దివ్యాంగుల హక్కుల బిల్లు 2016 ఏమంటున్నది?
వివిధ అంగవైకల్యాలతో భాదపడే దివ్యాంగులు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో 2.21 (26.8 మిలియన్) శాతం ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం దాదాపు 10 శాతం మంది వికలాంగులు మనదేశంలో ఉన్నారు. మొత్తం దివ్యాంగుల్లో 20.3 శాతం మంది కదలికకు, 18.9 శాతం మంది వినికిడి, 18.8 శాతం మంది చూపునకు సంబంధించినవారు ఉన్నారు.
దివ్యాంగులు-రాజ్యాంగపరమైన కల్పనలు
-దివ్యాంగుల గురించి రాజ్యాంగంలో రెండు చోట్ల పేర్కొన్నారు.
1) ఆర్టికల్ 41: దివ్యాంగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం పనిహక్కుకు సంబంధించి, విద్య, నిరుద్యోగ సందర్భాల్లో ప్రభుత్వ సాయం, సిక్నెస్ లాంటి సందర్భాల్లో ప్రత్యేక రక్షణలు కల్పించాలి.
2) రాష్ట్ర జాబితా 5 ఎంట్రీ 9: దీనిలో దివ్యాంగులు, నిరుద్యోగులకు సాంత్వన, ప్రత్యేక సదుపాయాల గురించి వివరించారు.
-దివ్యాంగుల హక్కులను పరిరక్షిస్తూ వారికి వివక్ష రహిత వాతావరణం కల్పించేలా రూపొందించిన దివ్యాంగుల హక్కుల బిల్లు-2016కు లోక్సభ ఈ నెల 16న ఆమోదం తెలిపింది. రాజ్యసభ అంతకుముందే ఈ బిల్లును ఆమోదించింది.
-2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 2.21 శాతం ఉన్న దివ్యాంగుల గురించి 1995లో చట్టం (సమాన హక్కులు, హక్కుల రక్షణ) ఉండేది. దీనిలో 7 రకాల వికలాంగులు, వారికి సంబంధించి ప్రత్యేక రక్షణలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు.
-ఈ చట్టమే మెంటల్ హెల్త్ చట్టం-2000, ఆటిజమ్ల రక్షణకు సంబంధించి ట్రస్టు, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ చట్టం-1999, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఇండియా చట్టం-1992 మొదలైన చట్టాలు కూడా దివ్యాంగులకు సంబంధించినవే.
-2007లో దేశం యునైటెడ్ నేషన్స్ గవర్నిషన్ ఆన్ ది రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (యూఎన్సీఆర్పీడీ)కి ఆమోదం తెలుపుతూ దానికి అంగీకరించింది.
-యూఎన్సీఆర్పీడీ వివిధ దేశాల్లోని చట్టాల్లో ఉన్న పరిమితులను కల్పించాల్సిన చట్టబద్ధ అవకాశాలు, నిర్వచన సంబంధ వివిధ అంశాలను ఆయా దేశాల చట్టాల్లో కూడా ఉండాలి. దీంతో 1995 దివ్యాంగుల చట్టాన్ని పూర్తిస్థాయిలో సరళీకరించి, సమీక్షించి మరో కొత్త బిల్లు తెచ్చి చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు 2014 దివ్యాంగుల బిల్లు.
-అందుకోసం కేంద్రప్రభుత్వం సాధికారత మంత్రిత్వశాఖ డాక్టర్ సుధాకౌల్ ఆధ్వర్యంలో కొత్త బిల్లు రూపొందించేందుకు ఒక నిపుణల కమిటీని 2010లో నియమించింది. అలా ఆ కమిటీ 2011లో ప్రతిపాదిత డ్రాప్టు ఇచ్చింది.
-ఆ బిల్లును 2014, ఫిబ్రవరి 7న అప్పటి యూపీఏ ప్రభుత్వ సాధికారత మంత్రి మల్లకార్జున ఖర్గే రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. అది 2014, సెప్టెంబర్ 16న రమేష్ బియాస్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు. అది రిపోర్టు ఇచ్చిన తరువాత మళ్లీ చర్చ మొదలై ఇటీవల ఉభయసభలు ఆమోదించాయి.
బిల్లు ఉద్దేశం
-దివ్యాంగులకు రక్షణ, వారి హక్కులను పెంపొందించడం బిల్లు ఉద్దేశం.
-ఈ బిల్లు 1995 దివ్యాంగుల బిల్లును తిరిగి భర్తీ చేస్తుంది. ఈ బిల్లు ఇంతకుముందున్న 7 రకాల వికలాంగశ్రేణి నుంచి 21 రకాల వికలాంగశ్రేణికి విస్తరించింది.
-అంటే ఇప్పటివరకు ఉన్న 28.6 మిలియన్ల నుంచి 70-100 మిలియన్లకు పెరగవచ్చు.
-40 శాతం ఉన్న బెంచ్మార్క్ డిజేబిలిటీస్కి విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు.
-చట్టబద్ధ, అడ్వయిజరీ బోర్డులు, ఇతర సదుపాయాలను కల్పించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది.
రాష్ట్ర జాబితా 5 ఎంట్రీ 9లో ఉన్న వాటిపై ఈ బిల్లు విధించిన వివిధ ఆంక్షలు
-రాజ్యాంగం ఆర్టికల్ 253 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై అంతర్జాతీయ ఒప్పందాల గురించి పార్లమెంటు చట్టం చేయవచ్చు.
-దీనికనుగుణంగా కేంద్రం కింది సదుపాయాలు కల్పించాలని రాష్ర్టాలను ఆదేశించవచ్చు.
1) 18 ఏండ్లు నిండిన దివ్యాంగులకు రాష్ట్రం ఉచిత విద్యను అందించాలి.
2) అన్ని ప్రభుత్వ భవనాల్లో హాస్పిటళ్లు, ఇతర భవనాల్లో దివ్యాంగులకు అనుకూలమైన భవనాలను రాబోయే ఐదేండ్లలో నిర్మించాలి.
3) అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్లను దివ్యాంగులకు కూడా అందుబాటులో ఉండేటట్లు రూపొందించాలి.
4) వాహనాలు, బస్స్టాపులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు మొదలైనవన్నీ దివ్యాంగులు ఉపయోగించుకునేటట్టు రూపొందించాలి.
-ఇవేకాకుండా దివ్యాంగులు రాష్ట్ర జాబితా కావున ఈ చట్టం అమలుకు సరిపోయేంత బడ్జెట్ కేటాయింపులు తప్పకుండా ఉండాలి.
దివ్యాంగుల వివక్షకు సంబంధించిన ప్రతిపాదనలు
-ఒకవేళ వైకల్యాన్ని సాకుగా చూపి దివ్యాంగులపై ఏవిధమైన వివక్ష చూపినా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
-దీని ప్రకారం దివ్యాంగులపై వివక్ష చూపినవారికి 6 నెలల నుంచి రెండేండ్ల వరకు శిక్ష విధించవచ్చు.
-అంతేకాకుండా రూ. 10 వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు.
-అంతేకాకుండా ఈ బిల్లులో ఉన్న రూల్స్గాని, వివక్షగాని చూపడం, ఇతర వివరాలను అతిక్రమిస్తే దానిని క్రిమినల్ యాక్ట్గా పరిగణిస్తారు.
సంరక్షకుల గురించి
-ఈ బిల్లు రెండు రకాల సంరక్షకులను అనుమతిస్తుంది. వీరు ఏ దివ్యాంగులైతే తమ పని తాము చేసుకోలేరో ఆ దివ్యాంగుల తరఫున అన్ని చట్టబద్ధ లావాదేవీలను నడిపించడానికి, వారికి అన్ని విధాలా సకల సౌకర్యాలు కల్పించడానికి ఈ బిల్లు ఇద్దరు సంరక్షకులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.
రిజర్వేషన్ల గురించి-తాజా బిల్లు
-ఇంతకుముందు వికలాంగులకు విద్య, ఉద్యోగాల్లో ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్ను 4 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది.
-2011లో ప్రతిపాదించిన ముసాయిదా బిల్లు-2014లో అది 5 శాతం ఉంది. కానీ స్టాండింగ్ కమిటీ సూచనలననుసరించి 3 నుంచి 4 శాతానికి పెంచారు.
మహిళలు-తాజా బిల్లు
-దివ్యాంగులైన మహిళకు గర్భం తీసివేసే క్రమంలో కచ్చితంగా ఆ మహిళ అనుమతి తీసుకోవాలి.
-ఇంకా ఇంతకుముందున్న Termination of Pregnency: The medical Termination of Pregnency Act-1971 ప్రకారం ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా దానిని ఒకరికి తగ్గించింది.
-అంతేకాకుండా మహిళపై వివక్ష తాలూకు శిక్షకు సంబంధించి కూడా ఇంతకుముందు కంటే తక్కువ శిక్షను ఈ తాజా బిల్లు ప్రతిపాదించింది.
-ఇంకా ఇంతకుముందే ఉన్న ఇతర చట్టాలు, ఇప్పటి తాజా చట్టం మధ్య సరైన సంబంధం లేకపోవడంతో ఏ చట్టం అమలు చేయాలో దేన్ని పరిగణలోకి తీసుకోవాలో సంశయం ఏర్పడింది.
జాతీయ, రాష్ట్ర కమిషన్లు
-దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర దివ్యాంగుల కమిషన్, రాష్ట్ర దివ్యాంగుల కమిషన్లను ఏర్పర్చాలి.
-ఈ కమిషన్లు దివ్యాంగుల హక్కులను రక్షిస్తూ వారి హక్కుల అమలు కోసం పలు సూచనలు ఇస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తాయి.
కేంద్ర, రాష్ట్ర సలహా బోర్డులు
-దివ్యాంగుల హక్కుల కోసం, వారి చట్టాల అమలు పర్యవేక్షణ కోసం ప్రభుత్వానికి వివిధ విధానాలు రూపొందించి సూచనలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సలహా బోర్డులను కూడా ఏర్పర్చాలి.
దివ్యాంగులకు సంబంధించిన ఇతర సంస్థలు
1) The National Handicapped Finance and Development Corporation (NHFDC)
-ఇది దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధికి, వ్యక్తిగత ఉపాధి అవకాశాల కోసం చేయూతనందిస్తుంది.
-అతి తక్కువ వడ్డీ రేట్లతో విద్య, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి కోసం లోన్లు కూడా ఇస్తుంది.
2) ప్రత్యేకాధికారి
-దివ్యాంగుల కోసం ఫిర్యాదులు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది.
దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు
1) దివ్యాంగుల జాతీయ విధానం-2006
-ఇది దివ్యాంగులను తగ్గించడం (ఆరోగ్యకరమైన చర్యల ద్వారా), వ్యవస్థాపనా సదుపాయాలను కల్పిస్తుంది.
-ఇంకా భౌతిక సంస్థాగత సదుపాయాలు, విద్యాసంస్థాగత వ్యవస్థాపనలు, ఆర్థిక వ్యవస్థాపనలు మొదలైనవి కల్పిస్తుంది.
ముగింపు
-మొత్తంగా దివ్యాంగుల బిల్లు-2016 అన్ని అంశాల్లో ఇప్పటి కాలానికి తగ్గట్టు చట్టాన్ని సవరిస్తూ 120 సవరణల్లో కొత్త బిల్లును రూపొందించినా అవి భౌతిక, మానసిక వైకల్యానికి నిర్వచనం ఇవ్వలేదు. అయితే ఈ బిల్లు సక్రమంగా అమలు జరిగితే దివ్యాంగుల సాధికారతకు ఉపయోగపడుతుంది.
యూఎన్సీఆర్పీడీ ప్రకారం దివ్యాంగుల నిర్వచనం
-దివ్యాంగులు అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా భౌతిక, మానసిక, మేధాపర, స్పర్శ సంబంధ వికలాంగత్వంతో, వివిధ ఇతర ఇబ్బందులతో ఉంటూ సమాజంలో పోటీ పడేటప్పుడు తమ పూర్తి సామర్థ్యాన్ని చూపలేకపోతారో వారినే వికలాంగులు/దివాంగ్యులు అని అంటారు.
దివ్యాంగులు- 12వ పంచవర్ష ప్రణాళిక
-12వ పంచవర్ష ప్రణాళిక ఉద్దేశం సమ్మిళిత వృద్ధిలో భాగంగా దివ్యాంగులకు విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని కోరింది.
-అంతేకాకుండా దివ్యాంగుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మిస్తూ వారికి విద్యారంగంలో ప్రీ, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లను కూడా ప్రభుత్వం అందిస్తుంది.
21 రకాల దివ్యాంగులు
1) అంధత్వం
2) దృష్టిలోపం
3) కుష్ఠు
4) వినికిడి లోపం
5) చలన వైకల్యం
6) మరుగుజ్జుతనం
7) బుద్ధిహీనత
8) మానసిక సమస్యలు
9) ఆటిజం
10) సెరిబ్రల్ ప్లాసీ
11) మస్కులర్ డిస్ట్రోపీ
12) నాడీ సంబంధ సమస్యలు
13) స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ
14) మల్టిపుల్ స్లెరోసిస్
15) మాట్లాడలేకపోవడం
16) తలసేమియా
17) హీమోఫీలియా
18) సిడిల్ సెల్ డిసీజ్
19) మల్టిపుల్ డిజేబిలిటీస్
20) యాసిడ్ దాడి
21) పార్కిన్సన్స్ బాధితులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు