కళాపూర్ణోదయంలో నాయికానాయకులు?
ప్రబంధం : ప్రకృష్ణుమైన బంధం కలది ప్రబంధం. జాతి, వార్తా, చమత్కారాలు గల ప్రక్రియ ప్రబంధం. తెలుగు సాహిత్యంలో 16వ శతాబ్దానికి ప్రబంధయుగం అని పేరు. దీనికే రాయలయుగం అని కూడా పేరు ఉంది.
-ప్రబంధ లక్షణాలు : 1 అష్టాదశ వర్ణనలు కలిగి ఉండటం, 2) వస్తువు ఐక్యత ఉండటం, 3) శృంగార రస ప్రాధాన్యం కలిగి ఉండటం, 4) ఏకనాయకాశ్రియంగా ఉండటం, 5) అలంకార శైలిని కలిగి ఉండటం, 6) మనసును రంజింపచేయడం.
-అష్టాదశ వర్ణనలు : 1) నగర వర్ణన, 2) సముద్ర వర్ణన, 3) పర్వత వర్ణన, 4) రుత వర్ణన, 5) సూర్యోదయ వర్ణన, 6) చంద్రోదయ వర్ణన, 7) ఉద్యానవన వర్ణన, 8) జలక్రీడా వర్ణన, 9) మధుపాన వర్ణన, 10) రతివేడుక, 11) విరహ వర్ణన, 12) వివాహ వర్ణన, 13) కుమారోదయ వర్ణన, 14) మంత్రాంగ వర్ణన, 15) రాయబార వర్ణన, 16) ప్రయూద వర్ణన, 17) యుద్ధ వర్ణన, 18) నాయకాభ్యుదయ వర్ణన
-నన్నెచోడుడు తాను రచించిన కుమార సంభవాన్ని ప్రబంధమని పేర్కొన్నాడు.
-ప్రబంధం అనే శబ్దాన్ని మొదట ప్రయోగించిన కవి- నన్నెచోడుడు
-తాను రచించిన మహాభారత పర్వాలకు ప్రబంధమండలి అని పేరు పెట్టినవాడు- తిక్కన
-ఎర్రన రచించిన నృసింహపురాణంలో కూడా ప్రబంధ లక్షణాలు కనిపిస్తాయి.
-తెలుగు సాహిత్యంలో రాసిన తొలి ప్రబంధం- మనుచరిత్ర
-మనుచరిత్రను రచించిన కవి అల్లసాని పెద్దన. ఇతని జన్మస్థలం కడప జిల్లా కోకట అనే గ్రామం. ఇతను రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడు. పెద్దర రచించిన మరో గ్రంథం హరికథాసారం. ఇది అలభ్యం. దీన్ని తన గురువు శఠకోపయతికి అంకితమిచ్చాడు. అల్లసాని పెద్దనకు గల బిరుదు ఆంధ్రకవితా పితామహుడు. మనుచరిత్రకు గల మరో పేరు- స్వారోచిషమనుసంభవం.
-మనుచరిత్రలో కథానాయకుడు స్వరోచి. కథానాయిక మనోరమ. సిద్దుడు ఇచ్చిన పాదలేపనంతో హిమాలయాలను దర్శించినవాడు ప్రవరుడు. ఇతని జన్మస్థలం అరుణాస్పదపురం.
-అల్లసాని వాని అల్లిక జిగిబిగి అని ప్రసిద్ధి. జిగి అంటే కథగమనానికి మనోహరత్వాన్ని చాటే మృదువైన పదాల కూర్పు. బిగి అంటే మృదువైన పదాల కూర్పునకు మాధుర్యాన్ని సమకూర్చే సరళమైన భావ పరంపరల పొందిక.
-పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని పెద్దన కవిత్వాన్ని ప్రశంసించిన కవి- చౌడప్ప.
-తెలుగు పంచకావ్యాల్లో మొదటగా చెప్పుదగినది- మనుచరిత్ర. ఇది శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చారు.
-పంచకావ్యాలు : 1) మనుచరిత్ర, 2) అముక్తమాల్యద, 3) శృంగారనైషధం, 4) పాండురంగమహాత్యం, 5) వసుచరిత్ర.
-సంస్కృతంలోని పంచకావ్యాలు : 1) రఘువంశం, 2) కుమార సంభవం, 3) మేఘసందేశం, 4) కిరాతార్జునీయం, 5) శిశుపాల వధ.
-ఎదురైనచో తన మదకరీంద్రమునిల్పి చేయిని ఆసరాగా ఇచ్చి పెద్దనను ఏనుగుపైకి ఎక్కించుకున్నవాడు- శ్రీకృష్ణదేవరాయలు.
-పెద్దనకు రాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం- కోటకం.
-మనుచరిత్రంలో లేని వర్ణన- మధుపానవర్ణన
-ఆ నగరం భూదేవి కంఠంలో ధరించిన ముత్యాలహారంలోని నాయకమణిలా ప్రకాశిస్తున్నది అని అరుణాస్పదపురాన్ని వర్ణించిన కవి- పెద్దన
-పెద్దన కవిత్వాన్ని వడపోత పెట్టిన ఇక్షురసంతో పోల్చిన కవి, విమర్శకుడు- విశ్వనాథ సత్యనారాయణ
-మనుచరిత్రలోని ప్రధాన రసం ధర్మవీరం. ఇందులోని అశ్వాసాల సంఖ్య- 6
-స్వరోచి, వనదేవతల కుమారుడు- స్వారోచిష మనువు
-స్వరోచి భార్యలు మనోరమ, కళావతి, విభావసి
-స్వరోచికి మనోరమ అశ్వహృదయమనే విద్యను, విభావసి మృగ, పక్షి భాషల విద్యను, కళావతి పద్మినీ విద్యను నేర్పారు.
-రాయల మరణానంతరం బతికి ఉన్నాడు జీవచ్ఛవంబు కరణి అని బాధపడిన కవి- అల్లసాని పెద్దన.
-మనుచరిత్రకు వ్యాఖ్యలు రచించినవారు- తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య, వావిళ్ల రామశాస్త్రి, శేషాద్రి రమణ కవులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి.
-అముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించిన కవి- శ్రీకృష్ణదేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినవారిలో గొప్పవాడు. ఇతనికి గల బిరుదులు ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరురాయరగండ.
-శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులకు గల పేరు- అష్టదిగ్గజ కవులు. వీరు 1) అల్లసాని పెద్దన, 2) నంది తిమ్మన, 3) మాదయగారి మల్లన, 4) అయ్యలరాజు రామభద్రుడు, 5) ధూర్జటి, 6) తెనాలి రామకృష్ణుడు, 7) పింగళి సూరన, 8) రామరాజు భూషణుడు.
-అష్టదిగ్గజ కవుల ప్రస్తావన గల శాసనం- తిప్పలూరు శాసనం.
-శ్రీకృష్ణదేవరాయల రచనలు- అముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనం, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి.
-అముక్తమాల్యదకు గల మరోపేరు- విష్ణుచిత్తీయం. ఇందులో అశ్వాసాంత గద్యాలు లేవు. కథానాయిక పేరుతో వెలువడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఇది. శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యదను తన ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు.
-అముక్తమాల్యద అంటే విడిచిన మాలను ధరింపచేయనది అని అర్థం.
-గోదాదేవి, శ్రీరంగనాథుల ప్రణయగాథను తెలిపే ప్రబంధం- అముక్త మాల్యద.
-వైష్ణవ మత ప్రచారకులలో గల 12 మంది ఆళ్వారుల్లో ఒకరు విష్ణుచిత్తుడు. ఇతని కూతురు గోదాదేవి.
-కాండిఖ్య కౌశిధ్వజుల వృత్తాంతం, యమునా చర్య వృత్తాంతం, సోమశర్మ వృత్తాంతం, మాలదాసరి కథలు గల ప్రబంధం అముక్తమాల్యద. ఇది ప్రకృతి వర్ణనలు అధికంగాగల ప్రబంధం.
-అముక్తమాల్యదలోని రచనా శైలి నారికేళపాకం.
-చూడికొడుత్తాళ్ అనే తమిళ పద సంపుటికి సంస్కృతీకరణమే అముక్తమాల్యద. ఇది విల్లీపుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమవుతుంది.
-అముక్తమాల్యద ద్వారా రాయలు స్థాపించదలచుకున్న మతం- విశిష్టాద్వైతం
-అముక్తమాల్యదకు రుచి పేరుతో చదలువాడ సీతారామశాస్త్రి, సంజీవని పేరుతో వేదం వెంకటరాయశాస్త్రి వ్యాఖ్యలు రాశారు.
-అముక్తమాల్యదలో వస్తువైక్యం లోపించిందన్నవాడు దివాకర్ల వెంకటావధాని. లోపించలేదన్నవాడు కొండూరి వెంగళాచార్యులు.
-అముక్తమాల్యదపై పరిశోధన చేసినవాడు- తుమ్మపూడి కోటేశ్వరరావు.
-పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించిన కవి నంది తిమ్మన. ఇతని మరో రచన వాణీవిలాసం. ఇది అలభ్యం. నంది తిమ్మన తల్లిదండ్రులు తిప్పాంబ, సింగనామాత్యుడు. గురువు అఘోర శివగురుడు. రాయల భార్యయైన తిరుమలదేవి వెంట అరణపు కవిగా వచ్చినాడు. ఇతనికి గల బిరుదు- సకల విద్యావివేక చతురుడు. నంది తిమ్మన వ్యవహార నామం ముక్కు తిమ్మన. ముక్కును గురించి అద్భుతంగా పద్యాన్ని రాయడంతో ముక్కు తిమ్మనగా ప్రసిద్ధిగాంచాడు.
-ముక్కు తిమ్మనార్య ముద్దు పలుకు అన్న కవి కాకమాని మూర్తికవి.
-పారిజాతాపహరణానికి మూలం సంస్కృత హరివంశం. దీనికి ఖిలపురాణం అనే పేరు. పారిజాతాపహరణం కృతిభర్త శ్రీకృష్ణదేవరాయలు.
-పుర వర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం పారిజాతాపహరణం. ఇందులో నాటకీయత అధికంగా ఉంటుంది.
-పారిజాతాపహరణంలో నాయకానాయకులు సత్యభామ, శ్రీకృష్ణుడు.
-పారిజాతాపహరణంలోని ప్రధాన రసం శృంగారం.
-నందనవనంలోని పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ పెరటిలో నాటినవాడు శ్రీకృష్ణుడు.
-పారిజాతాపహరణానికి మూలం కన్నడంలోని హరికథాసారం అని అభిప్రాయపడినవాడు పుట్టపర్తి నారాయణాచార్యులు.
-పారిజాతాపహరణ ప్రబంధాకరం దాల్చిన నాటకం అని చెప్పినవాడు జీ నాగయ్య.
పారిజాతాపహరణంలోని కొన్ని పద్యాలు
1) చక్కనిదానవంచు ఎలజవ్వని దానవంచు…
2) అన విని వ్రేటువడ్డ యురగంగనయంబలె…
3) ఏమేమీ కలహసనుండచటికై యేతెంచి…
4) జలజాతాసనావాసవాది సుధ పూజాభాజనంబై…
5) పారిజాతాపహరణంలో లేని వర్ణన- పుర వర్ణన.
-చక్కని కుటుంబ కథాచిత్రం అనే విధంగా ప్రశంసించదగిన ప్రబంధం- పారిజాతాపహరణం.
-పారిజాతాపహరణానికి పరిమళోల్లాస వ్యాఖ్య రచించినవాడు నాగపూడి కుప్పుస్వామయ్య. సురభి వ్యాఖ్య రచించినవాడు దూసి రామమూర్తి.
-శ్రీకళాహస్తిమహాత్యం అనే ప్రబంధాన్ని రచించిన కవి ధూర్జటి. ఇతడు రచించిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం.
-ధూర్జటి తల్లిదండ్రులు సింగమ, నారాయణుడు. గురువు మహాదేశి సార్వభైముడు. ఇతనికి గల బిరుదు సాహిత్యశ్రీవార. ఇతడు శివ భక్తుడు. రాయల అష్టదిగ్గజ కవుల్లో ఏకైక శివకవి ఇతడు. ధూర్జటి తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఇతని మనుమడు కుమార ధూర్జటి.
-క్షేత్ర మహిమను తెలిపే ప్రబంధం శ్రీకాళహస్తి మహాత్యం. దీనికి మూలం స్కాంధపురాణం వైష్ణవ ఖండంలోని ఆరో అధ్యాయం. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
-ధూర్జటి కవిత్వం మాధురీమహిమగా ప్రసిద్ధిగాంచింది.
-శ్రీకాళహస్తి మహాత్యంలోని ప్రధాన కథలు- వశిష్టుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు, నత్కీరుడు, శివ బ్రాహ్మణుడు, వేశ్యాపుత్రికలు మొదలైనవారి కథలు.
-శ్రీకాళహస్తి మహాత్యంలోని ప్రధాన రసం శాంతరసం. అంగరసాలు వీరం, శృంగారం.
-శ్రీకాళహస్తి మహాత్యానికి మూలం- సంస్కృత షడధ్యాయి కథ.
-శ్రీకాళహస్తి మహాత్యానికి వ్యాఖ్యలు రాసినవారు చిలుకూరి పాపయ్య శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి.
-కావ్యారంభంలో పూర్వ కవి స్తుతిచేయని ప్రబంధకవి ధూర్జటి.
తెలుగు సాహిత్యాన వికటకవిగా, హాస్యకవిగా ప్రసిద్ధిగాంచిన కవి తెనాలి రామకృష్ణుడు. ఇతని ఇంటిపేరు గార్లపాటి. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. ఇతనికి గల బిరుదు కుమార భారతి. ఈయన రచనలు పాండురంగ మహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం.
-తెనాలి రామకృష్ణుని అలభ్య రచనలు లింగపురాణం, కందర్పకేతువిలాసం, హరిలీలావిలాసం.
-తెనాలి రామకృష్ణుని అసలు పేరు తెనాలి రామలింగడు. వైష్ణవ మతాన్ని స్వీకరించిన అనంతరం తెనాలి రామకృష్ణుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఇతని తొలి గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. మరో గురువు భట్టారం చిక్కాచార్యుడు.
-వైష్ణవ మతాన్ని స్వీకరించిన అనంతరం రాసిన మొదటి గ్రంథం హరిలీలా విలాసం.
-స్థల, తీర్థ, దైవ మహాత్మ్యాలు మూడింటిని తెలిపే ప్రబంధం పాండురంగ మహాత్మ్యం. దీనికి గల మరో పేరు పౌండరీక మహాత్మ్యం. దీన్ని విరూరి వేదాద్రికి అంకితమిచ్చాడు.
-పాండురంగ మహాత్మ్యంలోని కథాఘట్టాలు- పుండరీకుని చరిత్ర, నిగమశర్మోపాఖ్యానం, శ్రీకృష్ణావతార చరిత్ర, రాధాదేవి చరిత్ర, సుశీల కథ, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ మోక్షం పొందిన కథలు, గాలిగంగల జాతర, సుశర్మోపాఖ్యానం మొదలైనవి.
-పాండురంగ మహాత్మ్యానికి మూలం స్కాంధ పురాణం.
-భట్టుమూర్తి శబ్దాల కూర్పు చేపల బుట్ట అల్లిక వంటిదని తన చాటు పద్యం ద్వారా చెప్పిన కవి- తెనాలి రామకృష్ణుడు.
-పాండురంగ విభుని పదగుంఫనంబు అని ఏ కవి శైలిని గురించి తెలుపుతుంది? తెనాలి రామకృష్ణుడు
-పాండురంగ విభుని పదగుంఫనంబు అని చాటు పద్యం ద్వారా చెప్పిన కవి- కాకమాని మూర్తి కవి
-పదగుంఫనం అంటే సంస్కృతంలో, తెలుగులో నూతన పదాలను కనుగొని కూర్చడం.
-ప్రతి పద్యంలోనూ సంస్కృత్వోజ్వల్లమాన భోజనం వడ్డించిన కవి- తెనాలి రామకృష్ణుడు.
-సంస్కృత పదాలను అధికంగా వాడిన ప్రబంధ కవి- తెనాలి రామకృష్ణుడు.
-తుంగభద్రానది వర్ణన గల ప్రబంధం- పాండురంగ మహాత్మ్యం. ఇందులో మొత్తం 9 కథలు ఉన్నాయి.
-పాండురంగ మహాత్మ్యంలో పిల్లి శీలం, చిలుక చదువ గల పాత్ర నిగమశర్మ. ఇతన్ని తేనెపూసిన కత్తి ధాత్రీసురుండు అని తెనాలి రామకృష్ణుడు అభివర్ణించాడు.
-పాండురంగ మహాత్మ్యం ప్రౌఢశైలి, నిర్మాణ నైపుణ్యం ద్వారా కైలాస శిఖరం వంటిదని అభిప్రాయపడిన విమర్శకుడు- విశ్వనాథ సత్యనారాయణ.
-పాండురంగ మహాత్మ్యంపై పరిశోధన చేసినవారు- దేవళ్ల చిన్నికృష్ణయ్య, ఎక్కిరాల కృష్ణమాచార్యులు.
-పాండురంగ మహాత్మ్యానికి వ్యాఖ్యానం రచించినవాడు- బులుసు వెంకట రమణయ్య.
-ఉద్భటారాధ్య చరిత్రకు మూలం పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణంలోని ఉద్భటుని కథ. దీన్ని ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.
-పూర్తి చేయకుండా వదిలివేసిన రచన- ఘటికాచల మహాత్మ్యం. దీన్ని అంకితంగా పొందినవాడు శహాజీ బంధువు ఖండాజీ.
-ఘటికాచల మహాత్మ్యం పేలవమైన రచన అని ఆరుద్ర, కాళ్లు, చేతులు లేని కథ అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విమర్శించారు.
-కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని రచించిన కవి పింగళి సూరన. శ్రీకృష్ణదేవరాయల అనంతరం నంద్యాల కృష్ణరాజు ఆస్థానంలో ఉన్నాడు. ఈయన ఇతర రచనలు రాఘవ పాండవీయం, ప్రభావతీప్రద్యుమ్నం, గరుడ పురాణం (అలభ్యం), గిరిజా కల్యాణం (అలభ్యం).
-లలాపేక్షణ భక్తిశీలుడు పింగళి సూరన
-అద్భుత కల్పనా కథ గల 8 అశ్వాసాలు గల ప్రబంధం కళాపూర్ణోదయం. దీన్ని నంద్యాల కృష్ణరాజుకు అంకితమిచ్చాడు.
-కేవల కల్పనా కథలు, కృత్రిమ రత్నాలు అని కళాపూర్ణోదయాన్ని నిరసించిన కవి రామరాజు భూషణుడు.
-సకల లక్షణలక్షితాలైన మహా ప్రబంధంబు కీర్తికరణమని ఊహించి కావ్య నిర్మాణానికి పూనుకున్న కవి సూరన.
-కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, మరికొంత ఈనాటి సినిమాలాగా కళాపూర్ణోదయం రచన కొనసాగిందని అభిప్రాయపడిన విమర్శకుడు ఆరుద్ర.
-కల్పిత కథావస్తువుతో వెలువడిన ప్రథమాంధ్ర ప్రబంధం కళాపూర్ణోదయం.
-దీనిలోని ప్రధాన ఘట్టాలు- సరస్వతీ చతుర్ముఖుల ప్రణయవృత్తాంతం, సుగాత్రి శాలీనుల కథ, కలభాషణి మణికంధరుల వృత్తాంతం, రంభనలకూబరుల వృత్తాంతం, కళాపూర్ణుడు, మధురలాలస, అభినవకౌముదిల వృత్తాంతం, నారదగానమాత్సర్యం.
-సరస్వతీ చతుర్ముఖుల పెంపుడు చిలుకయే కలభాషిణిగా, మధుర లాలసగా జన్మించింది. సుగాత్రి శాలీనులే సుముఖాసత్తి, మణిస్తంభం సిద్దులుగా జన్మిస్తారు. వీరి కుమారుడే కళాపూర్ణుడు.
-కళాపూర్ణోదయంలోని శృంగారం 4 విధాలు.
1) దివ్యం (బ్రహ్మం)- సరస్వతీచతుర్ముఖుల ప్రణయం
2) గాంధర్వం- కలభాషిణి, మణికంధరుల ప్రణయం
3) మానవం- సుగాత్రి, శాలీనుల ప్రణయం
4) రాక్షసం- శల్యాసురుడు అభినవకౌముదిని బలాత్కరించడం
-కళాపూర్ణోదయాన్ని అత్యుత్తమ ప్రబంధంగా ఎంపిక చేసిన విమర్శకుడు- కట్టమంచి రామలింగారెడ్డి. ఈయన అభిమాన కవి పింగళి సూరన.
-కళాపూర్ణోదయంలో నాయికానాయకులు కళభాషిణి, మణికంధరుడు.
-స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం గ్రంథకర్త- జీవీ కృష్ణారావు
-కళాపూర్ణోదయంసై విశ్వవిద్యాలయాల స్థాయిలో జరిగిన పరిశోధన- స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం.
-కళాపూర్ణోదయానికి లఘుటీక పేరుతో వ్యాఖ్య రచించినవాడు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి. భావ ప్రకాశిక వ్యాఖ్య పేరుతో రచన చేసినవాడు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి.
-తెలుగులో తొలి ద్వర్థి కావ్యం- రాఘవ పాండవీయం
-రామాయణ, మహాభారత ఇతివృత్తంగల కావ్యం రాఘవ పాండవీయం. దీన్ని పింగళి సూరన విరూపాక్ష దేవునికి అంకితమిచ్చాడు.
-పింగళి సూరన చివరి రచన ప్రభావతీప్రద్యుమ్నం. దీన్ని తన తండ్రి అమరామాత్యునికి అంకితమిచ్చాడు. తండ్రికి కావ్యాన్ని అంకితం చేసిన తొలి కవి సూరన.
-ప్రభావతీప్రద్యుమ్నానికి మూలం సంస్కృత హరివంశంలోని వజ్రనాభవధ.
-ప్రభావతీప్రద్యుమ్నాల మధ్య రాయబారం నడిపిన హంస- శుచిముఖి. ఇది బ్రహ్మ రథ వాహనుడైన సారంధురుని కూతురు. దీన్ని సరస్వతి పెంచి పెద్ద చేసింది.
-వజ్రనాభుడు అనే రాక్షసుని కూతురు ప్రభావతి.
-ప్రభావతీప్రద్యుమ్నయానికి వ్యాఖ్యలు రచించినవారు- వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, పురాణపండ మల్లయ్య శాస్త్రి, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి.
-వసుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించిన కవి- రామరాజ భూషణుడు. ఈయన అసలు పేరు భట్టుమూర్తి. ఇంటిపేరు ప్రబంధకమువారు. శ్రీకృష్ణదేవరాయల అనంతరం అళియ రామరాయల ఆస్థానంలో ఉన్నాడు. రామరాజు ఆస్థానానికి భూషణుడు కాబట్టి ఇతనికి రామరాజ భూషణుడు అనే పేరు ప్రసిద్ధిగాంచింది.
-సంగీత రహస్య కళానిధి, ప్రబంధ పఠన రచనా దురంధరుడు అనే బిరుదులు గల కవి- రామరాజ భూషణుడు. ఈయన తనను గురించి శతలేఖినీ పద్యసంధానధేరేయు అని నరసభూపాలీయంలో పేర్కొన్నాడు. ఇతడు శ్రీరాముని భక్తుడు.
-రామరాజ భూషణుని ఇతర రచనలు- నరసభూపాలీయం, హరశ్చంద్రనలోపాఖ్యానం (ద్వర్థి కావ్యం)
-పవన నందన కారుణ్య కటాక్షలబ్ధ కవితాధార సుధారాశియై విలసిల్లిన కవి- రామరాజ భూషణుడు.
-శృంగార రస ప్రాధాన్యంగల గిరికావసువుల వృత్తాంతం గల ప్రబంధం వసుచరిత్ర. దీన్ని తిరుమల దేవరాయలకు అంకితమిచ్చాడు. ఈ ప్రబంధంలోని నాయికానాయకులు గిరిక, వసురాజు.
-వసుచరిత్రలోని ప్రధాన రసం- శృంగారం
-శ్లేషవైచిత్రికి పుట్టినిైల్లెన ప్రబంధం- వసుచరిత్ర
-నాటకరీతులు గల రామరాజ భూషణుని రచన- వసుచరిత్ర
-వసుచరిత్రకు మూలం- మహాభారతంలోని ఆదిపర్వంలోని ఉపరిచర వసువు వృత్తాంతం
-శుక్తిమతి కోలాహబల కూతురు గిరిక. ఈమె చెలికత్తె పేరు మంజువాణి.
-వసు చరిత్రను సంస్కృతీకరించిన కవి కాళహస్తి కవి. వసుమంగళ నాటకం పేరుతో వసుచరిత్రను నాటకరూపాన సంస్కృతంలో రచించినవాడు- పేరుసూరి
-తమిళంలోకి అనువదించిన ఏకైక ప్రబంధం వసుచరిత్ర.
-వసుచరిత్రకు వ్యాఖ్యలు రచించినవారు- శొంఠి భద్రాద్రిరామ శాస్త్రి, శేషాద్రి రమణ కవులు, తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య.
-రామరాజ భూషణుని తొలి రచన నరసభూపాలీయం. దీనికి గల నామాంతరం కావ్యాలంకార సంగ్రహం. దీన్ని అళియ రామరాజు మేనల్లుడైన ఓబయ నరసరాజుకు అంకితం ఇచ్చాడు. దీన్ని విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణాన్ని అనుసరించి రాశారు.
-శ్రీరామునికి అంకితమిచ్చిన రామరాజ భూషణుని కావ్యం- హరిశ్చంద్రనలోపాఖ్యానం. ఇది హరిశ్చంద్ర నల మహారాజుల ఇతివృత్తానికి సంబంధించిన ద్వర్థి కావ్యం.
-రవిగాంచనిచోట కవిగాంచునెయ్యడన్ కదా అనే చాటుపద్యం చెప్పిన కవి- రామరాజ భూషణుడు
-రాజశేఖర చరిత్ర అనే ప్రబంధాన్ని రచించిన కవి- మాదయగారి మల్లన. ఇతడు అష్టదిగ్గజ కవుల్లో ఉన్నాడని తెలిపే గ్రంథం- రాయవాచకం.
-పెండ్లి వేడుకను సమగ్రంగా వర్ణించిన కవి- మాదయగారి మల్లన. ఈయన తాను రచించిన రాజశేఖర చరిత్రను నాదెండ్ల అప్పామాత్యునికి అంకితమిచ్చాడు.
-త్రికాలవేది అనే చిలుక వృత్తాంతం గల ప్రబంధం రాజశేఖర చరిత్ర.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు