కళ్యాణి చాళుక్యులు- సాంస్కృతిక సేవ
కళ్యాణి చాళుక్యుల తొలి రాజధాని ‘కొలనుపాక’ అని ప్రముఖ చరిత్రకారుడు బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు. తదనంతర కాలంలో వీరు రాజధానిని కర్ణాటకకు మార్చుకున్నారు. హన్మకొండ విషయపాలకుడుగా గరుడ బేతరాజును రెండో తైలపుడు నియమించాడు. రెండో తైలపుడు పేరుమీదుగా తెలంగాణ పేరు వచ్చినట్లు కూడా చారిత్రక వాస్తవం గమనించాలి. సత్యాశ్రయుడు రాజైన తర్వాత తెలంగాణ నుంచి శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కళ్యాణి చాళుక్యుల నుంచే కాకతీయులు స్వాతంత్య్రం పొంది రాజ్యాన్ని స్థాపించారు.
# విష్ణుకుండినుల చివరి రాజు వంచనభట్టారక వర్మను ‘పిష్టిపురం’ యుద్ధంలో కుబ్జ విష్ణువర్ధనుడు ఓడించి, చంపి తూర్పుచాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. (తూర్పు చాళుక్యుల వంశం గురించి ఇక్కడ వివరాలు పొందుపర్చడం లేదు. తెలంగాణ చరిత్రలో వీరి ప్రాధాన్యత అంతగా లేదు. అభ్యర్థుల అవగాహన కోసం తెలంగాణలో విష్ణుకుండినుల అనంతరం వచ్చిన కళ్యాణి చాళుక్యుల వంశం గురించి మాత్రమే ప్రస్తావించడమైంది.) తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు (892-921), తర్వాత అమ్మరాజు-I (రాజమండ్రి నగర నిర్మాత), తర్వాత దానార్ణవుని కాలంలో రాష్ట్ర కూటుల రాజైన రెండో కర్ణున్ని ఓడించి రాష్ట్ర కూటుల సామంతుడైన రెండో తైలపుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడే కళ్యాణి చాళుక్య వంశ స్థాపకుడు.(రాష్ట్రకూటులు పశ్చిమ చాళుక్యులకు సామంతులు. క్రీ.శ 750లో దంతిదుర్గుడు రాష్ట్రకూట వంశాన్ని స్థాపించాడు)
# రాష్ట్రకూట చివరి రాజైన రెండో కర్కుని వారి సామంతుడైన రెండో తైలపుడు 973 సంవత్సరంలో ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యం స్థాపించినట్లు, కన్నడ కవిత్రయంలోఒకడైన రన్నడు తన ‘గదాయుద్ధం’ కావ్యంలో వివరాలు పొందుపర్చాడు. (కన్నడ కవిత్రయం అంటే పంపడు (ఆదికవి), పొన్నడు, రన్నడు). రెండో తైలపుడు బాదామి చాళుక్య వంశ రాజైన కీర్తివర్మకు పినతండ్రి అయిన భీముని సంతతిలో జన్మించాడని ‘కేథేం’ శాసనంలో ఉంది. మొత్తానికి రెండో తైలపుడు, నాలుగో విక్రమాధిత్యుడు(కాళచూరి రాజైన లక్ష్మణుని కుమార్తె) బొంతాదేవిల కుమారుడు.
# రెండో తైలపుడు రాష్ట్రకూట రాజధాని మాన్యఖేటం ఆక్రమించి కర్క-2ను ఓడించి అహావమల్ల, భువనైకమల్ల అనే బిరుదులు ధరించి స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. అతడు తనలాగే స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలనుకునే రాజులతోనూ, రాష్ట్రకూటులకు విశ్వాసపాత్రులై అతన్ని ప్రతిఘటించిన రాజులతోనూ తీవ్ర యుద్ధాలు చేశాడు. అలాంటి వారిలో గంగ వంశీయులైన మారసిండు, పాంచాల దేవుడు ముఖ్యులు. మారసిండిని క్రీ.శ 974లో తైలపుడు ఓడించి వధించాడు. పాంచాల దేవుడు ధార్వాడ్ జిల్లాలోని ప్రాంతాన్ని పాలించేవాడు. చాళుక్యులకు ప్రభల శత్రువుగా ‘చాళుక్య పంచానన’ అనే బిరుదు పొందాడు. తైలపుడు తన మిత్రుడైన భూతిగదేవుని సాయంతో పాంచాల దేవున్ని కూడా వధించాడు.
# కళ్యాణి చాళుక్యుల తొలి రాజధాని నల్లగొండ జిల్లాలోని ‘కొలనుపాక’ అని బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు. తర్వాత కళ్యాణి ప్రాంతానికి మారినట్లు కొన్ని చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. రెండో తైలపుడు తన రాజ్యాన్ని తెలంగాణ, రాయలసీమ, దక్షిణ షిమోగ, చితల్దుర్గ్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు విస్తరించాడు. ఇతను కాదంబళిగె (చితల్దుర్గ్), కదంబ ఆర్యవర్మ (కోగళి, లిసుకాడ్, సుందపత్తి ప్రాంతాలను పాలించాడు)ను తన సామంతులుగా చేసుకున్నాడు. ఇతనికి సత్యాశ్రయుడు దశవర్మ అనే కుమారుడు ఉన్నాడు. రెండో తైలపుడు 24 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతడు గరుడ బేతరాజును ‘హన్మకొండ’ విషయపాలకుడిగా నియమించాడు. రెండో తైలపుడి పేరుమీదగా తెలంగాణ వచ్చినట్లు కూడా చారిత్రక వాస్తవం గమనించాలి.
# సత్యాశ్రయుడు (997-1008) రాజైన తర్వాత తెలంగాణ నుంచి శ్రీశైలం వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. సత్యాశ్రయునికి కుమారుడు లేనందువల్ల తన సోదరి కుమారుడు 4వ విక్రమాదిత్యుడు (1008-1014) సింహాసనం అధిష్టించాడు. వీరు రాజ్య విస్తరణలో భాగంగా వేంగీ చాళుక్యులతోనూ, వారికి సహాయంగా వచ్చిన చోళులతోనూ పలుమార్లు యుద్ధాలు చేశారు.
# వరుసగా విక్రమాదిత్యుని తర్వాత అతని సోదరుడు అయ్యన (1014-1015), అతని తర్వాత సోదరుడు 2వ జయసిండు (1015-42), చాళుక్యరాజైన రాజరాజనరేంద్రున్ని కొలనుపాక నుంచి తరిమివేశాడు. చోళులు (రాజరాజ చోళుడు) నల్లగొండ జిల్లా ‘మొసంగి’ వద్ద కళ్యాణి చాళుక్యులను ఓడించి రాజరాజనరేంద్రున్ని వేంగీ సింహాసనంపై కూర్చుండబెట్టాడు. (రాజరాజచోళుని కుమార్తె కందవ్వకు, విమలాదిత్యుడికి రాజురాజనరేంద్రుడు జన్మించాడు. ఇతని మేనమామ రాజేంద్రచోళుడు. రాజేంద్రచోళుని కుమార్తె అమ్మాంగ దేవిని రాజరాజనరేంద్రుడు వివాహం చేసుకున్నాడు)
# మొదటి సోమేశ్వరుడు (1042-68) విజయసింని కుమారుడు. కళ్యాణి చాళుక్యుల్లో గొప్పవాడు. ఇతనికి త్రైలోక్యమల్ల, రాజనారాయణ అనే బిరుదులు ధరించినా ‘అహావమల్ల’ అనే బిరుదుతో ప్రసిద్ధుడు అయినాడు. ఇతడు తన పాలనా కాలంలో…
1) దక్షిణాన చోళ చక్రవర్తులతోనూ
2) ఉత్తరాన, పరమార, గుర్జార శాఖలకు చెందిన చాళుక్య రాజులతోనూ పోరాటం చేయడంతోనే గడిచింది. చివరకు సోమేశ్వరుడు రాజరాజనరేంద్రున్ని తన సామంతుడిగా మార్చుకున్నాడు. (దీన్నిబట్టి సోమేశ్వరుడి గొప్పతనం గుర్తించదగ్గ అంశం). తన ఆస్థానంలో ఉన్న ప్రధానమంత్రి అయిన నారాయణభట్టును నరేంద్రుని ఆస్థానంలోకి పంపాడు. సోమేశ్వరుని సేనాని అయిన నాగవర్మకు
1) విద్యాధిపమల్ల శిరచ్ఛేదన 2) శేవణదిశావట్ట
3) చక్రకూట, కాలకూట 4) ధారా వర్షధర్పోత్పాటన
5) మారి సింఘమదవర్ధన అనే బిరుదులు ఉన్నట్లు నాందేడ్ శాసనంలో పేర్కొన్నారు.
# ఇతని తర్వాత పెద్దకుమారుడు 2వ సోమేశ్వరుడు (1068-76) రాజైనాడు. తెలంగాణలో కొన్ని శాసనాలు ఇతని గురించి వివరించాయి. తర్వాత ఇతని తమ్ముడు 6వ విక్రమాదిత్యుడు (1076-1126) రాజ్యానికి వచ్చాడు. తన సామంతులైన కందూరి చోళులు, కాకతీయుల సహాయంతో సింహాసనం ఆక్రమించి సుదీర్ఘ పాలన చేశాడు.
ఆరో విక్రమాదిత్యుడు (1076-1126)
# ఆరో విక్రమాదిత్యుడు ‘త్రిభువన మల్ల’ అనే బిరుదు ధరించి సింహాసనం అధిష్టించాడు. తన ప్రారంభానికి చిహ్నంగా ‘చాళుక్యవిక్రమ శకం’ అనే నూతన శకాన్ని ప్రారంభించాడు. (భారతదేశంలో ఇలాంటి శకాలు విక్రమ శకం 58, కాలచూరులు, గుప్తులు 319 మొదలగువారు ప్రారంభించారు.) 1085లో చోళరాజ్యంపై దండెత్తి కాంచీ నగరాన్ని ఆక్రమించాడు. 1093లో వేంగిపై దండెత్తి వెలనాటి గొంకరాజును ఓడించి ఆంధ్రదేశాన్ని ఆక్రమించాడు. విక్రమాదిత్యుని తర్వాత అతని కుమారుడు 3వ సోమేశ్వరుడి (1126-1138) అనంతరం అతని పెద్ద కుమారుడు జగదేకమల్లుడు (1138-50) సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతనికి కందూరు చోడులు, కాకతీయ రాజులు సాయంగా ఉన్నారు. ఇతని తర్వాత సోదరుడు 3వ తైలపుడు (1150-56), తర్వాత అతని మేనల్లుడు బిజ్జలుడు 1156లో తైలపున్ని తొలగించి, కళ్యాణి నగరాన్ని ఆక్రమించుకున్నాడు. (బిజ్జలుడు కాలచూర్య వంశస్థుడు, ఇతని కాలంలో బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు.) 3వ తైలపుడి తర్వాత అతని కుమారుడు నాలుగవ సోమేశ్వరుని (1184-1200) కాలంలో ఈ రాజ్యం పతనమయ్యింది. ఆ తర్వాత..
1) హోయసళ (ద్వారసముద్రం), 2) యాదవ (దేవగిరి) 3) కాకతీయ (ఓరుగల్లు) బలమైన రాజ్యాలుగా అవతరించాయి. కళ్యాణి చాళుక్యులు తెలంగాణలో ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉండెను.
పాలనాంశాలు
# పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని మండల, విషయాలు, నాడులుగా విభజించారు. విషయపతి జిల్లాకు అధికారి, గ్రామంలో రైతులకు ప్రముఖ స్థానం ఉండేది. తమ సామంతులకు, మహామండలేశ్వరుడు, మహా సామంతులు అని పిలిచారు. స్థానిక స్వపరిపాలన రూపొందించబడింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాజధానుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సమితులు ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగులు 3 రకా ల పన్నులను రైతులనుంచి భూస్వాముల నుంచి వర్త క సంఘాల నుం చి వసూలు చేసేవారు. వాణిజ్యం ప్రధానంగా వైశ్యుల చేతిలో ఉండేది. వీరు క్రమంగా కోమట్లుగా మార్పు చెందారు. నకరాలు (వర్తక సంఘాలు), యాత్రా స్థలాలు, వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందాయి.
రాజకీయ ముఖ్యాంశాలు
# రాష్ట్రకూట వంశ నిర్మూలన అనంతరం కళ్యాణి చాళుక్యులు రాజ్యాధిపత్యం వహించి సుదీర్ఘకాలం దక్షిణాపథాన్ని పాలించారు. బాదామి చాళుక్య వంశాన్ని మించి ఉన్న రాజ్యాన్ని పాలించాడు.
మత విధానం
# ఆంధ్రలో వీరశైవ ఉద్యమ ప్రచారం చేసింది మొదట మల్లికార్జునుడు. వీరశైవ మతస్థాపకుడు బసవేశ్వరుడు. వీరశైవం ద్వారా కుల నిర్మూలన, సాంఘిక సమానత్వం ముఖ్యాంశాలుగా బసవేశ్వరుడు బోధించాడు. తెలంగాణలో బసవేశ్వరుడు కాయతీయుల కాలంలో వీరశైవం వ్యాపింపజేశాడు. వీరికాలంలో బౌద్ధం క్షీణించి, జైనం బలపడింది. కొలనుపాకలో జైనాలయాన్ని నిర్మించారు. (తెలంగాణలో మిగిలిన ఏకైక జైనస్థావరం ప్రస్తుతం ఇదే.) అలంపురంలోని జోగులాంబ (అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి) దేవాలయాన్ని నిర్మించారు. కొల్లాపురం, కొలనుపాక, వేములవాడ, హన్మకొండ శైవ క్షేత్రాలుగా అభివృద్ధి చెందాయి.
సాహిత్య సేవ
# సంస్కృతం స్థానంలో దేశ భాషలు (ప్రాంతీయ భాషలు) క్రమంగా బలపడెను. బిల్హణుడు ఆరో విక్రమాదిత్యుని ఆస్థాన కవి. అతడు విక్రమాంక దేవ చరిత్ర అనే ప్రసిద్ధ కావ్యం రచించాడు. 3వ సోమేశ్వరుడు కళ్యాణి చాళుక్యుల్లో స్వయంగా గొప్పకవి. తను ‘అభిలాషార్ధచింతామణి, మానసోల్లాసం గ్రంథాలు రచించాడు. ‘రన్నకవి’ తైలపుని ఆస్థానకవి. ఇతడు మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదించాడు. జయసింని ఆస్థానంలో చంద్రరాజు అనే కవి ఉండేవాడు. రాజు ఈ కవిని ఆదరించి పోషించాడు. ఆయన మదన తిలకం అనే కావ్యాన్ని రచించాడు.
ముఖ్యాంశాలు
8 కళ్యాణి చాళుక్య వంశస్థాపకుడు తైలపుడు, సోమేశ్వరుడు (అహవమల్ల బిరుదు పొందెను) ఉత్తర భారతదేశంపై దండెత్తి పరపారభోజుడిని ఓడించెను. 6వ విక్రమాదిత్యుడు, కళ్యాణి చాళుక్యుల్లో గొప్పవాడు. ఇతనికి ‘త్రిభువనమల్ల’ బిరుదు ఉంది. 3వ సోమేశ్వరుడు స్వయంగా గొప్పకవి. మానసోల్లాసం రచించాడు.
1. కొలనుపాక (నల్లగొండ)లో జైన పార్శ్వనాథుని ఆలయం
2. అలంపూర్ (మహబూబ్నగర్)లో ‘జోగులాంబ’ ఆలయం
3. వేములవాడ (కరీంనగర్) లో రాజేశ్వరాలయం నిర్మించిరి. వీరి కాలంలో ‘రన్నడు’ గొప్పకవి. తైలపుని ఆస్థానంలో ఉన్నాడు. 2వ తైలపుని పేరుతో తెలంగాణ రాజ్యం ఏర్పడెను. (కాకతీయులు వీరి నుంచే స్వాతంత్య్రం సంపాదించిరి)
మాదిరి ప్రశ్నలు
1. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది?
ఎ) కళ్యాణి (కర్ణాటక)
బి) కొలనుపాక (నల్లగొండ)
సి) వేములవాడ (కరీంనగర్)
డి) అలంపూర్ (మహబూబ్నగర్)
1) ఎ మాత్రమే సరైనది 2) బి మాత్రమే సరైనది
3) ఎ, బి మాత్రమే సరైనవి 4) పైవన్నీ
2. ‘మదన తిలకం’ రచించిన చంద్రరాజు ఎవరి ఆస్థానంలో నివసించెను?
1) జయసింహడు 2) రెండో తైలపుడు
3) విక్రమాధిత్యుడు 4) 6వ సోమేశ్వరుడు
3. రాజరాజనరేంద్రుని ఆస్థానంలోని నన్నయ్యకు తెలుగు నేర్పిన
కళ్యాణి చాళుక్యుల కాలంనాటి ప్రధానమంత్రి ఎవరు?
1) మల్లికార్జునుడు 2) నారాయణ భట్టు
3) సోమేశ్వరుడు 4) బిల్హణుడు
వివరణ: నారాయణ భట్టు నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేయడానికి సహాయం చేసి, రాజరాజ నరేంద్రునిచే ‘నందంపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా పొందెను.
సమాధానాలు: 1) 3 2) 1 3) 2
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు