టెక్నాలజీ + టాలెంట్ డిజిటల్ ఇండియా
డిజిటల్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇది దేశాన్ని శక్తివంతమైన డిజిటల్ సమాజంగా, నాలెడ్జ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చేసే దార్శనికతతో రూపొందింది. ప్రపంచంతో మరింత వేగంగా అనుసంధానం అవటం, దేశంలోని అపారమైన యువ మానవ వనరుల్లో నైపుణ్యాలను పెంచి యువతకు ఉపాధిని సృష్టించటం, టెక్నాలజీ ఆధారంగా పేదరికం, అవినీతి, సామాజిక రుగ్మతలను రూపుమాపటం తదితర లక్ష్యాలతో ముందుకు సాగుతున్నది. ఈ కార్యక్రమంపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం.
-పౌరులు కేంద్రంగా అందించాల్సిన సేవలపై ప్రత్యేక దృష్టితో మరిన్ని అప్లికేషన్ల కోసం 1990 దశకం మధ్యలో ఈ-గవర్నెన్స్ ప్రయత్నాలు భారతదేశంలో విస్తృతమయ్యాయి. ఇవి పలు రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినా కోరుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
-ఫలితంగా ప్రభుత్వం జాతీయస్థాయిలో 2006లో ప్రభు త్వ సేవల్లో ఈ-గవర్నెన్స్ ప్రాధాన్యం దృష్ట్యా జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళిక (NEGP)ను ప్రారంభించింది.
-దీనిలో భాగంగా వివిధ రంగాలకు చెందిన 31 మిషన్ మోడ్ ప్రాజెక్టులు (ఎంఎంపీ) ప్రారంభించబడ్డాయి. (2007లో ప్రారంభించిన 27 ఎంఎంపీలకు 2011లో మరో 4 జత చేయబడ్డాయి). ప్రస్తుతం 44
-ఎలక్ట్రానిక్ సేవలు, ఉత్పత్తులు, సాధనాలు, ఉద్యోగ అవకాశాలను కలిగిన సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి, దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పాదన పటిష్టానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
-సమాచార సాంకేతికను ఉపయోగించి ప్రజా సేవల వ్యవస్థల వాతావరణాన్ని సమూలంగా మార్చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆవిష్కరించిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా.
-వివిధ రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉన్న అన్ని రకాల ఈ-గవర్నెన్స్ కార్యక్రమాల ఏకీకృత కార్యక్రమే డిజిటల్ ఇండియా
-2005 జూలై 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది.
-ఈ కార్యక్రమం మూడు కీలకమైన దార్శనిక రంగాలపై దృష్టి సారించింది.
ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు కల్పించటం
-ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవడానికి హైస్పీడ్ ఇంటర్నెట్ను మౌలిక సాధనంగా లభ్యమయ్యేలా చూస్తారు.
-డిజిటల్, ఆర్థిక సర్వీసులను అందించడానికి ప్రతిపౌరుడి మొబైల్ ఫోన్ నంబరును వారి బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానిస్తారు.
-ఆజన్మాంతం విశ్వసనీయమైన, సురక్షితమైన డిజిటల్, ఆర్థిక సేవలను అందించడానికి ప్రతి పౌరుడికి డిజిటల్ గుర్తింపు సంఖ్యను అందిస్తారు. (ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధార్ సంఖ్య)
-ఈ సర్వీసుల లభ్యత కోసం సమీప నివాస స్థానాల్లో ఉమ్మడి సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లను ఏర్పాటుచేస్తారు.
-ప్రతి ఆరు గ్రామాలకు ఒక సీఎస్సీ చొప్పున ఆరు లక్షల గ్రామాలకు లక్ష సీఎస్సీలను ఏర్పాటుచేయాలనేది లక్ష్యం. కాగా ప్రస్తుతం 1,37,000 సీఎస్సీలు పనిచేస్తుండగా, 2.50 లక్షలకు పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
-లావాదేవీలన్నీ సురక్షితంగా నిర్వహించడానికి భారత ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆధ్వర్యంలో సెక్యూర్ యువర్ పీసీ అనే పోర్టల్‌ను నిర్వహిస్తున్నది.
(www.certain.org.in/secure your pc in)
-సైబర్ సెక్యూరిటీపై నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు.
ప్రభుత్వ సేవలను ఈ-మాధ్యమంలో అందించడం
-భారీస్థాయిలో దేశవ్యాప్త మౌలిక వసతులను మారుమూల గ్రామాలకు సైతం అందుబాటులోకి తెస్తారు.
-సులభమైన, సురక్షితమైన దస్తావేజుల లావాదేవీల నిర్వహణకు ప్రతి రికార్డునూ డిజిటలైజ్ చేస్తారు.
-జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంను జాతీయస్థాయిలో అమలుచేస్తూ కావాల్సిన మౌలిక వసతుల కల్పనను పర్యవేక్షిస్తారు. దీంతో ప్రాజెక్టులు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రజాభద్రత, ఏజెన్సీల ప్రాజెక్టుల భౌతిక పురోగతి పర్యవేక్షణ సులభతరమవుతుంది.
పౌరులకు డిజిటల్ సాధికారత
-సార్వజనీన డిజిటల్ అక్షరాస్యత, అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ వనరులు/సేవల అందుబాటుపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు వీక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి డిజిటల్ కోర్సులు, ఆన్లైన్ పరీక్షలు జరిపి సర్టిఫికెట్స్ అందించడానికి పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
డిజిటల్ ఇండియా – నిర్వహణ యంత్రాంగం
-ప్రధానమంత్రి అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ
-కమ్యూనికేషన్లు, ఐటీ శాఖామంత్రి అధ్యక్షతన డిజిటల్ ఇండియా సలహాబృందం
-కార్యక్రమ పర్యవేక్షణ, పాలసీ అమలు, వ్యూహాత్మక విధానాల అమలు, అంతర్మంత్రిత్వ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సంఘం.
-వ్యయ ఆర్థిక కమిటీ/ప్రణాళికేతర వ్యయంపై కమిటీ
-డిజిటల్ ఇండియాపై మిషన్ లీడర్ల మండలి
-డిజిటల్ ఇండియా కార్యక్రమ పరిధిని, పూర్తి సాంకేతికతను అందించడానికి, కార్యాచరణ, ప్రయాణాలు, భద్రత, సేవలను బట్వాడా, మౌలిక వసతుల కల్పనను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Deity) సమన్వయం చేస్తుంది.
రాష్ట్ర స్థాయిల్లో..
-రాష్ర్టాల ముఖ్యమంత్రుల అధ్యక్షతన డిజిటల్ ఇండియా రాష్ట్ర కమిటీ
-ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన అత్యున్నత కమిటీలు ఆయా రాష్ర్టాల్లో వనరుల కేటాయింపు, ప్రాజెక్టుల ప్రాధాన్యతల నిర్దేశం, వివిధ రాష్ట్ర శాఖల మధ్య సమస్యల పరిష్కారం మొదలగు అంశాలను చేపడుతాయి.
డిజిటల్ ఇండియా పరిధి
-భారతదేశాన్ని భవిష్యత్తు విజ్ఞాన గనిగా మార్చుట
-ఐటీ + ఐటీ = ఐ.టీ
(ఇండియన్ టాలెంట్) (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
(ఇండియా టుమారో)
-అంటే ఐటీపై రూపాంతరాన్ని వాస్తవ రూపం దాల్చేలా చేయడం.
-అభివృద్ధి చెందే క్రమంలో దేశ ముఖ చిత్ర మార్పునకు టెక్నాలజీని కేంద్రంగా చేయడం.
-పలు విభాగాల సర్వీసులు, కార్యకలాపాలు ఒకే గొడుగు కిందకు తేవడం.
-అందరికి డిజిటల్ మౌలిక వసతుల కల్పన : డిమాండ్‌కు అనుగుణమైన ప్రభుత్వ పాలన, సేవలను ఈ-మాధ్యమంలో అందించుట. పౌరులందరికి డిజిటల్ సాధికారత అనే మూడు కీలక లక్ష్యాల సాధనకు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తొమ్మిది మూల అంశాలను పునాదులుగా లేదా మూలస్తంభాలుగా పరిగణిస్తారు. అవి
బ్రాడ్‌బ్యాండ్ హైవేలు
-దీనిలో మూడు ఉప విభాగాలున్నాయి.
1. రూరల్ ఏరియాలో అందరికి బ్రాడ్‌బ్యాండ్
-నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కింద 2016 డిసెంబర్ వరకు 2.5 లక్షల గ్రామపంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించనున్నారు.
-దీనికి టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
2. అర్బన్ ఏరియాలో అందరికి బ్రాడ్‌బ్యాండ్
-సేవల విస్తరణకు ప్రస్తుతం ఉన్న ఆపరేటర్లను ప్రోత్సహించుట.
-నూతన పట్టణాభివృద్ధి ప్రాంతాలు, నూతన భవన సముదాయాల్లో కమ్యూనికేషన్ మౌలిక వసతులను తప్పనిసరి చేయడం
3. నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
-దీనికి ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
-వివిధ ప్రభుత్వ శాఖల్లో పంచాయతీ స్థాయి వరకు హైస్పీడ్ కనెక్టివిటీ, క్లౌడ్ సేవల కల్పనకు దేశంలోని నెట్వర్క్, క్లౌడ్ మౌలిక వసతులను అనుసంధానిస్తారు.
ఉదా : స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్ (ఎస్డబ్ల్యూఏఎన్), నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ (ఎన్‌కేఎన్), నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్), గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్, మేఘ్రాజ్క్లౌడ్ లాంటి మౌలిక వసతులను అనుసంధానిస్తారు.
అందరికి మొబైల్ కనెక్టివిటీ
-దేశంలో ఎలాంటి మొబైల్ కవరేజీ లేని గ్రామాలు 55, 619.
-ఈ గ్రామాలకు దశలవారీగా కనెక్టివిటీ అందించడానికి టెలికమ్యూనికేషన్ల శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. 2014-18 వరకు ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 16 వేల కోట్లు వెచ్చిస్తారు.
పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రాం
-దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి సేవాకేంద్రాలు నెలకొల్పడమేకాక తపాలా కార్యాలయాలను బహుళ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు.
-1.50 లక్షల తపాలా కార్యాలయాల్లో ఈ పథకం అమలుచేయడానికిగాను తపాలాశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
ఈ-గవర్నెన్స్
-ప్రభుత్వ సేవలను సత్వర, సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపి, ప్రక్షాళన చేయడానికి ఈ-గవర్నెర్స్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
-దీంతో సేవల్లో నాణ్యత పెరగడంతో పాటు ప్రభుత్వ నిర్వహణ వ్యయం తగ్గుతుంది.
-ఆన్లైన్లో నిర్వహించే కార్యకలాపాలతో పర్యవేక్షణ సులభతరం. అవినీతికి ఆస్కారం ఉండదు. సత్వర నిర్ణయాలకు అవకాశం ఉంటుంది.
వివిధ రాష్ర్టాల్లో ఈ-గవర్నెర్స్ సేవలు
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – మీసేవ
-కేరళ – అక్షయ
-కర్ణాటక – భూమి
-రాజస్థాన్ – మండి
-మధ్యప్రదేశ్ – జ్ఞానదూత్
-హిమాచల్‌ప్రదేశ్ – లోకమిత్ర
-మహారాష్ట్ర – వారాణ
-తమిళనాడు – రాణి
-దీని నిర్వహణ బాధ్యతలు – డిపార్టుమెంటు ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఈ-క్రాంతి
-ఇది డిజిటల్ ఇండియాకు ముఖ్య పునాది. దేశంలో ఈ-గవర్నెన్స్, మొబైల్ గవర్నెర్స్, గుడ్ గవర్నెన్స్‌ల కీలక అవసరాల దృష్ట్యా పరిపాలన రూపురేఖలు మార్చడానికి ఈ-గవర్నెన్స్‌ను రూపాంతరం చేయడం అనే దార్శనికతతో 2015 మార్చి 25న ఈ-కాంత్రి విధానం చేపట్టబడింది.
-ఈ-కాంత్రి కింద 44 మిషన్మోడ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలవుతున్నాయి.
-కేంద్రస్థాయిలో – 13-ఈ-సన్సద్, తపాలా, పింఛన్లు, ఆదాయపు పన్ను, పాస్‌పోర్టు మొదలైనవి.
-రాష్ట్ర స్థాయిలో – 17 – స్త్రీ, శిశు అభివృద్ధి, వ్యవసాయం, ఈ-విధాన్, పాఠశాల విద్య, గ్రామపంచాయతీలు మొదలైనవి.
ఇంటిగ్రేటెడ్ మిషన్
-మోడ్ ప్రాజెక్టులు – 14-ఈ-కామర్స్, ఈ-బిజ్, ఇండియా పోర్టల్, ఈ-కోర్టులు, ఎన్జీఐఎస్, ఈ-భాష
-ఆర్యోగం కోసం, రైతుల కోసం, భద్రత కోసం, న్యాయం కోసం సాంకేతికత వంటి అంశాలు ఉన్నాయి.
అందరి కోసం సమాచారం
-ఓపెన్ డేటా ఫ్లాట్‌ఫాం ద్వారా సమాచార ఆన్లైన్ హూస్టింగ్, దస్తావేజులు పౌరులకు బహిరంగంగా, సులభంగా అందుకొనే వీలుంటుంది.
-పౌరులతో సమాచారం పంచుకోవడానికి, సంభాషించడానికి Mygov.in మాధ్యమంగా, ప్రభుత్వంతో ఆలోచనలు/సూచనలు పంచుకొనే సౌలభ్యం కల్పిస్తూ పాలనలో పౌరులను భాగస్వాములుగా చేయడానికి 2014 జూలై 16న ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ
-ఈ విధానంలో 2020 నాటికి దిగుమతులు పూర్తిగాలేని విధంగా దేశంలో ఎలక్ట్రానిక్ తయారీకి ప్రోత్సాహం కల్పిస్తారు.
-భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులు పెట్టేలా, ప్రమాణాలు, నాణ్యత గల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా 2012 జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాన్ని ఆవిష్కరించారు.
-సెమీకండక్టర్ ఫ్యాబ్, టెలికాం ఉత్పత్తులు, ఎల్ఈడీ ఫ్యాబ్, ఎలక్ట్రానిక్ అప్లయన్సస్, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఏవియానిక్స్ మొదలైనవి ఈ రంగంలో కొన్నింటిగా చేర్చారు.
ఉద్యోగాలకు ఐటీ
-ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.
-ఈ కార్యక్రమంలో భాగంగా నైపుణ్యాల్లో శిక్షణను అందించడమే కాకుండా మూలధన తోడ్పాటు, కార్యాలయాలకు అద్దె తోడ్పాటు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలను సైతం కల్పిస్తారు.
-బీపీవో/కాల్సెంటర్లను ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తారు.
సత్వర ఫలితాలు అందించే కార్యక్రమాలు
-దీనిలో స్వల్ప కాలవ్యవధిలో ఫలితాలు/ఫలాలు లభించే కార్యక్రమాలు ఉంటాయి. అవి
2 సందేశాలకు ఐటీ ఫ్లాట్ ఫాం : సామూహిక సందేశ బట్వాడా అప్లికేషన్ ద్వారా 1.36 కోట్ల మొబైళ్లను, 22 లక్షలకుపైగా ఈ-మెయిళ్లను డేటాబేస్‌లో భాగంగా ఉండే పోర్టల్‌ను 2014 ఆగసు 15న విడుదల చేశారు.
-Mygov.in అప్లికేషన్ ద్వారా జాతీయ పర్వదినాల్లో సామూహికంగా శుభాకాంక్షలు పంపుట.
-అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు సౌకర్యం.
-నేషనల్ నాలెడ్జి నెట్‌వర్క్‌లో భాగంగా అన్ని విశ్వవిద్యాలయాలకు వైఫై సౌకర్యం కల్పించుట.
-ప్రభుత్వ ఉద్యోగుల పాలనలో భాగంగా (పారదర్శకతను పెంపొందించేందుకు) పంపే మెయిళ్ల రక్షణ/భద్రతకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి.
-డిజిటల్ నగరాలను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశాల్లో వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు.
-అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ-బుక్స్‌గా అందుబాటులోకి తేవడం.
-వాతావరణ సమాచారం, ప్రకృతి విపత్తుల హెచ్చరికలను అందించేందుకు ఎస్ఎంఎస్లు ఆధారిత సేవలను అందుబాటులోకి తేవడం
-తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని, దొరికిన పిల్లల సమాచారాన్ని సేకరించడానికి, పంచడానికి వీలు కల్పించుట, తద్వారా నేరాల అదుపునకు, సకాలంలో స్పందించడానికి వీలు కలుగుతుంది. దీని కోసం మొబైల్ యాప్‌ల ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని విస్తరించుటకు.
-పోలీస్‌శాఖకు మొబైల్/ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టం
-పౌరుల కోసం మెరుగైన నావిగేషన్ ప్రణాళిక
-సోషల్ మీడియాను తగువిధంగా ఉపయోగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
-ఇందుకుగాను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి.
-డిజిటల్ ఇండియాలో భాగంగా కింది సదుపాయాలను పౌరులకు కల్పిస్తున్నారు. అవి
2 డిజీ లాకర్ : దీనిలో ప్రభుత్వంచే పౌరులకు జారీ చేయబడిన ఉపయుక్తమైన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుటకు వీలు కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శిలో రూపొందిన రవాణా శాఖ వారి ఎమ్-వ్యాలెట్ తరహా సేవలను అందించుట ముఖ్య ఉద్దేశం
-దీనిలో పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు, విద్యా సంబంధ మార్క్‌షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని ఒరిజినల్ డాక్యుమెంట్లకు ప్రత్యామ్నాయంగా భద్రపరిచే సదుపాయం.
-అటెండెన్స్.గవ్.ఇన్ : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల హాజరును పర్యవేక్షించే వ్యవస్థ.
-ఎస్బీఎం మొబైల్ యాప్ :స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాల సాధనకు, పౌరులు, ప్రభుత్వ విభాగాల ఉపయోగార్థం తయారుచేశారు.
ఈ-సైన్
-ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత లావాదేవీలు, కార్యకలాపాల నిర్వహణకు వీలు కల్పించే వ్యవస్థ.
-అత్యంత సురక్షితమైన విధానంలో పౌరులు, ప్రభుత్వాధికారులు, ఆధార్ సమాచారం సాయంతో డిజిటల్ రూపంలో సంతకాలు చేసి సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతాయి.
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్
-జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడం, వెరిఫికేషన్ చేయడం, మంజూరు, ఆయా విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేయడం వంటి కార్యకలాపాలు పూర్తి పారదర్శకతతో త్వరితగతిన అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది.
-కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన ప్రధాన ఉద్దేశంగా ప్రారంభించిన ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రజలకు కావాల్సిన సేవల్లో అనవసర జాప్యాన్ని నివారించి, ప్రజలకు నాణ్యమైన సేవలను సకాలంలో అందించడానికి ఉత్తమమైన వ్యవస్థగా పేర్కొనడంలో ఎటువంటి సందేహం లేదు.
సూపర్ కంప్యూటర్లు
-వీటి పరిమాణం, సామర్థ్యం అత్యధికం. తయారీకయ్యే ఖర్చుకూడా అధికమే.
-ప్యారలల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేస్తాయి. అంతరిక్షకంగా వెదర్బ్రాడ్ కాస్టింగ్ వంటి క్లిష్టమైన రంగాల్లో అద్భుతమైన సేవలందిస్తాయి.
-వీటి వేగాన్ని ఫ్లావ్స్ (ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్)లలో కొలుస్తారు.
-భారత్‌లోని మొదటి సూపర్ కంప్యూటర్ – సిద్దార్థ
-ప్రపంచపు మొదటి సూపర్ కంప్యూటర్ క్రే-1ను సేమూర్ క్రే 1976లో కనుగొన్నాడు.
-భారతదేశపు సూపర్ కంప్యూటర్ల శ్రేణి-పరమ్. వీటిని పుణెలోని సీడాక్ కంపెనీ తయారుచేస్తుంది.
-ప్రపంచపు అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్- తెయాన్హే-2. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే దీన్ని సామర్థ్యం. 33.86 పెటాఫ్లావ్స్
-పనితీరు ఆధారంగా కంప్యూటర్లు (గణన యంత్రాలు) రకాలు
2 అనలాగ్ కంప్యూటర్లు : పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతిక విలువలను డిజిటల్ సిగ్నల్‌గా మార్చి ప్రాసెస్ చేసే కంప్యూటర్లు. వీటిని ఇంజినీరింగ్, సైంటిఫిక్ రంగాల్లో విరివిగా వినియోగిస్తారు.
-డిజిటల్ కంప్యూటర్లు : బైనరీ డిజిట్స్గా పరిగణించబడే 0, 1 సాయంతో ఎలాంటి గణనైనా చేయగల కంప్యూటర్లు, ప్రస్తుతం వాడదలుచుకున్న పర్సనల్ కంప్యూటర్లు ఈ కోవకు చెందినవే.
హైబ్రిడ్ కంప్యూటర్లు
-ఇవి అనలాగ్, డిజిటల్ రకాలను కలిపి తయారుచేసినవి.
-వీటిని వైద్యరంగంలో వాడే ఈసీజీ, డయాలసిస్ విభాగాల్లో వాడే పరికరాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా సాధారణ అవసరాలకు వాడే కంప్యూటర్లు, ఎయిర్‌క్రాఫ్ట్, ల్యాండింగ్, మల్టీమీడియా అవసరాలకు వాడే కంప్యూటర్లు ప్రత్యేకంగా ఒకే పనికి వాడ గల ప్రత్యేక అవసరాల కంప్యూటర్లుగా కూడా వర్గీకరించవచ్చు.
కంప్యూటర్ల వినియోగాలు
-విద్యారంగంలో వీడియో పాఠాల తయారీలో వాటిని ప్రదర్శించడంలో ఈ-బుక్స్, టెలీఎడ్యుకేషన్, వర్చువల్క్లాస్రూం, వర్చువల్ల్యాబ్, ఆన్లైన్ కోర్సుల రూపంలో కంప్యూటర్లను విరివిగా వాడుతున్నారు.
-పారిశ్రామిక రంగంలో, ఉష్ణోగ్రత, పీడనం, ఘనపరిమాణం, ఉత్పత్తి, ప్యాకేజింగ్, పంపిణీ వంటి అంశాలను మానిటర్ చేస్తూ నియంత్రణ చేయడం ప్రస్తుతం కంపూటర్లే నిర్వహిస్తున్నాయి.
-వినోద కార్యక్రమాల తయారీ, ప్రసారాల్లో సైతం కంప్యూటర్లు గణనీయపాత్ర నిర్వహిస్తున్నాయి.
-వైద్యరంగంలో కొన్ని రకాల శస్త్ర చికిత్సలను కంప్యూటర్ల సాయంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు.
-ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలు, విభాగాల అనుసంధానికి సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి, పారదర్శకతకు కంప్యూటర్లే వాడబడుతున్నాయి.
-బ్యాంకింగ్ రంగంలో, కస్టమర్ల రికార్డులను తయారుచేయడం, భద్రం చేయడం, కార్యకలాపాల నిర్వహణ అన్ని కంప్యూటర్లు సులభతరం చేస్తున్నాయి.
-విమానయానంలో వెదర్బ్రాడ్కాస్టింగ్, మిలిటరీ అవసరాల్లో (క్షిపణులను నియంత్రించడంలో) ఈ-కామర్స్, ఈ-బిజినెస్ వంటి వ్యవహారాల్లో కంప్యూటర్లు ఎనలేని సేవలందిస్తున్నాయి.
కొన్ని నిజాలు
-కంప్యూటర్ల పితామహుడిగా చార్లెస్బాబేజ్ని పరిగణిస్తారు. ఇతడు కనుగొన్న యంత్రాన్ని అనలిటికల్ ఇంజిన్‌గా వ్యవహరిస్తారు.
-మైక్రోప్రాసెసర్ల రాకతో కంప్యూటర్ల శకం నాలుగో తరం కంప్యూటర్ల తయారీ ప్రారంభమైంది.
-1971లో టెడ్హాఫ్ మొదటి చిప్‌ను కనుగొన్నాడు. దీన్ని ఇంటెల్ 4004 చిప్‌గా పిలుస్తారు.
-మొదటి సమీకృత వలయం ఇంటిగ్రేటెడ్ను జాక్ కిల్బీ, రాబర్ట్నోయ్న్లు 1958లో కనుగొన్నారు.
-కంప్యూటర్ పనిచేయడానికి అందించే సూచనల సమూహాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఉదా :
బేసిక్, పాస్కల్, కోబాల్, సీ, సీ++ మొదలైనవి.
-0.1 లను బైనరీ డిజిట్ అంటారు. వీటి ఆధారంగా వివిధ కంప్యూటర్ మెమరీ ప్రమాణాలను నిర్ణయిస్తారు.
-1 బిట్ = 0/1 బైనరీ డిజిట్
-8 బిట్ = 1 బైట్ = 2 నిబుల్స్
-210 బైట్స్ = 1024 బైట్స్ = 1 కిలోబైట్ (1 కేబీ)
1024 కిలోబైట్స్ = 1 మెగాబైట్ (1 ఎమ్బీ)
1024 మెగాబైట్స్ = 1 గిగాబైట్ (1 జీబీ)
1024 గిగాబైట్స్ = 1 టెరాబైట్ (1 టీబీ)
1024 టెరాబైట్స్ = 1 పెటాబైట్ (1పీబీ)
1024 పెటా బైట్స్ = 1ఎక్సాబైట్ (1 ఈబీ)
1024 ఎక్సాబైట్స్ = 1 జెటాబైట్ (1జడ్బీ)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు