ప్రగతి సోపానం – విద్య, రాష్ట్రంలో అక్షరాస్యత
ఏ సంక్షేమ రాజ్యానికైనా ప్రధాన లక్ష్యం ప్రజల నికరమైన, మనగలిగిన, మెరుగైన జీవన ప్రమాణం కోసం సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం. సామాజిక, మౌలిక సదుపాయాల్లో విద్య, ఆరోగ్యం, పోషణ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా మొదలైనవి. సామాజికాభివృద్ధిని వ్యవస్థీకృతం చేయడంతో అది ఆర్థికాభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రక్రియను నిలదొక్కుకునేలా చేస్తున్నది.
అక్షరాస్యత
రాష్ట్రంలో అక్షరాస్యత స్థాయి 2001లో 58 శాతం ఉండగా, 2011లో 66.46 శాతానికి పెరిగింది. రాష్ట్ర అక్షరాస్యతా స్థాయి అఖిల భారత స్థాయి 72.99 శాతం కన్నా తక్కువ. గడిచిన దశాబ్దంలో అక్షరాస్యతా వృద్ధి అటు జాతీయస్థాయిలోనూ, ఇటు రాష్ట్రస్థాయిలోనూ మందగించింది. ఏడేండ్లు, అంతకు పైబడిన వయస్సు బాలల్లో రాష్ట్రంలో సాధారణ అక్షరాస్యతా స్థాయి మరీ ఎక్కువగా లేదు.
మూడో వంతు నిరక్షరాస్యులతో రాష్ట్రం 2011లో 25వ ర్యాంకులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వయోజన అక్షరాస్యతా స్థాయి 73.07 శాతం. 2011-12లో ఈ విషయంలో జాతీయస్థాయిలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది. ఒక్క వయోజన అక్షరాస్యుడు లేని కుటుంబాలు గ్రామీణ తెలంగాణలో 29 శాతం ఉన్నాయి. అదే 2011-12లో అఖిల భారతస్థాయిలో వయోజన అక్షరాస్యుడు లేని కుటుంబాలు 18.07 శాతం ఉన్నాయి. పట్టణ విభాగాల్లో ఒక్క వయోజన అక్షరాస్యుడు లేని కుటుంబాలు ఇప్పటికీ 6 శాతం ఉన్నాయి.
అక్షరాస్యత ప్రగతి సూచికలు
66.46 శాతం అక్షరాస్యతా స్థాయితో తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యుల సంఖ్య 207.84 లక్షలు. వీరిలో 117.49 లక్షల మంది పురుషులు, 90.35 లక్షల మంది స్త్రీలున్నారు. నిష్పత్తి పరంగా అక్షరాస్యతా స్థాయి పురుషుల్లో 74.95 శాతం కాగా, స్త్రీలల్లో 57.92 శాతంగా ఉంది.
పాఠశాల విద్య
యూఎన్డీపీ సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు(ఎండీజీ) గుర్తించిన ప్రకారం అందరికీ విద్య అనేది మానవాభివృద్ధి ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. దీన్ని భారత రాజ్యాంగం 21-ఏ అధికరణంలో పొందుపర్చారు. 2009లో 93వ రాజ్యాంగ సవరణ తర్వాత విద్య ప్రాథమిక హక్కుగా మారింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విద్య అందుబాటు, విద్యాలయ ప్రవేశంలో లైంగిక సమానత, మొత్తం మీద బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మెరుగుపడింది. విద్యార్థులు సగంలో బడి మానేయకుండా చదువును పూర్తికాలం కొనసాగించడం, నాణ్యమైన విద్యను అందించడం మొదలైనవి విద్య అవసరాలుగా పరిగణింపబడ్డాయి.
ఈ రాజ్యాంగ శాసనాన్ని సమర్థంగా అమలు చేయడానికి, భారతదేశంలో ప్రాథమికోన్నత(ఎలిమెంటరీ) స్థాయి విద్యను సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కిందకు తెచ్చారు. ఇది ప్రాథమికోన్నత విద్యను సార్వత్రికం చేయడానికి ఉద్దేశించింది. అదే విధంగా సెకండరీ స్థాయి విద్యను రాస్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) అనే అగ్రగామి కార్యక్రమం కిందకు తెచ్చారు. ఈ రెండు పథకాలను విద్యాహక్కు చట్టంతో కల్పి, విస్పష్టమైన రాష్ట్ర నిబంధనలతో రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేయడం ప్రభుత్వ విధానం.
అందరికీ విద్య
-పాఠశాల సదుపాయాలను నెలకొల్పడంలో దిగువ సూత్రాలను పాటించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తున్నది.
-విద్యార్థులు నడిచివెళ్లి రావడానికి వీలుగా, జనావాసాల నుంచి కిలోమీటరు దూరం మించకుండా అందుబాటులో ప్రాథమికస్థాయి(ప్రైమరీ) విద్యాలయాలుండాలి.
-విద్యార్థులు నడిచివెళ్లి రావడానికి వీలుగా, అన్ని జనావాసాల నుంచి 3 కిలోమీటర్లలోపు దూరంలోఎలిమెంటరీ (ప్రాథమికోన్నత) స్థాయి విద్యాలయాలుండాలి.
-విద్యార్థులు నడిచివెళ్లి రావడానికి వీలుగా అన్ని జనావాసాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ (మాధ్యమిక) స్థాయి విద్యాలయాలుండాలి.
ఎలిమెంటరీ విద్యాస్థాయిలో తెలంగాణ రాష్ట్రం 99 శాతం వృద్ధిని సాధించింది. పైన తెల్పిన సూత్రాలకు అనుగుణంగా విద్యాలయాలను నెలకొల్పడంతో సెకండరీ స్థాయిలో 91.05 శాతం వృద్ధిని సాధించింది. గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాలయాలు లేని తావుల్లో కొత్త ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాలయాలను ప్రారంభించారు. పాఠశాల వయస్సు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 61.78 లక్షల మంది బాలలున్నారు. వీరికి పాఠశాల విద్యా సదుపాయాన్ని విద్యాశాఖ కల్పిస్తున్నది. 2014-15లో వివిధ యాజమాన్యాలకు చెందిన 43,208 పాఠశాలలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. ప్రాథమిక విద్య సార్వత్రీకరణ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రం చేరువలో ఉంది. ప్రాథమిక స్థాయి విద్యా సంస్థల స్థాయిలో భౌతికమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడానికి గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి.
దీనివలన విద్యాబోధనలో నాణ్యత, అధ్యాపకుడు-విద్యార్థుల నిష్పత్తి మెరుగుపడింది. 2014-15లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాస్థాయిల్లో అధ్యాపకుడు- విద్యార్థుల నిష్పత్తి వరుసగా 27, 23, 24గా ఉంది. ఇక ఎలిమెంటరీ విద్య సార్వత్రీకరణ లక్ష్యంతో అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడున్న పాఠశాలలను పటిష్టం చేయడం, కొత్త ప్రైమరీ పాఠశాలలను తెరవడం, మారుమూల ప్రాంతాల్లోనూ ఇప్పటి వరకు పాఠశాల సదుపాయం లేని జనావాస ప్రాంతాల్లోనూ ప్రత్యామ్నాయ విద్యాలయాలనూ, ఇతర రకాల విద్య సదుపాయాలనూ నెలకొల్పడం ఈ చర్యల్లో భాగాలు. కొత్త చర్యలు, బడిలో చేరని పిల్లలను వెదికి పట్టుకుని, ప్రోత్సహించి, తల్లిదండ్రులకు నచ్చజెప్పి, వారిని బడిలో చేర్పించడం వంటి చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. పాఠశాలల్లో పిల్లల చేరికలు పెరగడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల్లో కలిపి 2014-15లో చేరిన విద్యార్థుల సంఖ్య 60.76 లక్షలు.
సర్వశిక్ష అభియాన్
-6 నుంచి 14 ఏండ్ల వయస్సు బాలలందరికి ఉపయోగకరమైన, కాలానికి తగిన ఎలిమెంటరీ విద్యను అందించాలన్నదే సర్వశిక్ష అభియాన్ ఆశయం. పాఠశాలల యాజమాన్యాల్లో సమాజాన్ని చురుకుగా నిమగ్నం చేయడం ద్వారా సామాజిక, ప్రాంతీయ, లింగ పరమైన వెలుతులను భర్తీ చేయాలని ఆకాంక్షిస్తున్న ఎస్ఎస్ఏ 2014-15లో 65: 35 నిష్పత్తిలో నిధులను సమకూర్చింది.
లక్ష్యాలు
-6 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించడం
-ఎలిమెంటరీ విద్య ఎనిమిదేండ్లు పూర్తి చేసేవరకు విద్యార్థులు బడుల్లో కొనసాగేలా చూడటం
-జీవితానికి పనికొచ్చే విద్య అనే అంశానికి ప్రాధాన్యమిచ్చేలా సంతృప్తికరమైన నాణ్యతతో ఎలిమెంటరీ విద్యను రూపుదిద్దడంపై దృష్టి పెట్టడం
-ఆడ, మగ సామాజిక అంశాల వారీగా ఉన్న వ్యత్యాసాలను ఎలిమెంటరీ విద్యాస్థాయిలో భర్తీ చేయడం
కొత్త చర్యలు
-కొత్త ప్రైమరీ పాఠశాలలను తెరవడం
-ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల స్థాయికి పెంచడం
-కొత్త స్కూళ్లకు నిరంతరం అధ్యాపకులను మంజూరు చేయడం, ఇప్పుడున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అదనపు అధ్యాపకులను మంజూరు చేయడం
-మండల్ రిసోర్స్ సెంటర్లను, స్కూలు సముదాయాలను పటిష్టం చేయడం
-సర్వీసులో ఉన్న అధ్యాపకులకు ప్రతియేటా ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం
-బడులకు దూరమైన విద్యార్థులకు చదువు, ప్రత్యేక శిక్షణ
-స్కూలు యూనిఫారాల సరఫరా
-కొత్త ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలకు టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ గ్రాంటు విడుదల
-స్కూళ్లు, టీచర్లు, నిర్వహణకు గ్రాంట్లను విడుదల చేయడం
-కొత్తచర్యల మీద పరిశోధన, మదింపు అధ్యయనాలు, కార్యకలాపాల పర్యవేక్షణ, నిఘా
-యాజమాన్యం, నాణ్యత, సమాజ సమీకరణ
-సృజనాత్మక ఆవిష్కరణలు – బాలికల విద్య నిమిత్తం సృజనాత్మకమైన కార్యకలాపాల నిర్వహణ. మొగ్గదశలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పట్టణాల్లో నిర్లక్ష్యానికి గురైన బాలలకు చదువు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
-సమాజ నాయకులకు శిక్షణ, సమాజ సమీకరణ
-రవాణా/ భద్రత
-పట్టణాల్లో నిర్లక్ష్యానికి గురైన బాలలకు ప్రత్యేక ఆవాస విద్యాలయాలు, వసతి గృహాల నిర్వహణ
2014-15లో సాధించిన విజయాలు
-పాఠశాల లేని జనావాస ప్రాంతాల్లో 2014-15లో సుమారు 38 కొత్త ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
-దాదాపు 22,41,785 మంది బాలలకు రెండు సెట్ల యూనిఫారాల పంపిణీ
-దాదాపు 99.4 శాతం విద్యాలయాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది. అధ్యాపకుడు- విద్యార్థుల నిష్పత్తి (టీపీఆర్) మెరుగుపడింది. 1 నుంచి 5 తరగతుల స్థాయిలో 1:29, 1 నుంచి 8, 9 తరగతుల స్థాయిలో 1:24, 1 నుంచి 12 తరగతుల స్థాయిలో 1:39 వంతున ఉంది.
-రాష్ట్రంలో దాదాపు 98.4 శాతం పాఠశాలలకు క్రియాశీలకమైన యాజమాన్య కమిటీలున్నాయి.
-పాఠశాలలకు దూరంగా ఉన్న బాలలను క్రమపద్ధతిలో నడిచే విద్యాలయాల్లో చేర్పించడం కోసం దాదాపు 52,947 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఇంటర్మీడియేట్ విద్య
ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాలనా నియంత్రణలో 397 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 4 ప్రభుత్వ వృత్తివిద్యా జూనియర్ కళాశాలలున్నాయి. గ్రాంట్-ఇన్-ఎయిడ్, సర్వీస్ పరిస్థితులు, విద్యాబోధనాంశాల పరంగా అన్ని వాస్తవిక ప్రయోజనాల రీత్యా మరో 43 ప్రైవేటు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల కార్యకలాపాలను కూడా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చూస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్య(12వ తరగతి) పూర్తి చేసిన తర్వాత, సైన్స్, ఆర్ట్స్, కామర్స్, వృత్తి విద్యాకోర్సుల్లో విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. 588 జూనియర్ కళాశాలల్లో ఇంజినీరింగ్- టెక్నాలజీ, వ్యవసాయం, హోమ్ సైన్స్, వైద్య సహాయక రంగం, వ్యాపార-వాణిజ్యం, మానవీయ శాస్త్ర రంగాల్లో 29 వృత్తి విద్యాకోర్సులను బోధిస్తున్నారు.
విద్యకు వృత్తివిద్యా రూపం ఎన్‌వీఈక్యూఎఫ్ పైలట్ ప్రాజెక్ట్
ఉన్నత విద్యను వృత్తిగా మార్చడానికి సంబంధించింది. రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్రం నేషనల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌వీఈక్యూఎఫ్) కింద ఓ పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది. దీనికి ఆమోదించిన ఖర్చు రూ. 1247.73 లక్షలు. దీనిలో కేంద్రం భరించే భాగం రూ. 1,066.73 లక్షలు. రాష్ట్ర భరించే భాగం రూ. 181.00 లక్షలు.
స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులు
ఇంజినీరింగ్, ఐటీ, హోమ్ సైన్సెస్, పశుగణాభివృద్ధి, ఇతర రంగాలకు సంబంధించి, ఎంపిక చేసిన స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సులు 24 ఉన్నాయి. 2014-15లో 2014 జూన్ 2 నుంచి 2015 జనవరి 31 వరకు స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సుల ద్వారా 1,333 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. చదువును అర్ధాంతరంగా ఆపిన విద్యార్థులు ఎస్సెస్సీ విఫలమైన/ఉత్తీర్ణులై చదువును ఆపేసిన, ఇంటర్ విఫలమైన లేదా ఉత్తీర్ణులై ఆగిపోయిన విద్యార్థులకు ప్రయోజనం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు, ఏడాది కాలం పాటు బోధించే సర్టిఫికెట్ కోర్సులను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నది.
కళాశాల విద్య
నాణ్యమైన, సమానతా విధానం కలిగిన ఉన్నత విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా కళాశాల విద్యాశాఖ శ్రద్ధ వహిస్తున్నది. రాష్ట్రంలో ఉన్న 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లోనూ, 69 ఎయిడెడ్ కళాశాలల్లోనూ చదువుకు సంబంధించిన నాణ్యతను ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. అన్ని ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి అవసరాలను కూడా ఈ శాఖ తీరుస్తుంది. 126 ప్రభుత్వ, 69 ఎయిడెడ్ కళాశాలలు కలిపి రాష్ట్రంలో 195 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో ప్రభుత్వ కళాశాలల్లో 87,339 మంది, ఎయిడెడ్ కళాశాలల్లో 58,785 మంది కల్పి మొత్తం 1,46,124 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
సాంకేతిక విద్య
రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ టెక్నికల్ విద్యను పెంపొందిస్తుంది. పరిశ్రమ అవసరాలకు దీటుగా సాంకేతిక నైపుణ్యాలతో, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను సిద్ధం చేయడం ఈ శాఖ ఆశయం. రాష్ట్రంలో 1,356 డిప్లొమా, డిగ్రీస్థాయి వృత్తి విద్యాసంస్థలుండగా, వాటిల్లో మొత్తం 3,47,950 సీట్లున్నాయి.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధికల్పన, శిక్షణ, నాణ్యతను పెంచడానికి 27 నాణ్యతాభివృద్ధి కేంద్రా (ఎస్డీసీ)లను నెలకొల్పారు. ప్రతి ఎస్డీసీని రూ.30 లక్షల ఖర్చుతో నెలకొల్పారు. ఎస్‌డీసీలను ప్రారంభించింది మొదలు 10,028 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
తెలంగాణలో ఉన్నత విద్య
ఉన్నత విద్యలో తెలంగాణ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. వాటిలో ఒకటి కొత్త రాష్ట్రంలో ఉన్నత విద్యను విద్యార్థులకు చేరువచేయడానికి సంబంధించింది. ఉన్నత విద్యా సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే యువ జనాభాలో అధిక భాగం మాత్రం గ్రామాల్లోనే ఉన్నారు. ఫలితంగా ఎక్కువ మంది యువతీ యువకులకు ఉన్నత విద్యను అందించడం ఇప్పటికీ కలగానే మిగిలింది.
ఆరోగ్య రంగంలో కొత్త ప్రయత్నాలు
ఆరోగ్య సంరక్షణ సేవలు నాణ్యతా పరంగా అరకొరగానే ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సూచికల రీత్యా తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటుకన్నా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని పేద ఆర్థిక స్థితిగతుల పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఆరోగ్య సంరక్షణ మీద చేసే వ్యయాన్ని మానవాభివృద్ధి మీద పెట్టుబడిగా పరిగణిస్తారు.
మధ్యలోనే చదువు మానేస్తున్న బాలలు
శ్రద్ధ వహించి ఎదుర్కోవాల్సిన మరొక సవాలు బాలలు చదువును కొనసాగించేలా చూడటం. ఒక వంక బాలలందరికీ విద్య అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో బాలలు సగంలోచదువులు మానేయకుండా కాపాడుకోవడం ఒక బృహత్కార్యం. ప్రాథమికస్థాయిలో బాలలు బడుల్లో చేరడం ఇతోధికమైన స్థాయిలో ఉంటుండగా, వారు ఒక్కో తరగతి పూర్తి చేసి, ముందుకు వెళుతున్నకొద్దీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా పడిపోతున్నది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో మధ్యలోనే చదువు మానేస్తున్న విద్యార్థుల శాతం (38. 32) గా ఉంది.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బాలలను వ్యవసాయంలోనూ, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో పెట్టడం వల్ల, ప్రత్యేకించి పంటలు పండిచే రోజుల్లో వారిని పనుల్లోకి తీసుకెళ్లిపోవడంతో వారి చదువు అర్ధాంతరంగా ఆగిపోతున్నదని ప్రథమ్ నిర్వహించిన ఏఎస్ఇఆర్-2014లో సర్వే వెల్లడించింది. బడి వయస్సు బాలలను తిరిగి బడులకు రప్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు బాలికలకు ప్రత్యేక సదుపాయాలను కల్పించడాన్ని పటిష్టం చేయాల్సి ఉంది. పరీక్షా వ్యవస్థలో సంస్కరణలను కూడా పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది.
మధ్యాహ్న భోజన పథకం
1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరఫరా పథకాన్ని అమలు చేయడానికి భారత ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తన సొంత నిధులతో 9, 10 విద్యార్థులకు కూడా వర్తింపచేస్తున్నది. విద్యార్థుల పోషణ స్థాయిలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు గుడ్లు లేదా అరటి పండును కూడా పంపిణీ చేసున్నది. రాష్ట్రంలో విద్యార్థులందరికీ సన్న బియ్యం (సూపర్ ఫైన్ రకం)తో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. 2014-15లో మధ్యాహ్న భోజన పథకం ప్రయోజనాన్ని పొందిన విద్యార్థులు 30.44 లక్షల మంది ఉన్నారు.
సామర్థ్య నిర్మాణం
నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) జరిపే అక్రిడిటేషన్ ద్వారా ఉన్నత విద్యలో నాణ్యతను పరిరక్షించడం జరుగుతున్నది. 2015, జనవరి 31 ప్రకారం మొదటి దశలో 55 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అక్రిడిటేషన్ పొందాయి. రెండో దశలో 31 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అక్రిడిటేషన్ పొందాయి. ఇక విద్యా సంస్థల్లో అక్రిడిటేషన్ అనంతర కార్యకలాపాలకు ప్రణాళిక వేయడానికి, నిర్వహించడానికి, అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థల నాక్ అక్రిడిటేషన్‌ను త్వరితం చేయడానికి సాయపడే కార్యకలాపాలను, కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి, నిర్వహించడానికి, నాణ్యతను పెంచే కార్యకలాపాలను చేపట్టడానికి కళాశాల విద్యా కమిషనరేట్‌లో ఎస్ఎల్క్యూఏసీపీ క్రియాత్మక విభాగంగా రాష్ట్ర నాణ్యతా పూచీ విభాగాన్ని నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో, సీసీఇ కార్యాలయాల్లోనూ నాణ్యతా అవగాహనను సృష్టించడానికి ఎస్క్యూఏసీ ఎన్నో కార్యగోష్టులను, సదస్సులను నిర్వహించింది.
-తెలంగాణ సామాజిక ఆర్ధిక చిత్రణ -2015 పుస్తకం నుంచి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు