యూనిఫాం కొలువులకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు
– 27 ఏండ్లలోపు కానిస్టేబుల్, 30 ఏండ్లలోపు ఎస్సై అభ్యర్థులకు చాన్స్.. రిజర్వేషన్ అదనం
– దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంపు
-అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టులు
యూనిఫాం సర్వీసులకు చెందిన శాఖల్లో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులు గరిష్ఠంగా 27 ఏండ్లు, ఎస్సై అభ్యర్థులు 30 ఏండ్లలోపు ఉన్నవాళ్లు ఈ కొలువులకు పోటీపడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మరో ఐదేండ్లు వయో పరిమితి అదనం. రాష్ట్రంలో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు కొత్త జోనల్ వ్యవస్థ అందుబాటులోకి రావటం, రెండేండ్లు కరోనా కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక నిరుద్యోగ యువత నష్టపోయారని.. వీరికి వయోపరిమితి పెంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.
రెండేండ్లు పెంచుతూ జీవో విడుదల
ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, రవాణా, అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
# ఇటీవల వెలువడిన యూనిఫాం సర్వీసుల నోటిఫికేషన్లోనే కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడేండ్ల సడలింపుతో 25 ఏండ్లు, ఎస్సై అభ్యర్థులకు 28 ఏండ్ల వరకు అవకాశం ఇచ్చారు. తాజాగా రెండేండ్ల వయోపరిమితి పెంపుతో కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ఠ వయస్సు 27 ఏండ్లు ఉన్న అభ్యర్థులంతా అర్హులవుతారు. రిజర్వేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మరో ఐదేండ్లు అంటే.. 32 ఏండ్ల వరకు పోటీ పడవచ్చు.
#ఎస్సై అభ్యర్థులకు తాజా వయో పరిమితి పెంపుతో గరిష్ఠంగా 30 ఏండ్ల వరకు పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మరో ఐదేండ్లు అంటే.. 35 ఏండ్ల వరకు అవకాశం ఉంటుంది.
# వయోపరిమితి పెంపుతో దాదాపు 60 వేలకుపైగా అభ్యర్థులు అదనంగా పోటీపడే అవకాశం ఉన్నది.
దరఖాస్తు గడువు పెంచిన టీఎస్ఎల్పీఆర్బీ
యూనిఫాం సర్వీసు ఉద్యోగ నియమకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండు పెంచిన నేపథ్యంలో దరఖాస్తు తుది గడువులోనూ టీఎస్ఎల్పీఆర్బీ మార్పులు చేసింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో భర్తీ చేయనున్న అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు తుది గడువు ఈ నెల 26(గురువారం) రాత్రి 10 గంటల వరకు పెంచినట్టు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ద్వారా ‘www.tslprb.in’వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోచ్చని సూచించారు. చివర తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. చివర రోజు అందరూ ఒకేసారి దరఖాస్తు చేస్తే సర్వర్ బిజీతో పేమెంట్లు స్కిప్ అయ్యే సమస్య తలెత్తుతున్నదని, ఇలాంటి సందర్భాల్లో నిర్ణీత సమయం తర్వాత బ్యాంక్ నుంచి తిరిగి అభ్యర్థుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
అభ్యర్థులు కంగారు పడకుండా మరోసారి పేమెంట్ చేయడం ఉత్తమమని, ఒకవేళ బోర్డుకు ఒకే అభ్యర్థి నుంచి రెండుసార్లు డబ్బు వస్తే తిరిగి వారి బ్యాంకు ఖాతాకు జమచేస్తామని తెలిపారు. శుక్రవారం వరకు అన్ని కొలువులకు కలిపి పది లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు పేర్కొన్నారు.
వయో పరిమితి సడలింపుపై మంత్రుల హర్షం యూనిఫాం పోస్టుల భర్తీలో అభ్యర్థులకు రెండేండ్లు వయో పరిమితి సడలింపు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. వయోపరిమితి సడలింపు కోసం హోంమంత్రి మహమూద్ అలీకి లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వయో పరిమితి పెంపుపై హోం మంత్రి మహమూద్ అలీ ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ పల్లా
గ్రూప్-1 పోస్టుల నియామకాలలో డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థుల ఎత్తు అర్హతను 167 సెం.మీ. నుంచి 165 సెం.మీ.లకు తగ్గించడం, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేండ్ల వయోపరిమితిని పెంచడం పట్ల సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా టీశాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టులు
# డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ
అగ్నిమాపక శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 225 పోస్టులను భర్తీ చేయనున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 21 ఉదయం 8 గంటల నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?