విస్మృత వీరులు
ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిన తెలంగాణ మహనీయుల చరిత్ర
ఈ నేలలో ఎందరో త్యాగధనుల చరిత్ర వెలుగులోకి రావాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమంలో విస్మృత వీరులు, విస్మృత సాహిత్యంపై విస్తారంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు పొడుచుకొచ్చాయి. విస్మృత వీరులను, విస్మృత సాహిత్యాన్ని ఉద్యమ సమయంలో తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు బహిరంగ వేదికలపై చర్చించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఆ వీరులను, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. వెలికితీసేందుకు పరిశోధనలు చేయాలి. చరిత్ర, సంస్కృతి, సామాజిక శాస్ర్తాలు మన అభివృద్ధికి ప్రాణాలని తెలంగాణ ఉద్యమం చాటిచెప్పింది. ఎవరైతే చరిత్రను సామాజిక అవసరంగా భావించి అధ్యయనం చేస్తారో, ఆ దారుల్లో నడుస్తూ ఎవరైతే ముందుకు సాగుతారో వారు మాత్రమే కొత్త చరిత్రను సృష్టించగలరు. తెలంగాణ నేలలోని 1 లక్షా 15 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని చరిత్రను అవలోకనం చేసుకుంటే ఎంత చరిత్ర కప్పివేయబడిందో అర్థమవుతుంది.
రావెళ్ల వెంకట రామారావు
తెలంగాణ మాతృగీతిక అయిన
కదనాన శత్రువుల
కుత్తుకల నవలీల
నుత్తరించిన బలో
న్మత్తు లేలిన భూమి
వీరులకు కాణాచిరా!
తెలగాణ
దీరులకు మొగసాలరా!
అబలయని దేశమును
కబళింప తలపడిన
పరరాజులకు, స్త్రీల
పటు శౌర్యమును జూపి
రాజ్యతంత్రము నడిపెరా!
తెలగాణ
రాణి రుద్రమదేవిరా!…
అంటూ తన జీవితాన్నే అభ్యుదయ కావ్యంగా మలుచుకొని పోతన వారసత్వంతో సహజ కవిత్వాన్ని పండించి తెలంగాణ తొలి దశ పోరాటానికి మాతృగీతాన్ని అందించిన రావెళ్ల వెంకట రామారావు ఈ తరానికి తెలియదు. ఆయన గొప్ప సాహిత్యాన్ని సృష్టించి ప్రజలను కదిలించారు. ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఈ పాటే ఊపిరయ్యిందని ప్రొఫెసర్ జయశంకర్ పదే పదే చెప్పారు. రావెళ్ల తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ భావాల వైపు మళ్లారు. రైతు కూలీ పరివారంలో ఖమ్మం జిల్లాలోని పల్లెటూరు గోకినపల్లి గ్రామంలో 1931లో పుట్టారు. 1948 నుంచి 1952 వరకు జైలు జీవితాన్ని గడిపారు. ఆయన రాగజ్యోతులు (గేయసంపుటి), జీవనరాగం (ఖండకావ్యం) నవ ప్రచురణలు (కవిత్వం), అనలతల్పపు (గేయకవిత్వం), పల్లెభారతి (పాటలు), తాండవహేల (శివస్తవ రూపక కావ్యం) రచనలు చేశారు.
ఉప్పల మలుసూరు
నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల పక్షాన నిలబడి సేవచేసి చివరకు చెప్పులు కుట్టుకుంటూ జీవించిన ఉప్పల మలుసూరులాంటి నాయకుడు భారతదేశంలో ఉన్న అతికొద్దిమందిలో ఒకరు. ఎమ్మెల్యే జీతాన్ని పార్టీకే ఇచ్చి క్రమశిక్షణ గల ప్రజానాయకుడిగా నిలిచిన ఈ దళితనాయకుడి చరిత్ర రాష్ట్రం వచ్చాక మాత్రమే పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది.
కొమురం భీమ్
గిరిజనుల హక్కుల కోసం, సహజవనరుల సంరక్షణ కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతో, ఇటు నిజాం ప్రభుత్వంతో పోరాటం చేసిన గిరిజన వీరుడు కొమురం భీవ్‌ు. ఈయన పోరాటం ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా, గిరిజన చైతన్యానికి, సమాజ వికాసానికి తోడ్పడింది. జల్, జంగల్, జమీన్ పోరాటానికి శ్రీకారం చుట్టిన వీరుల్లో కొమురం భీవ్‌ు అగ్రభాగంలో నిలుస్తారు. ఆయన పోరాడిన ప్రాంతంగా జోడేషూట్ చరిత్రలో నిలిచిపోయింది. గిరిజన తెగల నుంచి దూసుకువచ్చిన యోధులు భీవ్‌ు.
సర్దార్ జమలాపురం కేశవరావు
ఆనాటి హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యులు. ఈయన కొంతకాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయనకున్న పలుకుబడికి గుర్తుగా సర్దార్ అని ప్రేమగా పిలిచేవారు. ప్రజాస్వామ్యం పైన ఆయనకు గొప్ప విశ్వాసం ఉంది. అటు స్వాతంత్య్ర పోరాటంలో ఇటు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆయన జీవించింది 45 ఏండ్లు మాత్రమే. తక్కువ సమయంలోనే ఆయన ప్రజల కోసం పనిచేశారు. నెహ్రూ తొలి ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో రజాకార్లను ఎదుర్కొన్న వాళ్లలో జమలాపురం ప్రముఖుడిగా నిలిచారు.
టీఎన్ సదాలక్ష్మి
1969 తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించారు. తన బంగారు, వెండి నగలను అమ్మి ఉద్యమ నిధిని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించిన వీర తెలంగాణావాది. దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రి. నేనే బలాన్ని అని ఆమె ఆత్మకథను ప్రకటించారు. ఈమె ఆత్మకథను గోగు శ్యామల అక్షరీకరించారు.
సుమిత్రాదేవి
భాగ్యనగరం నుంచి నాలుగు సార్లు గెలిచిన దళిత మహిళా ఎమ్మెల్యే, పేదల నాయకురాలు సుమిత్రాదేవి. హైదరాబాద్ నగరంలో అనేక అభ్యుదయ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. ఆమె స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఆమె చరిత్ర ఈ తరానికి తెలియదు. 1951లో హైదరాబాద్ నగర పురపాలక సంఘానికి కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికై 1954లో ఉపాధ్యక్షురాలయింది. ఆమె పలు హోదాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో రాజేంద్రనగర్‌లో 500 మంది దళితులకు ఇళ్లు కట్టించడానికి ఎంతో శ్రమించారు. 60 మంచినీటి బావులు, చెరువులు తవ్వించి దళితులను మంచినీటి కరువు నుంచి బయటపడేశారు. ఉప్పల్ గ్రామంలో చర్మ శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు. ఉపన్యాసాలివ్వడమే కాకుండా జీవితంలో ఆచరించి చూపిన నాయకురాలిగా చరిత్రలో నిలిచిపోతారు. దళిత జాతుల పిల్లలందరూ విద్యావంతులవ్వాలని ఆమె తపించారు.
కృష్ణస్వామి ముదిరాజ్
ఈయన ఒకనాటి హైదరాబాద్ మేయర్. బహుజన వర్గాల్లో చైతన్యం రగిలించి సామాజిక, రాజకీయ ఉద్యమాలకు పునాది వేశారు. ఈయన రచయిత, జర్నలిస్టు, విద్యాసంస్థల స్థాపకుడు, దార్శనికులు. హైదరాబాద్ మేయర్‌గా నగరాన్ని తీర్చిదిద్ది రాబోయే కాలానికనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన భవిష్యత్ స్వాప్నికులు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించారు. హైదరాబాద్‌ను 1000 ఫొటోలతో పిక్టోరియల్ హైదరాబాద్ అనే విలువైన గ్రంథాన్ని చరిత్రకు అందించారు. దళితులు, బహుజనులు కలిసి ఉద్యమించాలని తొలి పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల సంక్షేమం కోసం కృషిచేశారు. స్వాతంత్రోద్యమ చరిత్ర రచించే సంఘంలో ఈయన కీలక సభ్యుడిగా వ్యవహరించారు.
సంగెం లక్ష్మీబాయి
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన తెలంగాణ ప్రథమ మహిళ, వినోభా భూదానోద్యమంలో పాల్గొన్న తొలి మహిళ సంగెం లక్ష్మీబాయి చరిత్రను ఈ తరం తెలుసుకోవాలి. ఈమె బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 15 ఏళ్లు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథను రాశారు. తన జీవితాన్ని స్త్రీల అభ్యున్నతి కోసం అంకితమిచ్చారు.
మల్లినాథ సూరి
కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యాన చక్రవర్తిగా నిలిచిన మల్లినాథ సూరికి రావాల్సినంత పేరు రాలేదు. మల్లినాథుని వ్యాఖ్యానం లేకపోతే కాళిదాసు కావ్యాలు ఇంతగా జనంలోకి వచ్చేవి కావు.
చందాల కేశవదాసు
పరబ్రహ్మ పరమేశ్వర శ్లోకం చదవకుండా రంగస్థలం ప్రారంభం కాదు. ఆ శ్లోకమే కాకుండా వెండితెరకు తొలి సినిమా పాట రాసిన చందాల కేశవదాసు విస్మరణకు గురయ్యారు. భక్త ప్రహ్లాద చిత్రంలో తొలి సినిమా గేయం..
పరితాప భారంబు భరియింపు తరమా
కటకటనే విధి గడువంగ జాలదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా….. ॥పరి॥
ఈ వేషం నేనెటులను
తనయుని త్రావింపగలను?
ధర్మం కాపాడుదునా?
తనయుని కావగలనా? ॥పరి॥
కౌముది
తన కావ్యాలతో చైతన్యాన్ని రగిల్చి మతసామరస్యానికి గుర్తుగా నిలిచిన కౌముదిని చరిత్ర మరిచింది. అల్విదా అనే కవితా సంపుటిని రాశారు. ఉర్దూ, హిందీ నుంచి తెలుగులోకి అనేక అనువాదాలు చేసిన ఆయన మంచి జర్నలిస్టు. ఖమ్మం జిల్లాలో సాహిత్య చైతన్యానికి కృషి చేశారు. కౌముది అసలు పేరు హంసుద్దీన్.
హీరాలాల్ మోరియా
నిర్బంధాలను ఎదుర్కొన్న హీరాలాల్ మోరియాను కనుమరుగు చేశారు. సృజనాత్మక రచనలు చేసి తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
కవిరాజమూర్తి
ఖమ్మం స్తంభాద్రిలో కంఠం విప్పిన కవిరాజమూర్తిని ఆధిపత్య సంస్కృతి కప్పేసింది. ఈయన ప్రణతి, మహైక, మానవ సంగీతం దీర్ఘకవితలు రాశారు. మై గరీబ్ హూ నవలను, కథలు, వ్యాసాలు, అనువాద సాహిత్యం రాశారు.
గంగాపురం హనుమశ్శాస్త్రి
మహబూబ్‌నగర్‌కు చెందిన గంగాపురం హనుమశ్శాస్త్రి దుందుభి కావ్య గానం చేశారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసి సాహిత్య సేవతోపాటు సామాజిక సేవకునిగా రాణించారు.
మామిండ్ల రామాగౌడ్
మామిండ్ల రామాగౌడ్ తెలుగు పద్యంపై ప్రేమతో విద్యార్థి దశనుంచే రచనలు చేశారు. రసతరంగిణి ఖండకావ్యం, గౌడప్రబోధం, కవి గౌడప్ప శతకాలు రచించారు. సుకవి సుధాకర, మధురకవి, కవికోకిల వంటి బిరుదులను పొందారు. కాకి గొప్పతనాన్ని చాటిచెబుతూ వాయసం అనే గొప్ప కవితాఖండికను రచించారు.
కూరెళ్ల విఠలాచార్య
నల్లగొండ ఎర్ర సెలకల్లో ప్రభవించిన కూరెళ్ల విఠలాచార్య విఠలేశ్వర శతకం రాశారు. అభినవ పోతన బిరుదాంకితులు. స్వాతంత్య్రోద్యమ నవలలపై సిద్ధాంత వ్యాసం ప్రకటించారు. తెలుగులో గొలుసుకట్టు నవలలపై పరిశోధన చేశారు. కాన్ఫిడెన్షియల్ రిపోర్టు అనే కవితా సంకలనాన్ని వెలువరించారు.
గింజల నర్సింహారెడ్డి
గింజల నర్సింహారెడ్డి మధురమైన పద్యాన్ని ఆశువుగా చెప్పడంలో ప్రసిద్ధుడు. పొక్కిలి కవిత్వ సంకలనంలో ఈయన కవిత ఉంది.
ఆచ్చి వెంకటాచార్యులు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఆచ్చి వెంకటాచార్యులు మాఊరు అనే ఏకశ్వాసా ప్రబంధం రాశారు. ఆండాళ్ బుర్రకథ, రాగమాల ఈయన రచనలు. కరీంనగర్ జిల్లా ఆవునూరు గ్రామంలో జన్మించారు. చెరువును నిండు గంగాళంతో పోల్చిన కవి. తెలంగాణ పలుకుబళ్లతో పల్లె తల్లిని వర్ణించారు.
టీ కృష్ణమూర్తియాదవ్
వచన కవిత్వంలో తెలంగాణ భాషా సౌందర్యం చూపిన కవి కృష్ణమూర్తియాదవ్ తొక్కుడుబండ కావ్యం రాశారు. మధ్యతరగతి జీవితంలోని విభిన్న కోణాలను కవిత్వీకరించారు. తెలంగాణ భాషలో, యాసలో కవిత్వాన్ని నూరారు. షబ్నం అనే కవితా సంపుటి రచించారు.
ముద్దు రామకృష్ణయ్య
50వ దశకంలో ఆసియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాలన్నింటిలో అనేక దేశాలు పర్యటించారు. ఆయా దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేశారు. భారతదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడానికి కారణభూతుడయ్యారు. తన విదేశీ పర్యటనల అనుభవాలను నా ప్రథమ విదేశీయాత్ర అనే యాత్రా చరిత్రను రాశారు. ఆదర్శనీయమైన విద్యావిధానాలతో క్రమశిక్షణకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే విద్యా ఉద్యమాన్ని చైతన్యవంతంగా నడిపించిన గొప్ప విద్యావేత్త. సముద్ర ప్రయాణాన్ని జీవిత చరిత్రగా రాసి యాత్రా చరిత్రకు పట్టాభిషేకం చేసిన ముద్దు రామకృష్ణయ్యను చరిత్ర మరిచింది.
పల్లా దుర్గయ్య
వరంగల్ జిల్లా మడికొండ పల్లా దుర్గయ్య జన్మ స్థలం. పాలవెల్లి, గంగిరెద్దులు ఈయన రచనల్లో ప్రమఖమైనవి. ఈయన రచనల్లో హాస్యం పొదిగి ఉంది. తెలంగాణ సంస్కృతి, జీవన విధానం ఈయన రచనల్లో కనిపిస్తుంది.
శేషం లక్ష్మీనారాయణాచార్య
ఈయన ఊరు కరీంనగర్ జిల్లా నగునూరు. స్వరభారతి గేయ సంకలనం, దైవభక్తి, దేశభక్తి గీతాలను విరివిగా రాశారు. పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు చెబుతూ గేయాలు రాశారు.
ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు
ఈయన నల్గొండ జిల్లా మునగాలకు చెందిన కవి. గోదాదేవి, గోదావరి, సత్యవతీస్వాంత్వం, మారుతి, యాదగిరి లక్ష్మీ నర్సింహ శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం వంటి రచనలు చేశారు. విద్వత్ కవిగా జనుల హృదయాల్లో నిలిచారు. ఈయన రాసిన శ్రీ వెంకటేశ్వర శతకం మరువకూడదు
టీవీ నారాయణ
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా కూడా సేవలందించారు. జీవన వేదం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం కవితా సంపుటాలు వెలువరించారు. హైదరాబాద్‌కు చెందిన డా. టీవీ నారాయణ 1935లో హర్షపుత్ర శతకం రాశారు. అనేక వ్యాస సంపుటాలు వెలువరించారు.
సూరోజు బాలనర్సింహా చారి
పద్యాన్ని మధురంగా ఆలపించటంలో మేటి. వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర రాశారు. సహజకవిగా పేరుపొందారు. నల్లగొండకు చెందిన ఈయన బాల నృసింహశతకం రాశారు.
శిరశినగల్ కృష్ణమాచార్యులు
నిజామాబాద్‌కు చెందిన ఈయన రత్నమాల ఖండకావ్యం రాశారు. అభినవ కాళిదాసు, నైజాం రాష్ట్ర ఆద్యశతావధాని.
కౌకుంట్ల నారాయణరావు
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈయన ప్రభుతనయ శతకం రాశారు.
ధూపాటి సంపత్కుమారాచార్య
ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన శ్రీ యాదగిరి లక్ష్మీనర్సిహ శతక కర్త.
షోయబుల్లాఖాన్
ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాం నియంతృత్వ విధానాలను రజాకార్ల అకృత్యాలను బయటపెట్టిన కలం యోధుడు. పత్రికలకున్న శక్తిని ఆనాడే తెలిపి ప్రజల పక్షం వహించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి రజాకార్ల చేతిలో హత్యకు గురైన పత్రికా సంపాదకులు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ జాతీయోద్యమ భావాలను తన పత్రిక ద్వారా ప్రచురితం చేస్తూ వచ్చిన ప్రజాస్వామిక వాది. నిజమైన లౌకికవాదానికి నిదర్శనంగా నిలబడిన వ్యక్తి.
గంగుల సాయిరెడ్డి
తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం, గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు చేశారు. పోతన ప్రభావంతో పద్యాన్ని నడిపించిన కవి. కర్షకా! చేతులెత్తినే గౌరవింతు అని రైతును ఉన్నతస్థానంలో నిలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యం రాశారు.
నెల్లూరి కేశవస్వామి
ప్రేమ్‌చంద్, కిషన్చంద్లతో పోల్చదగిన చార్మినార్ కథలు రాసిన ఈయనను మరిచిపోకూడదు. 1942 సెప్టెంబర్ 17 నాటి అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభం లాంటి చారిత్రక సామాజిక పరిణామాలను తన కథల్లో చిత్రించిన గొప్ప రచయిత. హిందూ ముస్లింల మధ్య గల అంతర్మథనాన్ని, సంఘర్షణను, హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను తన కథల్లో ప్రధాన వస్తువుగా తీసుకున్నారు.
బీఎన్ శాస్త్రి
ఊరూరూ తిరిగి శాసనాధారాలను సేకరించి తెలంగాణ చరిత్రను లిఖించిన అగ్రగణ్య చరిత్రకారుడు బీఎన్ శాస్త్రి. 9వ తరగతి చదివేటప్పుడు సంధ్యారాగం నవల, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి మూడు భాగాలు రాశారు. భారతదేశ చరిత్రసంస్కృతిపై 21 సంపుటాలను వెలువరించారు. నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల సర్వస్వాలను కనులకు కట్టినట్లు రచించారు. రెడ్డిరాజ్య, బ్రాహ్మణరాజ్య సర్వస్వాలను ప్రకటించారు. 12 శాసన సంపుటాలను సేకరించి ప్రకటించిన చరిత్రకారుడు. వందలకొద్ది శాసనాలను వెలికితీసి ప్రజల చేత శాసనాల శాస్త్రిగా పిలువబడ్డారు.
ఆదికవి నన్నయ్య కాదు నన్నెచోడుడని తన పరిశోధనలో నిరూపించారు. దీనికి సుముఖంగా లేని విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆ విషయాన్ని తొలగించమని ఆదేశించారు. వారి ఆదేశాలను ధిక్కరిస్తూ పీహెచ్డీ తిరస్కరించారి. నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పరిశోధనలు చేశారు. పరిశోధనలో తనకు తానే మహా సంస్థగా ఎదిగి భావి పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచారు.
కపిలవాయి లింగమూర్తి
మహబూబ్‌నగర్‌కు చెందిన గొప్ప సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తిని చరిత్రలో గర్వంగా లిఖించుకోవాలి. ఈయన అనేక విలువైన గ్రంథాలు రాసి పరిశోధనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నూరు వసంతాలకు దగ్గరవుతున్న కపిలవాయి లింగమూర్తిని సగర్వంగా గౌరవించుకోవాలి.
పొన్నగంటి తెలగన
ప్రాచీన సాహిత్యంలో పొన్నగంటి తెలగన రాసిన అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర కూడా విస్మృతానికి గురైందంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. గోల్కొండ పరిసరాల్లో జన్మించి తిరుగాడిన పొన్నగంటి కావ్యరచన మొత్తం సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చ తెనుగులో రాయటం అద్భుతం.
గూడూరు సీతారాం
సీతారాం తొలితరం తెలుగు కథకుడని తప్పకుండా తెలుసుకోవాలి.
వేముగంటి నర్సింహాచార్యులు
మెదక్ జిల్లా రచయితల సంఘం, సాహితీ వికాస మండలి సంస్థను స్థాపించి సాహిత్య చైతన్యానికి కృషి చేశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి బిరుదులు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సిద్ద్దిపేటకు చెందిన ఈయన గుర్తింపులేని గొప్ప కవి. ఈయన మంజీర నాదాలు అనే గేయకావ్యం, తిక్కన, రామదాసు పద్య కావ్యాలు రాశారు.
కవి ఫణికుండలుడు
కవి ఫణికుండలుడు తెలుగు ప్రాచీన పద్యశక్తిని చాటిచెప్పిన సాహితీవేత్త.
కెప్టెన్ విజయ రఘునందనరావు
కశ్మీర్ ఆక్రమణకు గురవుతున్న సందర్భంలో పాకిస్థాన్ సైనికులను తరిమి కొట్టి యుద్ధభూమిలో ప్రాణాలొదిలిన వీరుడు కెప్టెన్ విజయ రఘునందనరావు చరిత్ర ఈ తరానికి తెలియదు. దేశం కోసం ప్రాణాలర్పించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచారు.
అద్దంకి గంగాధరుడు
అద్దంకి గంగాధరుడు తపతీ సంవరణోపాఖ్యానం ప్రబంధం రచించారు. మల్కీభరాముడుగా ప్రసిద్ధిపొందిన గోలకొండ ప్రభువు ఇబ్రహీం కుతుబ్‌షాహీ ఆస్థానకవిగా అద్దంకి గంగాధరుడు వెలుగొందారు.
అలిశెట్టి ప్రభాకర్
అలిశెట్టి ప్రభాకర్ మరణం నా చివరి చరణం కాదు అనే కవిత్వం రాశారు. సిటీలైఫ్ అనే మినీ కవితలతో ఆయన ప్రసిద్ధికెక్కారు. రక్తరేఖ కావ్యాన్ని రచించారు. రెండు మూడు పాదాల్లో వర్తమాన జీవన వేదాలను లిఖించారు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనావేశాలను రగిలించి సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి.
మాదిరెడ్డి సులోచన
తెలుగు నవలా రంగాన్ని శాసించిన రచయిత్రుల్లో ప్రధానమైన వారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు. జీవనయాత్ర, తరం మారింది, సంధ్యారాగం, భిన్నధృవాలు మొదలైన 73 నవలలు, 150 కథలు రాశారు.
నంబి శ్రీధర్‌రావు
ఈయన శతకకర్త. శ్రీమన్నింబాగిరి నరసింహశతకం రాశారు. కవిరాజ బిరుదాంకితులు.
గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ
ఈయన అవధాని శశాంక ఆశు కవితాకేసరి బిరుదును పొందిన అవధాని, శతకకర్త. కవితా కళ్యాణి, వాగేశ్వరి శృతి రాశారు.
సోమరాజు రామానుజరావు
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఈయన 1920లోనే ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. 22 పుస్తకాలు అచ్చువేశారు. ఈయన రచించిన స్వరాజ్య రథం పుస్తకాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. భారత విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు.
భాగ్యరెడ్డి వర్మ
ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిలభారత అంటరాని వర్గాల సభ మొదలైన అనేక సామాజిక చైతన్య సంస్థలను స్థాపించి జాతీయస్థాయిలో విజయవంతంగా సభలను నిర్వహించారు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను నిరసించి సమాజంలో నెలకొన్న అనేక దురాచారాలను ఎండగట్టిన గొప్ప సంస్కరణవాది. ఆదిహిందూ సమాజం ద్వారా హిందూ సమాజం చీలికుండా రక్షించారు. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబీ గౌతవ్‌ు భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని వెలువరించారు. అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని అస్పృశ్యతా నిర్మూలనకు పట్టుదలతో పనిచేసి సామాజిక వికాసాన్ని కలిగించిన వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ. నిరంతర కార్యాచరణతో అంటరానివర్గాల వారిని ఆది హిందువులుగా గుర్తించటంలో ఈయన కృషి అపూర్వం. జనజీవితంలో అడుగుపెట్టి అనేక బహిరంగ సభల్లో మాట్లాడిన మహావక్త. 3348 ఉపన్యాసాలిచ్చిన సామాజికోద్యమకారుడు.
బత్తిని మొగిలయ్య గౌడ్
వరంగల్ కోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి ఖాసిం రజ్వీ సైన్యాలను ముప్పు తిప్పలు పెట్టి తరిమికొట్టారు బత్తిని మొగిలయ్య గౌడ్. ప్రజలకు అండగా నిలిచి పుట్టిన నేల దాస్యవిముక్తి కోసం ప్రాణాలిచ్చిన యోధుడు. ఆధిపత్య సంస్కృతిని ధిక్కరిస్తూ బహుజనం కోసం అండగా నిలిచినఆయన ఆర్య సమాజంలో కార్యకర్త. వ్యాయామం, యుద్ధ విద్యల్లో నేర్పరి. కత్తిసాము చేయటంలో ఆరితేరారు. రజాకార్ల దాష్టీకాలను ఎదిరించారు. గౌడులపై తాశీలు కోసం విధించే దుర్మార్గమైన శిక్షలు, రాజ్యహింసను చూసి అగ్గయ్యారు. 200 మంది ఖాసిం రజ్వీ సైన్యాలపై లంఘించి దూకారు. ఈయన 25 ఏండ్ల వయసులోనే ప్రజల కోసం ప్రాణాలిచ్చి అమరుడయ్యారు.
చిందు ఎల్లమ్మ
జానపద కళల్లో విశిష్ట కళారూపం చిందు భాగోతం. ఒక కళారూపాన్ని తన ఇంటి పేరుగా మార్చుకుని తెలంగాణ సమాజానికి కొత్త కళా చైతన్యాన్ని అందించిన కళాకారిణి చిందు ఎల్లమ్మ. స్త్రీ పురుష పాత్రలను సమర్థవంతంగా పోషించి, తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన కళాతపస్వి.
రాణి శంకరమ్మ
మనకు రుద్రమదేవితోపాటు రాణి శంకరమ్మ కూడా ఉంది. ఆందోలు సంస్థానాన్ని పాలించిన వీరవనిత ఈ శంకరమ్మ. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702 లో జన్మించారు. ప్రజలను కంటిపాపలా చూసుకున్న సంస్థానాధీశురాలు. నైజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదునిచ్చారు.
సుద్దాల హనుమంతు
తెలంగాణ సాయుధ పోరాట రచన చేసే కలాన్ని, యుద్ధగానం చేసే గొంతుని, సమరం కోసం తుపాకీ పట్టిన చేయిని, ఏకం చేసుకుని త్రిముఖంగా త్రివిక్రమంగా పరాక్రమించిన ప్రజాకవిగాయకుడు, కళాకారుడు, తెలంగాణ విముక్తి ప్రత్యక్ష ప్రజాయుద్ధ సైనికుడు సుద్దాల హనుమంతు. తన రచనలతో సామాన్య ప్రజలను చైతన్యపరిచారు. పల్లెటూరి పిల్లగాడా/పసులకాసే మొనగాడా/పాలుమరిచి ఎన్నాళ్లయిందో అంటూ సుద్దాల రాసిన గేయం చాలా ప్రసిద్ధం. ఈయన మహా వాగ్గేయకారుడు. అమరులకు జోహార్లు అర్పిస్తూ జోహార్లు…జోహార్లు అనే పాట ఆయన కవిత్వంలోని ప్రౌఢత్వానికి నిదర్శనం.
దేవూరి శేషగిరిరావు
కొత్తగూడెం సింగరేణి కంపెనీలో 1935లో ఉద్యోగిగా చేరారు. అప్పటి వరకు సింగరేణిలో కార్మిక సంఘం లేదు. ఆయన కమ్యూనిస్టు భావజాలంతో తొలిసారిగా సింగరేణిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. కార్మిక హక్కుల కోసం పోరాడిన యోధుడు. తెలంగాణ సాయుధపోరాటంలో 100 సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. 1948 మే 15న భద్రాచలం దగ్గర నెల్లికుదురు గ్రామంలో నిజాం పోలీసులు శేషగిరిరావుని, ఆయన అనుచరులు రాగయ్య, పాపయ్యలను కాల్చి చంపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా నిలిచాడు. శేషగిరిరావు జీవిత చరిత్రను ప్రముఖ తెలంగాణ నవలా రచయిత పీసీ చంద్ శేషగిరి పేరున నవల రాశారు.
సోయం గంగులు
ఈయన జన్మస్థలం ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేదార్ బంజర (కోయగూడెం). నిజాం సైన్యం, భారత యూనియన్ సైన్యంతో అపజయం ఎరుగక పోరాడిన గిరిజన వీరుడు. తుపాకి కాల్చడంలో నేర్పరి, గురితప్పని విలుకాడు. పాల్వంచ ఏరియాలో కమ్యూనిస్టు పార్టీని బలీయంగా తీర్చిదిద్దారు. గోదావరికి ఇరు వైపులా పార్టీని అభివృద్ధి చేశారు. ఆయనను అంతం చేసేందుకు వ్యూహాత్మకంగా వలపన్ని పట్టుకుని, మిలిటరీ వ్యాన్‌కు కట్టేసి గ్రామ గ్రామాన ఊరేగించారు. 1951 మార్చి 26న సత్తుపల్లి దగ్గర రుద్రాక్షపల్లిలో కాల్చివేశారు. గిరిజనులను పోరాటాయోధులుగా తీర్చిదిద్దారు. కొమురం భీమ్ 11 నెలలు పోరాటం చేస్తే, అల్లూరి సీతారామరాజు రెండేండ్లు బ్రిటీషు ప్రభుత్వంపై పోరాటం చేశారు. సోయం గంగులు నాలుగున్నరేండ్లు దీర్ఘకాలికంగా పోరు చేసిన గిరిజన యోధుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు