తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దిశగా..
1969 ఉద్యమం తర్వాత తెలంగాణ ఆకాంక్ష తిరిగి 1990వ దశకంలో ముందుకొచ్చింది. సీమాంధ్ర పాలకుల దోపిడీ అంతంకావాలని తెలంగాణ ప్రజలు భావించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తెరమీదకు వచ్చింది. మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్య సంఘటనలు, ఉద్యమానికి వేదికగా ఏర్పాటైన సంస్థల గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం..
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ (1988 జూలై 14)
-1987లో హైదరాబాద్‌లోని కాచిగూడ బసంత్ టాకీస్‌లో తెలంగాణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కాళోజి, జయశంకర్, నాట్యకళాప్రెస్ ప్రభాకర్, కేశవరావ్‌జాదవ్, పీ హరినాథ్, తోట ఆనందరావు, ఈవీ పద్మనాభం, వినాయక్, కోదండరాం, నందిని సిధారెడ్డి, పాశం యాదగిరి, జస్టిస్ కొండా మాధవరెడ్డి పాల్గొన్నారు.
-ఈ సదస్సులో పలువురు వక్తలు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న నష్టాలను, అన్యాయాలను, ఉల్లంఘనలను మొదలైనవాటిని ఎప్పటికప్పుడు తెలపడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ఫలితంగా ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 జూలై 14న ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ప్రభాకర్ ఇంటినే సంస్థ కార్యాలయంగా ఉపయోగించారు.
-తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలపై పరిశోధన, అధ్యయనం దానికి సంబంధించిన ప్రచురణలను ట్రస్ట్ లక్ష్యాలుగా ప్రకటించారు. తెలంగాణ సమస్యలను మరింత స్పష్టంగా వివరించడానికి మా తెలంగాణ మాస పత్రికను ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రభాకర్‌రావు 1989లో స్థాపించారు. ఈ పత్రికను 13-08-1989లో కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో ప్రజాకవి కాళోజి నారాయణరావు ఆవిష్కరించారు.
-ప్రాంతీయ మండలి రద్దువల్ల తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం ఏ రంగానికి ఎంత కేటాయిస్తుందో తెలిసేదికాదు. కాని తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటు వల్ల వీలైనంతవరకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన వివక్షపూరితమైన కేటాయింపులను, సాగునీటి రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ నిధుల తరలింపుల్లో జరిగిన అన్యాయాలను మా తెలంగాణ పత్రిక ద్వారా ట్రస్ట్ వివరించింది. ఇది ప్రచురించిన పలు రకాలైన సమాచారం వల్ల ప్రజాసంఘాలు, విద్యార్థులు, ఉద్యోగుల్లో తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తిని పెంపొందించడానికి ఉపయోగపడింది.
-తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తెలంగాణ పత్రిక మొత్తం 4 సంచికలు, 3 అనుబంధాలు ప్రచురించింది. మా తెలంగాణ ప్రత్యేక సంచికలో ఒకటి 1989లో కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఎన్నిక సందర్భంగా, రెండోది మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం సందర్భంగా,మూడోది 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రచురించింది. కల్వకుర్తిలో ప్రజలు ఎన్టీఆర్‌ను ఓడించడంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వెలువరించిన మా తెలంగాణ పత్రిక అనుబంధ సంచిక ప్రభావం కూడా ఉంది.
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (1992)
-ఆరు సూత్రాల పథకం అనుసరించి కళాశాలల్లో 80 శాతం సీట్లను స్థానికులకు, మిగతా 20 శాతం ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. ఓపెన్ కాంపిటీషన్ స్థానికులు, స్థానికేతరుల్లో ఎవరికి అర్హత ఉంటే వారితోనే సీట్లను భర్తీ చేయాలి. కానీ కేవలం సీమాంధ్ర విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీనిపై విద్యార్థులు రాజకీయ పార్టీలకతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయిన కొత్తిరెడ్డి మనోహర్‌రెడ్డి నాయకత్వంలో 1992లో ఓపెన్కోటాలో అర్హత కలిగిన తెలంగాణ విద్యార్థులకు సైతం సీట్లు కేటాయించాలని ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి 1992లో మనోహర్‌రెడ్డి, కృష్ణమోహన్, జగన్‌రెడ్డి తదితర విద్యార్థుల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది.
-ఈ సంస్థ తన డిమాండ్లను నెరవేర్చాలని ర్యాలీలు, ధర్నాలు, సదస్సులు, సమావేశాలు, నిరాహారదీక్షలను నిర్వహించింది. ఈ సంఘం 1992, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. ఈ సదస్సులో సురేంద్రమోహన్, జార్జిఫెర్నాండెజ్ లాంటి జాతీయ నాయకులు పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
సంస్థ ముఖ్య కార్యక్రమాలు
-1992 మార్చిలో విడుదలైన మొండి మొగుడు – పెంకి పెళ్లాం సినిమాలో హీరోయిన్ పాత్ర తెలంగాణ భాషను, సంస్కృతిని, మహిళలను కించపరిచేలా ఉందని ఒక కరపత్రం రాసి సినీ నిర్మాత, దర్శకులను హెచ్చరించింది. ఇది విద్యార్థుల్లో చర్చకు దారితీసింది.
-M.A తెలుగు సిలబస్‌లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో భాగంగా ప్రఖ్యాత రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజలమనిషిని తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను ఘోరావ్ చేశారు. దీంతో తలొగ్గిన అధికారులు ఈ నవలను పాఠ్యాంశంలో చేర్చారు.
-తెలంగాణలోని ఎయిడెడ్ కళాశాలల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి 127 మంది ఆంధ్రప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల ఉపసంహరణకు మనోహర్‌రెడ్డి 6-10-1994 నుంచి ఓయూలో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. 8-10-1994న రామచంద్రమూర్తి ఈ దీక్షపై ఉదయం దినపత్రికలో సంపాదకీయం రాసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 4 రోజులు తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఈ బదిలీలను నిలిపివేసింది.
-1995 వరకు ప్రముఖపాత్ర వహించిన విద్యార్థులంతా చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఈ సంస్థ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
తెలంగాణ ముక్తి మోర్చా (1993)
-తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజాసంఘాల్లో తెలంగాణ ముక్తి మోర్చా ఒకటి. ఇది 1993లో మేచినేని కిషన్‌రావు, కే పురుషోత్తం, సీహెచ్ లక్ష్మయ్య, నాగసేనారెడ్డి, మదన్మోహన్ల ఆధ్వర్యంలో ఏర్పడింది.
-ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో చిన్నరాష్ర్టాలను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ కోరింది. ఇది చిన్న రాష్ర్టాల ఏర్పాటును గురించి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చి 24-9-1993 నుంచి 28-9-1993 వరకు విజయవంతంగా రాజకీయ నాయకత్వ శిక్షణ తరగతులను నిర్వహించింది. సుస్థిరపాలనకు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రతివ్యక్తికి ఉద్యోగాన్ని కల్పించడానికి, తాగునీరును, సాగునీరును అందించడానికి, విద్య, వైద్యం అందుబాటులో ఉంచడానికి చిన్నరాష్ట్రమే శరణ్యమని శిక్షణ తరగతుల్లో తీర్మానించింది.
-తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అయినప్పటి నుంచి ఏ రంగంలోనూ అభివృద్ధికి నోచుకోలేదని తెలంగాణ ముక్తి మోర్చా అభిప్రాయపడింది. తెలంగాణ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రమొక్కటే మేలని భావించి ముక్తి మోర్చ ఉద్యమించింది.
తెలంగాణ ప్రజా సమితి సదస్సు (1994)
-1994 జనవరి 23న భూపతి కృష్ణమూర్తి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సదస్సు జరిగింది. ఇందులో పెద్దసంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, 1969 ఉద్యమకారులు, ప్రజాసమితి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసమితి ప్రచురించిన 24 పేజీల పుస్తకంలో తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ ప్రాంతం ఆంధ్రపాలకుల దోపిడీ వేదికగా మారిందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
-తెలంగాణ ప్రజాసమితి మలిదశ ఉద్యమంలో భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్‌కిశోర్, సంతపురి రఘువీర్‌రావు, మామిడి రమాకాంత్‌రావు, టీఎన్జీవో నాయకుడు ఆమోస్ తదితరుల నాయకత్వంలో తెలంగాణ సదస్సులను అన్ని జిల్లాల్లో నిర్వహించి మరోసారి ప్రజలను ఉద్యమానికి సన్నద్ధంచేసే ప్రయత్నాలు చేపట్టింది.
-1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హెచ్డీ దేవెగౌడ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 1996 ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం జార్ఖండ్, ఉత్తరాంచల్, విదర్భ లాంటి రాష్ర్టాలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. దీంతో తెలంగాణ కోసం కృషిచేస్తున్న ప్రజాసంఘాలు, నాయకులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ఆశలు చిగురించాయి.
-నిజామాబాద్ అడ్వకేట్స్ సభ: ప్రధాని దేవెగౌడ ప్రకటనతో ముందుగా స్పందించింది న్యాయవాదులే. 1996 అక్టోబర్ 27న నిజామాబాద్ న్యాయవాదులు 29 మంది ఏఎస్ పోశెట్టి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ప్రొ. జయశంకర్‌ను ఆహ్వానించారు. ఈ సమావేశం తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
-వరంగల్ సభ : నిజామాబాద్ సభ విజయవంతమైన కొన్ని రోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతూ తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ భూపతి కృష్ణమూర్తి, కాళోజీ, మాధవరెడ్డి, జయశంకర్, నారం కృష్ణారావు, కేశవరావ్ జాదవ్ మొదలైన వారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రత్యేక రాష్ర్టాన్ని కోరుతూ వరంగల్‌లో జరిగిన బహిరంగ సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఈ మహాసభ విజయం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునరుజ్జీవం కలిగింది.
-ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్: ఈ సభ నిర్వాహకులు పాశం యాదగిరి, పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన జర్నలిస్టు గులాం రసూల్‌ఖాన్ స్మారకార్థం తెలంగాణ జర్నలిస్టులు ఈ సభను ఏర్పాటుచేశారు.
-1997 జనవరి 19న వివేకవర్ధిని కళాశాల పక్కనే ఉన్న అశోకా టాకీస్ (హైదరాబాద్) లో ఈ సభ జరిగింది.
-ఈ సదస్సు కరపత్రంలోని మొదటివాక్యంలో సొంతగడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం అని పేర్కొన్నారు.
-గాదె ఇన్నయ్య తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన గణాంకాలతో సహా ముద్రించిన దగాపడ్డ తెలంగాణ తొలి సంచికను ఈ సదస్సులోనే ఆవిష్కరించారు.
-1997-2000ల మధ్యకాలంలో వేలాదిమందిని ప్రభావితం చేసి తెలంగాణ సోయిని కలిగించిన జయశంకర్ రాసిన పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతోంది కూడా ఈ సదస్సులోనే ఆవిష్కరించారు.
-ఈ సదస్సులోనే తొలిసారిగా గద్దర్ అమ్మా తెలంగాణమా – ఆకలి కేకల గానమా పాటను పాడారు.
-సిద్దిపేట సదస్సు: 1997 ఆగస్టులో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సు నిర్వహించారు.
-ఈ సదస్సులోనే నందిని సిధారెడ్డి రాసిన నాగేటి సాళ్లల్ల – నా తెలంగాణ పాట వచ్చింది.
-భువనగిరి సభ : తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 1997 మార్చి 8, 9ల్లో జరిగింది. సభాప్రాంగణానికి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరుపెట్టారు.
-ఈ సదస్సును ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రారంభించారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నవారిని పాలకులు కాల్చి చంపుతున్నారని కాళోజీ ఆవేదన వ్యక్తం చేశారు.
-ఈ సదస్సు ఇండియన్ మిషన్ స్కూల్ ఆవరణలో 9 ప్రత్యేక సెషన్లలో తెలంగాణలోని పలు సమస్యలపై విస్తృతస్థాయిలో చర్చ జరిపింది.
-చర్చల అనంతరం చివరిరోజున సాయంత్రం నిర్వహించిన భారీ ప్రదర్శనవల్ల భువనగిరి వీధులు జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి.
-ఈ ప్రదర్శనలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన మేధావులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, గద్దర్ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం, గొల్లకుర్మ డోలుదెబ్బ నాయకురాలు బెల్లి లలిత, జననాట్య మండలి, ఏకలవ్య నాట్యమండలి, ఆరుణోదయ సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.
-ఈ సదస్సులో చేసిన తీర్మానాలను బహిరంగ సభలో ప్రజలు ఆమోదించారు.
కొన్ని ముఖ్యమైన తీర్మానాలు
1) తెలంగాణలో కరెంట్ కోతను పూర్తిగా ఎత్తివేయాలి
2) కామన్ ఎంట్రన్స్ పద్ధతిని రద్దుచేసి ప్రాంతీయ ఎంట్రన్స్ పద్ధతిని ప్రవేశపెట్టాలి.
3) తెలంగాణలోని అన్ని ఫ్యాక్టరీలు, సంస్థల్లో తెలంగాణవాసులకు న్యాయమైన వాటా కల్పించాలి
4) ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గీకరణ ప్రాంతీయ ప్రాతిపదికగా జరగాలి
5) 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న అటవీ భూములను ఆదివాసులకు తిరిగి ఇవ్వాలి.
6) తెలంగాణ పల్లెల నుంచి పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలి
7) ప్రసార సాధనాల్లో తెలంగాణ భాషను, యాసను అవమానపర్చే ధోరణులను మానుకోవాలి
-ఈ రెండురోజుల భువనగిరి సదస్సులో కాళోజీ, జయశంకర్, జీవన్, గద్దర్, జైని మల్లయ్య గుప్తా, మామిడి బాలకృష్ణారెడ్డి, భువనగిరి చైర్మన్ దామోదర్ గౌడ్, తెలంగాణ హక్కుల సమితి ఆహ్వాన కమిటీ కన్వీనర్ నాగారం అంజయ్య, కేజీ సత్యమూర్తి, కోదండరామ్, నందిని సిధారెడ్డి, పాశం యాదగిరి, కృష్ణమూర్తి, ఆకుల భూమయ్య మొదలైనవారు పాల్గొన్నారు.
-భువనగిరిలో జరిగిన తెలంగాణ సదస్సు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో మైలురాయి వంటిది. ఈ సదస్సుకు వచ్చిన స్పందనచూసి ప్రభుత్వం భయాందోళనకు గురైంది. ఈ సభలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజలను తమ ఆటపాటలతో చైతన్యవంతం చేస్తున్నారనే అక్కసుతో ఆంధ్రపాలకులు ఈ సభ జరిగిన నెలలోపే అమ్మా తెలంగాణమా – ఆకలి కేకల గానమా అంటూ భువనగిరి సభలో గళమెత్తిన గద్దర్‌పై ఏప్రిల్ 6న కాల్పులు జరిపించారు.
-అదేవిధంగా తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేస్తున్న తెలంగాణ జనసభ, కళాసమితి నాయకులు బెల్లి లలితను భువనగిరి గుట్ట వెనుకప్రాంతంలో 1999 మే 26న అతిదారుణంగా ముక్కలుముక్కలుగా నరికి చంపించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు