కొలువుల దోపిడీ బట్టబయలు
గిర్గ్లానీ కమిషన్ నివేదిక-సిఫారసులు
ఉల్లంఘన – 13 : హైదరాబాద్ నగరం
రాష్ట్రపతి ఉత్తర్వులో 7వ జోన్ భావన, ఫ్రీజోన్ అనే అంశాలు లేవు. హైదరాబాద్ సీటీ 7వ జోన్, ఫ్రీజోన్ కాదని, VIవ జోన్లో భాగమని హైకోర్టు తన తీర్పులో కూడా వెల్లడించింది. ఉద్యోగాల నియామకాలకు రాష్ట్రం మొత్తాన్ని ఆరు జోన్లుగా విభజించింది. ఆరు జోన్లకు మినహాయించిన భూభాగం లేదు. హైదరాబాద్ సిటీ VI జోన్లో భాగం. హైదరాబాద్ జిల్లాలో భాగం. కానీ ఆంధ్ర పాలకుల ఆధిపత్యంలోని ప్రభుత్వం ఉద్యోగ నియమకాలకు సంబంధించి రాష్ర్టాన్ని 7 స్థానిక ప్రాంతాలుగా విభజించింది. మొదటి 5 స్థానిక ప్రాంతాలుగా మొదటి 5 జోన్లను విభజించింది. VI వ జోన్‌ను రెండు స్థానిక ప్రాంతాలుగా విభజించింది. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ సిటీ మినహా మిగిలిన ప్రాంతాన్ని ఆరో స్థానిక ప్రాంతంగానూ, హైదరాబాద్ సిటీని 7వ స్థానిక ప్రాంతంగానూ విభజించి, దీనికి ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ క్యాడర్‌ను ఏర్పాటుచేయాలని పేర్కొన్నది. ఉద్యోగాల విషయంలో స్థానికుల రక్షణ కోసం హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ సిటీ, సిటీ మినహా మిగిలిన హైదరాబాద్ జిల్లా ప్రాంతాలుగా విభజించింది. హైదరాబాద్ సిటీ క్యాడర్ హైదరాబాద్ జిల్లా క్యాడర్‌కు సమానం. హైదరాబాద్ సిటీని ప్రత్యేక జోన్, ఫ్రీజోన్‌గా భావించి జరిగిన ఉద్యోగ నియమకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలుగా నివేదిక పేర్కొన్నది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా హైదరాబాద్ సిటీని VIIవ జోన్, ఫ్రీజోన్‌గా భావించి నియామకాలు చేసిన వారందరిని వారి, వారి జోన్లకూ తిరిగి పంపించి స్థానికులను నియమించాలని కమిషన్ సిఫారసు చేసింది.
ఉల్లంఘన 14: ఉపాధి కల్పనా కేంద్రాల పాత్ర
స్థానిక ఉపాధి కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఉంటే చాలు. అతన్ని స్థానికుడిగా భావించి ఉద్యోగంలో నియమించింది. అతని స్థానిక సర్టిఫికెట్లను పరిశీలించలేదు. ఉపాధి కల్పనా కేంద్రాలు కూడా అభ్యర్థుల స్థానిక సర్టిఫికెట్లను పరిశీలించలేదు. జిల్లాలో నివాసముంటున్నట్లుగా ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం లేక కొన్ని సందర్భాల్లో అభ్యర్థి తనకు తానుగా నివాసమంటున్నట్లుగా అడ్రస్ ఇస్తే చాలు, స్థానికుడిగా భావించి రిజిస్ట్రేషన్ చేసింది. కనీసం ఇచ్చిన అడ్రస్‌ను కూడా చెక్ చేయలేదు. విద్యా సర్టిఫికెట్లు కూడా సరియైనవా? నకిలీవా? అనేది కూడా పరిశీలన చేయలేదు. ఉద్యోగాల నియామకాలు జరిగేటప్పుడే వారి విద్యా సర్టిఫికెట్లు, స్థానిక ధ్రువపత్రాలు, ప్రామాణికతను పరిశీలించి, స్థానిక రిజర్వేషన్ కోటాను అమలు చేసే బాధ్యత నియామకాధికారులపై ఉంది.
ఉల్లంఘన 15 : నకిలీ సర్టిఫికెట్లు
స్థానికులను నియమించాల్సిన స్థానంలో స్థానికేతరుల నియామకాలకు నకిలీ సర్టిఫికెట్లు ఒక సాధనంగా మారాయి. విద్యా సర్టిఫికెట్లు స్థానిక సర్టిఫికెట్లలో నకిలీ కుంభకోణాలు వెలుగు చేశాయి. (గిర్గ్లానీ కమిషన్ ఏర్పడిన సమయానికి) ఉపాధ్యాయుల ఎంపిక సందర్భంలో రంగారెడ్డి జిల్లాలో 40 నకిలీ విద్య లేక తప్పుడు స్థానిక ధ్రువపత్రాలు పరిశీలనలో బయటపడ్డాయని కమిషన్ పేర్కొన్నది. సర్టిఫికెట్ల స్థానిక ప్రామాణికతను పరిశీలించాల్సిన బాధ్యత నియామక అధికారులదేనని కమిషన్ స్పష్టం చేసింది.
ఉల్లంఘన 16 : నియామకాలు
ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వును పాటించకుండా, స్థానిక ప్రామాణికతను పరిశీలించకుండా, స్థానిక రిజర్వ్డ్ కోటాను పరిగణనలోకి తీసుకోకుండా దీర్ఘకాలం తాత్కాలిక నియామకాలు జరిగాయి. తర్వాత వీరినే రెగ్యులరైజ్ చేశారు. ఇక్కడ రెండు రకాలుగా ఉల్లంఘనలు జరిగాయి. ఒకటి స్థానిక ధ్రువపత్రాన్ని పరిశీలించకపోవడం, రెండోది ఉపాధి కల్పనా కేంద్రాలు అభ్యర్థులు ఇచ్చిన స్థానిక అడ్రస్‌ను తీసుకున్నాయే తప్ప. ధ్రువపత్రం ప్రామాణికతను పరిశీలించలేదు. నియామకాధికారి పరిశీలించలేదు. ఈ విధమైన ఉల్లంఘన ద్వారా స్థానికేతరుల నియామకాలు జరిగాయని కమిషన్ అభిప్రాయపడింది.
ఉల్లంఘన 17 : నిరంతర తనిఖీ
నాలుగు విధాలైన శాఖలు లేదా నాలుగు రకాలైన పోస్టులున్నాయి. నియమితులైన అభ్యర్థుల నియామకాలు, కేటాయింపుల క్రమం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్నది లేనిది నిరంతరం దగ్గరగా పరిశీలించాలి.
-APPSC, DSCల పరిధికి బయట ఉంచిన శాఖలు, పోస్టులు : APPSC పరిధికి బయట ఉంచిన అన్ని శాఖలు తమ నియామక విధానాలను క్రమబద్దీకరించుకోవడం జరగలేదు. అందులో అనేక శాఖలు స్థానిక ఉపాధి కల్పనా కేంద్రాల ద్వారా నియామకాలు చేస్తున్నాయి. పట్టు పురుగుల పెంపకం శాఖకు రాష్ట్రపతి ఉత్తర్వు గురించిన విషయమే తెలియదు. ఈ శాఖలో గుమస్తాస్థాయి (ఫోర్‌మెన్) ఉద్యోగుల ట్రైనింగ్‌కు అభ్యర్థులను స్థానిక ఉపాధి కల్పనా కేంద్రాల ద్వారా V, VI జోన్లలోని కొన్ని జిల్లాల నుంచి తీసుకొంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరిని ఈ జోన్లలోని ఇతర జిల్లాలోనేకాక, ఇతర జోన్లలో కూడా నియమించింది. ఇతర శాఖలు కూడా ఇదే విధంగా అభ్యర్థుల స్థానిక ధ్రువపత్రాలు పరిశీలించకుండా, స్థానిక ఉపాధి కల్పనా కేంద్రాల ద్వారా నియమిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. విదేశీ సహాయంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖలో, అత్యవసరంగా చేపట్టాల్సిన విదేశీ సహాయ ప్రాజెక్టుల్లో నియామకాలకు ఐదేండ్లు APPSC పరిధి నుంచి మినహాయించారు. ఈ పథకాలను అమలు చేయడానికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నేరుగా నియమించుకోవడానికి 1991-95 మధ్య ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోస్టుల స్వభావం, స్థానిక క్యాడర్ అనేవి పరిగణనలోకి తీసుకోకుండా 694 మంది AEEలను వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల నుంచి నేరుగా ఇంజినీర్ ఇన్ చీఫ్ నియమించాడు. AEEలను ట్రైనర్ల నుంచి, వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి తీసుకొన్నాడు. ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వును మొత్తంగానే పక్కన పెట్టారు. దీని విషయంలో వివరాలను కమిషన్ కోరింది. స్థానికులకు 60 శాతం కోటాను అమలు చేశానని ఇంజినీర్ ఇన్ చీఫ్ జవాబు ఇచ్చాడు. స్థానికులు అంటే తప్పుగా అన్వయించుట జరిగింది. స్థానికంగా పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులను స్థానికులుగా భావించి నియమించాడు. వర్క్చార్జ్డ్ ఉద్యోగులను స్థానిక ధ్రువపత్రం ఆధారం నియమించకపోవడంతో ఇందులో ఎంతమంది నిజంగా స్థానికులనేది సందేహస్పదమైన విషయం అని గిర్గ్లానీ కమిషన్ పేర్కొంది.
-అనేక విభాగాలు కలిగి, కేంద్రీకృత క్యాడర్ కలిగిన శాఖలు నీటి పారుదల, ఇతర ఇంజినీరింగ్, పోలీసుశాఖలు ఈ విధమైన శాఖలు. ఉదా: నీటి పారుదల శాఖలో మొదట ఒక జోన్లో నియమించి తర్వాత మరో జోన్‌కు బదిలీ చేసింది. ఎందుకంటే APPSC మొదట కేటాయించినప్పుడు, ఆ జోన్లో ఖాళీలు లేవని, ఖాళీలు ఏర్పడిన తర్వాత కేటాయించిన జోన్‌కు మార్చడం జరిగిందని నీటి పారుదల శాఖ వివరించింది. ఉద్యోగుల తప్పుడు కేటాయింపుల్లో ఇది సముద్రంలో నీటిబొట్టు లాంటింది.
-కరీంనగర్ జిల్లాలో పోలీస్‌శాఖ నియామకాల్లో జరిగిన ఉల్లంఘనను నివేదిక ప్రస్తావించింది. రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం స్థానికేతరులకని తప్పుగా అర్థం చేసుకొని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నియామకాలు చేశాడు. 20 శాతం మెరిట్ అభ్యర్థులకే కానీ, స్థానికేతరులకు కేటాయించిన రిజర్వ్డ్ కోటా ఎంతమాత్రం కాదు అని కమిషన్ పేర్కొన్నది.
పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థలో..
-నోటిఫైడ్ కాని గ్రామపంచాయతీల్లో రెవెన్యూ పంచాయతీ విధులను నిర్వర్తించడానికి గ్రామ కార్యదర్శుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం ఉన్న ఆరు క్యాటగిరీల పోస్టుల నుంచి ఉద్యోగులను తీసుకొని గ్రామపంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఉత్తర్వులిచ్చింది.
ఈ ప్రభుత్వ ఉత్తర్వులో రాష్ట్రపతి ఉత్తర్వును ప్రస్తావించలేదు అందువల్ల. గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో స్థానికులకు రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం 80 శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయలేదేమోనని అనుమానాన్ని కమిషన్ వ్యక్తం చేసింది. ఉపాధి కల్పనా కేంద్రాల నుంచి నియమించే అభ్యర్థుల విషయంలో స్థానిక రిజర్వ్ కోటాను అమలు చేయాలని, స్థానికేతరులకు 20 శాతం రిజర్వ్డ్ కోటాలేదని గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకాలు సమీక్షించి, రాష్ట్రపతి ఉత్తర్వుకనుగుణంగా అమలు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.
ఉల్లంఘన 18 : ఇతర విధాలుగా ఉల్లంఘనలు
స్థానిక క్యాడర్లలో భర్తీకాని బ్యాగ్‌లాగ్ ఖాళీలను పూర్తిగా స్థానికులకు కేటాయించకుండా కొత్త నియామకాల పోస్టుల్లో కలిపి నియామకాలు జరిగాయి. అంటే బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా, మెరిట్ కోటా కింద 20 శాతం కేటాయించింది. ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, స్థానికులకు రిజర్వ్ చేసిన కోటాలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను 100 శాతం స్థానికులకే కేటాయించాలని నివేదిక స్పష్టం చేసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో వేలాదిమంది స్థానికేతరులను ఉపాధ్యాయులుగా నియమించింది. కానీ స్థానికేతరులు, గిరిజనేతరులను సర్వీసుల నుంచి తొలగించినట్లుగా కలెక్టర్ల నివేదికలు తెలుపుతున్నాయి. ఇవి నిజంగా అమలు జరిగాయా అనేది పరిశీలించాలని కమిషన్ కోరింది. ప్రభుత్వాస్పత్రుల్లో నర్సులుగా స్థానికులు లభ్యం కానుందున, స్థానికేతరులను రాష్ట్రపతి ఉత్తర్వుకు భిన్నంగా నియమించింది. ఒకవేళ శిక్షణ పొందిన స్థానికులు లభ్యం కానట్లయితే, తాత్కాలిక ప్రాతిపదికపై మాత్రమే స్థానికేతరులను నియమించాలని కమిషన్ వివరించింది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న నాన్‌గెజిటెడ్ పోస్టులుగా ఉన్న ట్యూటర్లు, డిమాన్స్ట్రేటర్ల పోస్టుల స్థానంలో జూనియర్ లెక్చరర్ పోస్టులు గెజిటెడ్ పోస్టులుగా మార్చింది. వీటిని అన్ని జోనల్ పోస్టులుగా గుర్తించి 60 శాతం స్థానికులకు కాలేజీ సర్వీస్ కమిషన్ కేటాయించింది. కానీ వాస్తవంగా పై పోస్టులు జోనల్ పరిధిలోకి తెచ్చి, 70 శాతం స్థానాలకు రిజర్వ్ కోటాను అమలు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లఘించి సాంకేతిక విద్యాశాఖలో స్థానికేతరులను నియమించారు. 1985లో గిరిజన ప్రాంతాలైన భద్రాచలంలో ప్రారంభించిన మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌ల్లో ఏర్పర్చిన లాస్ట్‌గ్రేడ్ సర్వీస్ పోస్టుల్లో స్థానికేతరులను ప్రిన్సిపాళ్లుగా నియమించారు. రాష్ట్రపతి ఉత్తర్వును ఉల్లంఘించి నియమించిన స్థానికేతరులను వారి ప్రాంతాలకు పంపించాలని, ఆ స్థానాల్లో స్థానికులను నియమించాలని కమిషన్ పేర్కొంది.
నివేదిక అందిన తర్వాత నష్టాన్ని తగ్గించే చర్యలు మొదట చేపట్టాలి. నివేదికలో ఎక్కడ పేర్కొన్నప్పటికీ ఇక ముందు ఉల్లంఘనలు జరుగకుండా వెంటనే నివారించాలి. ఉదాహరణకు శాఖాధిపతుల కార్యాలయాల్లో నిర్దిష్టంగా పేర్కొన్న గెజిటెడ్ పోస్టుల వరకు ఉన్న ఉద్యోగుల నుంచి నియామకాలు, ప్రమోషన్లు, ఇకముందు కూడా మార్చరాదు. ఇక ముందు కారుణ్య నియామకాలు, అదనపు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, తిరిగి కేటాయించడం, డిప్యూటేషన్లు మొదలైనవి ఆపాలి.
నివేదికలో పేర్కొన్న పరిష్కార చర్యల సలహాల ప్రతిపాదనలపై వెంటనే భవిష్యత్తుకు ఉపయోగపడే చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రపతి ఉత్తర్వు పరిధి నుంచి మినహాయించిన ఏఈఈ, డీఈఈ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వు పరిధిలోకి తేవాలి. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత స్థానిక క్యాడర్‌కు చెందిన పోస్టులను, శాఖకు బదిలీ చేసి స్థానికులను నియమించాలి. ప్రాజెక్టుల్లో రోజువారీ పనికి వినియోగిస్తున్న పోస్టులు స్థానిక క్యాడర్‌కు చెందినవైతే స్థానికులను నియమించాలి.
సాధారణంగా జరిగే నియామకాలు, ప్రమోషన్లకు ముందు నివేదికలో పేర్కొన్న వివిధ నిర్ధారణలో సూచించిన తప్పులను సరిదిద్దడంతో పాటు ఆ తప్పు జరుగకుండా చూసుకోవాలి.
వ్యక్తుల ఫిర్యాదులపై ఇచ్చిన తీర్పులపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలి.
నివేదికపై చర్యలు తీసుకోడానికి తగిన అమలు, పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలి.
దీర్ఘకాలిక, పర్యవేక్షణ సంస్థ వ్యక్తులను నియమించి, తగిన విధంగా దాన్ని బహిరంగ పర్చాలి. ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వు కమిషన్ నివేదికలోని చిక్కులను పరిశీలించాలి.
ఉద్యోగుల సర్వీసు రిజిష్టరు ఉద్యోగుల స్థానిక స్థితిని తెలపాలి. ఈ రిజిష్టరులో స్థానికస్థితిని తెలిపే విభాగం ఉండాలి. అందులో మొదట నియమించినప్పుడు జిల్లా లేదా జోనల్‌కు చెందిన క్యాడరా ? అనే విషయం స్పష్టంగా ఉండాలి. ఉద్యోగంలో చేరటానికి ముందు 7 ఏండ్లు ఎక్కడ చదివింది, నివాసం ఎక్కడ ఉన్నదీ వివరాలు ఉండాలి.
నియామక పత్రంలో ఎంపిక, కేటాయింపులకు సంబంధించిన విషయాలతో పాటు స్థానిక స్థితిని తెలిపే వివరాలు నియామక అధికారులు పొందుపర్చాలి.
ఉద్యోగుల గణాంక వివరాలపై వివరాల ఆధారంగా జిల్లా, జోన్లవారిగా, పోస్టుల వారిగా తయారు చేయాలి.
రాష్ట్రపతి ఉత్తర్వు అమలుపై నిఘా కోసం శాసనసభా కమిటీని ఏర్పాటు చేయాలి.
రాజకీయ కార్యనిర్వాహణ వర్గం స్థాయిలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చాలి.
రాష్ట్రపతి ఉత్తర్వు అమలును పర్యవేక్షించుటకు పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందువల్ల పర్యవేక్షణ సెల్ స్థానంలో అమలు,పర్యవేక్షణ సంస్థ (Implementation and Monitoring Authority-IMA)ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వు, సర్వీసు విషయాల్లో పరిజ్ఞానం కలిగి, గుర్తింపు ఉన్న వ్యక్తిని దీనికి అధికారిగా నియమించాలి. అతనికి తోడు శిక్షణ పొందిన నిపుణుల బృందం ఉండాలి. వీళ్లు రాష్ట్రపతి ఉత్తర్వు, దానికి అనుబంధంగా ఉన్న విషయాల్లో గట్టి శిక్షణ, వర్క్‌షాపుల ద్వారా నిష్ణాతులై ఉండాలి. రాష్ట్రపతి ఉత్తర్వు అమలుకు సంబంధించిన మార్గదర్శకసూత్రాల హ్యాండ్ బుక్ తయారు చేయాలి. ఈ హ్యాండ్‌బుక్‌కు కమిషన్ తుది నివేదిక అనుబంధంగా ఉండాలి.
కమిషన్ సిఫారసులు
రాష్ట్రపతి ఉత్తర్వు వెలువడిన నాటికి ఉన్న స్థానిక పోస్టుల స్వభావం, స్థానిక పోస్టుల సంఖ్య, రాష్ట్రపతి ఉత్తర్వు మూల పరిధి మారదని ఒక ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం నిర్దందంగా ప్రకటించడం రాష్ట్రపతి ఉత్తర్వుకు ప్రాథమిక రక్షణ అని కమిషన్ నివేదికలో పేర్కొన్నది. ఆ విధమైన ప్రకటన ఏ విధమైన రక్షణ వ్యవస్థకైనా పునాదిగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థాగత నిర్మాణంలో ఎటువంటి మార్పు, పోస్టుల హోదా లేదా పోస్టుల క్యాటగిరీల్లో మార్పులకు సంబంధించిన నిర్ణయం లేదా ప్రతిపాదనలు చేస్తున్నప్పుడు ఇవే పరీక్షకు ప్రామాణికంగా ఉంటాయి.
-ఒక పోస్టు వేతనం లేదా హోదా గెజిటెడ్ మారినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వు వెలువడినప్పుడు స్థానిక స్థితినే కొనసాగించాలి. దానికి స్థానిక స్వభావం మారదు. అంటే జిల్లా లేదా జోన్ లేదా అన్ని జోన్లకు సంబంధించిన రాష్ట్రస్థాయి ఏ స్థానిక స్థాయిలోఉంటే అదే విధంగా ఉండాలి. రిజర్వేషన్ కోటాలో మార్పు ఉండకూడదు. యధాతథ స్థానిక స్థితిని కొనసాగించాలి. ఏ విధంగా స్వభావంలో మార్పు చేయకూడదు. ఒకవేళ చేస్తే అది రాష్ట్రపతి ఉత్తర్వు, దాని ప్రాథమిక రక్షణల ఉల్లంఘనగా భావించాలి. సర్వీసు నిబంధనల్లో మార్పులు, పోస్టుల స్థానిక స్వభావంలో రిజర్వేషన్ కోటాలో మార్పులు చేయకూడదు.
-ప్రాంతీయ కార్యాలయం క్షేత్రకార్యాలయాలుగా మారినా లేక రద్దయినా ఆ ఉద్యోగుల పోస్టులను శాఖాధిపతి కార్యాలయానికి లేదా మరో చోటుకు మార్చినా వాటి స్థానిక స్వభావం, రిజర్వేషన్ కోటా మారకూడదు. రాష్ట్రపతి ఉత్తర్వు కింద అదే స్థానిక స్వభావం అదే రిజర్వ్డ్ కోటా ఆయా పోస్టులను కలిగి ఉండాలి.
-ఒక కార్యాలయం ఒక చోట నుంచి మరో జిల్లాకు మార్చినా అందులోకి పోస్టులు గత స్థానిక క్యాడర్- జిల్లా లేక జోనల్ స్థానిక స్వభావం కలిగి ఉండాలి. ఒక శాఖను విభజిస్తే ఉపశాఖలను శాఖలుగా పరగణించరాదు. మాతృశాఖ దాని మూల పోస్టుల సంఖ్య మాత్రమే. రాష్ట్రపతి ఉత్తర్వు నుంచి మినహాయించాలి. మిగిలిన పోస్టులన్నీ స్థానిక క్యాడర్‌కు చెందిన పోస్టులుగా పరిగణించాలి. ఒక శాఖలోని ఏదైనా భాగం, ప్రభుత్వేతర సంస్థకు బదలాయించినా, మార్చిన పోస్టులన్నింటినీ స్థానిక క్యాడర్ పోస్టులుగానే రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోనే కొనసాగించాలి. ఒక ప్రాజెక్టుకు బదిలీచేసిన పోస్టు అవసరం పూర్తయితే, దాన్ని తిరిగి పాత స్థానానికి బదిలీ చేయాలి. ఉల్లంఘనలకు దారీతిసిన పరిస్థితులు, కారణాలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రపతి ఉత్తర్వు అమలుకు సంబంధించిన తక్షణ, దీర్ఘకాలిక రక్షణ చర్యలు తీసుకోవాలి.
-వ్యక్తుల ఫిర్యాదులపై కమిషన్ విచారించి, ఇచ్చిన తీర్పుపై తక్షణం కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి.
-వివిధ ఉల్లంఘనలు పై కమిషన్ తన నివేదికలో పేర్కొన్న నిర్ధ్దారణలపై వెంటనే కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.
-కమిషన్ పేర్కొన్న నిర్ధారణలో తీవ్రమైన అశ్రద్ధ, నిర్లక్ష్యం, పక్షపాతం, అభిమానం, దురుద్దేశాలతో జరిగిన ఉల్లంఘనలను మొండిగా కొనసాగించిన సూచనలు ఏ అధికారి వైపు నుంచి కనిపించినా, దానికి బాధ్యుడైన అధికారి లేక అధికారులపై, వాటిని గట్టిగా నిరోధించి చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, పర్యవేక్షణ సంస్థ కర్తవ్యాలు
-పాలనా వ్యవస్థలోని ఏభాగంలోనైనా మార్పులకు ఏవిధమైన ప్రతిపాదనలు వచ్చినా వాటిని నిశితంగా పరిశీలించాలి.
-భారీ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పోస్టులను ప్రతినెలా పర్యవేక్షించాలి. ప్రాజెక్టుల్లో పనికాకుండా, రోజువారి పనిచూసే స్థానిక క్యాడర్‌కు చెందిన పోస్టులు, ఆ శాఖకు బదిలీ చేయాలి. లేదా వాటిల్లో స్థానికులను నియమించాలి. సూటిగా చెప్పాలంటే రాష్ట్రపతి ఉత్తర్వు అమలు, నివేదిక అమలు స్థానికుల ప్రయోజనాల రక్షణ జరిగేటట్లు చూడాలి.
-క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు కోరితే అప్పడు సమగ్రమైన నివేదికను అందించాలి.
-సాధారణ పరిపాలన శాఖ(Six Point Formula-SPF) ఉద్యోగుల సంఖ్యలోనే కాక, ఆరు అంశాల కార్యకమంతో పాటు, రాష్ట్రపతి ఉత్తర్వు, ఈ నివేదికతో పాటు, సత్సంబంధిత నివేదికలు, డాక్యుమెంట్లపై గట్టి శిక్షణపొందడం అవసరం.
-పాలనా వ్యవస్థ లేదా ఉద్యోగుల విషయాల్లో ఏ చిన్న మార్పునైనా, అమలు పర్యవేక్షణ సంస్థ అభిప్రాయాన్ని సాధారణ పాలనాశాఖ(SPF) తప్పనిసరిగా తీసుకున్న తర్వాత మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలి. సాధారణ పాలనాశాఖ(SPF) కూడా ఇప్పటి వరకు నిర్వహించిన సలహాపాత్రను విడనాడి, ఆరు అంశాల కార్యక్రమం, రెండు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని అన్ని అంశాలను అమలు చేసే విధంగా కేంద్రశాఖలో ్ల(Modal Agency) పాత్రను నిర్వహించాలి.
-అమలు, పర్యవేక్షణ సంస్థ సాధారణ పాలనాశాఖ(SPF) అభిప్రాయాల్లో ఏ శాఖ అయినా విభేదిస్తే, దాన్ని సీఎంకు పంపించి, అతని నిర్ణయానికి విడిచిపెట్టాలి. సీఎం దానిపై తన నిర్ణయం తీసుకోవచ్చు లేదా క్యాబినెట్ సబ్ కమిటీకి పంపవచ్చు. లేదా క్యాబినెట్లోనే చర్చించవచ్చు.
-రాష్ట్రపతి ఉత్తర్వు, దానికి సంబంధించిన విషయాలు, కమిషన్ నివేదికలపై స్పష్టమైన అవగాహన కలిగించుటకు ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలు శిక్షణ, వర్క్‌షాపు కార్యక్రమాలను నిర్వహించాలి.
-ప్రభుత్వపాలనా యంత్రాంగం కింద నుంచి పై వరకు అందరికి రాష్ట్రపతి ఉత్తర్వును, దానికి సంబంధించిన విషయాల గురించిన అవగాహన ఉండాలి. జిల్లా, రాష్ట్రస్థాయిలోని అధికారులకు ఈ విషయాల్లో అవగాహన కలిగించుటకు శిక్షణ, వర్క్‌షాపులను నిర్వహించాలి. ప్రభుత్వంలోని రాజకీయ పార్టీలు లేదా పైన పేర్కొన్న శాసనసభా కమిటీ లేదా ప్రభుత్వం కూడా శిక్షణ కోసం వర్క్‌షాపును నిర్వహించాలి.
-రాష్ట్రపతి ఉత్తర్వు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలి. ప్రభుత్వం ఇష్టపడితే తుది నివేదికను కూడా అందులో ఉంచవచ్చు. మార్గదర్శక సూత్రాల పుస్తకాన్ని తప్పక ఉంచాలి. ఈ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు అందులో ఉంచాలి. ఇది అనుమానాలు, ప్రచారాలు, ఊహలను తొలగించి, విశ్వాసాన్ని, ఆశలను కల్పిస్తుంది.
-మార్గదర్శక పుస్తకంగా విషయాలను తెలుసుకోడానికి, మార్గదర్శకంగా ఉండటానికి అన్ని శాఖలు, సెక్రటేరియట్ శాఖలు, జిల్లా కలెక్టర్లకు తుది నివేదికను అందుబాటులో ఉంచాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు