ఇక్ష్యాకులు – సాంస్కృతిక సేవ
శాతవాహనుల అనంతరం తెలంగాణలో రాజ్యం స్థాపించినవారు ఇక్షాకులు. ఈ రాజ్యస్థాపకుడు వశిష్టపుత్ర శాంతమూలుడు (వీరు కూడా మాతృసంజ్ఞలు ధరించారు). ఇతడు చివరి శాతవాహనరాజైన పులోమావి-3ను పారదోలి రాజ్యానికి వచ్చాడు. విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు (విజయపురి పట్టణాన్ని విజయశ్రీ శాతకర్ణి రాజు నిర్మించాడు). ఇక్షాకులు దాదాపు 100 ఏండ్లు ఐదుగురు రాజులు పాలించారు. శాసనాల్లో మాత్రమే ఐదురుగు రాజులు, పురాణాల్లో మాత్రం ఏడుగురు రాజులు పరిపాలించినట్లు తెలుపుతున్నాయి.
జన్మస్థలంపై వాదాలు
-చరిత్రకారులు రాప్సన్, బూలర్ ప్రకారం: ఇక్షాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్షాకు సంతతి వారు.
-ధర్మామృతం (జైనగ్రంథం) ప్రకారం.. ఇక్షాకు వంశానికి చెందిన యశోధరుడు అంగదేశం (బెంగాల్ రాష్ట్రం) నుంచి తెలంగాణ ప్రాంతం వచ్చి రాజ్యాన్ని స్థాపించాడని కన్నడ గ్రంథం తెలుపుతుంది.
-చరిత్రకారుడు కాల్వేల్ ప్రకారం.. వీరు తెలంగాణలోని కృష్ణానది తీరంలోని ఇక్షు అనే స్థానిక జాతి వారు ఉత్తర భారతదేశం నుంచి వలస రాలేదు.
– వోగెల్ పండితుని ప్రకారం.. కన్నడ ప్రాంతానికి చెందినవారు.
– గోపాలచారి: తమిళదేశం నుంచి వచ్చారని సిద్ధాంతాల ద్వారా నిరూపించారు.
– నాగార్జునకొండ శాసనం : ఈ శాసనంలో ఇక్షాకులు బుద్ధుని వంశస్థులని (అంటే ఇక్షాకు వంశం) పేర్కొనబడింది.(వీరపురుషదత్తుడు మాత్రమే బౌద్ధం స్వీకరించాడు. కానీ ఇక్షాకుల వంశమని చెప్పుకోలేదు.
– ఇక్షాకుల్లో మేనరికం పెళ్లి సంబంధాలు చేసుకొనే ఆచారం ఉంది. వీరపురుషదత్తుడు తన మేనత్త కుమార్తెలను (తండ్రి చెల్లెలు కూమార్తెలను) వివా హం చేసుకున్నాడు. ఈ పద్ధతి ఉత్తర భారతదేశంలో లేదు. అడవిసిరి, ఖండ, కోడబలిశ్రీ అనే రాణుల పేర్ల ను బట్టి వీరు దక్షిణాదికి చెందిన అనార్య తెగలకు చెందినవారని చెప్పవచ్చు. దక్షిణాది ప్రాంతంలో ఇక్షు అనగా చెరకు అని అర్థం. చెరకును జాతి చిహ్నంగా స్వీకరించిన ప్రాచీనగణం (తెగ)గా వీరిని చెప్పుకోవచ్చు. (నేను రాసిన తెలంగాణ సామాజిక-సంస్కృతిక వారసత్వం గ్రంథంలో కొన్ని వివరాలు పేర్కొన్నాను. అభ్యర్థులు వీటిని గమనించి చదువుకోగలరు).
రాజకీయ చరిత్ర
– శాంతమూలుడు: రాజ్యస్థాపకుడు, ఉజ్జయిని మహాసేనుని భక్తుడు (మహాసేనుడు అంటే కార్తికేయుడు). శక, అబీర, యవన, గర్దభీ, జాతులను జయించి రాజ్యవిస్తరణకు పూనుకొన్నాడు. దానికి నిదర్శనమే అశ్వమేధయాగాలునిర్వహించాడు. ఇతని శాసనాలు రెంటాల, దాచేపల్లి (పాకృత భాష)లో కింద విధంగా ఉంది.
– లక్షల కొలది బంగారు నాణాలు దానం చేసినట్లు
– నేగిమాలు అనే వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాడు.
– శ్రీశైలం మహాక్షేత్రానికి ఈశాన్య ద్వారం ఏలేశ్వరంను పునర్నిర్మించాడు.
– అడవులను సాగుచేసి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు.
– వీరపురుషదత్తుడు : శాంతమూలుని తర్వాత అతని కుమారుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని తల్లి మాధిరి. అందుకే ఇతనిని మాధరీపుత్ర వీరపురుషదత్తుడు అంటారు.
– ఇతని నాణాలు ఫణిగిరి (నల్లగొండ జిల్లా) లో లభించాయి. ఇతని అధికారి ఎలిసిరి. ఇతడు తన పేరుమీదగా ఏలేశ్వరం అనే ఆలయాన్ని ఏలేశ్వరంలో నిర్మించాడు. ఇతడు ఉజ్జయినీలోని శకరాజు (మధ్యప్రదేశ్) రాకుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. ఇక్షాకుల-ఉజ్జయినీ రాజ్యాల మధ్య వైవాహిక సంబంధాలతో ఈ రాజ్యాన్ని పటిష్టంగా తీర్చిదిద్దాడు అని డా. కృష్ణారావు పేర్కొన్నారు.
– ఇతని కాలంలో తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లోనూ బౌద్ధమతం స్వర్ణయుగంగా వెలుగొందింది. అంతేకాకుండా పర్నిక అనే వర్తక శ్రేణులను (కూటములను) నియమించి విదేశీ వ్యాపారం కోసం కృషి చేశాడు. ఇతని తండ్రి అడవిని నిర్మూలించి సాగుభూములుగా మార్చి రైతులకు శతసహస్ర నాగళ్ల దాన ప్రదాత (లక్ష నాగళ్లను రైతులకు దానం చేసినవాడు) అనే బిరుదు వహించెను. కానీ ఇతడు విదేశీ వ్యాపారం జరిపి తోటలను అభివృద్ధి చేసి (తమలపాకులు మొదలగునవి) గొప్పరాజుగా పేరు గడించినట్లు విశపట్టి శాసనంలో వివరాలను బట్టి తెలుస్తోంది. ఇతని రాజ లాంఛనమే ఇక్షాకుల రాజ చిహ్నంగా మారింది. అదే సింహం గుర్తు. అతని ఆస్థానంలో భావవివేకుడు అనే గొప్ప బౌద్ధ తత్వవేత్త ఉన్నాడు. ఇతడు ప్రత్యేకంగా నాగార్జునకొండలో సిథియన్ సైనికుని శిల్పం చెక్కడంలో ప్రత్యేక శ్రద్ధకనబర్చాడు.
– ఏహబల శాంతమూలుడు: ఏహబలుడు రాజ్యానికి వచ్చిన 11 సంవత్సరాల తర్వాత అతని సోదరి కోడబలిశ్రీ నాగార్జునకొండలో బౌద్ధ విహారం నిర్మించింది. తొలిసారిగా సంస్కృత శాసనాలు నిర్మించాడు. అంతేకాకుండా విజయపురిలో కార్తికేయ, పుష్పభద్ర ఆలయాలు నిర్మించాడు. ఇతని కాలంలో నాగార్జునకొండలో హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అవి నవగ్రహ ఆలయం, కుబేర ఆలయాలుగా చెప్పవచ్చు. గుమ్మడుర్రులో ఇతని శాసనం బయటపడింది. ఈ శాసనంలో బౌద్ధ విద్యాలయం ఉందని బౌద్ధ ధర్మానికి నమస్కారాలని ఈ శాసనంలో పేర్కొనబడింది.
– రుద్రపురుషదత్తుడు: ఇతని శాసనాలు గురజాలలో లభించాయి. పల్లవుల రాజ్యాన్ని ఆక్రమించారు. సింహవర్మ మంచికల్లు శాసనంలో వివరాలు ఉన్నాయి.
బౌద్ధశిల్ప కళ
-నాగార్జునకొండ మహాయాన మతానికి కేంద్రస్థా నం. వీరు ఇక్కడ 20 స్థూపాలు, విహారాలు నిర్మించారు. నాగార్జునకొండలో అపరశైలిని వ్యాప్తి చేశారు.
(అపరశైలులు-నాగార్జునకొండ, పూర్వశైలులు-అమరావతి, రాజగిరిక-గుంటుపల్లి, ఉత్తరశైలి-జగ్గయ్యపేట, సిద్దార్ధక శైలి-గుడివాడ, బహుశృతి శైలి-చేజెర్ల, మహావినయ శైలి-బట్టిప్రోలు కేంద్రాలుగా, మహాశాసక శైలి-ఫణిగిరిలో ప్రసిద్ధ కేంద్రాలుగా ప్రారంభించబడ్డాయి). అభ్యర్థులు వీటిని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
– బౌద్ధమతస్తుడైన వీరపురుషదత్తుడు నాగార్జునకొండలోని ఒక శిల్పంలో ఒకరాజు శివలింగాన్ని కాలితో తీసేస్తున్నట్లు చెక్కించెను. తర్వాతి కాలంలో విష్ణుకుండినులు బౌద్ధవిగ్రహాన్ని ఒక గరుడ పక్షి తన రెండు కాళ్లతో పట్టుకొని వెళ్లి సముద్రంలో వేస్తున్నట్లుగా శిల్పాల్ని చెక్కారు. ఈ శిల్పాల్లో మనం మతాల మధ్య వైషమ్యాన్ని గమనించవచ్చు.
– మహాచైత్యం, పారావత మహాచైత్యం నాగార్జునకొండలో శాంతసిరి నిర్మించాడు. శాంతమూలుని చెల్లెలు శాంతసిరి.(గతంలో ఉన్న మహాచైత్యాన్ని తాను నిర్మించింది అనుటకంటే పునర్నిర్మించిందిగా భావించాలి). వీరపురుషదత్తుని ఆరవ రాజ్యకాలంలో భవంత ఆనందుడు అను బౌద్ధ ఆచార్యుడు ఈ చైత్యానికి కొన్ని మరమ్మతులు చేయించాడు. ఈ సమయంలో శాంతసిరి ఒక స్తంభాన్ని ప్రతిష్టించి 170 దీవారమాషకాలను దానం చేసింది.
– ఇంకను ఉషాసిక బోధిశ్రీ (బోధిశర్మ మేనకోడలు) గొప్ప ధనవంతురాలు, బౌద్ధమతాభిమాని. మహాదమ్మగిరి వద్ద విహారం, పారావత విహారం ఎదురుగా శిలామండలం నిర్మించింది. పూర్వశైలిలో ఒక తటాకం నిర్మించింది.
వీరి ప్రభావం, పాలన
-సామాజిక, ఆర్థిక శిల్పకళారంగాల అభివృద్ధిలో ఇక్షాకులు శాతవాహనులను అనుసరించారు. బౌద్ధమతం ఈ కాలంలోనే స్వర్ణయుగాన్ని అనుభవించింది. పరిపాలనలో వీరు శాతవాహనులను అనుసరించారు. రాజ్యాన్ని ఆహారాలుగా, పథాలనుగా విభజించారు. మహాతలవరులు గవర్నర్స్గా వ్యవహరించారు. ప్రధాన న్యాయాధికారిని మహాతలవరి అనేవారు. కాలక్రమంలో తలవరి పదం తలారిగా మారింది.
ఆర్థిక వ్యవస్థ
– గ్రామాలు స్వయంపోషకాలు, వ్యాపారం, పరిశ్రమలు, గ్రామాల్లో వివిధ వృత్తులవారు ఆర్థిక వ్యవస్థకు పునాదులు. సాహసికులైన వర్తకులు ఓడల్లో సముద్రయానం చేసి, గ్రీకు, రోమ్, ఈజిప్ట్ దేశాలతోనే కాకుండా బర్మా, జీవ, చైనా, సుమత్రా ప్రాగ్దేశాలతో వ్యాపారం చేసి విశేషంగా ధనం ఆర్జించారు.
– వ్యవసాయాభివృద్ధికి కాలువలు, తటాకాలు తవ్వించి రైతులకు సౌకర్యాలు కల్పించారు.
సమాజం
-స్త్రీకి అత్యున్నత స్థానం కల్పించారు. కానీ ఈ కాలంలో సతీసహగమనం జరిగినట్లు శిల్పాల్లో గమనించవచ్చు.
మత విధానం
-ప్రధానంగా ఇక్షాకులు వైదిక మతస్థులు, వైదికమతాన్ని అవలంభించి యజ్ఞాలు చేశారు. శాంతమూలుడు అశ్వమేథయాగం చేశారు.
-బౌద్ధమతం ఉన్నత స్థితికి చేరుకుంది.
హిందూ దేవాలయాలు
– భారతదేశంలోనే తొలిసారిగా వీరి కాలంలోనే దేవాలయాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ నిర్మాణాల్లో రాజులే కాకుండా అలనాటి స్త్రీలు కూడా పాల్గొనడం గర్వకారణం. రాతవశ్య అనే ఒక స్త్రీ అంత:పుర స్త్రీలతో కలిసి నోదగిరిమీద నోదగిరేశ్వరాలయం నిర్మించింది. ఏహబల శాంతమూలుని కాలంలో అష్టభుజనారాయణ దేవాలయం నిర్మించాడు. ఇది తొలి వైష్ణవాలయంగా చెప్పవచ్చు. ఈ దేవాలయాన్ని అభీరవసుసేనుని… సేనాధిపతి శకసేనుడు నిర్మించాడు.
– నెమలిపురి వద్ద పంచవీరుల రాతిఫలకం దొరికింది. ఈ ఫలకం మధ్యలో విష్ణువును నరసింహుని రూపంలో చిత్రీకరించడం ఒక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ శిల్పం హైదరాబాద్లోని నిజాం కళాశాల ఎదురుగా ఉన్న స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో భద్రపరిచారు.
– ఇంకనూ పుష్పభద్రస్వామి ఆలయం, ఈ ఆలయం గజపృష్ట ఆకారంలో నిర్మించబడింది. (గజపృష్ట ఆకారం అంటే ? వచ్చే సంచికలో శిల్పకళ-వాటి ప్రాధాన్యతలు అనే శీర్షికల్లో వివరణాత్మకంగా వివరిస్తాం. దీన్ని అభ్యర్థులు గమనించాలి). ఏహబల శాంతమూలుని సేనాధిపతి ఎలిసిరి కుమారస్వామి సర్వదేవాది వాసాన్ని నిర్మించారు. మాతృదేవతారాధన ప్రస్పుటంగా వీరి కాలంలో కన్పిస్తుంది. వీరు హారతి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ సప్తమాతృకలను కూడా చెక్కించారు. (సప్తమాతృకలు అంటే సంతానం కోసం సప్తమాత్రుకలను పూజించేవారుగా ఆరాధించారు. ఇది చిన్నపిల్లల ఆరాధ్యదేవత. సంతానం లేనివారు సందర్శించేవారని ప్రతీతి.
– ఇక్షాకులు వాస్తుశాస్త్ర ప్రకారం దేవాలయంలో హంగులు ఉన్నట్లు కన్పిస్తుంది. గోపురం (ద్వారం) ధ్వజస్తంభం, ప్రాకారం, గర్భగుడి లాంటి వాటిని క్రమానుసారంగా నిర్మించి దేవాలయం అనే పూర్ణస్వరూపం తెచ్చింది వీరే.
ప్రాక్టీస్ బిట్స్
1. వీరకళ్ మత సంప్రదాయం ఇతని కాలంలో అభివృద్ధి చెందింది ?
(2)
1) వీరుపురుషదత్తుడు 2) శ్రీశాంత మూలుడు 3) ఏహబల శాంతమూలుడు
4) ఉషాసిక బోధిశ్రీ
2. నిర్బంధ సతీసహగమనం ఏ శైలిలో ఉంది ?
(2)
1) పూర్వాశైలి 2) అపరశైలి
3) రాజగిరిక 4) సిద్ధార్థకశైలి
3. ఇక్షాకులు తమ శిల్పకళకు ఏ రంగురాతిని ఉపయోగించారు ?
(3)
1) తెలుపు 2) నలుపు
3) ఆకుపచ్చ 4) లేత గులాబీ రంగు
4. ఇక్షాకుల రాజ్యానికి సంబంధించి కిందివానిలో ఏది వాస్తవం ?
(2)
A. వీరు ప్రాచీన గణరాజ్యానికి చెందినవారు
B. భావ వివేకుడు ఈ రాజ్యానికి చెందిన తత్తవేత్త
C. తొలి సంస్కృత శాసనం ఎలిశ్రీ శ్రీశాంతమూలుని కాలంలో చెక్కించెను
1) A. మాత్రమే నిజం
2) A,B మాత్రమే నిజమైనది
3) B, Cమాత్రమే కరెక్ట్ 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు