కంచిని కొల్లగొట్టిన బహుమనీ సుల్తాన్ ఎవరు?
రెండో అల్లాఉద్దీన్ (1436-58):
ఇతడి తండ్రి అహ్మద్‌షా. రేచర్ల పద్మనాయకవంశ లింగమనేడు సాయంతో భువనగిరి దుర్గాన్ని జయించాడు. సుల్తాన్ తమ్ముడైన మహ్మ ద్ ఖాన్ రెండో దేవరాయలను ఓడించి బాకీ ఉన్న కప్పాన్ని రాయల నుంచి వసూలు చేయడమేకాక అన్నపై తిరుగుబాటు చేశాడు. ఖాందేష్ యుద్ధంలో విజయం సాధించి సబ్బిసాయిర్ మండలాన్ని పొంది ఆదిలాబాద్ జిల్లాలోని సామంత మాండలికులను జయించాడు. అన్నను చెరసాలలో వేసిన సమయంలోనే మహ్మద్ఖాన్పై బావమరిది 1455లో నల్లగొండలో తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
హుమాయూన్ (1458-61):
ఇతడు రెండో అల్లాఉద్దీన్ అహ్మద్‌షా కుమారుడు. మహ్మద్ గవాన్ అనే విదేశీయుడిని చేరదీసి మాలిక్ నాయబ్ పదవినిచ్చాడు. హుమాయూన్ మేనమామ జలాల్ఖాన్, అతని కుమారుడు సికిందర్ ప్రజలను హింసించేవారు. పద్మనాయక (బాలకొండ), వెలమ రాజులతో చేయికలిపి హుమాయూన్తో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో సికిందర్ గుర్రంపై నుంచి కిందపడి మరణించగా, జలాల్ఖాన్ లొంగిపోయాడు. హుమాయూన్ తన సైన్యాన్ని రెండుగా విభజించి కొంత సైన్యాన్ని ఖ్వాజా-ఎ-జహాన్ నిజాం ఉల్‌ముల్క్ నా యకత్వాన దేవరకొండ దుర్గం ముట్టడికి పంపాడు.
మిగిలిన సైన్యంతో ఓరుగల్లు కోటను ముట్టడించాడు. దేవరకొండ ప్రభువు లింగమనేడు ఒరిస్సా రాజు కలిలేశ్వర గజపతి సైనిక సహాయంతో తన కుమారుడు హంవీరుని నాయకత్వంలో దేవరకొండ దుర్గాధిపతికి సహాయార్థం వచ్చి లింగమనేడు సైన్యంతో కలిసి హుమాయూన్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో వేలకొద్ది బహమనీ సైనికులను హతమార్చాడు. మిగిలిన సైన్యం వరంగల్‌లో ఉన్న సుల్తాన్ వద్దకు పారిపోయింది. ఈలోగా బీదర్‌లో పరిస్థితులు మారిపోయి తన సోదరుడైన హసన్‌ఖాన్ తప్పించుకొని పారిపోగా హుమాయూన్ తెలంగాణ వ్యవహారాలను మహ్మద్ గవాన్ సైన్యాధిపతికి అప్పగించి బీదర్ చేరగా గజపతులు, వెలమలు కలిసి వరంగల్‌ను ఆక్రమించారు (1461). దీంతో తెలంగాణ బహమనీ రాజుల నుంచి చేజారిపోయింది. హుమాయూన్ 1461లో మరణించాడు.
నిజాంషా (1461-63):
నిజాంషా పెద్ద కుమారుడైన నిజాం షా 1461లో సుల్తానయ్యడు. బాలుడవడంతో ఇతడి తల్లి నర్గీస్ బేగం ముజ్దుమాఇజహాన్ బిరుదుతో ఖ్వాజా జహాన్ తుర్క్, మహ్మద్ గవాన్ అనే మంత్రుల సహాయంతో రాజ్యాన్ని పాలించింది. ఒడ్ర గజపతులు, మాళ్వా సుల్తాన్, మహ్మద్ ఖిల్జీలు నిజాంషా రాజ్యంపై దండెత్తారు. నిజాంషా సైన్యం ఓడిపోగా నర్గీస్ బేగం ఫిరోజాబాద్ పారిపోయింది. మాళ్వా, గజపతి సైన్యం బీదర్‌ను ముట్టడించగా మంత్రి మహ్మద్ గవాన్ బీదర్పై దాడికి రావాల్సిందిగా గుజరాత్ నవాబును ఆహ్వానించాడు. గుజరాత్ సైన్యం ముట్టడించినట్లు మధ్యలో వెనుదిరిగిపోగా గజపతులు బహ్మనీ సైన్యాన్ని ఎదుర్కోలేక కళింగకు పారిపోయారు. నిజాంషా జ్వరంతో 1463లో మరణించాడు. అతడి తమ్ముడైన మూడో మహ్మద్‌షా సింహాసనానికి వచ్చాడు.
మూడో మహ్మద్‌షా (1463-82):
ఇతడు హుమాయూన్ రెండో కుమారుడు. పదేండ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు. ఖ్వాజా ఇజహర్ తుర్క్, మహ్మద్ గవాన్లు అనే మంత్రుల సహాయంతో పరిపాలించాడు. ఖ్వాజా ఇజహర్ తుర్క్ను రాజమాత అయిన నర్గీస్ చంపించగా మహ్మద్ గవాన్ 1463లో ప్రధాని అయ్యాడు. 3వ మహ్మద్షాకు యుక్త వయసు వచ్చినా గవాన్‌ను సంప్రదించకుండా ఏ పనినీ చేసేవాడుకాదు. ఇతడు బహ్మనీ సుల్తాన్లలో గొప్పవాడు.
దాడులు:
1) 1466లో ఖేర్లాను వశపరుచుకొనుటకు చేసిన దండయాత్ర విఫలమైంది. 2) 1468లో కొంకణాన్ని జయించేందుకు కొల్హాపురం, నెలవీడుగా రెండు దండయాత్రలు చేశాడు. మొదటిది విఫలం కాగా రెండోది దండయాత్రలో ఖేల్నా సంగమేశ్వర పాలకులను జయించి కొంకణంలోని చాలాభాగం బహ్మనీ రాజ్యంలో కలిపాడు. దీంతోహజ్ (మక్కా) యాత్రకు వెళ్లి ముస్లింలను దోచుకునే సంగమేశ్వర పాలకుల దాడులు ఆగిపోయాయి. 3) విజయనగరంపై దాడి-కారణం: ముస్లిం గుర్రపు వ్యాపారులు గోవా, భట్కల్ రేవుల్లో గుర్రాలను దిగుమతి చేసి బహ్మనీ రాజులకు మాత్రమే అమ్మటం వలన విజయనగర రాజులు ఆ గుర్రాల వ్యాపారులను హతమార్చారు. ఆ గుర్రాల వ్యాపారుల్లో కొందరు బహ్మనీ సుల్తాన్‌కు మొరపెట్టుకోగా సుల్తాన్ గోవాపై దండెత్తి ఆక్రమించాడు. 4) 1470లో కళింగ రాజు కపిలేశ్వర గజపతి మరణంతో అతడి కుమారులు సింహాసనం కోసం పోటీపడ్డారు. హంవీర, పురుషోత్తమ గజపతుల మధ్య అంతఃకలహం జరిగింది. హంవీర గజపతి బహ్మనీ సుల్తాన్ మూడో మహ్మద్‌షాను సైనిక సాయం చేయమని అర్థించాడు. ప్రతిగా తెలంగాణ ప్రాంతాన్ని సమర్పిస్తున్నట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సైన్యం, మహ్మద్‌షా నిజాం ఉల్‌ముల్క్ ఖేరీ అనే దక్కనీ సర్దార్‌ను కొంత సైన్యంతో హంవీరునికి సాయంగా పంపాడు. యుద్ధంలో విజయానంతరం హంవీరుడు తెలంగాణ తీరాంధ్రలను సుల్తాన్ వశం చేశాడు. మాలిక్ నిజాం ఉల్‌ముల్క్ ఖేరీని సర్ లష్కర్-ఇ-తిలింగ్ బిరుదుతో సేనాధిపతి ని చేసి రాజమండ్రి దుర్గాధిపతిగా, కొండపల్లి దుర్గాధ్యక్షునిగా మరో సేనానిని నియమించాడు. అయితే కొండపల్లి దుర్గాధ్యక్షుడి దుష్టపాలనను సహించలేని ప్రజలు తిరుగుబాటు చేయగా దుర్గాన్ని తిరిగి హంవీరునికి అప్పగించాడు. హంవీరుడు ముస్లింలను తెలుగు ప్రాంతం నుంచి వెళ్లిగొట్టుటకు అవకాశంగా భావించి తన అన్న అయిన పురుషోత్తముని సాయం అర్థించాడు. గజపతుల సైన్యాలు రాజమండ్రి సైన్యాన్ని ముట్టడించాయి. ఇదే సమయంలో విజయనగర సామంతుడు చంద్రగిరి పాలకుడైన సాళువ నరసింగరాయలు తీరాంధ్రను జయించి రాజమండ్రి వరకు సైన్యాలతో వచ్చా డు. మూడో మహ్మద్‌షా తన కుమారుడు మహ్మద్‌తో, గవాన్తోనూ స్వయంగా సైన్యాలను నడుపుకుంటూ పురుషోత్తమ గజపతిని ఓడించి అతని మదగజాలను కానుకలుగా స్వీకరించి రాజమండ్రిని ఆక్రమించాడు. సుల్తాన్ రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని (1478-80 వరకు) తెలంగాణను తూర్పు-పడమరలు గా విభజించి వాటికి రాజమండ్రి, వరంగల్ రాజధానులు ఏర్పర్చాడు. తూర్పు తెలంగాణకు నిజాం ఉల్‌ముల్క్ ఖైరీని, పడమటి తెలంగాణకు అజమ్ఖాన్ను పాలకులుగా నియమించాడు.
సాళువ నరసింగరాయలుతో యుద్ధం: 1480లో మహ్మద్‌షా కొండవీటిని ఆక్రమించి కోటలోని దేవాలయాన్ని కూల్చి మసీదును కట్టించాడు. ఆ దేవాలయ పూజారులను చంపాడు. ఫలితంగా గాజీ బిరుదు పొందాడు.
కంచిపై దాడి:
కంచిపై దాడిచేసి గెలిచి అపార ధనరాశులతో తీరంవెంట బహ్మనీ రాజ్యానికి వెళ్తుండగా నేటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద సాళువ నరసింహుని దండ నాయకుడు ఈశ్వర నాయకుడు (తుళువ) సుల్తాన్‌ను ఓడించి అతని వద్ద ఉన్న ధనరాశులను, గుర్రాలను స్వాధీనం చేసుకున్నాడు.
గవాన్ మరణం:
మంత్రి గవాన్‌ను సుల్తాన్ మూడో మహ్మద్‌షా బాగా తాగి ఉన్న సమయంలో చాడీలు చెప్పి దక్కనీ మంత్రులు ఈర్ష్యతో ఉరి తీయించారు. వాస్తవం తెలుసుకొని పశ్చాతాపంతో 1482లో మరణించాడు.
ప్రధానమంత్రిగా గవాన్ సంస్కరణలు: 1) తరఫ్దార్ల అధికారాలను అదుపులో ఉంచేందుకు తరఫ్ల (రాష్ర్టాలు)ను సర్ లష్కర్లుగా విభజించాడు. అవి గుల్బర్గా, బీజాపూర్, దౌలతాబాద్, జున్నార్, గాలిర్గర్, మహుర్, రాజమండ్రి, వరంగల్. 2) పంటపొలాలన్నీ సర్వే చేయించి పంటను బట్టి శిస్తు వసూలు నిర్ణయించాడు. 3) దక్కనీ సర్దారులకే ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. 4) భూమిశిస్తు విషయంలో గవాన్ తోడర్మల్ విధానాలను అనుసరించాడు.
గవాన్:
1404లో పారశీక కుటుంబంలో జన్మించాడు. 1447లో బీదర్‌లో రెండో అల్లాఉద్దీన్ కొలువులో ఉద్యోగిగా చేరాడు. హురుయాక్ షా గవాన్‌ను వకీల్-డస్-సల్తనత్గా నియమించి బీజాపూర్ తరఫ్‌దార్‌గా నియమించాడు. మూడో మహ్మద్ అతని సేవలకు మెచ్చి మలిక్-ఉల్-తుజ్జార్ బిరుదునిచ్చి మంత్రిగా చేశాడు. గవాన్ అరబ్బీ, పారశీక భాషల్లో విద్వాంసుడు, కవి, గ్రంథకర్త. సమకాలీన సాహిత్యకారులతో ప్రజ్ఞ కలవాడు. బీదర్‌లో పెద్ద మదర్సాను నిర్మించాడు. దీనిలో ఆచార్యులు, విద్యార్థులకు వసతి సౌకర్యాలను కల్పించాడు. ఇందులో వేల గ్రంథాలున్న గ్రంథాలయాన్ని నిర్మించాడు.
మహ్మద్‌షా (1482-1518):
మూడో మహ్మద్‌షా కొడుకు. సుల్తాన్ అయ్యేనాటికి 12 ఏండ్ల బాలుడు. అందువల్ల ప్రధాని అయిన మాలిక్ హసన్ నిజాం ఉల్‌ముల్క్ పెత్తనం చెలాయించాడు. ఇతడు దక్కనీ ముస్లింలకు నాయకుడు. నాలుగేండ్లు పెత్తనం చెలాయించాడు. అధికారం కోసం విదేశీ అమీరులైన కాశింబరీద్, యూసఫ్ ఆదిల్ ఖాన్, మాలిక్ హసన్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాశింబరీద్ ప్రధాని అయి సుల్తాన్ మహ్మద్‌షాను కీలుబొమ్మగా చేసుకొని వేలకొద్ది దక్కనీ ముస్లింలను హత్య చేయించాడు. ఇదే సమయంలో అహ్మద్‌నగర్‌లో మాలిక్ హసన్ కుమారుడు మాలిక్ అహ్మద్ నిజాం ఉల్‌ముల్క్ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు.
ఇతడే నిజాంషాహి వంశ స్థాపకుడు. అదేవిధంగా బీజాపూర్‌లో యూసఫ్ ఆదిల్‌ఖాన్ స్వతంత్రుడై ఆదిల్షాహి వంశాన్ని, బీరార్‌లో ఫతుల్లా ఇమ్మద్ ఉల్‌ముల్క్ స్వతంత్రుడై ఇమాద్ షాహి వంశాన్ని, 1512లో గోల్కొండలో కులీకుతుబ్‌షా కుతుబ్షాహి వంశాన్ని స్థాపించారు. కాశింబరీద్ విజయనగర చక్రవర్తుల సాయంతో వీరందరినీ అణచివేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాశింబరీద్ కుమారుడు అలీ బరీద్ ప్రధాని అయ్యాడు. మహ్మద్‌షా 1518లో చనిపోగా అతని కుమారులు అహ్మద్‌షా (1518-21), అల్లాఉద్దీన్ (1521) వలీముల్లా (1521-24), కలీముల్లా (1524-27)లు ఒకరి వెంట ఒకరు పరిపాలించారు. కరీముల్లా కాలంలో బాబర్ దాడి జరిగింది. బాబర్ సాయంతో బహ్మనీ రాజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం విఫలమైంది. దీంతో 1527లో బీజాపూర్‌కు పారిపోయాడు. 1528లో మరణించాడు.
బహ్మనీ రాజ్య పరిస్థితులు:
బహ్మనీ రాజుల చరిత్ర భారతదేశ చరిత్రలో హృదయానికి హత్తుకునే చరిత్రకాదు. విన్సెంట్ స్మిత్ అభిప్రాయంలో వీరు రక్తపిపాసులు. మత దురహంకారులు, దుష్టులు, తాగుబోతులు, వ్యభిచారులు. 18 మందిలో ఎక్కువమంది తాగుబోతులు, వ్యభిచారులు, మిగిలినవారు అమీరులు, సర్దారుల చేతుల్లో కీలుబొమ్మలు. వారి పరిపాలన కుట్రలతో, పన్నాగాలతో, హత్యలతో చిత్రహింసలతో నిండినది. మెడీస్ టైలర్ వంటి చరిత్రకారులు క్రౌర్యం, తాగుబోతుతనం, వ్యభిచారం, మధ్యయుగ సామాన్య లక్షణాలేగాని, ఈ విషయంలో బహ్మనీలు మినహాయింపు లేదని అంటారు. 1470 నుంచి 74 వరకు బీదర్‌లో ఉన్న రష్యన్ వ్యాపారి అథానేపియన్ నికిటన్ అమీరులు భోగలాలసత్వాన్ని అనుభవించగా పేదవారు దుర్బరస్థితిలో ఉన్నారని రాశాడు. సుల్తానులను ఎదిరించినవారికి చిత్రహింసలకు గురిచేసేవారని పెరిస్టో రాశాడు. పక్కన ఉన్న రెడ్డి, వెలమ, విజయనగర రాజ్యాల్లో పౌరజనాన్ని సుల్తానులు జరిపిన అమానుషాలు, అత్యాచారాలు అనేకం.
హిందువుల నుంచి జిజియా వసూలుచేసేవారు. వీరు చేసిన కొన్ని మంచి పనుల్లో తెలంగాణ ప్రాంతంలో తటాకాలు తవ్వించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం. అనేకమంది హిందువులు ముస్లింలుగా మారి దక్కనీ ముస్లింలు అయ్యారు. పారశీక, అరబ్బీ భాషల్లో ముస్లిం విద్యావ్యాప్తి కోసం గవాన్ బీదర్‌లో మదర్సాను నిర్మించాడు. వాస్తులో దౌలతాబాద్, బీదర్, గుల్బర్గాల్లోని కట్టడాలు కనిపిస్తాయి. వీరు గావిల్‌గర్, గుల్బర్గా, నర్నాలా, జౌసా, పారెంద్ మొదలైన చోట్ల పటిష్ట దుర్గాలను నిర్మించారు. వీటిలో కొన్ని పాదశీక, హిందే వాస్తు సంప్రదాయాలు కనిపిస్తాయి. దీన్నే దక్కన్ వాస్తు అంటారు. గుల్బర్గాలోని జామీ మసీద్‌లో, గవాన్ మదర్సాలో, గీజు దరాజ్ సమాధిలో పారశీక సంప్రదాయాలు కనిపిస్తాయి. గుల్బర్గాలోని ఫిరోజ్‌షా సమాధిలో ఫిరోజాబాద్ దుర్గంలోనూ హిందూ, పారశీక వాస్తు సమ్మేళనం కలదు. మహ్మద్ షా పరిపాలనలో 8 మంది మంత్రులు ఉన్నారు. 1) వకీల్-ఉన్-సుల్తానత్ (ప్రధాని) 2) అమీర్-ఇ-జుమ్లా (ఆర్థిక) 3) వజీర్-ఇ-అష్రఫ్ (విదేశాంగ) 4) సాదర్-ఇ-జహర్ (ప్రధాన న్యాయమూర్తి 5) కొత్వాల్ (రక్షక భట అధికారి) 6) పీష్వా మొదలైనవి. రాజ్యాన్ని అల్లాఉద్దీన్ బహ్మన్షా నాలుగు తరఫ్‌లుగా విభజించాడు. తరఫ్‌లను సర్ లష్కర్లుగా గవాన్ విభజించాడు. తరఫ్‌లు సర్కార్లుగా, సర్కార్లు పరగణాలుగా, గ్రామాలుగా విభజించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు