తెలంగాణకై జన చైతన్యం ( తెలంగాణ ఉద్యమ చరిత్ర)
విశాలాంధ్రకు నిజాం అనుకూలం కాదు.
-హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్ నిజాం నవాబు విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని, అందువల్ల ఆంధ్ర ముఖ్యమంత్రితో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నారని స్థానిక పత్రికల్లో వెలువడిన వార్తలను రాజ్‌భవన్ ఖండించింది. రాష్ర్టాల పునర్నిర్మాణం భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం కావున ఈ వార్తకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
విశాలాంధ్ర నినాదం తెలంగాణ ప్రజలది కాదు
-కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం నవంబర్ 2న సమావేశమై హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సీ చేసిన సిఫారసు అమలు చేయాలని, విశాలాంధ్ర నినాదం తెలంగాణ ప్రజలది కాదని తీర్మానం చేశారు. (గోలకొండ పత్రిక 8.11.1955)
తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి కేంద్రం అడ్డుతగలరాదు: విద్యార్థి ఫ్రంట్ కార్యాచరణ సమితి
-విశాలాంధ్రకై కొన్ని సంస్థలు చేస్తున్న తీర్మానాలు, వ్యక్తుల ప్రకటనలు రాష్ట్రప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం లేదని, తెలంగాణ ప్రజలు యావత్తు ప్రత్యేక రాష్ర్టాన్ని కోరుతున్నారని తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి తెలిపింది.(గోలకొండ పత్రిక 10.11.1955)
ఎస్ఆర్సీ సిఫార్సులను బలపరుస్తూ హైదరాబాద్ కార్పొరేషన్ తీర్మానం
-హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్‌ను గురించి రాష్ర్టాల పునర్విభజన సంఘం చేసిన సిఫారసులను ఆమోదిస్తూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. మేయర్ షహబొద్దిన్ అహ్మద్‌ఖాన్ అనీస్నుద్దిన్ అహ్మద్, జయాచారిలతో కూడిన ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి పంపి కాంగ్రెస్ హైకమాండ్‌కు, ప్రధాని నెహ్రూకు ప్రజాభిప్రాయాన్ని తెలిపేందుకు నిర్ణయించారు. ఎస్ఆర్సీ సిఫారసులను బలపరిచే తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు సభలో 82మంది సభ్యులున్నారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. (గోలకొండ పత్రిక 10.11.1955)
బూర్గులకు నల్లజెండాలు చూపిన తెలంగాణవాదులు
-విశాలాంధ్రను సమర్థించిన ముఖ్యమంత్రికి సికింద్రాబాద్‌లో చిత్రటాకిస్ దగ్గర తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఆంధ్రాబ్యాంకు ప్రారంభోత్సవానికి బూర్గుల సికింద్రాబాద్‌కు రాగా జనం కారుకు అడ్డం వచ్చి విశాలాంధ్ర ముర్ధాబాద్ అంటూ నినాదాలిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుని వ్యాఖ్యలు
-హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుడు జేవీ నర్సింగరావు ఢిల్లీ వెళ్లివచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఎన్నికైన పన్నెండుమంది కాంగ్రెస్ ఎంపీలలో ఒక్కరు తప్ప సత్వర విశాలాంధ్ర నిర్మాణాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 78శాతం డెలిగేట్స్ తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతున్నారు. తెలంగాణ జిల్లాల డీసీసీలలో ఎనిమిది ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ర్టాన్ని కోరగా ఒక మెదక్ డీసీసీ విశాలాంధ్రను కోరిందని అన్నారు. (గోలకొండ పత్రిక 12.11.1955)
మాడపాటి – తెలంగాణ ప్రకటన
-నేను విశాలాంధ్ర నిర్మాణాన్ని విశ్వసించే వారిలో ఒకన్ని. ఎస్ఆర్సీ నివేదిక, ప్రజాభిప్రాయాన్ని బాగా గమనించిన పిదప, శాంతియుత పద్ధతులలో విశాలాంధ్ర నిర్మాణానికి సరైన విధానం ఎస్ఆర్సీ నివేదికలో రాష్ట్రభవిష్యత్తును గురించి చేయబడిన ప్రతిపాదనలు అంగీకరించడమేనని ఒక నిర్ణయానికి వచ్చాను. విశాలాంధ్ర-తెలంగాణవాదుల ప్రచారం వల్ల వచ్చిన ఉద్రేకాలు అనవసరమైనవి. అవసరమైన సరిహద్దుల మార్పులతో ఎస్ఆర్సీ సిఫారసులు అంగీకరించడమే అత్యుత్తమం
తెలంగాణ ఉద్యమ వార్తలు
గోలకొండ పత్రిక 10.11.1955 సంపాదకీయంలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని, తదితర సమస్యల దృష్ట్యా ఇప్పుడే అంతియ నిర్ణయం జరగాలని కాంగ్రెస్ కార్యవర్గం (జాతీయ) భావిస్తే హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు అత్యధిక మెజార్టీతో ఆమోదించిన తీర్మానాన్ని పాటించి రెండు స్టేట్స్ చిరస్థాయిగా ఉండవచ్చునని ఇప్పుడే చెప్పవచ్చు ఈ విషయాన్ని నిర్ణయించడానికి ఏర్పాటైన ఉన్నతాధికార సంఘం ఎంత ప్రయత్నించినా ప్రదేశ్ కాంగ్రెస్ అధిక సంఖ్యాక సభ్యులు విశాలాంధ్రను అంగీకరించబోరు. తెలంగాణ ప్రజల్లో నూటికి 90 మందికి పైగా ప్రత్యేక రాష్ర్టాన్నే కోరుకుంటుండగా దానికి విరుద్ధ తీర్మానాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గానీ, ఇండియా ప్రభుత్వం గానీ ఎప్పటికీ చేయలేదు.
-విశాలాంధ్రవాదుల పిచ్చివాగుడు వల్ల అప్పుడే తెలంగాణ ప్రజలలో ఉద్రేకాలు పెరిగిపోయినవి. ఇవి కొంతవరకైనా అణగిపోయే అవకాశం 1961 వరకు ఏర్పడవచ్చును. ఆ అవకాశాన్ని పోగొట్టుకొని ఉద్రేకాలు పెరిగిపోయి అభిప్రాయభేదాలు అధికమైన ఈ సమయంలో విశాలాంధ్ర ఏర్పడితే ఈ అభిప్రాయభేదాలు చిరస్థాయిగా ఉండగలవు. కేవలం రాజకీయ రంగంలోనే కాక ప్రతి రంగంలో కల్మషాలు అధికమై, అనుమానాలు పెరిగి శాశ్వత వైరుధ్యమేర్పడగలదు. దాని ప్రభావం సామాన్య ప్రజానీకంపై విశేషంగా పడగలదు.
కరీంనగర్, హన్మకొండలో విద్యార్థుల ఆందోళనలు
-1955, నవంబర్ 8న కరీంనగర్ విద్యార్థులు సుమారు 2వేల మంది పెద్ద ఊరేగింపును నిర్వహించారు. పట్టణమంతా ఊరేగింపు తీసి స్కూల్ మైదానంలో సమావేశం జరిపి ప్రత్యేక తెలంగాణ కావాలని తీర్మానించారు. అటు వరంగల్, హన్మకొండ జంటనగరాలలో నవంబర్ 7, 9 తేదిల్లో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పాఠశాలలు మూసివేయబడినవి. భారీ ర్యాలీతో విద్యార్థులు విశాలాంధ్ర అక్కరలేదు, ప్రత్యేక తెలంగాణ కావాలి ప్రజాభిప్రాయానుసారం ముఖ్యమంత్రి మెలగాలి అంటూ వేయి స్థంభాల గుడిలో సమావేశాన్ని నిర్వహించారు. కార్యాచరణ సమితి కన్వీనర్ ఎస్. కొండలరావు కేంద్రానికి పంపే తీర్మానాన్ని చదివి వినిపించారు. (గోలకొండ పత్రిక 12.11.1955)
తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
-ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సభ్యుల్ని కలిసినప్పుడు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జెవీ రంగారావు, రెవెన్యూమంత్రి కెవీ రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రమే హైదరాబాద్ ప్రజలను సంతృప్తిపరచగలదని స్పష్టం చేశారు. ఈ కమిటీలో నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, మౌలానా ఆజాద్, దేబర్లు ఉన్నారు. ఆంధ్రలో తెలంగాణను విలీనం చేసి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలన్న వర్కింగ్ కమిటీ సలహాపై సంప్రదింపులు జరిపారు.
-అయితే హైదరాబాద్ సీఎం కమిటీతో విశాలాంధ్రను ఏర్పా టు చేయాలన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా నవంబర్ 10న తీర్మానం చేయడంతో తెలంగాణవాదులు వివిధ జిల్లాల్లో ఆందోళనను తీవ్రతరం చేశారు. నవంబర్ 12న తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో విద్యార్థులు తరగతులు బహిష్కించి తెలంగాణ నినాదాలతో ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించారు.
రక్షణలపై నమ్మకం లేదు- జేవీ నర్సింగా రావు
-జేవీ నర్సింగరావు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు) తెలంగాణ ప్రజలు అంగీకరిస్తేనే తెలంగాణ, ఆంధ్రప్రాంతాలను కలపడం జరుగుతుందని నవంబర్ 20న తెలిపాడు. ఇదే విషయంపై కాంగ్రెస్ కార్యవర్గం చేసిన తీర్మానం లో స్పష్టంగా ఉందని పేర్కొన్నాడు.అయితే తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రతిపాదన గురించే అంగీకారం కుదరనప్పుడు తెలంగాణకు కావాల్సిన రక్షణలను చర్చించే ప్రశ్నే లేదన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపివేయాల్సివస్తే రక్షణ కోరుకోవడంలో నాకేమాత్రం నమ్మకం లేదని ఆయన అభిప్రాయపడినారు.
విశాలాంధ్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఆదేశం
-ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించి హైదరాబాద్‌కు రాగానే 15న హైదరాబాద్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. విశాలాంధ్ర ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణవాదులను ఒప్పించాలని హైకమాండ్ హైదరాబాద్ నాయకులకు చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ కార్యవర్గ నిర్ణయాన్ని అనుసరించాలని బూర్గుల అన్నారు. (ఆంధ్రపత్రిక 17.11.1955)
ఉధృతమైన తెలంగాణ ఉద్యమం
-కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనితో వరంగల్, హన్మకొండలో తెలంగాణవాదులు, విద్యార్థులు ఆ పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెద్దలు విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయడంతో వరంగల్‌లో ఆ పార్టీ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎలాగైనా విశాలాంధ్రకు ఒప్పించడానికి కర్నూలులో నవంబర్ 23న ఆంధ్ర ముఖ్యమంత్రి తలపెట్టిన చర్చలకు రావడం లేదని కెవీ రంగారెడ్డి, జెవీ నర్సింగరావు, చెన్నారెడ్డి స్పష్టం చేస్తూ లేఖ రాశారు.
-నిజామాబాద్ ఎంపీ హరిశ్చంద్ర హెడా అధ్యక్షతన నవంబర్ 23న హైదరాబాద్ ప్రతాప్గిర్జీ హోదాలో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు వెయ్యిమందికి పైగా డెలిగేట్లు తెలంగాణ నలుమూలల నుంచి హాజరయ్యారు. వెంటనే తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని కన్వెన్షన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
-హైదరాబాద్ పీసీసీ మహిళ కన్వీనర్ సంగెం లక్ష్మీబాయి తెలంగాణ మహిళల ప్రత్యేక రాష్ట్రశాఖ మెమోరాండం ద్వారా ప్రధానికి, కాంగ్రెస్ అధ్యక్షులు దేబర్, ఇందిరాగాంధీ, పంత్‌లకు తెలియజేసింది.(గోలకొండ పత్రిక 24.11.1955)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు