హైదరాబాద్ రాజ్యంలో సాంఘిక సంస్కరణోద్యమాలు
తెలంగాణ ప్రాంతంలో ఒకవైపు దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలు, మరొపక్క రజాకార్ల దౌర్జన్యాలు కొనసాగడంతో స్త్రీలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వెనుకబడి ఉన్నాయి. ప్రజల్ని చైతన్యం చేయడం కోసం గ్రంథాలయోద్యమం, ఆంధ్రజన కేంద్ర సంఘం, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజ్ వంటి సంస్థలు అవిరళమైన కృషి చేశాయి. ఆర్య సమాజం హిందూ మత పటిష్టత కోసం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ సంస్థల కృషితో రాజకీయ చైతన్యం, మహిళా చైతన్యం పెరిగింది. మరోవైపు మజ్లీస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్, కార్యకలాపాలు, అనల్‌మాలిక్, తబ్లీగ్ మొదలైన కార్యక్రమాలు, రజాకార్ల దురాగతాలు, మతోన్మాదం, దీన్దార్ ఉద్యమం, ఇస్లాహుల్ ముస్లిమీన్ అనే ముస్లిం సంస్కరణ కార్యక్రమాలు హైదరాబాద్ రాజ్యంలో జరిగాయి.
స్త్రీల పరిస్థితి-సాంఘిక దురాచారాలు
క్రీ.శ. 1935లో ఆంధ్ర మహిళాసభకు అధ్యక్షురాలిగా వ్యవహరించిన జోగినేపల్లి రాధాబాయమ్మ మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలే, స్త్రీల మానసిక, ఆర్థిక అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని, స్త్రీలు ఎక్కడ చైతన్యవంతులై స్వతంత్రులవుతారేమోనని భయంతో నాటి సమాజం వారికి విద్యను దూరం చేసిందని పేర్కొన్నారు.
బాల్యవివాహాలు
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరపడం అనే సాంఘిక దురాచారం ఉంది. పది సంవత్సరాల్లోపు బాలికలకు ఎక్కువ వయస్సున్న వారితో పెళ్లి జరిపించేవారు. క్రీ.శ. 1911లో హైదరాబాద్‌లో 6,799 మంది వితంతువులు ఉన్నారు. చిన్న వయస్సులోనే తల్లులుకావడం, ప్రసవ సమయంలో కష్టాలు ఎదుర్కొవడం అంటే కొన్ని సందర్భాల్లో చనిపోవడం జరుగుతుండేది. ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చేవి. తత్ఫలితంగా స్త్రీ, పురుష నిష్పత్తిలో తారతమ్యాలు కనిపిస్తుండేవి.
నిర్బంధ వైధవ్యం
అనారోగ్య కారాణాలు, వృద్ధాప్యంతోగానీ భర్తలు చనిపోతే చిన్న వయస్సులోనే బాలికలు నిర్బంధ వైధవ్యం అనుభవించాల్సిన దుస్థితి నాటి సమాజంలో నెలకొని ఉండేది. క్రీ.శ. 1911 నాటికి 17,979 మంది బాలికలు 15 ఏండ్లలోపు, 6,799 మంది బాలికలు పదేండ్లలోపు నిర్బంధ వైధవ్యం అనుభవిస్తున్నారు. విద్య ఎక్కువగా లేకపోవడం తద్వారా ప్రజల్లో చైతన్యం కొరవడటం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
బహుభార్యత్వం
నాటి సమాజంలో బహుభార్యత్వం అనే సాంఘిక దూరాచారం కూడా ఉండేది. దీని ప్రకారం ఒక వ్యక్తి అనేకమంది స్త్రీలను పెళ్లి చేసుకొనేవారు. ముఖ్యంగా ఈ ఆచారం ముస్లింలలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉన్నతవర్గాల్లో కూడా ఉండేది.
పరదా పద్ధతి
పరదా పద్ధతి అనే ఆచారం ముస్లింలతోపాటు, దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, వెలమ, రెడ్డి, కమ్మ, కాపు మొదలైన వర్గాల్లో కనిపించేది. ఈ సాంఘిక దురాచారం స్త్రీలను కట్టడి చేసింది. తద్వారా స్త్రీలు అనేక ఇక్కట్లకు గురయ్యారు.
వరకట్నం-కన్యాశుల్కం
ముఖ్యంగా ఉన్నతవర్గాల్లో ఈ ఆచారాలు ఎక్కువగా కనిపించేవి.
బాలికల శ్రమదోపిడీ
తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల ఆధిపత్యం కొనసాగింది. భూస్వాముల దోపిడీ కొనసాగింది. భూస్వాముల ఇళ్లలో బాలికల్ని దాసీలుగా నియమించుకొని, వారి శ్రమను దోపిడీ చేసే సాంఘిక దూరాచారం ఉండేది. భూస్వాముల ఇళ్లలో జరిగే వారి కూతుళ్ల, చెల్లెళ్ల పెళ్లిళ్ల్ల పనులు చేయడం కోసం బాలికలను పని మనుషులుగా ఉపయోగించేవారు. వివాహమైన తర్వాత పెళ్లికూతుళ్ల వెంట బాలికలను వారివారి భర్తల ఇళ్లకు పంపేవారు. అలా పంపిన బాలికల శ్రమదోపిడీ చేయడమే కాకుండా, వారిని శారీరకంగా కూడా ఉపయోగించేవారు భూస్వాములు.
జోగినీ సంప్రదాయం
తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ మొదలైన జిల్లాల్లో ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా దళిత కుటుంబాలకు చెందిన బాలికల్ని చిన్న వయస్సులోనే గ్రామదేవతకు అంకితమిచ్చే పద్ధతి ఉండేది. ఈ విధంగా బాలికల హక్కుల్ని హరించారు.
విద్య, వైద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం
ముఖ్యంగా మీర్‌మహబూబ్ అలీఖాన్, ఉస్మాన్ అలీఖాన్‌ల కాలంలో పారశీక, ఉర్దూ భాషలకు ఆదరణ లభించింది. తెలుగు భాష నిరాదరణకు గురైంది. సాలార్జంగ్ కృషితో ప్రాచ్య విద్యావ్యాప్తి జరిగింది. క్రీ.శ. 1884లో ఉర్దూ భాషను అధికార భాషగా ప్రకటించారు. పాలనాభాషగా, బోధనాభాషగా ఉర్దూభాష ఆధిపత్యాన్ని వహించింది. క్రీ.శ. 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఉర్దూయే భోదనా భాషగా ఉండేది. ప్రజల్లో మూఢాచారాలు, కుల వివక్ష, హిందువుల్లో బాల్యవివాహాలు, ముస్లింలలో పరదాపద్ధతి, ఉన్నతవర్గాల కుటుంబాల్లో పరదా పద్ధతి మొదలైన దుస్సంప్రదాయాలు ఉండేవి. జమీందార్లు ప్రైవేట్ విద్యను ఆశ్రయించేవారు. 1933-34లలో నిజాం ప్రభుత్వం వయోజన విద్యను ప్రోత్సహించింది. 19వ శతాబ్దం మొదటి భాగం వరకు ప్రజారోగ్య వసతులు ఎక్కువగా లేవు. నాటువైద్యం, మంత్రాలు మొదలైనవి కూడా ఉండేవి. ఆయుర్వేదం అమలులో ఉండేది. క్రీ.శ. 1944లో వైద్యశాఖ ఏర్పడింది. క్రీ.శ. 1921లో పారిశుద్ధ్యశాఖ ఏర్పాటుచేసింది. క్రీ.శ. 1938లో ఆయుర్వేద విభాగం పునర్వ్యవస్థీకరణ జరిగింది. కలరా, మసూచి వ్యాధుల నివారణ కోసం చర్యలు తీసుకుంది. క్రీ.శ. 1940 నుంచి క్షయ నివారణ కోసం చర్యలు తీసుకుంది.
మతం-సాంఘిక ఆచారాలు
మంత్రతంత్రాలు, కులం, వెలివేయడం, బాల్యవివాహాలు, బానిసత్వం, అంటరానితనం మొదలైన సామాజిక దురాచారాలు ఉండేవి. నిజాం రాజ్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, శైవులు కలసిమెలసి జీవించేవారు. గ్రామాల్లో గ్రామదేవతలు ఉండేవారు. పోతరాజు, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ దేవతల్ని ఆరాధించడం, బోనాల ఉత్సవాలు, కల్లు శాకపోయడం, జంతుబలులుండేవి. భాగవతులు, గొల్లసుద్దులు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు మొదలైనవి ప్రజల వినోదాలు.
గ్రంథాలయోద్యమం
అసఫ్‌జాహీల పాలనాకాలంలో ప్రజలకు వాక్, సభా, పత్రికా స్వాతంత్య్రాలు పెద్దగా ఉండేవి కావు. ప్రజలకు రాజకీయ హక్కులు లేవు. 20వ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయాన్ని కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజా నాయిని వెంకటరావు మొదలైనవారు స్థాపించారు. అదే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషానిలయం (క్రీ.శ. 1901). మడపాటి హన్మంతరావు ఈ గ్రంథాలయంలో సభ్యుడిగా చేరి క్రీ.శ. 1914-15లో కార్యదర్శిగా ఎన్నికై గ్రంథాలయాభివృద్ధికి కృషి చేశారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం, శ్రీ రాజరాజానరేంద్ర ఆంధ్రభాషా నిలయం, ఆంధ్ర సంవర్థినీ గ్రంథాలయం, విజ్ఞాన చంద్రికామండలి మొదలైనవి ప్రజల చైతన్యానికి కారణమయ్యాయి. గ్రంథాలయాల స్థాపనలో గౌలిగూడ బాల సరస్వతి, మాడపాటి హన్మంతరావు, కొండా వెంకటరంగారెడ్డి మొదలైనవారు అవిరళ కృషి చేశారు. గ్రంథాలయాలు పాఠశాలలుగా కూడా పనిచేశాయి. బాలసరస్వతి పాఠశాల, కన్యాపాఠశాల, భాగ్యరెడ్డివర్మ స్థాపించిన ఆది ఆంధ్ర బాలికల పాఠశాల మొదలైనవి బాలికల విద్య కోసం కృషి చేశాయి.
అఘోరనాథ చటోపాధ్యాయ
క్రీ.శ. 1878లో యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అసొసియేషన్ స్థాపించాడు. అఘోరనాథ చటోపాధ్యాయ. ఈ సంస్థ గ్రంథాలయాలు స్థాపించి, సాంఘిక విషయాలు చర్చించి మూఢనమ్మకాల్ని పారదొలే ప్రయత్నం చేసింది.
ముల్లా అబ్దుల్ ఖయ్యూం
స్త్రీ విద్య కోసం కృషి చేశాడు. ఇక్వాస్ ఉన్నీసా అనే పత్రిక ద్వారా స్త్రీల విద్యకోసం కృషి చేశాడు.
హైదరాబాద్ రికార్డ్
ఈ పత్రిక హైదరాబాద్ సంస్థాన ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. హైదరాబాద్ రెసిడెంట్‌ను స్థానిక సీజర్ అని పేర్కొన్నందుకు బ్రిటీష్ రెసిడెన్సీ ఆ పత్రికను నిలిపివేసింది.
సరోజిని విలాస్ తెలుగులో ప్రచురించిన పత్రిక. క్రీ.శ. 1912లో మహబూబ్‌నగర్‌లోని గ్రామం నుంచి వెలువడింది. దీనిని శ్రీనివాసశర్మ నిర్వహించాడు.
-గోల్కొండ (1925) : మాడపాటి హనుమంతరావు – (సురవరం ప్రతాపరెడ్డి సంపాదకుడు)
-నీలగిరి పత్రిక (1922) : ఎస్వి. వెంకటనరసింహరావు (నల్లగొండ నుంచి వెలువడిన తొలి రాజకీయ పత్రిక)
-పత్రిక (1920) : బద్దిరాజు సీతారామచంద్రరావు – ఇన్గుర్తి (వరంగల్ జిల్లా) నుంచి వెలువడింది.
మధుసూదన్. బి
సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ హిస్టరీ
హైదరాబాద్
9440082663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు