నీటిపారుదల ప్రాజెక్టులపై నిత్య కుట్రలు ( తెలంగాణ ఉద్యమ చరిత్ర)
– సీమాంధ్ర పాలకుల గుట్టు బయటపెట్టిన అంచనాల కమిటీ
# కేంద్రం 216 టీఎంసీలను 1952లో కెటాయించగా రాష్ట్రప్రభుత్వం 66 టీఎంసీలకు ప్రాజెక్టును పరిమితం చేసి కుదించగా ఎగువన ఉన్న మహారాష్ట్ర 52టీఎంసీలతో ప్రతిపాదించిన గైక్వాడ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఇదే సమయంలో 96టీఎంసీలకు పెంచుకున్నది. మంత్రి ప్రకటనతో మహారాష్ట్రకు 161టీఎంసీలకు బదులు 222టీఎంసీలు కొత్తగా వినియోగానికి అందుబాటులోకి వచ్చినవి. ఆమేరకు 1963లో తెలంగాణ గోదావరి జలాలను నష్టపోయింది.
# గైక్వాడ్ ప్రాజెక్టు పరిమాణాన్ని పెంచిన తర్వాత కూడా పోచంపాడు వద్ద గోదావరిలో ఆనాటికి ఇంకా 195 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా ఆ నీటిని పోచంపాడుకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరలేదు. దీన్ని అదనుగా తీసుకుని మహారాష్ట్ర, కర్ణాటక ఇతర ప్రాజెక్టులు నీటి కేటాయింపులు పొందాయి. కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి 1963 స్టేట్మెంట్ ఆధారంగానే కేంద్రప్రభుత్వం ఆ తర్వాత గోదావరిపై ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు కెటాయింపులు చేస్తూ వచ్చింది.
# 1956లో కేంద్రప్రణాళిక సంఘం మహారాష్ట్రకు కెటాయింపులను గతంలోనే చేసినా, కృష్ణా, గోదావరి కమిషన్ మహారాష్ట్రలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు 210 టీఎంసీలు చాలని తమ నివేదికలో తెలిపినా, కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మహారాష్ట్రకు 400 టీఎంసీలు కేటాయి స్తూ ప్రకటన చేసినా, ఆంధ్ర ప్రభుత్వం ఎప్పుడూ అభ్యంతరం తెలుపలేదు. కనీసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని అడగలేదు. కోర్టులోఫిర్యాదు దాఖలు చేయలేదు. ఈ నిర్లక్ష్యంపై అంచనాల కమిటీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.
# పోచంపాడు ప్రాజెక్టుకోసం ప్రపంచబ్యాంకు నుంచి తెస్తు న్న నిధులను అప్పుగా ఇతర పథకాలకు మళ్లించబోమని కేంద్రప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వకపోతే ప్రపంచబ్యాం కు నిధులివ్వదని అంచనాల కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రస్తుత చిన్నసైజు పోచంపాడు ప్రాజెక్టును ఐదేండ్ల్లలో మార్చే ప్రక్రియను పక్కన పెట్టకూడదని ఈ విషయంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం జరగదనే గందరగోళం భవిష్యత్తులో ఎవ్వరిలోనూ తలెత్తకూడదని కమిటీ సూచించింది.
పోచంపాడు అంచనా వ్యయం మూడింతలు
# పోచంపాడు చిన్నసైజు ప్రాజెక్టు వ్యయం రూ.15.25 కోట్లతో ప్రభుత్వం 1959లో ప్రతిపాదించింది. 1963-64 నాటికి సవరించిన అంచనా వ్యయం రూ.40.10 కోట్లుగా పేర్కొన్నది. 1969 నాటికి ఇది రూ.66.50 కోట్లకు పెరిగింది. తర్వాతికాలంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినప్పుడు అంచనాఖర్చు రూ.80.50 కోట్లుగా ప్రభుత్వం వారికి తెలిపింది. పోచంపాడు కాల్వలు లైనింగ్ చేస్తే అంచనా వ్యయం రూ.95 కోట్లు అవుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనితో పాటు ప్రతిఏటా ధరలు పెరుగుతున్నందున ఏటా 50శాతం అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటి పద్దతిలోనే ఏటా కోటి, కోటిన్నర ఖర్చు చేస్తూ పోతే 1963-64లో నిర్ణయించిన అంచనా వ్యయం ప్రకారమే పూర్తవడానికి 40ఏళ్లకు పైగా పడుతుందని అంచనాల కమిటీ తమ రిపోర్టులో పేర్కొన్నది.
# అంచనాల కమిటీ చైర్మన్ కే అచ్యుత్‌రెడ్డి 1969, నవంబర్ 29న అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి రాసిన లేఖలో ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టుకు 280 టీఎంసీల నీటిని పొందేట్లుగా వాదనలు సిద్ధ్దం చేసుకోవాలని, పూర్వపు హైదరాబాద్ ప్రభుత్వం ప్రతిపాదించిన 280టీఎంసీల భారీ ప్రాజెక్టుగా పోచంపాడును నిర్మించాలని కోరారు.
# కృష్ణా, గోదావరి నదులపై నిజాం ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను నిర్మించాలని సంకల్పించి 1930-42 మధ్య ప్రాజెక్టు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిలో కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించింది. 1948లో పోలీస్ చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో చేరిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి మిలటరీ గవర్నర్ జనరల్ దరి, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేంద్రప్రభుత్వంచే నియమించబడిన వెల్లోడి.
# 1951 జూలై 27, 28 తేదీల్లో కేంద్రప్రణాళిక సంఘం సమావేశానికి వెల్లోడి స్వయంగా హాజరై కింది ప్రాజెక్టులకు నీటి కెటాయింపులు సాధించారు.
1951 నాటికి గోదావరి నదిపై నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు
1. నిజాం సాగర్- 58 టీఎంసీలు
2. అప్పర్ మానేరు డ్యాం-34 టీఎంసీలు
3. మైనర్ ఇరిగేషన్ (చెరవులు, కుంటలు)- 91.70 టీఎంసీలు
4. కడెం ప్రాజెక్టు (గోదావరి ఉత్తర కాల్వ)- 53 టీఎంసీలు
1951 నాటికి నిర్మించాల్సిన ప్రతిపాదనలు,
సిద్ధమైన ప్రాజెక్టులు
1. దేవనూరు- 27 టీఎంసీలు
2. గోదావరి బళార్థక సాధక ప్రాజెక్టు- 227 టీఎంసీలు
3. పెన్‌గంగ- 53 టీఎంసీలు
4. లోయర్ మానేరు- 32 టీఎంసీలు
5. ప్రాణహిత- 32టీఎంసీలు
మొత్తం- 687.10 టీఎంసీలు
# ఈ ప్రాజెక్టుల్లో 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి నిర్మాణంలో ఉన్నది కడెం ప్రాజెక్టు మాత్రమే. కాని స్టేట్ రీ ఆర్గనైజేషన్ చట్టంలోని 107, 108 సెక్షన్ల ప్రకారం రాష్ట్ర విభజన కారణంగా పూర్వం నిర్మించతలపెట్టిన అనుమతులు పొందిన ఏ ప్రాజెక్టు కూడా నిలిపివేయకూడదు. అన్ని తెలిసి కూడా, తెలంగాణ నాయకుల నోరుక్కి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం దేవనూరు, పెన్‌గంగ, ప్రాణహిత, లోయర్ మానేరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పక్కన పెట్టింది. 53టీఎంసీల కడెం ప్రాజెక్టును 12 టీఎంసీలకు, 227 టీఎంసీల గోదావరి బళార్థక సాధక ప్రాజెక్టును, 66 టీఎంసీల పోచంపాడు చిన్నసైజులకు నాల్గింట ఒక వంతుకు ఏవిధంగా కుదించబడిందో దీని ద్వారా తెలుస్తుంది.
# గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులను నిర్మించకుండా వదిలివేయడానికి లేదా నిర్మిస్తున్న వాటిసైజు తగ్గించడానికి ప్రధాన కారణాలు..
# పైన ప్రాజెక్టులు లేకుంటే గోదావరి నీరు కావల్సినంత ఏడాది పొడవునా ధవళేశ్వరం వద్ద డెల్టాకు రెండు పంటలకు అందుబాటులో ఉండడం.
# తెలంగాణ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టాల్సిన నిధులను ఆంధ్ర అభివృద్ధి కోసం మళ్లించాలనే దురాలోచన.
# భవిష్యత్‌లో కృష్ణా, పెన్నా నదుల పరీవాహక ప్రాంతాల్లో ( ఆంధ్ర, రాయలసీమ) సాగుకు గోదావరి నీటిని మళ్లించాలనే ఆంధ్రనేతల ఆలోచన.
# 1969లో తెలంగాణ ఉద్యమం ప్రజ్వరిల్లడానికి ఇతర కారణాలతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం, వివక్ష కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు.
# ఇవి కృష్ణా నది ప్రాజెక్టు విషయంలో 1956 నుంచి 1969 మధ్యకాలంలో జరిగిన అన్యాయాలు, సిమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణపై అనుసరించిన వివక్ష భారీగా జరిగింది. 1956 తర్వాత సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 1968లోపు నిర్మాణాలు ప్రారంభించిన పెద్ద ప్రాజెక్టులు పోచంపాడు, నాగార్జునసాగర్ మాత్రమే.
కృష్ణానది పరీవాహక ప్రాజెక్టులపై వివక్ష నాగార్జునసాగర్ ప్రాజెక్టు
# 1930లో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వంలోని చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ ఆధ్వర్యంలో కృష్ణానదిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనువైన స్థలాల కోసం సర్వే జరిగింది. గుల్బర్గా జిల్లాలోని కమలదిన్నె దగ్గర కృష్ణానదిపై అప్పర్ కృష్ణా ప్రాజెక్టును, తంగడి దగ్గర భీమానదిపై భీమా ప్రాజెక్టును, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం దగ్గర కృష్ణానదిపై మరో ప్రాజెక్టును నిర్మించడానికి పథకాలను సిద్ధం చేశారు.
ఏలేశ్వరం ప్రాజెక్టు
# కృష్ణానదిపై నల్లగొండ జిల్లాలో నిజాం ప్రభుత్వం నిర్మించాలనుకున్న ఏలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో 161టీఎంసీలతో సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అలీ నవాబ్ జంగ్ సంకల్పించారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంత సాగునీటి కోసమే ఏలేశ్వరం ప్రతిపాదించబడింది.
# ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు పూర్వం అప్పటి ప్రణాళిక సంఘంలో సభ్యుడైన కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఇంజినీర్ కె.ఎల్. రావు ఈ ప్రాజెక్టును కొంచెం దిగువన ఉన్న నందికొండ దగ్గర నిర్మించాలని ప్రతిపాదించారు. ఎగువన ఏలేశ్వరం దగ్గర నిర్మిస్తే తెలంగాణకు ఎక్కువ ప్రయోజనం కలిగి ఉండేది. ఇప్పటికన్నా దాదాపు రెట్టింపు ఆయకట్టుకు కృష్ణాజలాలు లభించిఉండేవి. దిగువన కృష్ణానది మలుపు తిరిగిన తర్వాత నిర్మించాలంటే ఆంధ్రకు ఎక్కువ ప్రయోజనం కలిగి తెలంగాణ నష్టపోతుందని కేఎల్ రావుకు తెలుసు. తన ప్రాంతానికి ఎక్కువ లాభం కలిగించే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి నందికొండ దగ్గరకు ప్రాజెక్టు స్థలాన్ని మార్పించి, ఆంధ్ర- హైదరాబాద్ జాయింట్ ప్రాజెక్టుగా ప్రతిపాదించారు.
నందికొండ/నాగార్జునసాగర్ ప్రాజెక్టు
# నందికొండ ప్రాజెక్టుకు ఆచార్య నాగార్జున పేరు పెట్టి నాగార్జునసాగర్‌గా నామకరణం చేశారు. 1954లో అప్పటి ఆంధ్ర-హైదరాబాద్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్నవి. 1955, డిసెంబర్ 10న ప్రధాని నెహ్రూ నాగార్జునసాగర్‌కు పునాదిరాయి వేశారు. తెలంగాణ విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. అడుగడుగునా ప్రజలు నెహ్రూ కు ప్రత్యేక తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శించారు.
# నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం తెలంగాణ ఆయకట్టు 8.8లక్షల ఎకరాలు. తెలంగాణ ప్రాంతంలో 6,02, 093 ఎకరాలు (నల్లగొండ జిల్లాలో 3, 73, 067 ఎకరాలు, ఖమ్మం 2, 29, 014 ఎకరాలు) స్థిరీకరించారు. (ఏలేశ్వరం దగ్గర డ్యాం నిర్మించి ఉంటే నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరో 3 లక్షల ఎకరాలకు సాగునీరంది ఉండేది)
# ఆంధ్రప్రాంతంలో 15,52,950 ఎకరాలు (గుంటూరు జిల్లాలో 7,02,680 ఎకరాలు, ప్రకాశం 4,72,218, ఎడమ కాల్వ కింది కృష్ణా జిల్లా 3,78,021 ఎకరాలు) స్థిరీకరించారు. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి 28శాతం కాగా, ఆంధ్రప్రాంతానికి 72శాతం. జాయింట్ ప్రాజెక్టు రిపోర్టులోని నిర్ణయాలను అనేక సాకులు చూపూతు, ఏ అనుమతులను తీసుకోకుండానే ( ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత) పలు మార్పులు చేశారు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు