పార్లమెంటు పనితీరు
దేశంలో చర్చకు అత్యంత ముఖ్య వేదిక పార్లమెంటు. పార్లమెంటు ఎన్నో రకాలు, విచిత్రమైన సమస్యలకు, వాటి పరిష్కారాలకు సమగ్ర, సంపూర్ణ వేదిక. అలాంటి పార్లమెంటు ప్రస్తుతం ఏ విధంగా ఉపయోగపడకుండా, వృథా కాలయాపనకు విడిదిగా మారింది. రాజ్యసభ చైర్మన్ మాటల్లో అయితే హుందాతనంతో సభ వ్యవహరించలేదనీ మరణించిన సభ్యులకు సంతాపం తెలిపే సందర్భంలో తప్ప సభ ఎప్పుడూ ప్రశాంతంగా లేదని అన్నారు.
-ఇటీవల ముగిసిన 16వ లోక్‌సభ శీతాకాల సమావేశాలైతే 15 ఏండ్లలో పరమ చెత్తగా ముగిశాయి. 1952 నుంచి అవమానకరంగా, ఏ మాత్రం పనిలేకుండా ముగిసిన సమావేశం ఇదే. మొత్తం 21 రోజుల్లో కేవలం 19 గంటలే పనిచేసింది.
-మొత్తంగా పార్లమెంటు ఎందుకు ప్రమాదంలో ఉంది? దాని వెనుక వివిధ పార్టీల అసలు ఉద్దేశాలేంటి? గత లోక్‌సభల పనితీరు ఎలా ఉంది? దీన్ని పరిష్కరించడానికి చేయాల్సిన చర్యలేమిటి? మొదలైన వాటి గురించి చర్చిద్దాం..
-PRS లెజిస్లేచర్ పరిశోధన ప్రకారం దాదాపు 80 శాతం ఉత్పాదక సమయం వృథా అయింది.
పార్లమెంటు సెషన్లు – రాజ్యాంగ నియమాలు
-రాజ్యాంగం ప్రకారం రెండు సమావేశాల మధ్య సమయం 6 నెలలకు మించకూడదు. కానీ పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం మూడు రకాల సమావేశాలు ఉంటాయి. అవి..
1) బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి-మే): ఇవి చాలా ముఖ్యమైన, సుదీర్ఘమైన సమావేశాలు.
2) వర్షాకాల సమావేశాలు (జూలై-ఆగస్టు): సాధారణ విషయాలు ఎక్కువగా చర్చకు వచ్చే సమావేశాలు ఇవి.
3) శీతాకాల సమావేశాలు (నవంబర్-డిసెంబర్): ఇది అతి స్వల్ప కాలం ఉంటుంది.
-ఇవేకాకుండా ప్రత్యేక సమావేశాలు కూడా రాజ్యాంగంలో పేర్కొన్నారు.
-ప్రత్యేక సమావేశాలు మంత్రివర్గ తీర్మానంతో రాష్ట్రపతి 14 రోజుల ముందే స్పీకర్‌కి గాని, చైర్మన్‌కి గాని నోటీసు ఇచ్చి ఏర్పర్చవచ్చు.
ప్రజాస్వామ్యంలో పార్లమెంటు పాత్ర
-పార్లమెంటు అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది? ఎందుకు మనకు పార్లమెంటు ఉండాలి? అనేవి పరిశీలిస్తే.. అసలు పార్లమెంటు పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది.
1) భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే అతి ముఖ్య సంస్థ.
2) ప్రజల తరఫున దేశంలోని ఎంపీలందరూ ఒక దగ్గర కూర్చొని, వివిధ అంశాలను అతి క్లుప్తంగా, విశాలంగా చర్చించి, పరిశీలించి అతి ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక వేదిక పార్లమెంటు.
3) ఎన్నో రకాల భిన్నాభిప్రాయాలు, భిన్న దృక్పథాలను ఒకే తాటికి తీసుకువచ్చే గొప్ప అవకాశ వేదిక.
4) ప్రజలందరికీ జవాబుదారీగా వ్యవహరించడానికి గొప్ప అవకాశం ఉన్న వేదిక (రాజ్యాంగంలో 75వ ఆర్టికిల్)
5) పార్లమెంటులో ప్రశ్నలు అడిగి, వాటికి సమాధానాలు రాబట్టి, ప్రభుత్వం తరఫున విశ్వాసపాత్రమైన, అధికారిక ప్రకటనలను పొందడానికి అనువైన వేదిక.
6) ఇది ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉన్న అతి ముఖ్యమైన వేదిక.
7) కార్యనిర్వహణ, న్యాయ శాఖలు, అధికార యంత్రాంగం మొదలైన వాటన్నింటిలో ప్రజల తరఫున ఎన్నికైన ఏకైక వ్యవస్థ పార్లమెంటు.
పార్లమెంటు నడవకుంటే నష్టమేంటి?
-పార్లమెంటు కోసం వెచ్చించే నిర్వహణ ఖర్చులు, సభ్యుల సౌకర్యాలు మొదలైనవన్నీ కలిపి దాదాపు ప్రతి సమావేశానికి రూ. 100 కోట్లు వృథా అవుతున్నాయి.
-ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవు.
-దాదాపు ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాల కల్పనలు మరగున పడతాయి.
-ఉదా: జీఎస్టీ బిల్లు ఆలస్యం కావడం వలన
నాలుగేండ్లలో 4 శాతం జీడీపీ వృద్ధిరేటును కోల్పోయాం.
-ఒకవేళ పార్లమెంటు చేసే పనులను, న్యాయవ్యవస్థ చేయడం వలన న్యాయం ఆలస్యంగా అందవచ్చు.
-ఇది విధానాల రూపకల్పనలో ఎంతో ఆలస్యం జరిగి న్యాయం కోసం ఎదురుచూసే వివిధ వర్గాల ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది.
శీతాకాల సమావేశాల పనితీరు-దాని ముందు సమావేశాలు
-మొత్తం 21 రోజుల్లో పార్లమెంటు పనిచేసింది కేవలం 19 గంటలే. కేవలం 16 శాతం పనితీరును మాత్రమే నమోదు చేసింది. దాదాపు 92 గంటల సమయం వృథా అయింది.
-ఇక పనిచేసిన సమయంలో అధికంగా 31 శాతం ప్రశ్నోత్తరాలు, 28 శాతం సాధారణ చర్చలు, 13 శాతం శాసన చర్చలు, 4 శాతం ఆర్థిక చర్చలు, 24 శాతం ఇతర కార్యక్రమాలతో గడిచింది. మొత్తం 449 ప్రశ్నలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరగాల్సి ఉండగా కేవలం 49 ప్రశ్నలపైనే చర్చ సాధ్యమైంది. లోక్‌సభలో ఇప్పటివరకు అతి తక్కువగా ప్రశ్నోత్తరాలు జరిగింది ఈ సమావేశాల్లోనే.
-రాజ్యసభలోనూ సమయమంతా ఇలాగే వృథాగా గడిచిపోయింది. మొత్తం 21 రోజుల్లో కేవలం 22 గంటలు మాత్రమే సభ నడిచింది. దాదాపు 87 గంటల విలువైన సమయం వృథా అయింది.
-ప్రధాని నోట్ల రద్దుపై మాట్లాడాలని ఒకరు, అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంపై మాట్లాడాలని మరొకరు పరస్పర ఆరోపణలతో సభ కార్యకలాపాలను చేపట్టలేకపోయింది.
లోక్‌సభ, రాజ్యసభ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
-మొత్తం ఎంపీలను నియమ, నిబద్ధతతో నడిపించడానికి లోక్‌సభ, రాజ్యసభ నిబంధనలు మార్గదర్శకంగా పనిచేస్తాయి. అవి..
1) ఏ సభ్యుడైనా మాట్లాడేటప్పుడు ఇతర ఎంపీలు అతన్ని మాటలతో గాని, చేతలతో గాని అంతరాయం చేయకూడదు.
2) మరే ఇతర ప్రదేశాలకు తిరగడం గాని, చైర్ వద్దకు వెళ్లడం గాని చేయకూడదు.
3) స్పీకర్ హౌస్‌ను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సభను వదిలివెళ్లవద్దు.
4) సభలో నిశబ్దాన్ని పాటించాలి.
5) వేరే వ్యక్తులు మాట్లాడేటప్పుడు వెక్కిరించడం, రన్నింగ్ కామెంటరీ చేయడం, వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం చేయవద్దు.
6) ఎలాంటి నినాదాలు చేయవద్దు.
7) పేపర్లు, రిపోర్టులను చించడం చేయకూడదు.
8) వ్యక్తిగతంగా ఎవరూ చైర్ దగ్గరికి వెళ్లకూడదు.
-పై నియామాలన్నీ పాటించాలనే నిబంధన ఉన్నా ఎంపీలు నిర్దాక్షిణ్యంగా వాటిని ఉల్లఘించడం పార్లమెంటును ప్రమాదంలో పడేయడం లాంటిదే. ఇది పార్లమెంటు వ్యవస్థ పనితీరును సమీక్షించి, మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను తెల్పుతుంది.
పార్లమెంటు పనితీరును మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి?
1) ఉన్న నిబంధనలను మరోసారి సమీక్షించి, వాటికి కఠిన శిక్షలు అదనంగా కలపాలి.
2) ప్రతి బిల్లుకు స్టాండింగ్ కమిటీ రిపోర్టు కచ్చితం చేసి పార్లమెంటులో ఉన్న భిన్నాభిప్రాయాలకు ఒక వేదికను ఏర్పర్చాలి.
3) ప్రతి బిల్లుకు, చర్చకు ఒక ప్రత్యేక, కంపల్సరీ ఆలస్యాన్ని జతచేయాలి. ఆ సమయం తరువాత ఆ బిల్లు పాసయ్యేటట్లు నియమాలు ఉండాలి. (Guilletine, Kangaroo Motion లాంటివి)
4) ఏది ఆర్థిక బిల్లో చెప్పే అధికారం ఇంకా ఎక్కువ, ప్రత్యేక నియమాలు స్పీకర్‌కు కల్పించాలి.
5) మారిన టెక్నాలజీకి అనుగుణంగా పార్లమెంటును తీర్చిదిద్దాలి.
6) ప్రైవేటు బిల్లులను కూడా పరిగణలోకి తీసుకొని కనీసం ప్రైవేటు బిల్లును ఒక నియమంగా చేయాలి.
7) పార్లమెంటు నడవనప్పుడు వారి జీతభత్యాల్లో కోత విధించాలి.
ముగింపు: 1957, మార్చి 28న జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు చరిత్రకారులు ఎక్కువ చర్చలు, సారాంశాలు, తీర్మానాలను కాకుండా దేశానికి ఏం జరిగిందని మాత్రమే చూస్తారు. అందువల్ల దేశ పురోభివృద్ధికి పార్లమెంటు ఏం చేసిందో భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేటట్టు పార్లమెంటు పనితీరును మెరుగుపర్చి, చర్చలు సఫలమై, అత్యంత ప్రాధాన్యత గల ప్రముఖ సంస్థగా పార్లమెంటు వెలుగొందాలని కోరుకుందాం.
దిగజారుతున్న పార్లమెంటు విశ్వసనీయత
-కొంతకాలంగా భారత అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న వివిధ తీర్పులను పరిశీలిస్తే అవి దాదాపు వివిధ చట్టాలకు, నియమాలకు సంబంధించినవే. 1973 కేశవానంద భారతి కేసులో చెప్పిన రాజ్యాంగ మౌలిక భావన (బేసిక్ స్ట్రక్చర్) నుంచి నేటి వరకు కార్యనిర్వహణ, పార్లమెంటు చేసిన ఎన్నో నియమాలు, నిబంధనలు, చట్టాలను కొట్టివేసి మళ్లీ కోర్టు తనదైన శైలిలో కొత్త చట్టాలు రూపొందించాలని తీర్పు ఇచ్చింది.
-చట్టాలు చేయడానికే ప్రత్యేకంగా ఉన్న పార్లమెంటు సరైన దారిలో పనిచేయనప్పుడే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి.
-పార్లమెంటు చేసే చట్టాలు, కోర్టులు చేస్తే అది భారత రాజ్యాంగ మౌలిక సూత్రమైన అధికార విభజనకు వ్యతిరేకమైనవే.
-పార్లమెంటుపై నమ్మకం సడలడం వల్ల ఎన్నో చట్టాలు పార్లమెంటు గడప తొక్కకుండానే ఆర్డినెన్స్ రూపంలో చట్టరూపం దాలుస్తున్నాయి.
-పార్లమెంటు అనుమతి లేకుండానే క్యాబినెట్ తీర్మానాల ద్వారా నీతి ఆయోగ్, NDC, CBI మొదలైన అత్యంత ముఖ్య సంస్థలు ఆవిర్భవించి పార్లమెంటు విశ్వాసపాత్రను సవాల్ చేస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు