గిరి పుత్రుల సంక్షేమం ఇలా!
భారతీయ సమాజానికి దూరంగా విశిష్టమైన సంస్కృతి, విలక్షణమైన జీవన విధానాన్ని కలిగి ఉన్న గిరిజనులను నిజానికి ఈ దేశ మూలవాసులుగా, నిజమైన భూమి పుత్రులుగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. భారతీయ సమాజంలో షెడ్యూల్డ్ కులాలు సామాజికంగా వివక్షతకు, దోపిడీకి గురికాగా, షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా దోపిడీకి గురయ్యా రు. అందువల్ల గిరిజనాభివృద్ధి విధానాల్లో ప్రధానంగా ఆర్థిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా మిగతా మైదాన ప్రాంత ప్రజల పరిపాలనలో కలపకుండా గిరిజనులను ప్రత్యేక పాలనకింద గిరిజన సంక్షేమం, అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుంది.
చారిత్రక నేపథ్యం
– భారతదేశంలోకి ఆర్యులు రావడానికి ముందునుంచే గిరిజనులు అడవులు, కొండలు, గుట్టలను ప్రధాన ఆవాసాలుగా చేసుకొని ప్రాచీన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కలిగి ఉండి స్వయంసమృద్ధితో జీవించేవారు. దేశంలో మొత్తం మీద గిరిజనులు ప్రధానంగా మధ్య భారతం, ఈశాన్య భారత్‌లో నివసిస్తున్నారు. జనాభాలో సగానికిపైగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నివసిస్తున్నారు.
దేశంలోని తెగల లక్షణాలు
– భౌగోళికంగా విభజన చెంది ఉండటం
– ప్రత్యేకమైన పేరు, భాష, సంస్కృతిని కలిగిఉండటం
– అంతర్వివాహ సమూహం
– బలమైన బంధుత్వ వ్యవస్థను కలిగి ఉండటం
– మతానికి, ఇంద్రజాలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
– ఆదిమ ఆర్థిక వ్యవస్థ
– తెగ పంచాయతీ రాజకీయ వ్యవస్థ
– గిరిజనేతరులను చూసి భయపడటం
– రాజ్యాంగంలోని నిబంధన 342 ప్రకారం ఎస్టీలను గుర్తించడం జరుగుతుంది. దీనిప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్టీల జాబితా వేర్వేరుగా ప్రకటించబడింది. ఈ జాబితా ఆ ప్రాంతంలోనే చెల్లుబాటవుతుంది. ఎస్సీ, ఎస్టీల గుర్తింపు ప్రక్రియ అనేది ఒక నిరంతర ప్రక్రియ.
ఎస్టీగా గుర్తించడానికి ఆధారాలు
1) ఆదిమ లక్షణాలు
2) భౌగోళికంగా ఒంటరిగా ఉండటం
3) ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉండటం
4) ఆర్థికంగా వెనుకబడి ఉండటం
5) ఇతర సమూహాలతో కలవటానికి మొహమాటపడటం లేదా సిగ్గుపడటం వంటి లక్షణాలను కలిగి ఉండటం
ఆదిమ గిరిజనులు – లక్షణాలు
– గిరిజనుల్లో అత్యంత వెనుకబడినవారు ఆదిమ గిరిజనులు.
– జనాభా అతి తక్కువగా ఉండటం (అంతరించేపోయే దశ)
– ఏకాంత జీవనం
– ఏకరూప సముదాయం
– మార్పునకు దూరంగా ఉండటం
– వేట,ఆహార సేకరణ మారక వ్యవసాయంపై జీవించడం
– దేశంలో 75 వరకు ఆదిమ గిరిజన తెగలున్నట్లు అంచనా.
తెగల గణాంకాలు
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిల్లో ఎస్టీల జాబితా ఉండదు. మిగతా రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాల్లో గిరిజనులకు సంబంధించిన గణాంకాలు ఉంటాయి.
– గిరిజన తెగల రకాలు – 705
– 2011 ప్రకారం గిరిజన జనాభా- 8.6 శాతం
(తెలంగాణ లో 9.34 శాతం)
– వీరిలో గ్రామీణ జనాభా- 89.97 శాతం, పట్టణ జనాభా – 10.03 శాతం
– 2001 నుంచి 2011 వరకు దేశం మొత్తం జనాభా పెరుగుదల- 17.69 శాతం కాగా, గిరిజన జనాభా పెరుగుదల 23.66 శాతం
– దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి – 940:1000
– గిరిజనుల్లో స్త్రీపురుష నిష్పత్తి- 990:1000
దేశంలో గిరిజన జనాభా విస్తరణ
1) మధ్యప్రదేశ్ – 14.69 శాతం
2) మహారాష్ట్ర – 10.08 శాతం
3) ఒడిశా – 9.2 శాతం
4) రాజస్థాన్ – 8.86 శాతం
5) గుజరాత్ – 8.55 శాతం
6) జార్ఖండ్ – 8.29 శాతం
రాజ్యాంగం రక్షణ
– భారతీయ సమాజంలో భాగంగా కొనసాగుతున్న గిరిజన సమాజం నిజానికి భారతీయ సంప్రదాయ జీవనానికి పూర్తి భిన్నం. ఇలాంటి భిన్నమైన జీవనానికి విఘాతం కలగకుండా, గిరిజనేతరుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుం డా రాజ్యాంగంలో అనేక రక్షణలను కల్పించారు.
1) 15 (4) నిబంధన : ఎస్సీలతో పాటు ఎస్టీలకు సామాజిక, ఆర్థిక, విద్యా ప్రయోజనాలను కల్పించాలి.
2) 16 (4) నిబంధన : ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్‌ను కల్పించడం.
3) 19 (5) నిబంధన : ఎస్టీలకు మాత్రమే సంబంధించింది. గిరిజన ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ. అంటే గిరిజన ప్రాంతా ల్లో గిరిజనేతరులు ఆస్తులను కలిగి ఉండరాదు.
4) 23వ నిబంధన: వెట్టిచాకిరి, కట్టుబానిసత్వం మానవ క్రయ, విక్రయాలను పూర్తిగా నిషేధించింది.
5) 46వ నిబంధన : ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలు, ఇతర బలహీనవర్గాల ప్రజల విద్యా,ఆర్థిక సంబంధమైన అవసరాలపట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
6) 164వ నిబంధన : ఇది ఎస్టీలకు మాత్రమే సంబంధించింది. మధ్య భారత్‌లో గిరిజన రాష్ర్టాలైన జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో గిరిజన సంక్షేమానికి ప్రత్యేక గిరిజన మత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
7) 244వ నిబంధన : గిరిజన కొండప్రాంతాల్లో ప్రత్యేక గిరిజన పరిపాలన కోసం 5, 6వ షెడ్యూళ్ల ఏర్పాటు.
8) 330వ నిబంధన: ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభలో రిజర్వేషన్లు.
9) 332వ నిబంధన : ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర అసెంబీల్లో రిజర్వేషన్లు.
10) 338వ నిబంధన: ఎస్సీ, ఎస్టీల ప్రయోజనం కోసం రాజ్యాంగంలోని నిబంధనల అమలుతీరు సమీక్షకు గాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమించవచ్చు.
– గిరిజనాభివృద్ధి విధానం : దేశంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గిరిజన సమాజాల అభివృద్ధికి ప్రత్యేక గిరిజనాభివృద్ధి విధానాన్ని రూపొందించింది.
ఈ విధానంలోని ముఖ్యాంశాలు
1) చట్టబద్ధ పాలనతో గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ.
2) అడవులపై గిరిజనుల హక్కులను గుర్తించడం
3) భూమి అన్యాక్రాంతాన్ని నిరోధించడం
4) గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన
5) వ్యవసాయం పశుగణాభివృద్ధి, చిన్నపరిశ్రమలు,
ఉద్యానవన రంగాల్లో గిరిజన కుటుంబాలకు అన్నిరకాల
సహాయాన్ని అందించడం
6) సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ
7) గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం
8) గిరిజనులకు భూ పంపిణీ
9) గిరిజన విద్యార్థులకు సాంకేతిక, ఉన్నతవిద్య అందించడం
10) గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
గిరిజన మంత్రిత్వ శాఖ
– 1985 నుంచి 88 వరకు సంక్షేమ మంత్రిత్వ శాఖగా, 1988 నుంచి 99 వరకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో ఉండగా, 1999 నుంచి ప్రత్యేక గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖగా ఏర్పాటయింది.
విధులు
1) గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన, ప్రాజెక్టుల తయారీ, పరిశోధన, సమీక్ష, శిక్షణల నిర్వహణ
2) షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాల పరిపాలనకు ప్రత్యేక చర్యలు
3) పౌరహక్కుల రక్షణ చట్టం, షెడ్యూల్డ్ కులాల, తెగలపై అకృత్యాల నిరోధక చట్టం అమలుతీరును పర్యవేక్షించడం
4) ఎస్టీల సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించడం
5) ఎస్టీ విద్యార్థులకు విద్యాసదుపాయాలు, ఉపకార వేతనాలను కల్పించడం, ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటుచేయడం
జాతీయ ఎస్టీ కమిషన్
– జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్ నుంచి 2003 లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
– ఈ కమిషన్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు ముగ్గు రు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం మూడేండ్లు.
– అధ్యక్షుడికి కేబినెట్ మంత్రిహోదాను, ఉపాధ్యక్షుడికి సహా య మంత్రి హోదాను,సభ్యులకు భారత ప్రభుత్వ కార్యద ర్శి హోదాను ఇచ్చారు.
– ఈ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా , భోపాల్, భువనేశ్వర్, జైపూర్, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్‌ల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.
– ఈ కమిషన్ విధులు, బాధ్యతలు, అధికారాలను నిబంధన 338 (ఎ)లో పేర్కొన్నారు.
1) అటవీ ప్రాంతంలో నివసించే ఎస్టీలకు అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కు కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం
2) ఖనిజ, నీటి, ఇతర వనరులపై గిరిజనులకు హక్కులు
3) అభివృద్ధి పథకాల వల్ల నిర్వాసితులైన గిరిజన సముదాయాలకు సహాయ పునరావాస కార్యక్రమాలను సమర్థవంతం గా నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం
4) 1996లో రూపొందించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే పంచాయతీల చట్టం (PESA)లోని నిబంధనలను అమలుపర్చడానికి అవసరమైన చర్యలను చేపట్టడం
5) ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుతీరును మూల్యాంకనం చేయడం
6) ఎస్టీల రక్షణల ఉల్లంఘన ఫిర్యాదులను విచారించడం
7) ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకుండే అధికారాలుంటాయి.
గిరిజన ఉప ప్రణాళిక
– 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా రూపొందించిన గిరిజన ఉప ప్రణాళిక గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్రియాశీల సాధనంగా దోహదపడుతుంది. ఈ ఉప ప్రణాళిక తెలంగాణతో సహా 18 రాష్ర్టాల్లో, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది. దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలు (6వ షెడ్యూల్ రాష్ర్టాలు), దాద్రానగర్ హవేలి, లక్షద్వీప్ కేంద్రపాలిత (వీటిలో ప్రభుత్వ విధానాలన్నీ గిరిజనాభివృద్ధి విధానాలే) ప్రాంతాల్లో ఈ ఉప ప్రణాళిక అమల్లో లేదు. ఈ ఉప ప్రణాళిక ప్రకారం…
1) గిరిజన జనాభా 50 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టుల(ఐటీడీఏ) అమలు.
2) పదివేల కంటే ఎక్కువ గిరిజన జనాభా ప్రాంతాల్లో 240 మాడా ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు.
3) అత్యంత వెనుకబడిన 73 ప్రాచీన గిరిజన సముదాయాల (PTG) ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు.
గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య -1987
విధులు
1) గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు సరైన ధరను, మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం. మార్కెటింగ్‌లో మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించడం
2) గిరిజన రైతుల ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను అందించడానికిగాను గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
– ఈ సమాఖ్య ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా దేశవ్యాప్తంగా 12 కార్యాలయాలు ఉన్నాయి.
జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థ- 2001
– జాతీయ ఎస్టీ ఆర్థికాభివృద్ధి సంస్థను 2001 ఏప్రిల్‌లో భారత కంపెనీల చట్టం 1956లో సెక్షన్ 25 ప్రకారం ఏర్పాటు చేసింది.
లక్ష్యాలు
1) అర్హులైన ఎస్టీలకు ఉపాధి కల్పనకు వారి ఆదాయాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం
2) సరైన శిక్షణ ద్వారా ఎస్టీల్లో నైపుణ్యాలను పెంపొందించడం
3) రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థలు సమర్థవంతంగా పనిచేసేటట్లు చూడటం
4) అర్హులైన షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించడం
5) ఎస్టీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించడం
6) ఈ సంస్థ ఆదివాసి మహిళా స్వశక్తి కారణ్ యోజన పథకాన్ని షెడ్యూల్డ్ తెగల మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్టీ మహిళలకు ఆర్థికాభివృద్ధికి సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు