డాక్టర్ ఆఫ్ సివిల్ గా ప్రసిద్ధి చెందినది ఎవరు ?
‘సాలార్జంగ్ అనే అతి సామాన్య వ్యక్తి 24 ఏండ్ల నూనుగు మిసాల వయస్సులోనే ప్రధాని పదివిని చేపట్టి 30 ఏండ్ల పాటు ప్రధానిగా తన ఘనతను, ఖ్యాతిని భారతదేశానికి, ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇతడు గొప్ప స్వాప్నికుడు, గొప్ప దౌత్యవేత్త, గొప్ప పరిపాలనాకర్త. ‘మునిగిపోతున్న నిజాం రాజ్య నౌకను’ సురక్షితంగా తీరానికి చేర్చిన కెప్టెన్’
# సాలార్జంగ్ అసలు పేరు తురాబ్ అలీఖాన్. ఇతడు మదీనాకు చెందిన ‘షేక్ ఉమర్ కర్మాన్’ సంతతికి చెందినవాడు. తన బంధువు, నిజాం కొలువులో దివాన్‌గా పనిచేస్తున్న ‘సిరాజ్-ఉల్-ముల్క్’ సహాయంతో సాలార్జంగ్ 1848లో తెలంగాణలో ఒక పరిపాలనా పదవిని పొందాడు. సిరాజ్-ఉల్-ముల్క్ మరణం తర్వాత తురాబ్ అలీఖాన్ (సాలార్జంగ్-I)ను నిజాం నాసిరుద్దౌలా (4వ నిజాం) ప్రధానిగా నియమించాడు. అప్పటికి సాలార్జంగ్ వయస్సు 24 ఏండ్లు మాత్రమే. సాలార్జంగ్ 30 ఏండ్లు తన పాలనానుభవంతో ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా పనిచేశాడు. వారు వరుసగా
# నాసిర్ ఉద్దౌలా (1829-57)
# అఫ్జ్జల్ ఉద్దౌలా (1857-1869)
# మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)
# 1853లో ప్రధానిగా చేరి 1883 వరకు పనిచేశాడు.
#సాలార్జంగ్ దివాన్ అయినప్పుడు ‘రాజ్యపు ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. సుసంపన్నమైన, సారవంతమైన బీరార్, రాయ్‌చూర్, దరవ (ఉస్మాన్‌బాద్) జిల్లాలను కోల్పోవడం రాజ్య ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీసింది. ఇలాంటి సమయంలో నిజాం రాజ్యానికి సాలార్జంగ్ ప్రధానిగా వచ్చాడు. సాలార్జంగ్ నిజాం రాజ్యాన్ని ప్రపంచంలోనే గొప్ప సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దాడు.
ఆర్థిక సంస్కరణలు
# సాలార్జంగ్ ఆంగ్లేయుల ప్రభావంతో రాజ్యాన్ని జిల్లాలుగా, తాలూకాలుగా విభజించి జిల్లావారీగా శిస్తు వసూళ్లకు రెవెన్యూ బోర్డులను (1864-65) ఏర్పాటు చేశాడు. ఆ బోర్డుల ఆధీనంలో..
#వ్యవసాయం : చెరువుల ద్వారా, బావుల ద్వారా ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులను సాధించారు.
# వాణిజ్యం, సుంకాలు, స్టాంపు మొదలగువాటి ద్వారా ఖజానా నిండేలా చర్యలు చేపట్టాడు.
# 1867లో అటవీ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్) శాఖను నెలకొల్పాడు.
# 1875లో రెవెన్యూశాఖను నెలకొల్పి భూమిశిస్తు ‘జిలాబంది’ని క్రమబద్ధ్దీకరించాడు.
# సాలార్జంగ్ మొదట తన దృష్టిని రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, రుణాలు తగ్గించడం వైపు మరల్చాడు. ఇందుకోసం అతడు రెండు చర్యలు తీసుకున్నాడు. మొదటగా రాజ్య రెవెన్యూ వసూళ్లను నియంత్రించే ‘దఫ్తరేదార్స్’అనే అధికారుల అధికారాలను తగ్గించాడు. రెండోది రెవెన్యూ వసూళ్లు చేయడానికి జీతం ఇచ్చే తాలూక్దారులను నియమించాడు. అంతకుపూర్వం ప్రజలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేసి దోపిడీ చేసే కాంట్రాక్టర్లు రెవెన్యూ వసూళ్లను వేలం వేసేవారు. ఈ చర్యవల్ల రెవెన్యూ వసూళ్లలో కొత్త మార్పు వచ్చి రాజ్యానికి ఆదాయం పెరిగింది. తాకట్టుపెట్టిన రాజ్యాభరణాలను వెంటనే విడిపించాడు. ఇంకా మిగిలి ఉన్న రాజ్యం రుణాలను తగ్గించడం కోసం తక్కువ వడ్డీరేటుకు అప్పులను తీసుకున్నాడు.
# ద్రవ్య వ్యవస్థ నిలకడగా ఉండటానికి జిల్లాస్థాయిలో టంకశాలలను రద్దుచేసి హైదరాబాద్‌లో ఒక కేంద్ర టంకశాలను స్థాపించాడు. ఇతడు ‘హలిసిక్కా’ రూపాయిని జారీ చేశాడు.
# భూగర్భ, గనులు, కర్మాగారాలు, వర్క్‌షాప్స్. స్టోర్స్ నాలుగు శాఖలను ప్రతిభావంతులైన నిపుణులకు ఇచ్చాడు.
న్యాయ సంస్కరణలు
#న్యాయవ్యవస్థను సంస్కరించాలనే ఉద్దేశంతో అనేక మంది మున్సిఫ్లు, మీర్ ఆదిల్స్ అనే న్యాయ అధికారులను జిల్లాల్లో నియమించాడు. హైదరాబాద్‌లో ‘మకమ-ఇ-సదర్’ అని పిలువబడే హైకోర్ట్ ఈ అధికారులను నియంత్రించేది. హైకోర్ట్పైన కోర్ట్ ఆఫ్ అప్పీల్ లేదా ‘మజిలీస్-ఇ-మురఫ’ అనే సుప్రీంకోర్టు ఉం డేది. హైదరాబాద్ నగరంలో బుజంగ్ (సీనియర్) దివానీ-ఇ-అదాలత్ (సివిల్ కోర్టు), నిజామత్-ఇ-సదరన్ అనే మతపరమైన విషయాలను పరిశీలించే కోర్టులను నెలకొల్పాడు. (హైదరాబాద్ రాజ్యంలో న్యాయవాదుల పరీక్షలు మొదలుకావడంతో 1891 నాటికి రామచంద్ర పిళ్లే, బారిస్టర్ రుద్ర, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి మేటి న్యాయవాదులు ప్రసిద్ధి చెందారు) హైదరాబాద్ రాజ్యంలో న్యాయసంస్కరణలను ప్రవేశపెట్టి ‘డాక్టర్ ఆఫ్ సివిల్’గా సాలార్జంగ్-1 ప్రసిద్ధి చెందాడు.
పాలనా సంస్కరణలు
# 1855లో సాలార్జంగ్ పాలనా సంస్కరణల్లో భాగం గా కాంట్రాక్టర్స్ స్థానంలో జీతం ఇచ్చే తాలూక్‌దార్లను (కలెక్టర్స్) నియమించాడు. 1865లో జిలాబంది విధానం ప్రవేశ పెట్టబడింది. రాజ్యాన్ని 14 జిల్లాలుగా (సర్కార్స్) విభజించాడు. ప్రతి జిల్లాకు అవల్ తాలూక్దార్లు (కలెక్టర్స్ను) నియమించాడు. వీరు నేటి సబ్ కలెక్టర్స్‌తో సమానం. ఈ తాలూక్దార్ల వ్యవస్థను పర్యవేక్షించడానికి ‘మజిలిస్-ఇ-మల్‌గుజారి’ అనే ఒక పాలనా బోర్డు సృష్టించబడింది. 1867లో వీటిని రద్దుచేసి ఐదు రీజినల్ డివిజన్స్‌గా రూపొందించాడు. ప్రతి రీజినల్ డివిజన్‌కు సదర్-తాలుక్దార్ను నియమించాడు. వీరు నేటి రెవెన్యూ కమిషనర్స్‌తో సమానం
పోలీస్ సంస్కరణలు
# 1865 వరకు హైదరాబాద్ రాజ్యంలో ఒక పటిష్టమైన పోలీసు విధానం లేదు. తెలంగాణ ప్రాంతంలో వంశపారపర్యంగా వచ్చే గ్రామ వాచ్‌మన్ వర్థిల్లాడు. పెద్ద నగరాలైన హైదరాబాద్, ఔరంగబాద్‌లో కొత్వాల్ లేదా పోలీస్ కమిషనర్లు ఉన్నారు. కానీ క్రమంగా పోలీసు పనులను రెవెన్యూ అధికారులు నిర్వహించారు. సాలార్జంగ్ ‘మకమ-ఇ-కొత్వాల్’ అనే పోలీసు శాఖను నెలకొల్పాడు. నిజామ అనే పోలీసు పటాలాన్ని సృష్టించాడు. పోలీసు సూపరింటెండెంట్స్ను ముతమిన్లు, ఇన్స్పెక్టర్లను అమీన్లు అని పిల్చేవారు. పోలీస్స్టేషన్లను కీలు అని పిలిచేవారు.
రవాణా సౌకర్యాలు
#రాజ్యంలో రాకపోకల కోసం హైదరాబాద్-షోలాపూర్ మధ్య రహదారి నిర్మాణంతో, 1868లో బొంబాయి-మద్రాసు మధ్య రైల్వే నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణమ య్యాయి. ముంబాయి-మద్రాసు రైల్వే లైను రాజ్యం లో ముఖ్య పట్టణాలైన గుల్బర్గా, వాడి గుండా వెళ్లింది. 1878లో హైదరాబాద్‌ను వాడి తో కలిపే రైల్వేలైను పూర్తయింది.
పబ్లిక్ సర్వీసులు
# పరిపాలనా ప్రమాణాలు పెంచడం కోసం సాలార్జంగ్ నేర్పరులైన వారిని దేశం నలుమూలల నుంచి ఎంపికచేసి నియమించాడు. హైదరాబాద్ రాజ్య సర్వీసులో అధిక సంఖ్యలో ఉత్తర భారతదేశ ముస్లింలు, కాయస్థులు ప్రవేశించారు. వీరిలో సయ్యద్ స్సేన్ బిల్గ్రామి, సయ్యద్ అలీ బిల్గ్రామి, మొహిబ్ స్సేన్, సయ్యద్ మోహేది, మోహిన్ నుంచి అఘోరనాథ్ చటోపాధ్యాయుడు నిజాం కళాశాలలో ప్రవేశించారు. రాజ్య పరిపాలనలో అధికసంఖ్యలో బయటివారిని తీసుకోవడం వల్ల స్థానికులు, బయటివారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణే ముల్కి ఆందోళనకు కారణమైంది. ఈ ముల్కి, నాన్ ముల్కి సమస్య 1910 కాలంలో, మళ్లీ ఆంధ్రవారు రావడంతో 1950 దశకం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది.
భూమి పన్ను
#తెలంగాణలో భూమిశిస్తు విషయంలో రైత్వారీ విధానం అమల్లో ఉంది. అయినప్పటికీ మునగాల, అమరచింత, గద్వాల్ మొదలైన జమీందారులు ఉన్నారు. ప్రతి గ్రామానికి బలేల్ అనే వారసత్వంగా వచ్చే అధికారి ఉన్నాడు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అణచివేయడానికి అతనికి ఫౌజ్దార్ పటేల్ సహాయ పడ్డాడు. దేశ్‌ముఖ్‌లు (పటేల్స్ పెద్ద), దేశ్‌పాండేల కింద గ్రామాలు స్కిల్స్‌లో గ్రూపులుగా చేయబడినాయి. ‘రుసుం’ అనే రెవెన్యూలోని వాటాను జమీందారులకు ఇచ్చారు. భూమిశిస్తు తర్వాత రాజ్యానికి సుంకాలు (సైర్), ఎక్సైజ్ (ఆబ్కారి) పన్నుద్వారా అదాయం వచ్చేది. దేశ్‌పతి లేదా స్థానిక ఫండ్, పేష్కస్, స్థానిక రాజుల నుంచి కప్పం, నజరానాలు లేదా అధిపతులు చెల్లించే వారసత్వపు పన్ను అనేవి ఇతర ఆదాయాలు.
ఘనత
#1857 తిరుగుబాటు సమయంలో సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యానికి తన నేర్పరితనం, శక్తితో అమోఘమైన సేవలు అందించాడు. 1859 తర్వాత ఇతడు నిజాం విశ్వాసాన్ని కోల్పొయాడు. 1860, 1867లో ఇతన్ని పదవీచ్యుతున్ని చేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ హైదరాబాద్‌లో ఉన్న బ్రిటీష్ రెసిడెంట్స్ ఇతడి పదవి పోకుండా కాపాడారు. 1857-58 మధ్యకాలంలో బ్రిటీషు వారికి సాలార్జంగ్ అందించిన విలువైన సేవలు రెసిడెంట్లకు తెలుసు. అందువల్ల హైదరాబాద్ రెసిడెంట్ డేవిడ్సన్ 1860లో సాలార్జంగ్ను నిజాం పదవీచ్యుతున్ని చేయకుండా ఆపాడు. 1867లో రెసిడెంట్ యూలే జోక్యం వల్ల సాలార్జంగ్ పదవి రక్షించబడింది. 1869లో నిజాం అఫ్జలుద్దౌల మరణించగా అతని మూడేళ్ల వయస్సు గల మీర్ మహమూద్ అలీఖాన్ రాజ్యానికి వచ్చాడు. బ్రిటీష్ ప్రభు త్వం, సాలార్జంగ్, అమీర్-ఎ-కబీర్ బహదూర్‌ను కో-రీజెంట్‌గా నిజాం మైనార్టీ కాలంలో చేసింది.
విద్యా సంస్కరణలు
# రాజ్య పాలనను నడిపించడానికి శిక్షణ పొందిన ఉద్యోగస్తులను తయారుచేయడం కోసం సాలార్జంగ్ విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 1855లో దారుల్ ఉలుమ్ హైస్కూల్‌ను పాశ్చాత్య విద్యను రాజ్యంలో ప్రవేశపెట్టడం కోసం స్థాపించాడు. ఈ పాఠశాలలో పర్షియన్, ఉర్దూ భాషలతో పాటు ఆంగ్లభాషలో కూడాబోధన జరిగింది. నిజాం అఫ్జల్ ఉద్దౌల జీవితకాలంలో ఒక్క విద్యారంగంపైనే ప్రధానంగా దృష్టిసారించాడు. సాలార్జంగ్ కో-రీజెంట్‌గా అయినప్పుడు (1869లో) ఆంగ్లభాషను, పాశ్చాత్య విద్యను బోధించడం కోసం అనేక పాఠశాలలను స్థాపించాడు. సిటీ హైస్కూల్ 1870లో, చాదర్‌ఘాట్ హైస్కూల్ 1872లో స్థాపించబడ్డాయి. 1870లో ఇంజినీరింగ్స్కూల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్కు టెక్నికల్ సిబ్బందిని అందించడంకోసం స్థాపించబడింది. 1873లో ప్రభువుల పిల్లలకోసం మదరస-ఎ-ఆలియా స్థాపించబడింది. 1978లో రాజ కుటుంబ సభ్యుల కోసం మదరస-ఎ-ఐజ్జ ప్రారంభించబడింది. తత్ఫలితంగా హైదరాబాద్ నగరంలో కొందరు వైజ్ఞానిక కులీనులు ఏర్పడ్డారు.
# సాలార్జంగ్ మరణించిన కొన్ని సంవత్సరాలకు 1887లో నిజాం కళాశాల స్థాపించారు. సాలార్జంగ్ ఈ విద్యా వ్యవస్థను స్థాపించడంతోపాటు సర్ సయ్యద్ అహ్మద్ అలీఘర్‌లో విద్యాసంస్థలను నెలకొల్పడానికి ఆర్థిక సహాయం అందించాడు. అలీఘర్ కళాశాలలు అభివృద్ధి చెందడంలో హైదరాబాద్ అధికారులైన వకర్-ఉల్-ముల్క్, మొసిన్-ఉల్-ముల్క్ కీలక పాత్ర పోషించారు.
సాలార్జంగ్ కాలం నాటి ముఖ్యమైన సంస్కరణలు
# పారిశ్రామిక వస్తు ప్రదర్శన కేంద్రం
# రైల్వే మార్గాల నిర్మాణం-
# నాందేడ్ నుంచి వాడీ
#హైదరాబాద్-విజయవాడ
#రోడ్డు మార్గాల అభివృద్ధి
#షోలాపూర్-హైదరాబాద్ వరకు
# తంతి తపాలా
# హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు
# ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు
# చాదర్‌ఘాట్ హైస్కూల్, ఆలియా కళాశాల, ఐజా కళాశాల, ఇంజినీరింగ్, వైద్య కళాశాలల ఏర్పాటు
# రెవెన్యూ బోర్డు
# ఆబ్కారీ శాఖ కార్యాలయం ఏర్పాటు
#ఇతనికాలంలో నియమించబడిన అధికారులు ఎవరు ? వారికి గల శాఖలు ఏవి ?
ఉదా: విద్యా విషయాల్లో, పోలీస్ శాఖల్లో నియమించబడినవారు ఎవరు ? అనేదానిపై అభ్యర్థులు ఫోకస్ చేయాలి.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు