్వించాడు. నేటికి గండిపేట చెరువు నీటిని హైదరాబాద్ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. మూసీనదికి వరదలు రాకుండా గండిపేట చెరువు అడ్డకట్టగా నిలుస్తోంది. ఉస్మాన్ అలీఖాన్ వ్యవసాయం కోసం రూ.7 కోట్లు వెచ్చించి నిజాంసాగర్ తవ్వించాడు. రైతుల శ్రేయస్సు, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశాడు. అత్యంత సామాన్యమైన జీవితం గడిపినా, ప్రపంచంలోనే ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ధనవంతుడు, నిరుపేద జీవిత కథగా చివరి నిజామ్‌గా ఉస్మాన్అలీ ఖాన్ లైఫ్ హిస్టరీ మన కళ్ళముందు కనిపిస్తోంది.
రవాణా సౌకర్యాల అభివృద్ధి:
# 1932లో భారతదేశంలోనే మొదటి బస్‌డిపోను ఏర్పాటు చేశాడు.1935లో వైమానిక దళాన్ని, భారత వైమానిక దళంతో అనుసంధానం చేశాడు.
#దిండిగల్, హకీంపేట్, బేగంపేట్ విమానశ్రయాలు ఏర్పాటు చేశాడు. 1913లో పవర్ స్టేషన్ (ఎలక్టికల్ స్టేషన్), 1930లో హైడ్రో ఎలక్టిసిటీ నెలకొల్పాడు.
# నగరీకరణ కోసం 1912లో నగరాభివృద్ధి సంస్థను స్థాపించాడు. 1934లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌ను నెలకొల్పాడు. (భారతదేశంలో తొలి కార్పొరేషన్‌గా మద్రాస్ 1688లో ఏర్పడింది)
8 1942లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభమయింది. (హైదరాబాద్‌లో 1886లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ తొలిబ్యాంక్. దీనికంటే ముందు 1811లో బ్రిటీష్ వాళ్లు పామర్ అండ్ కంపెనీని స్థాపించారు.)
#ది కాలనైజేషన్ ఆఫ్ పాలసీ హెచ్.ఇ-హెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనేగ్రంథం ఎన్జీరంగా రాశాడు.
# హైదరాబాద్‌ను ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దింది మీర్ఉస్మాన్ అలీఖాన్ అని ఎన్జీరంగా గ్రంథం లో వ్యాఖ్యానించాడు.
అక్షరాస్యత అభివృద్ధి: హైదరాబాద్‌లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని దేవులపల్లి రామానుజం (5శాతం), సురవరం ప్రతాపరెడ్డి (6శాతం) వెల్లడించారు. అక్షరాస్యత అభివృద్ధి కోసం నిజాం 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఉస్మా నియా యూనివర్సిటీ నిర్మాణం కోసం సర్పాట్రిక్ జెడ్డీస్ను 1400 ఎకరాల భూమిని సేకరించడం కోసం నియమించాడు. యూనివర్సిటీకి డిజైన్ రూ పొందించడానికి నవాబ్ మొహినార్జంగ్, సయ్యద్ అలీరాజాల వంటి మేటి ఇంజనీర్స్‌ను నియమించాడు. నిర్మాణం ప్రత్యేకంగా ఉండటం కోసం బెల్జి యం దేశానికి చెందిన జస్పేర్కు కీలక బాధ్యతలను నిజాం అప్పగించాడు.
#1938లో గోథిక్ శైలిలో ఆర్ట్ కళాశాల రూపొందించబడింది. యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాలకు నిలువెత్తు సాక్ష్యం. చదువుల తల్లి సరస్వతి నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రస్తుతం భారతదేశంలోనే ఐదోస్థానంలో, దక్షిణభారత దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇలాంటి గొప్ప విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ బిడ్డలకు అందించిన ఘనత నిజాం రాజులకే దక్కుతుంది.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు