షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన ఎలా జరుగుతుంది?
రాజ్యాంగంలోని పదోభాగంలో 244వ ప్రకరణ ఒక ప్రత్యేక పరిపాలనా విధానాన్ని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు వర్తింపజేస్తుంది. వీటిని షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు అంటారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాలను మినహాయించి ఏదేని రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల పాలనకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో పొందుపర్చారు. అయితే నాలుగు ఈశాన్య రాష్ర్టాలైన అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లోని ఆదివాసీ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఆరో షెడ్యూల్లో చేర్చారు.
సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడి, ఇంకా ఆదిమవాసులుగా జీవించే ప్రజలతో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వీరి పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం లేదు. దీని కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలు అనవచ్చు. కాబట్టి రాష్ట్రంలో అమలులో ఉన్న సాధారణ పరిపాలనా యంత్రాంగాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపజేయరు. ఈ ప్రాంతాల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి తగు బాధ్యత ఉంది.
ఐదో షెడ్యూల్లో దీని గురించి పాలానాంశాల లక్షణాలు ఏమంటే:
1. షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రకటన: ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా పరిగణించే అధికారం రాష్ట్రపతికి ఉంది. సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ని సంప్రదించి, అతడు ఒక షెడ్యూల్డ్ ప్రాంత భూభాగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు. దాన్ని రద్దు చేయవచ్చు లేదా తిరిగి ఏర్పాటు చేయవచ్చు.
2. రాష్ర్టానికి, కేంద్రానికి గల కార్యనిర్వహణాధికారం: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రాష్ట్ర కార్యనిర్వహణాధికారం ఉంటుంది. ఈ ప్రాంతాలపై గవర్నర్‌కి ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఈ ప్రాంతాల పాలనా వ్యవహారాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి ప్రతి సంవత్సరం సమర్పించాలి. అంతేగాక రాష్ట్రపతి ఎప్పుడు కోరినా అతను నివేదికను సమర్పించాలి. ఈ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం తన కార్యనిర్వహణాధికారం ద్వారా రాష్ర్టాలకు ఇస్తుంది.
3. తెగల సలహా మండలి: షెడ్యూల్డ్ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోను ఒక తెగల సలహా మండలి ఉంటుంది. ఈ మండలి షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి, అభివృద్ధికి సలహానిస్తుంది. ఇందులో 20 మంది సభ్యులు ఉండాలి. వీరిలో 3/4 వంతు మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆ రాష్ట్ర శాసనసభ్యులై ఉండాలి. అదే మాదిరిగా ఒకవేళ రాష్ట్రపతి నిర్దేశిస్తే గిరిజన ప్రాంతాలుగా గుర్తించకుండా, గిరిజన ప్రజలు నివసిస్తున్న రాష్ర్టాల్లో ఈ తెగల సలహా మండలిని ఏర్పాటుచేయాలి.
n రాష్ర్టాల్లోని షెడ్యూల్డ్ తెగల వారి సంక్షేమం గురించి, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి ఒక కమిషన్‌ను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగం పేర్కొంటుంది. అతను ఈ కమిషన్‌ను ఎప్పుడైనా నియమించవచ్చు. కానీ రాజ్యాంగం అమలులోనికి వచ్చాక పదేండ్ల తర్వాత తప్పక నియమించాలి. ఆ కారణంగా 1960లో ఒక కమిషన్‌ను నియమించారు. యూఎస్ దేబార్ దీనికి అధ్యక్షుడు. ఈ కమిషన్ తన నివేదికను 1961లో సమర్పించింది. నాలుగు దశాబ్దాల తర్వాత 2002లో దిలీప్‌సింగ్ అధ్యక్షతన రెండో కమిషన్ నియమించారు.
ఆదివాసీ ప్రాంతాల పాలన
నాలుగు ఈశాన్య రాష్ర్టాలైన అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల పాలనకు సంబంధించిన ప్రత్యేక అంశాలను ఆరో షెడ్యూల్లో రాజ్యాంగం పొందుపర్చింది. ఈ నాలుగు రాష్ర్టాలకే ఈ విధమైన ప్రత్యేక ఏర్పాటు చేయడంలో గల హేతుబద్ధతని గురించి కింద వివరించడం జరిగింది. ఇతర రాష్ర్టాల్లోని ప్రజల జీవన మార్గాలను అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని ఆదివాసీలు ఒంటబట్టించుకోలేదు. ఈ ప్రాంతాలు ఇది వరకు మానవ ఆవిర్భావం గురించి అధ్యయనం చేయడానికి నమూనాగా ఉండేవి. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు మెజార్టీ ప్రజల మధ్య నివసిస్తూ వారి సంస్కృతి గురించి, జీవన విధానం గురించి తెలుసుకున్నాయి. కానీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంల్లో ఆదివాసీలు ఇప్పటికీ తమ సంస్కృతి, ఆచారాలు, నాగరికతతోనే స్థిరపడ్డారు. కాబట్టి ప్రాంతాలను రాజ్యాంగం వేరుగా పరిగణించి, వారు స్వయంగా పరిపాలన చేసుకోవడానికి అవసరమైనంత స్వయం ప్రతిపత్తిని కలుగజేస్తున్నది వీరి పాలన గురించి పేర్కొన్న వివిధ పరిపాలనా సూత్రాలు కింద పేర్కొనడం జరిగింది.
1. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లోని ఆదివాసీ ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి జిల్లాలుగా ఏర్పాటుచేయడం జరిగింది. అయితే అవి సంబంధిత రా్రష్ట్ర పరిధికి బయట మాత్రం లేవు.
2. ఈ స్వయం ప్రతిపత్తి గల జిల్లాలను గవర్నర్ ఏర్పాటు చేయవచ్చు, పునర్వ్యవస్థీకిరంచవచ్చు. తద్వారా అతను ఆ ప్రాంతాల భూభాగాలను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. లేదా వాటి పేర్లను, సరిహద్దులను నిర్ధారించవచ్చు.
3. ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలోని వివిధ ఆదివాసీలు ఉండే, గవర్నర్ ఆ జిల్లాని అనేక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చవచ్చు.
4. ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకి ఒక జిల్లా మండలి ఉంటుంది. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. మిగిలిన 26 మంది వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడిన సభ్యులు ఐదేండ్లు పదవిలో ఉంటారు. మండలి ముందే రద్దు కాకపోతే నామినేటెడ్ సభ్యులు గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. ప్రతి స్వయంప్రతిపత్తి ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ మండలి ఉంటుంది.
5. జిల్లా, ప్రాంతీయ మండళ్లు వాటి వాటి అధికార పరిధుల్లో ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన అంశాలపై అవి చట్టాలు చేయగలుగుతాయి. భూమి, అడవులు, కాలువలు, పోడుసేద్యం, గ్రామపాలన, ఆస్తి వారసత్వం, వివాహం, విడాకులు, సంఘ ఆచారాలు వగైరా ఉంటాయి.
6. జిల్లా, ప్రాంతీయ మండళ్లు తమ తమ అధికార పరిధిలో గ్రామ మండళ్లని లేదా న్యాయస్థానాలను ఏర్పాటుచేయవచ్చు. ఆదివాసీల మధ్యగల విచారణలు, దావాలు, కేసుల గురించి ఇవి విచారిస్తాయి. వారి నుంచి అప్పీళ్లను స్వీకరిస్తాయి. వీటిపై అధికార పరిధిని గవర్నర్ నిర్దేశిస్తారు.
7. ప్రాథమిక పాఠశాలలు, వైద్యశాలలు, మార్కెట్లు, బల్లకట్లను, మత్స్య క్షేత్రాలను, రోడ్లను, అనేక ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలను జిల్లా మండలి జిల్లాలో స్థాపించవచ్చు. నిర్మించవచ్చు. నిర్వహించవచ్చు. ఆదివాసేతరులచే చేసే వడ్డీ వ్యాపారాన్ని అది నియంత్రణ చేస్తుంది.
8. భూమిపై శిస్తు విధించి పన్నులను వసూలు చేసే అధికారం జిల్లా ప్రాంతీయ మండళ్లకు ఉంది.
9. పార్లమెంట్ చట్టాలు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాలు స్వతంత్రప్రతిపత్తి గల ప్రాంతాలకు వర్తించవు లేదా కొన్ని నిర్దేశిత మార్పులతో, మినహాయింపులతో అవి వర్తిస్తాయి.
10. స్వతంత్ర ప్రతిపత్తిగల జిల్లాల, ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన విషయాలను పరిశీలించి, వాటిపై నివేదికను పొందటానికి గవర్నర్ ఒక కమిషన్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఈ కమిషన్ సిఫారసు మేరకు జిల్లా లేదా ప్రాంతీయ మండలిని ఆయన రద్దు చేయవచ్చు.
పంచాయతీరాజ్ వ్యవస్థ కమిటీలు-ప్రధాన ఉద్దేశం
లార్డ్ మేయో తీర్మానం:
1870లో ఈ తీర్మానం చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఆర్థిక వికేంద్రీకరణ.
లార్డ్ రిప్పన్ తీర్మానం:
స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయించాలని 1882, మే 19న ఈ తీర్మానం చేశారు.
రాయల్ వికేంద్రీకరణ సంఘం (సర్ చార్లెస్ హబ్ హౌస్):
1907లో ఈ సంఘాన్ని నియమించారు. స్థానిక ప్రభుత్వాల సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని వెల్లడించింది.
సమాజ అభివృద్ధి పథకం (టీటీ కృష్ణమాచారి):
పేదరిక, నిరుద్యోగ నిర్మూలన కోసం 1952లో దీన్ని చేపట్టారు.
బల్వంతరాయ్ మెహతా కమిటీ (1957):
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావాలని పేర్కొంది.
సంతానం కమిటీ:
పంచాయతీరాజ్ సంస్థల స్థితిగతులపై అధ్యయనానికి 1963లో ఈ కమిటీని నియమించారు. పంచాయతీల ఆర్థిక స్థితిగతులను మెరగుపరచాలని సూచించింది.
దయా చౌబే కమిటీ (1976):
సమాజ వికాస ప్రయోగం పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసింది.
అశోక్ మెహతా కమిటీ (1977):
రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని సూచించింది.
దంత్వాలా కమిటీ (1978):
జిల్లా స్థాయిలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నది.
సీహెచ్ హన్మంతరావ్ కమిటీ (1984):
జిల్లా ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపింది.
జీవీకే రావ్ కమిటీ (1985):
ప్రణాళికాభివృద్ధికి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని సూచించింది.
ఎల్ఎం సింఘ్వీ కమిటీ (1986):
స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని పేర్కొన్నది.
ఆర్ఎస్ సర్కారియా కమిటీ (1988):
దేశానికంతటికీ ఒకే విధమైన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని సిఫారసు చేసింది.
పీకే తుంగన్ కమిటీ (1988):
స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని సూచించింది.
షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే శాసనం :
పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక శాషనం షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా చేసే అధికారం గవర్నర్‌కి ఉంది. దాన్ని మార్పులతో, మినహాయింపులతో వర్తింపచేసే అధికారం కూడా అతనికి ఉంది. తెగల సలహా మండలిని సంప్రదించి అతను షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి, సుపరిపాలన కోసం అవసరమైన నిబంధనలను జారీ చేయవచ్చు. ఈ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలవారు భూములను బదలాయించడంపై (వారిలో వారు భూములను బదలాయించడంతో సహా) పరిమితులను విధించవచ్చు లేదా నిషేధించవచ్చు. వారి భూముల కేటాయింపుని నియంత్రించడం, షెడ్యూల్ తెగలవారికి అప్పులిచ్చే వారి వ్యాపారాన్ని నియంత్రించవచ్చు. పైగా షెడ్యూల్డ్ ప్రాంతానికి సంబంధించిన ఏదేని పార్లమెంట్ ఆమోదించిన శాసనాన్ని కానీ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన శాసనాన్ని కానీ ఈ నిబంధనలు రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. కానీ రాష్ట్రపతి ఆమోదం ఈ నిబంధనలకు అవసరం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు