పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం
73వ రాజ్యాంగ సవరణ చట్టం – 1992
1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. పంచాయతీలు, The Panchaya అనే ఒక ప్రధాన శీర్షికతో 243, 243-ఎ నుంచి 243-ఓ అనే ప్రకరణలతో ఉంది. ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో 9వ భాగంగా చేర్చారు.
-ప్రధానాంశాలు : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ప్రముఖమైంది. గ్రామ, మాధ్యమిక, జిల్లా స్థాయిల్లో ఉన్న మూడంచెల పాలన గల పంచాయతీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.
-నిర్వచనాలు (243వ ప్రకరణ) : గ్రామసభ పంచాయతీ, జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భాల్లో వాడారు. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.
-గ్రామసభ (243-ఎ): ఈ చట్టం ప్రకారం గ్రామస్థాయిలో ఒక గ్రామసభ ఉంటుంది. ఇది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చెలాయిస్తుంది.
-పంచాయతీ వ్యవస్థ (243-బి) : ఈ చట్టం మూడంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి 1. గ్రామస్థాయి 2. మాధ్యమిక మండలస్థాయి 3. జిల్లాస్థాయి
పంచాయతీ నిర్మాణం (243-సి) : పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ అవసరమైన నిబంధనలను రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.
-సీట్ల రిజర్వేషన్లు (243-డి) : షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజాప్రతినిధులకు పంచాయతీల్లో వారి జనాభాను బట్టి సీట్ల రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటుంది. అలాగే 1/3వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని పేర్కొంటుంది.
-పంచాయతీల కాలపరిమితి (243-ఇ) : ఈ చట్టం ప్రకారం పంచాయతీల కాలపరిమితి ఐదేండ్లు, కాలపరిమితికి ముందే ఒకవేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించాలి.
-అర్హతలు, అనర్హతలు (243-ఎఫ్) : ఈ చట్టం పంచాయతీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను, అనర్హతలను నిర్దిష్టంగా పేర్కొంటుంది.
-అధికారాలు, విధులు (243-జి) : 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలతో పంచాయతీ కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.
-ఆదాయ వనరులు (243-హెచ్) : పంచాయతీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొదలైన వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.
-ఆర్థిక సంఘం (243-ఐ) : పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్ష కోసం ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పర్చి, తగిన విధి విధానాలను పేర్కొంటుంది.
-లెక్కల తనిఖీ ఖాతాలు (243-జె) : పంచాయతీల పద్దులు, వ్యయాలపై ఆడిటింగ్ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారం ఉంటుందని చట్టం పేర్కొంటుంది.
-రాష్ట్ర ఎన్నికల సంఘం (243-కె) : పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ మొదలైన అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటుందని ఈ చట్టం పేర్కొంటుంది.
-కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంచాయతీలు (243-ఎల్) : ఈ చట్టం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంచాయతీల ఏర్పాటు రద్దుకు సంబంధించిన వ్యవహారాలు మొదలైనవి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
-కొన్ని ప్రాంతాల మినహాయింపు (243-ఎం) : షెడ్యూల్ ప్రాంతాల పరిపాలక మండళ్లు ఉన్న రాష్ర్టాల్లో పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు కొన్ని మినహాయింపులు ఉంటాయని ఈ చట్టం పేర్కొంది.
-కొన్ని చట్టాల కొనసాగింపు (243-ఎన్) : ఈ చట్టం ప్రకారం ఇదివరకు ఉన్న చట్టాలన్నీ శాసనసభ ప్రత్యేకంగా రద్దు చేయకపోతే అవి కొనసాగుతాయని పేర్కొంది.
-న్యాయస్థానాల జోక్యం లేదు (243-ఓ) : పంచాయతీకి సంబంధించిన శాసనాల ఔచిత్యం, ఎన్నికల వ్యవహారాలు మొదలైనవి ప్రశ్నిస్తూ ఎలాంటి దావాలను కూడా న్యాయస్థానంలో దాఖలు చేయరాదని చట్టం పేర్కొంటుంది.
పంచాయతీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు
-73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992.. రాజ్యాంగంలో 243-జి ప్రకరణ ద్వారా 11వ షెడ్యూల్‌ను చేర్చింది. ఇందులో పంచాయతీ సంస్థల ప్రధాన విధులు, హక్కులు, అధికారాలు 29 ఉన్నాయి. అవి
-వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ
-భూసారాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం, భూసంస్కరణల అమలు
-చిన్న నీటిపారుదల, నీటి నిర్వహణ
-జంతువుల సంరక్షణ, కోళ్ల పెంపకం, పశు సంరక్షణ
-ఉపాధి కోసం చేపల పెంపకం
-సామాజిక అడవుల నిర్వహణ
-అటవీ ఉత్పత్తులు
-చిన్న తరహా పరిశ్రమలు
-ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు
-గ్రామీణ ఇండ్ల నిర్మాణం
-గ్రామీణ ప్రజలకు చక్కటి తాగునీటి సరఫరా
-ఇంధనం, పశుగ్రాసం
-రోడ్లు వంతెనలు, ఇతర ప్రసార మార్గాలు
-గ్రామీణ విద్యుత్, విద్యుత్ పంపిణీ
-సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి
-పేదరిక నిర్మూలన పథకం
-ప్రాథమిక సెకండరీ స్థాయి విద్య
-సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య
-అనియత విద్య
-గ్రంథాలయాలు
-సాంస్కృతిక కార్యక్రమాలు
-మార్కెట్ సంఘాల నిర్వహణ
-ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యత
-కుటుంబ సంక్షేమం
-స్త్రీ, శిశు సంక్షేమం
-సాంఘిక సంక్షేమం, వికలాంగుల సంక్షేమం
-బలహీనవర్గాల సంక్షేమం, అందులో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి సంక్షేమం
-ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ
-సామాజిక ఆస్తుల నిర్వహణ
-ఈ విధంగా 73వ రాజ్యాంగ చట్టం చక్కని పరిపాలనా వికేంద్రీకరణకు ఆదర్శమైన మైలురాయి అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవస్థ ఏ విధంగా ఆచరణలో ఉన్నదో పరిశీలించడం అవసరం.
ఒక పరిశీలన
-73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడిన పంచాయతీరాజ్ సంస్థల్లో మూడంచెలుంటాయి. వీటి నిర్మాణానికి, నిర్వహణకు కావాల్సిన శాసనాలను రాష్ట్ర శాసనసభ చేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి రాష్ర్టాల్లో మూడంచెల ప్రభుత్వాలుంటాయి. అవి
-1. గ్రామపంచాయతీ
-2. మండల పరిషత్ (మాధ్యమిక స్థాయి వ్యవస్థ)
-3. జిల్లా పరిషత్
-గ్రామపంచాయతీ : పంచాయతీరాజ్ సంస్థల్లో గ్రామపంచాయతీ మూలస్తంభం వంటిది. సాధారణంగా ఒక గ్రామం లేదా కొన్ని చిన్న గ్రామాలు కలిసి గ్రామపంచాయతీగా ఏర్పడుతాయి. ప్రధానంగా గ్రామపంచాయతీల్లో నాలుగు ప్రధానాంగాలుంటాయి. అవి
-1. పంచాయతీ 2. సర్పంచ్ 3. గ్రామసభ 4. సెక్రటరీ
-పంచాయతీ అనేది గ్రామస్థాయిలో గ్రామసంబంధ విషయాలపై చర్చావేదికగా వ్యవహరిస్తుంది. సర్పంచ్, వార్డు సభ్యులు దీంట్లో ఉంటారు. గ్రామంలో నమోదైన ఓటర్లు వీరిని ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామపంచాయతీ రాజకీయ కార్యనిర్వహణ అధిపతి. ఇతడు పంచాయతీ ఆమోదించిన తీర్మానాలను పర్యవేక్షిస్తాడు. గ్రామంలో నమోదైన ఓటర్లు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామానికి సంబంధించిన నివేదికలను పరిశీలిస్తారు.
-ప్రధాన విధులు : తాగునీరు, వ్యవసాయ విస్తరణ, నీటి పారుదల, పారిశుద్ధ్యం వంటి ప్రజాప్రయోజనాల వ్యవహారాలను నిర్వహించే బాధ్యత గ్రామపంచాయతీలకు ఉంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో గ్రామపంచాయతీలకు గల అధికారాలు, విధుల ప్రస్తావన ఉంది. సాధారణంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ విధులను నిర్వహించే బాధ్యత గ్రామపంచాయతీలకు ఉంటుంది.
-మండల పరిషత్ (మాధ్యమిక స్థాయి వ్యవస్థ) : పంచాయతీరాజ్ వ్యవస్థలో రెండోది మండల పరిషత్. దీనికి వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లున్నాయి. కొన్ని పంచాయతీలను కలిపి మండల పరిషత్‌ని ఏర్పరుస్తారు. ఈ వ్యవస్థ చిన్న రాష్ర్టాల్లో ఉండకపోవచ్చు. ఈ వ్యవస్థలోని ప్రధానాంశాలు
1. మండల పరిషత్ (ఇది శాసనబద్ధమైన సంస్థ)
2. మండల పరిషత్ అధ్యక్షుడు (పరిషత్‌కు రాజకీయ అధిపతి)
3. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (పరిషత్‌కు పరిపాలనాధిపతి)
-గ్రామపంచాయతీ నిర్వహించే వివిధ కార్యకలాపాలను సమన్వయం చేసే ప్రధానమైన అధికారాలు మండల పరిషత్‌కు ఉంటాయి.
-జిల్లా పరిషత్ : పంచాయతీరాజ్ సంస్థల్లో జిల్లా పరిషత్ అత్యున్నత స్థాయి స్వపరిపాలనా సంస్థ. దీని పరిధి జిల్లా మొత్తం ఉంటుంది.
-అనేక రాష్ర్టాల్లో దీనికి వివిధ పేర్లున్నాయి. జిల్లా పరిషత్‌లోని కొన్ని ప్రధానాంగాలు
1. జిల్లా పరిషత్ (శాసనపరమైన సంస్థ)
2. జిల్లా పరిషత్ చైర్మన్ (రాజకీయ అధిపతి)
3. జిల్లా మహాసభ (సలహా సంస్థ)
4. ముఖ్య కార్యనిర్వహణాధికారి (పరిపాలనాధినేత)
-వీరేకాక జిల్లా పాలనకు ప్రధాన అధినేతగా జిల్లా కలెక్టర్ ఉంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు