‘తెలంగాణ’ ఏర్పాటు – ముఖ్య ఘట్టాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. ఆరుపదుల పోరాటం. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో బలిదానాలు. అంతకుముందు నిజాం వ్యతిరేక పోరాటాలు.. కాశీం రజ్వీ అరాచకాలు, తెలంగాణ సాయుధ పోరాటం. హైదరాబాద్ విలీన ఉద్యమాలు. అన్నింటి ఫలితం ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం. అనంతరం ఆంధ్రుల కుట్రల కత్తుల మీద ఏర్పడిన సమైక్య ఆంధ్ర ప్రదేశ్. అది ఏర్పడిన నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, ఆరోవేలుగా మారిన డిప్యూటీ సీఎం పదవి. నిధుల తరలింపులు, ఉద్యోగాల కబ్జాలు, నీటి దోపిడీలు వాటిని ఎదిరిస్తూ 1969 ఉద్యమం. పదుల సంఖ్యలో కమిటీలు, అష్ట సూత్రాలు, ఆరు సూత్రాలు, 610 జీఓలు అన్నీ ఉల్లంఘనలే. అన్నింటినీ ఎదిరించి తెలంగాణ సాధించి నేడు మొదటి వార్షికోత్సవం జరుపు కుంటుంది. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రత్యేక కథనం..
# తెలంగాణ రాష్ట్రాన్ని ‘త్రిలింగ’ అంటారు. తెలంగాణ అనే పదాన్ని ‘మక్బుల్’ అనే వ్యక్తి 14వ శతాబ్దంలో మొదటిసారిగా ఉపయోగించాడు. ‘రత్నగర్భ’గా పేరుగాంచిన తెలంగాణ ప్రాంతం ఎన్నో రాజ వంశాల పాలనలో ‘యధా రాజా తథా ప్రజ’ అనే నానుడిలా పరిపాలించబడుతూ.. రాజులు-ప్రజలు, పెట్టుబడిదారులు-కార్మికులు, దోపిడీదార్లు-దోపిడీకి గురై అన్ని రకాలుగా అణచివేయబడిన వారు ఇక్కడ ఉన్నారు. కొన్ని రాజవంశాల కాలంలో తెలంగాణ ప్రాంతం స్వయంసమృద్ధిగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.
# భారతదేశం స్వాతంత్య్రం సాధించేనాటికి హైదరాబాద్ స్వదేశీ సంస్థానంగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజుగా, లయక్ అలీ ప్రధాన మంత్రిగా, అహ్మద్ ఇల్ద్రుస్ సైన్య అధికారిగా పరిపాలనలో కొనసాగబడేది. భారతదేశ విభజన చట్టం ప్రకారం స్వదేశీ సంస్థానాలు స్వతంత్ర రాజ్యంగా లేదా భారతదేశంలో లేదా పాకిస్థాన్ భూభాగంలో విలీనం కావచ్చని పేర్కొన్నారు.
# హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా కొనసాగించాలని మొదట మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయత్నం చేశాడు. రజాకార్ల ఉద్యమ నాయకుడు కాశీం రజ్వీ ఒత్తిడిమేరకు భారత దేశంలో విలీనం చేయడానికి మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించలేదు.
# హైదరాబాద్ సంస్థానంలో భారతదేశ రాయబారిగా కేఎం మున్షీ నియమించబడ్డాడు.
# దేశ విభజన అనంతరం భారత భూభాగంలో సుమా రు 552 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ బాయ్ పటేల్, హోం శాఖ కార్యదర్శి వీపీ మీనన్ సమష్టి కృషి ఫలితంగా జమ్ముకశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు తప్ప దాదా పు అన్ని ప్రాంతాలు భారతదేశ భూభాగంలో విలీనమయ్యాయి.
# 1947, అక్టోబర్ 26న అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జమ్ముకశ్మీర్ రాజు హరిసింగ్ల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా కశ్మీర్ భారతదేశంలో విలీనం అయ్యింది.
# జునాగఢ్ గుజరాత్ ప్రాంతంలోని ఒక చిన్న సంస్థానం. ఈ ప్రాంతంలో 1948, ఫిబ్రవరి 25న ప్రజాభిప్రాయ సేకరణ జరిపి 1949, జనవరిలో భారత భూభాగంలో విలీనం చేశారు.
# హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జనరల్ జేఎన్ దరి, రాజేంద్ర సింహాజీల నాయకత్వంలో సైనిక చర్య (పోలీస్ చర్య)కు సీ రాజగోపాల చారి ‘ఆపరేషన్ పోలో’ అని నామకరణం చేశారు.
# హైదరాబాద్ రాష్ట్రాన్ని బభాషా రాష్ట్రంగా కొనసాగించాలని సీ రాజగోపాల చారి అభిప్రాయపడ్డారు.
# హైదరాబాద్‌పై సైనిక చర్య గురించి జయంతీనాథ్ దరీ ‘ఆపరేషన్ పోలో’ అనే గ్రంథం రాశాడు.
# హైదరాబాద్ విలీనం అనంతరం ఆ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు 1948 నుంచి 1950 వరకు జేఎన్ దరీ ఆధ్వర్యంంలో కొనసాగింది.
# 1950 నుంచి 1952 వరకు వెల్లోడి అనే IAS అధికారి పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు.
# కైలాసనాథ్ వాంఛూ కమిటీ సిఫారసు మేరకు మద్రాసు రాష్ట్రం నుంచి విభజించి 1953, అక్టోబర్ 1న కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టును నెలకొల్పారు.
# హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరగగా డా. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా, మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్‌గా 1952 నుంచి 1956 వరకు పరిపాలన కొనసాగింది.
# హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్టారావు, ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డితోపాటు మరో ఆరుగురు సభ్యుల మధ్య 1956, ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది.
# రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం చైర్మన్ మహమ్మద్ ఫజల్ అలీ నేతృత్వంలోని కమిషన్ సిఫారసు మేరకు 20 జిల్లాలతో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది.
# హైదరాబాద్ రాజధానిగా.. హైదరాబాద్ రాష్ట్రంలోని 9 జిల్లాలు, ఆంధ్రరాష్ట్రంలోని 11 జిల్లాలు (9 + 11) కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
# ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి: డాక్టర్ నీలం సంజీవ రెడ్డి
# రాష్ట్ర మొదటి గవర్నర్: చందూలాల్ త్రివేది
# ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేశారు. అవి..
1) ప్రకాశం జిల్లా- 1970, ఫిబ్రవరి 2న ఏర్పాటు
2) రంగారెడ్డి జిల్లా- 1978, జూన్ 12న ఏర్పాటు
3) విజయనగరం జిల్లా-1979 జూన్ 01న ఏర్పాటు
8 దీంతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య 23కు చేరింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంఘటనలు
రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన పార్టీలు
1) జై తెలంగాణ పార్టీ -పి.ఇంద్రారెడ్డి
2) తెలంగాణ సాధన సమితి-ఆలె నరేంద్ర
3) తెలంగాణ ప్రదేశ్ కా్రంగెస్ – కొండాలక్ష్మణ్ బాపూజీ
4) నవ తెలంగాణ పార్టీ-టి.దేవెందర్ గౌడ్
5) తెలంగాణ నగారా సమితి- నాగం జనార్దన్ రెడ్డి
6) తల్లి తెలంగాణ పార్టీ- విజయ శాంతి
# అయితే ఈ పార్టీలు తెలంగాణ రాష్ట్రంకోసం ఏర్పాడినప్పటికీ ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయాయి.
# తెలంగాణ రాష్ట్రం సాధించడమే ప్రధాన ధ్యేయంగా కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 2001, ఏప్రిల్ 27న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’(టీఆర్ఎస్)ను ఏర్పాటు చేశారు.
# 2004లో జరిగిన ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరడంతో తెలంగాణ రాష్ట్ర అంశం పరిశీలన కోసం, అందరిని సమన్వయం చేసే లక్ష్యంతో 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇది క్రియాశీలకంగా పని చేయలేదు.
# యూపీఏ-1 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేయడంతో 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
# కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం, 2009, డిసెంబర్ 4న శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడంతో డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుందని ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రాంత ఎంపీలు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వెనకకు తీసుకుంటున్నట్లుగా డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
# దీంతో తెలంగాణలో ఉద్యమాలు పెరగడంతో 2010 ఫిబ్రవరి 3న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ‘జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు..
# వినోద్ కుమార్ దుగ్గల్- కార్యదర్శి
# ప్రొ. రణబీర్ సింగ్
# డా. రవీంద్రకౌర్
# డా.అబుసలీం షరీఫ్
# శ్రీకృష్ణ కమిటీ 6 సూత్రాలతో తమ నివేదికను 2010, డిసెంబర్ 30న సమర్పించింది.
# తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై 2011, మార్చి 10న ‘మిలియన్ మార్చ్’ ఉద్యమాన్ని చేపట్టారు.
# తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు 2011, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 24 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 42 రోజులపాటు సకలజనుల సమ్మె నిర్వహించారు.
# తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013 జూలై 30న ఏకగ్రీవంగా ప్రకటించింది.
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును 2014 జనవరి 7న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆంధ్రప్రాంత ఎంపీలు వ్యతిరేకించినప్పటికీ 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదం పొందింది.
# తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ 2014 ఫిబ్రవరి 20న ఆమోదించింది.
# మార్చి 1, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును రాష్ట్రపతి ఆమోదించగా ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు 71 పేజీల్లో ప్రచురించారు.
# సుదీర్ఘ నిరీక్షణ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా 2014, జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా 10 జిల్లాలతో ఏర్పడింది.
# 1956, నవబంర్ 1 నుంచి 2014 జూన్ 1 వరకు ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం
# 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి హైదరాబాద్ రాష్ట్రం ఆర్థికంగా మిగులు బడ్జెట్లో ఉండేది. హైదరాబాద్ ఆంధ్రరాష్ట్రంలో విలీనం అయిన తర్వాత పెద్దమనుషుల ఒప్పందంలోని నియమాలను అమలు పర్చకుండా, తెలంగాణ ప్రాంత ప్రజలు, భూభాగం, అభివృద్ధి చెందకుండా అన్ని రంగాలలో వెనుకబాటు తనానికి గురయింది. తెలంగాణ జిల్లాల్లో విద్యార్థులు నిరుద్యోగులుగా, వ్యవసాయ భూములు సాగునీరు సౌకర్యం లేక బీడు భూములుగా మారి పోయాయి. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘంగా పోరాటాలు చేశారు.
# రాష్ట్ర సాధన కోసం 1969లో ఉద్యమం చేయగా. ఆ ఉద్యమంలో 369 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా ఉద్యమాన్ని అణచి వేశారు.
# 1970లో రాష్ట్ర సాధన కోసం డా. మరి చెన్నారెడ్డి ‘తెలంగాణ ప్రజాసమితి పార్టీ’ని ఏర్పాటు చేశారు. (ప్రజా సమితి పార్టీ గుర్తు- పార)
# అప్పుడు జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి విజయం సాధించిన అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
# ముల్కి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రాంతానికి చెందిన వారిని తెలంగాణలో ఉద్యోగులుగా నియమించడం వలన ఇక్కడి విద్యార్థులు ఉద్యమం చేపట్టడంతో 1969లో అప్పటి ముఖ్యమ్రంతి కాసు బ్రహ్మానందరెడ్డి లలిత్ కుమార్ కమిటీని ఏర్పాటు చేశారు.
# 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగంలో 371(D) అధికరణంలో చేర్చా రు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ను 6 జోన్లుగా విభజించి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలను పొందుపర్చారు.
# 6 సూత్రాల పథకం అమలు పర్చడానికి 610 జీవో రూపొందించగా అదికూడా సక్రమంగా అమలవ్వలేదు.
# 610 జీవో అమలు విధానం పరిశీలించడానికి జేఎం గిర్గ్లాని కమిటీని ఏర్పాటు చేయగా.. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రాంతానికి చెందిన వారు ఉద్యోగాలు పొందరాని నివేదిక సమర్పించారు. ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కావాలనే ఆకాంక్షతో రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి.
సీహెచ్ భిక్షమయ్య
సీనియర్ ఫ్యాకల్టీ
డీఎల్, రామన్నపేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు