తెలంగాణకు అశనిపాతం ఆరుసూత్రాలు ( గ్రూప్-1 ప్రత్యేకం )
ఆరుసూత్రాల (షట్సూత్ర) పథకం గురించి విమర్శనాత్మకంగా వివరించండి?
# జై ఆంధ్ర ఉద్యమం ఆందోళనల ఫలితంగా 1973 జనవరి 18న పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. 1973 సెప్టెంబర్ 1న రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు పొడగించారు. ఇలాంటి పరిస్థితిలో 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
# 1972లో చెలరేగిన జైఆంధ్ర ఉద్యమం తర్వాత 1956, 1969లలో తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలన్నింటిని రద్దుచేసి వాటి స్థానంలో ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి జోన్‌గా ప్రకటించారు. ఆరు సూత్రాల పథకం కంటే ముందు హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగాలు తెలంగాణ వారికి అందుబాటులో ఉండేవి. అయితే ఈ పథకం అమలుతో హైదరాబాద్‌లో తెలంగాణేతరులు విద్య, ఉద్యోగాల్లో స్థిరపడటానికి అవకాశం ఏర్పడింది. ముల్కీ నిబంధనలను సవరించి, ప్రాంతీయ కమిటీలను రద్దుచేసి, నివాస పరిమితిని పదిహేను నుంచి నాలుగేండ్లకు తగ్గించారు. దీంతో ఉద్యోగాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రాంతీయుల పిల్లలు స్థానికత కోటా కింద విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొంది తెలంగాణ ప్రాంత విద్యార్థుల అవకాశాలను కొల్లగొట్టారు. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధ్దమేనన్న సుప్రీంకోర్టు తీర్పును కాదని ఆరుసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ప్రజలు హర్షించలేదు. జై ఆంధ్ర ఉద్యమం కూడా తమ లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్రం సాధించకుండానే తెలంగాణకు సంబంధించిన సౌకర్యాలను రద్దుచేయగానే చల్లబడింది. అంతేకాకుండా నిజాం కాలంలో ఏర్పడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజాహీ మిల్స్, ఆల్వీన్ వంటి కంపెనీలను కూడా నష్టాల పేరుతో మూసేశారు.
# 1976లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అదేవిధంగా ఆంధ్రప్రాంతం గుంటూరులో 1978లో నాగార్జున విశ్వవిద్యాలయం, అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ, 1983లో తిరుపతిలో పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం, 1985లో తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయం, 1986లో విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కుప్పంలో ద్రావిడ భాషల విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఫ్రీజోన్‌గా మారిన హైదరాబాద్‌లో 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం, 1982లో డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, 1958లో ఇఫ్లూ, 1974లో కేంద్రీయ విశ్వవిద్యాలయం, 1985లో తెలుగు విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఇవి రాష్ట్రపరిధిలో ఉండటంతో తరువాత దశలో అంతకుముందు ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని వైద్యకళాశాలను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యకళాశాలకు అనుబంధంగా మార్చా రు. ఆరు సూత్రాల పథకం వల్ల స్థానిక కోటాలో ఇక్కడి సీట్లు కూడా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రాంత విద్యార్థులకే రావడంతో తెలంగాణ యువత తీవ్ర నిరాశకు గురైంది.
# ఆరుసూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉదేశంతో 32వ రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చారు. దీనిఆధారంగా 1975, అక్టోబర్ 18న G.S.R 524 రాష్ట్రపతి ఉత్వర్వు ఇచ్చారు. ఈ సవరణ ద్వారా అంతకుముందు నిబంధనలను అతిక్రమించి జరిగిన నియామకాలన్నిటినీక్రమబద్ధీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఉద్యోగాలను వివిధ స్థానిక కేడర్లుగా, ఆంధ్రప్రదేశ్‌ను ఆరుజోన్లుగా విభజించారు. ఆంధ్ర, రాయలసీమలో నాలుగు జోన్లు, తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఒక జోన్ చొప్పున రెండు జోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉండే సీడీసీ స్థాయి ఉద్యోగాలన్నీ జిల్లాస్థాయి కేడర్లవుతాయి. వీటి నియామకాలకు ప్రతిజిల్లా ఒక లోకల్ ఏరియా అవుతుంది. ఒక జోన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సీడీసీ కంటే ఎక్కువ స్థాయి నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు, ఒక జోన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలో ఉండే కొన్ని నిర్ణీత గెజిటెడ్ ఉద్యోగాలన్ని జోన్‌స్థాయి కేడర్లు అవుతారు. ఈ నియామకాలకు ప్రతిజోన్ ఒక లోకల్ ఏరియా అవుతుంది. అవసరమని ప్రభుత్వం భావిస్తే ఒక జిల్లాస్థాయి కేడర్‌ను ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు విస్తరించవచ్చు. ఒక జోన్‌స్థాయి కేడర్‌ను ఒకటి కంటే ఎక్కువ జోన్లకు విస్తరింపచేయవచ్చు. వీటిని మల్టీజోనల్ కేడర్లు అంటారు. స్థానికంగా ఏదైన ప్రాంతంలో నాలుగేండ్లు నివాసం ఉంటే ఆ వ్యక్తి అక్కడ స్థానిక అభ్యర్థి అవుతాడు. అయితే కొన్ని సంస్థలకు, కార్యాలయాలకు ఈ రెసిడెన్షియల్ ఆర్డర్‌ను వర్తింపచేయలేదు. వాటిలో రాష్ట్ర సచివాలయం, రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యాలయాలు, పోలీసు శాఖలోని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి.
విమర్శ
# ఆరు సూత్రాల పథకం వల్ల తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైంది. దీనివల్ల అంతకుముందు కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలన్ని రద్దయ్యాయి.
#ముల్కీ నిబంధనలు, 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దయింది. తెలంగాణ, ఆంధ్రప్రాంత ఆదాయ వ్యయాలు విడివిడిగా చూపాలన్న నియమాన్ని కూడా తీసేశారు.
# అక్రమంగా చేరిన ఆంధ్ర ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. ప్రాంతీయసంఘం రద్దుతో తెలంగాణ భూములకు రక్షణ కరువైంది.
# ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జిల్లా, జోనల్ స్థాయి పోస్టుల్లో రిజర్వుచేసిన స్థానాల్లో స్థానిక అభ్యర్థుల నియామకం మాత్రమే జరగాలి. మిగతా ఖాళీలను ఓపెన్ పోటీ ద్వారా భర్తీ చేయాలి. కానీ స్థానిక అభ్యర్థులకు కేటాయించిన ఖాళీలు పోగా మిగతా ఖాళీలన్నింటిని స్థానికేతరులనే నియమించారు.
#కొన్ని జిల్లాస్థాయి కేడర్లను జోనల్స్థాయిగా మార్చి వాటి లో స్థానిక అభ్యర్థులకున్న 80 శాతం రిజర్వేషన్ కోటాను 70 శాతానికి తగ్గించారు. నాన్‌గెజిటెడ్ కేడర్లను జోనల్‌స్థాయి గెజిటెడ్ కేడర్లుగా మార్చి వాటిలో స్థానిక అభ్యర్థులకున్న 70 శాతం రిజర్వేషన్ కోటాను 60 శాతానికి తగ్గించారు.
# రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర పరిధిలోని కార్యాలయ సిబ్బం ది నియామకాల్లో సమన్యాయం చేయాలనే నిబంధనలు ఉన్పప్పటికీ తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో సరైన ప్రాతినిధ్యం లభించలేదు.
610 జీఓ గురించి తెలపండి?
# రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 ప్రకారం ఆంధ్రప్రాంత ప్రయోజనాలను రక్షించే అంశాలను అమలుచేసి తెలంగాణకు అనుకూలమైన వాటిని అమలుచేయకపోవడంతో తెలంగాణలో కిందిస్థాయి ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరిగింది. అందువల్ల తెలంగాణ ఎన్జీవోల సంఘం రాష్ట్రపతి ఉత్తర్వులోని అన్ని అంశాలను సక్రమంగా అమలుచేయాలనే విజ్ఞప్తితో అప్పటి ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారి జయభారత్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీని 1984లో నియమించారు. ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా 58,962 మంది స్థానికేతరులు తెలంగాణలో ఉద్యోగాలు పొందారని నివేదిక సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. కొంతకాలం తర్వాత మరో ఐఏఎస్ అధికారి సుందరేశన్ నాయకత్వంలో మరో కమిటీని ప్రభుత్వం నియమించింది. జయభారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీల సూచనల ఆధారంగా 1985 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రపతి ఉత్వర్వులు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ జీవో జారీ అయ్యేవరకు తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో, జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన స్థానికేతరులను 1986, మార్చి 31 నాటికి వారి ప్రాంతాలకు పంపించాలి. వారిని బదిలీ చేయడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైతే అదనపు ఉద్యోగాలను సూపర్‌న్యూమరీ కోటాకింద కల్పించాలి. అక్రమ నియామకాలు, పదోన్నతులకు సంబంధించిన వివాదలపై తెలంగాణ ఉద్యోగుల విజ్ఞప్తులను 1986, మార్చి 31లోగా పరిష్కరించాలి. బదిలీలను అవసరమైతే తప్ప చేయకూడదు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, పదోన్నతులను పునఃపరిశీలించాలి. జూరాల, శ్రీశైలం ఎడమకాలువ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కోసం నాన్‌గెజిటెడ్ కేడర్లలో నియమించిన స్థానికేతరులను వారికి సంబంధించిన జోన్లకు బదిలీచేయాలి. అయితే బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాల్లో నియమితులైన స్థానికేతరులపై చర్యలు తీసుకోవాలనే అంశాలపై అనేక ఉల్లంఘనలు జరిగాయి. నాయకత్వంలో చిత్తశుద్ధి లేకపోవడంతో నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకోని 610 జీవో అమలుకాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఉద్యోగులపై చర్య తీసుకోలేకపోయారు. 1989 వరకు అధికారంలో ఉన్న రామారావు ప్రభుత్వం ఈ జీవోను అమలుపర్చలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రామారావు, చంద్రబాబు ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. దీనికంటే ముందు రాయలసీమలో స్థానిక అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న జీవో నెం. 564ను మాత్రం ప్రభుత్వం అమలుచేసింది.
# తరువాత కొద్ది సంవత్సరాలకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో మలిదశ ఉద్యమం ప్రారంభం కావడం, ఈ ప్రాంత శాసనసభ్యులు 610 జీవోను అమలుచేయాలని ఒత్తిడి చేయడంతో దీన్ని పరిశీలించడానికి చంద్రబాబు ప్రభుత్వం 2001, జూన్ 25న ‘జెటో ముగళదాస్ గిర్గ్లాని’ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ తన మధ్యంతర నివేదికను 2001, అక్టోబర్ 6న, తుది నివేదికను 2004 సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. అయితే చాలాకాలం వరకు ప్రభుత్వాలు దీన్ని బహిర్గతం చేయలేదు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 1976లో హైదరాబాద్‌లో ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రాంత యువతకు పెద్దగా లబ్ధిచేకూరలేదు. జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా తెలంగాణకు కోటా ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఆరు సూత్రాల పథకం
1. రాష్ట్రస్థాయి ప్రణాళిక బోర్డును ఏర్పరచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపసంఘాలు ఏర్పాటు చేయడం.
2. విద్యాసంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చే విషయంలో రాష్ట్రానికంతా ఒకే విధానాన్ని పాటించాలి. రాజధాని ప్రాంతంలో ఉన్నత విద్యావంతులను పెంచడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
3. ఒక నిర్ణీత స్థాయివరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రమోషన్ల విషయంలో కూడా ఒక నిర్ణీత స్థాయివరకు ఈ నిబంధనలు పాటించాలి.
4. ఉద్యగ నియామకాలు, సీనియారిటీ, ప్రమోషన్ వంటి విషయాల్లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి ఉన్నతాధికారులతో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను నియమించాలి.
5. పై సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయమైన చిక్కులను నివారించడానికి రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కలిగించాలి.
6. పైన సూచించిన వాటిని పాటిస్తే ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరం లేదు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు