నక్సల్ ఉద్యమ పర్యవసానాలు
సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ
-మజుందార్ మరణించిన తర్వాత సీపీఐ (ఎంఎల్)లో వచ్చిన చీలికల్లో ఘోష్ వర్గం మజుందార్ పంథాను విడిచిపెట్టారు. తక్షణ విజయం కంటే దీర్ఘకాలిక పోరాటానికే వీరు అధిక ప్రాధాన్యమిచ్చారు. దీంతో సునీత ఘోష్ నాయకత్వంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడింది.
-ఈ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సీపీఐ (ఎంఎల్)కు తామే నిజమైన వారసులమని ప్రకటించుకుంది.
-సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ భారత విప్లవానికి మజుందార్ అందించిన సేవలను కొనియాడింది. కానీ ఆయన పంథా అజేయమైనదని అంగీకరించలేదు.
-1973లో మూడో కాంగ్రెస్‌లో మహదేవ ముఖర్జీ నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్) నిజమైన భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు-లెనినిస్టు) పార్టీ అని ప్రకటించుకున్నాడు.
-1973లో సునీత ఘోష్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశాడు. ఇది 1974 ఫిబ్రవరిలో వ్యవస్థీకృత రూపాన్ని పొందింది. అయితే తొలి రోజుల్లో చాలా విషయాల్లో అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
-మహదేవ ముఖర్జీ, సత్యనారాయణ సింగ్ వర్గాల్లో చేరని వారంతా సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీలో చేరారు.
-1971-76 మధ్య కాలంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ దళ చర్యలు (స్కాడ్ యాక్షన్స్) జరిగాయి.
-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండపల్లి సీతారామయ్య అనుచరులు సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీని సమర్థించారు.
-ఈ దళ చర్యలు కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమయ్యాయి. దీనికి కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలు నాయకత్వం వహించారు. అయితే వీరు దళం కార్యక్రమాలు మినహా మద్దతు సమకూర్చుకునే ప్రయత్నాలు ఏవీ చేయలేదు.
-ఆ కాలంలోనే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీకి మేధావులు, రచయితలు, కళాకారుల నుంచి మద్దతు లభించింది.
-శ్రీకాకుళం ఉద్యమం దిగంబర కవులను, వరవరరావు లాంటి యువ కవులను, రచయితలను ఎందరినో ఆకర్షించింది. వీరంతా కలిసి విప్లవ రచయితల సంఘం (విరసం)గా వ్యవస్థీకృతమయ్యారు.
మావోయిస్టుల ఐక్యతకు కృషి
-1970-72 మధ్య ఎన్నికల్లో విజయంతో ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదాలతో దేశంలో గల మావోయిస్టు వర్గాలు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయాయి.
-1972-75 మధ్య కాలంలో వివిధ మావోయిస్టు వర్గాలను సమైక్యపరచడానికి చాలా కృషి జరిగింది. మొదట సత్యనారాయణ సింగ్ వర్గం ఐక్యతా ప్రయత్నాలను ప్రారంభించింది.
-దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని చండ్ర పుల్లారెడ్డి వర్గం, పైలా వాసుదేవరావు వర్గం ఏకమయ్యాయి.
-ఈ సమైక్యత వల్ల పార్టీకి అవసరమైన క్యాడర్, ధనం, వసతులు పుష్కలంగా లభించాయి.
-సత్యనారాయణసింగ్ వర్గం ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నింటితో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.
-జయప్రకాశ్ నారాయణ ఈ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు కూడా తెలిపారు.
-అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి జరిగిన ఉద్యమానికి చండ్ర పుల్లారెడ్డి వర్గం మద్దతు ప్రకటించింది.
-1972 తర్వాత సీపీఐ (ఎంఎల్) విద్యార్థి వర్గాల్లో అనుకూల విద్యార్థి సంఘాల నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ను ఏర్పాటు చేసింది.
-1974లో పీడీఎస్‌యూ రాష్ట్రస్థాయి మొదటి సమావేశం జరిగింది.
-సత్యనారాయణ సింగ్ వర్గం తలపెట్టిన సమైక్యతా కృషిపట్ల కొంతమంది విముఖత వ్యక్తం చేశారు.
-చారు మజుందార్ మార్గాన్ని అనుసరించే వర్గాలు సమైక్య తా కృషి పట్ల ఆసక్తిని చూపించలేదు.
-దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో అన్నివర్గాల్లో స్తబ్ధత ఏర్పడింది. దీన్ని మావోయిస్టు వర్గాలన్నీ విమర్శించాయి.
కొండపల్లి సీతారామయ్య వర్గం
-చారుమజుందార్ మరణించిన తర్వాత ఏర్పడిన సందిగ్ధ పరిస్థితుల్లో కొండపల్లి సీతారామయ్య సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీకి దగ్గరైనప్పటికీ స్వతంత్ర విధానాన్ని అవలంభించారు.
-వర్గ శత్రు నిర్మూలన, ప్రజా ఉద్యమాల విషయంలో నిర్ధిష్టమైన సైద్ధాంతిక భావనలను ఏర్పర్చుకున్నారు.
-కొండపల్లి సీతారామయ్య వర్గం సీపీ రెడ్డి వర్గం కంటే తీవ్రవాద పద్ధతులను అనుసరించింది.
-వీరు శ్రీకాకుళం గిరిజనోద్యమంలో చేరినప్పటికీ ఆదిలాబాద్, తెలంగాణ జిల్లాల్లో మజుందార్ మార్గాన్ని అనుసరించారు. దీంతో ఆయనపై యువకుల్లో ఆకర్షణ పెరిగింది.
-అనుచరగణం పెరిగినకొద్ది కొండపల్లి సీతారామయ్య తన సైద్ధాంతిక భావాలకు నిర్ధిష్ట స్వరూపం ఇస్తూ, తనదైన ఒక ప్రత్యేక పంథాను రూపొందించుకున్నారు.
పీపుల్స్‌వార్
-1980 తొలినాళ్లలో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) అవతరించింది.
-దేశమంతటా ప్రజా చైతన్యం ఒకే విధంగా లేదనే విషయా న్ని పీపుల్స్‌వార్ గుర్తించింది. అయితే దేశంలో విప్లవ పరిస్థితి మాత్రం ఏర్పడిందని భావించారు.
-అమలులో ఉన్న శాసనాలను ధిక్కరించి, ఆయుధాలను చేతపట్టి పోరాటానికి ప్రజలు సిద్ధమైనట్లు భావించారు.
-విశాల ప్రాంతం విమోచనం చెందే వరకు పోరాటాన్ని ఆపవలసిన అవసరం లేదన్నారు.
-సాయుధ పోరాటాన్ని వాయిదా వేయాలనడం రివిజనిజంగా పేర్కొన్నారు. ఇందుకు వ్యతిరేకమైన అభిప్రాయాలను వెలిబుచ్చినవారిని రివిజనిస్టులుగా ముద్రవేశారు.
-సీపీ రెడ్డి వర్గం సాయుధ పోరాటాన్ని సాధించాల్సిన ఒక పోరాటంగా భావిస్తే, పీపుల్స్‌వార్ మాత్రం ప్రజలు సాయు ధ పోరాటానికి సన్నద్దులై ఉన్నారని అనుకుంది.
-శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటును అణచివేసిన తర్వాత కూడా సమైక్యాంధ్రప్రదేశ్‌లో హింసాయుత తిరుగుబాట్లు కొనసాగాయి.
-శ్రీకాకుళంలో బలంగా ఉన్న సాయుధ తిరుగుబాటు తర్వా త కాలంలో తెలంగాణ జిల్లాల్లో బలపడింది. ఈ తిరుగుబాట్లు ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వేగంగా విస్తరించాయి.
-ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ముఖ్యంగా గోండులు విప్లవ సిద్ధాంతాలవైపు ఆకర్షితులయ్యారు. దీంతో మైదాన ప్రాంతం వారి నుంచి మోసపోతున్న గోండు గిరిజనులు సహజంగానే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం కలిగి ఉం డి నక్సల్స్ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు.
-ఈ సాయుధ తిరుగుబాటుకు (హింసాయుత సంఘటనలకు) ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతం ముఖ్య కేంద్రాలుగా మారాయి.
-1967లో నక్సల్బరీలో ప్రారంభమై 1968లో శ్రీకాకుళంకు పాకి ఉధృతంగా సాగిన జనతా ప్రజాస్వామిక విప్లవోద్యమాలు 1972 నాటికి తీవ్ర అణచివేతకు గురయ్యాయి.
-ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం రాష్ట్రపతి పాలన కూడా విధించారు. అనంతర కాలంలో దేశంలో ఎమర్జెన్సీ కూడా విధించారు.
-దేశవ్యాప్తంగా కార్మిక, రైతాంగ ఉద్యమాలు, మరోవైపు జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ స్వాతంత్య్రోద్యమాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు వెల్లువలా సాగిన జనతా ప్రజాతంత్ర ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం అగ్రభాగంలో నిలిచింది.
-1969 ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ఆర్ఈసీ), హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. దీంతో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థులు నక్సల్బరీ వైపు పయనించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు.
-1969 ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వైద్య విద్యార్థుల సంఘం విద్యార్థి నాయకుడైన చిరంజీవి నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1978లో అనారోగ్య కారణాల వల్ల ఆయన నక్సల్బరీ ఉద్యమం నుంచి వైదొలిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
-పీపుల్స్‌వార్ పార్టీ అనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వంలో క్రియాశీలక పాత్ర పోషించిన కిషన్‌జీ కూడా 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నాడు.
-ఆయనతోపాటు మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ముఖ్య సభ్యులుగా కొనసాగిన నల్లా ఆదిరెడ్డి, శ్యామ్‌లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులే.
-తెలంగాణ ఉద్యమానికి సీపీఐ (ఎంఎల్), పీపుల్స్‌వార్, జనశక్తి, సీపీయూఎస్ఐలు మద్దతు ప్రకటించాయి.
వివిధ రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష సాక్షాత్కారం
-1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థి నాయకులు తర్వాత కాలంలో నక్సల్బరీ ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
-ఆ తర్వాత కాలంలో కేంద్రంలో జనతా ప్రభుత్వం, రాష్ట్రం లో ఎన్టీఆర్ ప్రభంజనం, తెలుగుదేశం ఆత్మగౌరవ నినాదం ప్రజల్లో కొంతమేరకు భ్రమలు రేపింది.
-1982లో ఎన్టీ రామారావు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని నినాదమిచ్చాడు.
-కానీ, అనతికాలంలోనే ఎన్టీఆర్ నిజస్వరూపం, తెలంగాణ వ్యతిరేకత తెలుగుదేశం పతనానికి దారితీసింది.
-తెలుగుదేశం ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో విప్లవోద్యమాలపై ఉక్కుపాదం మోపగా, విప్లవోద్యమాలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు ప్రజాస్వామిక ఆకాంక్షగా తెలంగాణ ఉద్యమం వివిధ రూపాల్లో సాక్షాత్కరించింది.
-1988లో ఏర్పడిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో తెలంగాణ జల వనరుల సంరక్షణ కోసం, పులిచింతల ప్రాజెక్టును ఎన్టీ రామారావు శంకుస్థాపన చేయకుండా అడ్డుకోవడం జరిగింది.
-1988లో మరోసారి తెలంగాణ స్టూడెంట్ ఉద్యమం ప్రారంభమై 1996 వరకు తీవ్రంగా కొనసాగింది. ఈ సమయంలోనే పులిచింతలను అడ్డుకోవడానికి మిలిటెంట్ ఉద్యమాలు చోటు చేసుకున్నాయి.
-1996 నుంచి మళ్లీతెలంగాణ ఉద్యమం తెరమీదికొచ్చింది.
-1996లో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉత్తరాఖండ్ ఏర్పాటుకు వాగ్దానం చేసింది.
-దీంతో తెలంగాణ, విదర్బ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్, హరితప్రదేశ్, బుందేల్‌ఖండ్ ఉద్యమాలు ఊపందుకున్నాయి.
-అందులో 2000లో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ర్టాలను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పర్చింది.
-1996 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణకు నిరసనలతో మళ్లీ ప్రారంభమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది.
-అన్ని ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు జరిగాయి.
-తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడానికి పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
-దీంతో 1997లో అనేక చిన్నాచితకా పార్టీలు ఏర్పడ్డాయి. 1971లో ప్రజలు తెలంగాణ పట్ల చూపిన అభిమానం దృష్ట్యా 1998 ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డాయి.
-1998లో ప్రారంభమైన ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
-తెలంగాణ కళాకారిణి బెల్లి లలితను కిరాయి గూండాలు వెంటాడి 17 ముక్కలుగా నరికి చంపేశారు.
చండ్ర పుల్లారెడ్డి వర్గం
-ఎమర్జెన్సీ అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) పటిష్టమైన వర్గంగా ఆవిర్భవించింది.
-చండ్ర పుల్లారెడ్డి వర్గం (సీపీ రెడ్డి వర్గం) ఎన్నికల్లో పాల్గొనే వ్యూహాన్ని అవలంబించింది. ఈ వర్గమే 1969లో తరిమెల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని విమర్శించింది.
-1969లో చండ్ర పుల్లారెడ్డి మహత్తర వీరోచిత తెలంగాణ పోరాటం అనే పుస్తకాన్ని రచించాడు.
-దేశంలో నెలకొన్న ఇందిరాగాంధీ వ్యతిరేక పవనాల నేపథ్యంలో సీపీ రెడ్డి వర్గం ఎన్నికల ద్వారా తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించింది.
-12 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
-1980 లోక్‌సభ ఎన్నికల నాటికి తాము పార్లమెంటరీ విధానాల వైపు మొగ్గు చూపడం ప్రజలకు ఇష్టం లేదన్న విషయాన్ని సీపీ రెడ్డి వర్గం నాయకులు గమనించారు.
-ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే అంశం కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఇదే విధానంతో సీపీ రెడ్డి వర్గం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నది.
-ఈ వర్గానికి చెందినవారు ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికయ్యారు.
-అయితే సీపీ రెడ్డి వర్గం ఎన్నికలను పోరాటానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోలేదు. తమ ప్రకటనల్లో సాయుధ పోరాటం అనే పదాలను చాలా వరకు తగ్గించారు.
-1980లో సీపీ రెడ్డి వర్గం రెండుగా చీలిపోయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు