రైతన్న పరపతికి భరోసా..
భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారమైనది. దేశంలో వ్యవసాయ కమతాల పరిమాణం తక్కువగా ఉండటం, రైతుల్లో ఎక్కువమంది చిన్న సన్నకారు రైతులు అందునా నిరక్షరాస్యులే కావటంతో ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా సాగుకోసం రైతన్నకు వ్యవస్థీకృతమైన పరపతి అందకపోవటంతో ప్రైవేటు వడ్డీవ్యాపారులపై ఆధారపడి మరింత రుణబాధల్లోకి కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వాలు అనేక విధాలైన పరపతి విధానాలు అమల్లోకి తెచ్చాయి. పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమైనప్పటి నుంచి వ్యవసాయరంగానికి నిధులు పెంచుతూ వస్తున్నాయి. ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం..
వ్యవసాయ విత్తం
వ్యవసాయ ఉత్పాదకాలను సమకూర్చుకోవడానికి, వ్యవసాయపనులు నిర్వహించడానికి అవసరమైన ద్రవ్యాన్ని వ్యవసాయ విత్తం అంటారు. వ్యవసాయదారుడు తన విత్త అవసరాలను మొత్తం తన సొంత వనరులనుంచి సమకూర్చుకోలేడు. వ్యవసాయ విత్తాన్ని ప్రభుత్వ సంస్థల నుంచి, ప్రభుత్వేతర సంస్థల నుంచి అందుకుంటాడు. కాల ప్రాతిపదికన వ్యవసాయ పరపతిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
స్వల్పకాలిక పరపతి :
విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పశుగ్రాసం, కూలీల వేతనాలు మొదలైన అవసరాల కోసం పొందే పరపతి. దీన్నే 12-15 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాలి.
మధ్యకాలిక పరపతి :
భూమిని మెరుగుపర్చడం, బావుల తవ్వకం, పశువులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు మొదలైన అవసరాల నిమిత్తం సమకూర్చుకొనే పరపతిని మధ్యకాలిక పరపతి అంటారు. 15 నెలల నుంచి 5 ఏండ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాలి.
దీర్ఘకాలిక పరపతి :
శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయటం కోసం అదనపు భూమిని, ట్రాక్టర్లు, మోటారు ఇంజన్లు మొదలైన వాటి కొనుగోలు కోసం ఎక్కువ మొత్తంలో రుణం అవసరం ఉంటుంది. దీన్ని దీర్ఘకాలిక పరపతి అంటారు. 15-20 ఏండ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాలి.
పంచవర్ష ప్రణాళికలు – వ్యవసాయరంగం
మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం నిధుల్లో 31 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఈ ప్రణాళికలో సామాజికాభివృద్ధి పథకం, జమిందారీ విధాన పద్ధతిని రద్దు చేయడం, భూ సంస్కరణలు అమలుచేయడం, సింధ్రీలో ఎరువుల కర్మాగారం, భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
-రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికి 27 శాతం కేటాయించారు.
-మూడో పంచవర్ష ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, స్వావలంబన లక్ష్యాలతో ప్రారంభమైంది. ఈ ప్రణాళికలో వ్యవసాయరంగానికి 14.6 శాతం నిధులను కేటాయించారు. 1963లో ARDC (Agricluture Refinance Decelopment Corpor-ation), 1965లో EPZ ప్రారంభం.
-వార్షిక ప్రణాళిక (1966-69)ల్లో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికల్లో సాంద్ర వ్యవసాయాన్ని, హరితవిప్లవాన్ని ప్రవేశపెట్టారు.
-నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయరంగానికి 28.3 శాతం నిధులను కేటాయించారు. 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం, 1970లో శ్వేత విప్లవం ప్రారంభం. 1973లో DRADP (Drought Prone Area Development Programme) ప్రారంభం.
-ఐదో పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయరంగం, నీటిపారుదలకు 22.2 శాతం నిధులను కేటాయించారు. ఈ ప్రణాళిక కాలంలో 1974లో కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభం, ఉపాంత రైతుల, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ (MAFAL), చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ ప్రారంభం, 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన, 1977లో పనికి ఆహార పథకం, ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం, అంత్యోదయ పథకాలు ప్రారంభం.
-ఆరో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదలరంగానికి 16.1 శాతం నిధులను కేటాయించారు.
-ఏడో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదల రంగానికి 13.4 శాతం నిధులను కేటాయించారు. భూ సమస్యలను పరిష్కరించడానికి 1988-89లో కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బంజారా భూముల అభివృద్ధి కోసం సమగ్ర బంజార భూముల అభివృద్ధి పథకాన్ని 1989-90లో ప్రారంభించారు.
-ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదలరంగానికి 12.7 శాతం నిధులను కేటాయించారు.
-తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదల రంగానికి 10.9 శాతం నిధులను కేటాయించారు. 2000లో అన్నపూర్ణ అంత్యోదయ పథకాన్ని ప్రారంభించారు.
-పదో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు 10.35 శాతం నిధులను కేటాయించారు. 2003లో టీ, కాఫీ, రబ్బరు, యాలకుల కోసం ధరల స్థిరీకరణరీతిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006లో ప్రారంభమైనది.
-పదకొండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటి పారుదలరంగానికి 10.35 శాతం నిధులను కేటాయించారు.
ప్రభుత్వ పథకాలు
రైతు సంక్షేమం :
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే తలంపుతో వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం రూ. 44,485 కోట్లు కేటాయించారు. దేశం మొత్తంమీద 14 కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉంటే అందులో 46 శాతానికి మాత్రమే సాగు నీరు అందుబాటులో ఉంది. సాగునీటి కోసం నాబార్డు ఆధ్వర్యంలో సాగునీటి నిధిని రూ. 20 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏర్పాటు చేసింది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టు కింద 80.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది.
సాయిల్ హెల్త్‌కార్డ్ పథకం :
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015, ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని శ్రీగంగారాంనగర్ జిల్లా సూరత్‌గఢ్ పట్టణంలో సాయిల్ హెల్త్‌కార్డ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతుల పొలాలను పరిశీలించి కావల్సిన పోషకాలు, ఎరువులను ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపర్చడానికి రైతులకు సహాయం చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా మూడేండ్ల కాలంలో దేశంలోని రైతులకు 14 కోట్ల సాయిల్ హెల్త్‌కార్డ్‌లు జారీ చేస్తారు. ఈ కార్డ్ వివిధ రకాల పొలాలకు అవసరమైన పోషకాలు, ఎరువులను పంటలవారీగా సిఫారసు చేస్తుంది. ఇంతేకాకుండా ప్రధాని స్వస్థ ధర ఖేత్ హారా (ఆరోగ్యకరమైన భూమి-పచ్చనైన పొలం) అనే నినాదాన్ని ఇచ్చారు. వ్యవసాయం అభివృద్ధి కోసం ఉన్నత స్థాయి నిపుణల కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ర్టాలకు సూచించారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన :
రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు 2016, జనవరి 13న ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంది. ఈ పథకం కింద ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాలు/నూనె గింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
రబీ సీజన్లో ఆహారధాన్యాలు/నూనె గింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని మొత్తం పంటల విస్తీర్ణం 19.5 కోట్ల హెక్టార్లు. దీనిలో 25-27 శాతానికి మాత్రమే బీమా కవచం అందుతుంది. ఈ పథకంతో రాబోయే మూడేళ్లలో ఇది యాభై శాతానికి చేరుకొంటుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా. ఈ పథకానికి రూ. 5,500 కోట్లు కేటాయించారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ. 17,600 కోట్ల వరకు ఖర్చవుతుంది.
పరంపరాగత్ కృషి వికాస్ యోజన :
ఈ పథకం ద్వారా వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఈశాన్య రాష్ర్టాల్లో సేంద్రియ సాగుకు కలిపి రూ. 412 కోట్ల కేటాయింపు. భూమి, నీళ్లు, ఎరువుల తర్వాత రైతులకు కావాల్సిన రుణాలు 2016-17లో రైతులకు రూ. 9 లక్షల కోట్ల రూణాలు ఇవ్వాలని నిర్ణయం. వ్యవసాయ రుణాలపై వడ్డీభారం నుంచి ఉపశమనం కలిగించేందుకు రూ. 15,000 కోట్లు కేటాయించారు.
-పాడి పరిశ్రమ పథకం 2016-17 వార్షిక బడ్జెట్లో రైతు కుటుంబాలు పాడి పరిశ్రమ ఆధారంగా అదనపు ఆదాయం సంపాదించేందుకు నాలుగు పథకాలు ప్రకటించి రూ. 850 కోట్లు కేటాయించింది. పశువుల ఆరోగ్యానికి సంబంధించినది పశుధన్ సంజీవనిలో భాగంగా నకుల్ స్వస్థపాత్ర పేరుతో ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు.
-పశు సంపద వృద్ధి లక్ష్యంగా అధునాతన సంతానోత్పత్తి విధానాలు అమలు.
-ఈ పశుధన్ హాత్ పేరిట ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు
-దేశీయ పశుజాతుల అభివృద్ధికి జాతీయ జినోమ్ కేంద్రం ఏర్పాటు.
-జాతీయ వ్యవసాయదారుల కమిషన్ 2004లో జాతీయ వ్యవసాయదారుల కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ చైర్మన్‌గా ఏర్పాటుచేశారు. ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి, ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజలందరికీ వర్తింపజేయాలి, జాతీయ ఆహారభద్రత బోర్డును ఏర్పాటుచేయాలి, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్‌ను చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి గల సంస్థగా మార్చాలి, కనీస మద్దతు ధరలను ఉత్పత్తి వ్యయానికి కనీసం అదనంగా ఉత్పత్తి వ్యయంలో 50 శాతం కలిపి నిర్ణయించాలి.
-1986లో నూనె గింజల టెక్నాలజీ మిషన్‌ను ప్రారంభించారు.
-1996-97లో సత్వర నీటిపారుదల లబ్ధి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం రాష్ర్టాలకు రుణాలను అందజేస్తుంది. దీనిలో భాగంగా 1999-2000 కేంద్రం నుంచి రుణాలివ్వడం ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు