పురపాలన అంగాలు, అధికారాలు, విధులు
నగర పాలక మండలి
-ఇది ఒక చర్చా సంబంధమైన అంగం. సంస్థ పరిధిలోని రిజిస్టర్ ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నగర పాలక సంస్థ ప్రథమ పౌరుడు మేయర్. ఇతడిని నగరప్రాంత సంస్థ పరిధిలోని ఓటర్లు ఎన్నుకుంటారు. ఇతడు నగరపాలక మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. నగరపాలక సంస్థ సమర్థమంతంగా పనిచేయడానికి కొన్ని స్థాయీ సంఘాలు ఉంటాయి. నగరపాలక సంస్థ పరిపాలనా అధిపతి కమిషనర్. ఇతడు ఐఏఎస్ కేడర్‌కు చెందినవాడు. ఇతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. నగర పాలక సంస్థకు సంబంధించిన కార్యక్రమాలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారం ఇతడికి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆరు నగరాల్లో నగరపాలక సంస్థలు ఉన్నాయి. అవి 1) హైదరాబాద్, 2) వరంగల్, 3) రామగుండం, 4) కరీంనగర్, 5) ఖమ్మం, 6) నిజామాబాద్
పురపాలక సంఘం : చిన్నచిన్న పట్టణాల పరిపాలన కోసం పురపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు. వీటిని కూడా రాష్ర్టాల్లో రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనం ద్వారా ఏర్పాటు చేస్తాయి. మున్సిపాలిటీలో మూడు అంగాలు ఉంటాయి. అవి 1) మండలి 2) స్థాయీ సంఘాలు 3) ప్రధాన కార్యనిర్వహణాధికారి.
మండలి (లేదా పురపాలక మండలి)కి మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఇది పురపాలక సంస్థలో చర్చా సంబంధమైన లేదా శాసనపరమైన అంగం. స్థాయీ సంఘాలు సంస్థకు తగిన సలహాలు ఇస్తుంది. కార్యనిర్వహణాధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతడు పరిపాలనను పర్యవేక్షిస్తాడు.
12వ షెడ్యూల్లో ఉన్న అధికారాలను, విధులను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది.
నోటిఫైడ్ ఏరియా కమిటీ : వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీని సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
టౌన్ ఏరియా కమిటీ : చిన్న పట్టణాల అవసరాలు తీర్చడానికి ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తాయి.
కంటోన్మెంట్ బోర్డు : సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌరులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని 1904లో రూపొందించారు. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. సికింద్రాబాద్ ప్రాంత పరిసరాల్లో కంటోన్మెంట్ బోర్డు ఉంది.
కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నికైన సభ్యులు, కొందరు నామినేటెడ్ సభ్యులు, మరికొందరు పదవీరీత్యా సభ్యులు ఉంటారు. ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ఉంది.
టౌన్షిప్ : ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఆ ప్రాంతంలో నివసించే వారికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ BHEL టౌన్షిప్, విశాఖపట్టణంలోని విశాఖ స్టీల్ టౌన్షిప్.
పోర్టుట్రస్ట్ : దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో పోర్టుట్రస్ట్లు ఏర్పాటవుతాయి. ఉదాహరణకు ప్రధాన ఓడరేవులున్న చెన్నై, ముంబై, విశాఖపట్టణంలో పోర్ట్ట్రస్ట్లున్నాయి. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌరసదుపాయాలను ఈ పోర్టుట్రస్ట్ కల్పిస్తుంది. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం ఈ పోర్టులు ఏర్పడతాయి. ఈ చట్టం ప్రకారమే సభ్యుల ఎన్నిక నామినేషన్, విధులు నిర్ణయమవుతాయి.
స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు : పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన ఏజెన్సీలు పనిచేస్తుంటాయి. ఉదాహరణకు హౌసింగ్ బోర్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ సప్లయ్ బోర్డులు ఈ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక విధులు ఉంటాయి. ఈ విధంగా వివిధ పట్టణ స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు వీటిలో ప్రముఖమైనవి.
రాష్ట్రంలో పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థలు
పంచాయతీరాజ్ సంస్థలో కింది ప్రతినిధులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు.
ఎ) జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జడ్పీటీసీ)
బి) మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ)
సి) గ్రామ పంచాయతీ సర్పంచ్
డి) గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు
ఈ-పంచాయతీలు : నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పలు తేవడానికి నిర్ణయించింది. ప్రథమంగా 2400 గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, వాటర్‌షెడ్ మొదలైన అనేక ప్రభుత్వ ప్రణాళికల ప్రయోజనాలు ఏకగవాక్ష (సింగిల్‌విండో) ప్రకారం జరుగుతాయి. స్థానిక ప్రభుత్వ పరిపాలన పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ ఏర్పర్చడం ఈ-పంచాయతీల ప్రధాన ఆశయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు.
నోట్ : 2015, అక్టోబర్ 2న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ-పంచాయతీలను నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట గ్రామంలో ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ : జిల్లా పరిపాలనలో కలెక్టర్ ప్రముఖమైన కీలకపాత్ర వహిస్తారు. ఇతడు ఐఏఎస్ కేడర్‌కు చెందినవాడు.
కలెక్టర్ అధికారాలు, విధులు
జిల్లా పాలన అధిపతి కలెక్టర్‌కు అనేక అధికారాలు, విధులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి
ఎ) రెవెన్యూ విధులు: జిల్లాలో భూమి శిస్తు వసూలు చేయడం, ప్రభుత్వానికి రావలసిన ఇతర బకాయిలను రాబట్టడం కలెక్టర్ ప్రధాన బాధ్యత. ప్రభుత్వ భూములను సర్వే చేయడం రికార్డులను భద్రపర్చడం ఇతడి రెవెన్యూ విధుల్లో ప్రముఖమైనవి. ఇతడి విధినిర్వహణలో జాయింట్ కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలైనవారు సహకరిస్తారు.
బి) మెజిస్టీరియల్ విధులు : జిల్లా కలెక్టర్ అనేక మెజిస్టీరియల్ అధికారాలను, విధులను కలిగి ఉంటారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటం ఇతడి బాధ్యత
సి) ఎన్నికల విధులు : జిల్లాలో ప్రధాన ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సవ్యంగా జరపడంలో అతడు తగిన బాధ్యతను వహిస్తాడు.
డి) సమన్వయ విధులు : జిల్లాలోని అనేక శాఖల మధ్య జిల్లా కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. అన్ని శాఖల అధిపతులు అతడికి జవాబుదారీగా ఉంటారు.
ఇ) జనాభా లెక్కల విధులు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధిగా ప్రతి పదేండ్లకు జరిగే జనాభా లెక్కల సేకరణలో కలెక్టర్ ఎన్నో చర్యలు తీసుకుంటారు.
ఎఫ్) ఇతర విధులు : జిల్లా అధిపతిగా జిల్లా కలెక్టర్‌కు అనేక విధులు ఉంటాయి. అతను పంచాయతీరాజ్ సంస్థల సమావేశాలకు, పట్టణ స్థానిక సంస్థల సమావేశాలకు హాజరవుతారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ కోశాగారాలపై పర్యవేక్షణ చేస్తారు. జూనియర్ అధికారాలకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల అమల్లో తగిన బాధ్యతను వహిస్తారు.
స్థానిక ప్రభుత్వాల్లో కలెక్టర్ పాత్ర : ప్రాంతీయ ప్రభుత్వాల వ్యవస్థలో కలెక్టర్ పాత్ర ఎంతో ప్రముఖమైంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా అనేక ఇతర సమస్యలు ప్రజలకు ఎదురైనప్పుడు కలెక్టర్ వారికి చేయూతనందిస్తారు.
ప్రాంతీయ, పట్టణ, స్థానక ప్రభుత్వాలను కలెక్టర్ సమన్వయపర్చి ఆ ప్రభుత్వాల నిర్వహణలో తగిన సహాయ సహకారాలను అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సమస్యలను తెలుపుతాడు. తద్వారా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందేవిధంగా తోడ్పడతాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తాడు.
కలెక్టర్ కేంద్ర, రాష్ట్ర సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన మధ్యాహ్న భోజనం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, స్వచ్ఛ భారత్ మొదలైన కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తాడు.
జిల్లాలోని ప్రజల సమస్యల పరిష్కార వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్‌ను ప్రధాన అధికారిగా ఎంపికచేసుకున్నాయి. జిల్లాలోని ప్రజలు కూడా కలెక్టర్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇటీవలకాంలో నిరంతరం పెరుగుతున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ కలెక్టర్ పాత్రపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా జిల్లాలో కలెక్టర్‌ను మకుటం లేని చిన్న రాజు అని చెప్పవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు