సహకార సంఘాలు – ఉద్దేశ్యాలు
దేశంలోని సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ చట్టం-2011 రాజ్యాంగ హోదా, భద్రతలను కల్పించింది. రాజ్యాంగం మూడు మార్పులను చేసింది. అవి..
1.(ప్రకరణ 19)…1 సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించారు.
2.(ప్రకరణ 43-B)…2 సహకార సంఘాలను పటిష్టపర్చి పెంపొందించేవిధంగా ఒక కొత్త ఆదేశిక సూత్రాన్ని చేర్చారు.
3.(ప్రకరణలు 243ZH-243ZT) సహకార సంఘాలు శీర్షికన నూతనంగా రాజ్యాంగంలో IX-B భాగం చేర్చారు.
నిబంధనలు
-రాజ్యాంగంలోని IX-B భాగంలో సహకార సంఘాలకు సంబంధించి కింది నిబంధనలు చేర్చారు.
-నమోదు: ప్రజాస్వామిక సభ్యత్వ నియంత్రణ, సభ్యుల ఆర్థిక వంతు, స్వచ్ఛంద ఏర్పాటు, విధుల నిర్వహణలో స్వతంత్ర సూత్రాల ఆధారంగా సహకార సంఘాల నమోదు, నియంత్రణ, ఎత్తివేతలకు సంబంధించిన ప్రొవిజన్లను రాష్ట్ర శాసనసభలు చేయవచ్చు.
-కార్యవర్గ సభ్యులు, పదవీకాలం: సహకార సంఘం డైరెక్టర్ల సంఖ్యను రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి. డైరెక్టర్ల సంఖ్య 21కి మించరాదు.
-సహకార సంఘంలో సభ్యులుగా షెడ్యూల్ కులాలు లేదా జాతుల నుంచి ఒకరు, మహిళల నుంచి ఇద్దరికి శాసనసభ కేటాయిస్తుంది.
-బోర్డు కార్యవర్గం, సభ్యులు ఎంపికైన రోజు నుంచి 5 ఏండ్లపాటు పదవిలో ఉంటారు.
-మేనేజ్మెంట్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో నిష్ణాతులైనవారిని సహకార సంఘంలో కో ఆప్టెడ్ సభ్యులుగా (21 మంది డైరెక్టర్లకు వీరు అదనం) శాసనసభ చేర్చవచ్చు. -ఇద్దరిని మించి కో ఆప్టెడ్ సభ్యులుగా నియమించకూడదు. వీరికి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు, కార్యవర్గంలోకి కూడా వీరిని తీసుకోరు.
-ఈ సంఘంలోని క్రియాశీల డైరెక్టర్లను బోర్డు సభ్యులుగా పరిగణిస్తారు. మొత్తం డైరెక్టర్ల సంఖ్యకు వీరిని కలపరు.
-బోర్డు సభ్యుల ఎంపిక: బోర్డు పదవీకాలం ముగియక ముందే కొత్త బోర్డు ఎంపికకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎందుకంటే పాత సభ్యుల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త సభ్యులు ఎన్నిక కావాలి.
-సహకార సంఘానికి అసెంబ్లీ నిర్దేశించిన సంస్థ పర్యవేక్షణ, మార్గదర్శనం, ఓటర్ల జాబితా తయారీ నియంత్రణ, ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.
-బోర్డు, తాత్కాలిక యాజమాన్యం అచేతనం, తాత్కాలిక రద్దు: బోర్డును 6 నెలల మించి అచేతనావస్థలో ఉంచకూడదు లేదా సస్పెండ్ చేయడానికి వీలు లేదు. బోర్డును అచేతనావస్థలో ఉంచడం లేదా తాత్కాలికంగా రద్దు చేయడం కింది సందర్భాల్లో చేయాలి.
1. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినప్పుడు
2. బోర్డుకు లేదా దాని సభ్యుల ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలకు పాల్పడినప్పుడు
3. నిరంతరం వైఫల్యాలు కలిగినప్పుడు
4. బోర్డు ఎన్నికలను రాష్ట్ర చట్టంలోని ప్రొవిజన్లకు అనుగుణంగా నిర్వహించడంలో విఫలమైనప్పుడు.
5. సంఘ నిర్మాణంలోను లేదా విధుల్లో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు.
-బోర్డుకు ప్రభుత్వం నుంచి భాగస్వామ్యం, రుణం, ఆర్థిక సహాయం, లేదా ఏదైనా హామీ లేనప్పుడు సహకార సంఘాన్ని అచేతనం చేసుకోవడానికి లేదా రద్దు చేయడానికి వీలులేదు.
-బోర్డును అచేతనం చేసుకున్నప్పుడు సంఘ వ్యవహారాలు నిర్వహించడానికి పాలనాధికారి 6 నెలల్లోపు బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలి. అలా ఏర్పడిన కొత్త బోర్డుకు పాలనా వ్యవహారాలను అప్పగించాలి.
-ఖాతాల ఆడిటింగ్: సహకార సంఘాల ఖాతాలను నిర్వహించడానికి అసెంబ్లీ తగిన ప్రొవిజన్లను రూపొందించింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా ఖాతాలపై ఆడిటింగ్ నిర్వహించాలి. అవి..
-బోర్డు జనరల్ బాడీ ద్వారా నియాకమకమైన ఆడిటర్ లేదా ఆడిటర్ సంస్థ ఆడిటింగ్ చేయాలి. ఈ ఆడిటర్ లేదా ఆడిటింగ్ సంస్థను ప్రభుత్వం నియమించిన ఒక ప్యానెల్ ఎంపిక చేస్తుంది.
-ప్రతి సహకార సంస్థ ఖాతాలను ఆర్థిక సంవత్సరం ముగింపునకు 6 నెలల్లోపు ఆడిటింగ్ పూర్తి కావాలి.
-ఇలా పూర్తయిన ఆడిటింగ్ నివేదికను సహకార సంస్థ ఉన్నతాధికారి అసెంబ్లీకి సమర్పించాలి.
-సర్వసభ్య సమావేశం ఏర్పాటు: అసెంబ్లీ ప్రొవిజన్ ప్రకారం ప్రతి సహకార సంఘం తన సర్వసభ్య సమావేశాన్ని ఆర్థిక సంవత్సర ముగింపు 6 నెలల్లోపు నిర్వహించాలి.
-సభ్యుడికి వివరాలు తెలుసుకునే హక్కు: అసెంబ్లీ ప్రొవిజన్ల ప్రకారం సహకార సంఘం సభ్యుడికి సంఘానికి సంబంధించిన రికార్డులు, సమాచారం, ఖాతాల గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది. అంతేకాకుండా సంఘం పాలనావ్యవహారాల్లో పాల్గొనవచ్చు. సభ్యులకు సహకార విద్య, శిక్షణలను అందించవచ్చు.
-రిటర్న్స్: సహకార సంఘాలు ఏటా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అథారిటీకి రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ రిటర్న్స్‌లో కింది అంశాలు పొందుపర్చాలి.
1. సంఘం నిర్వహించిన సర్వసభ్య సమావేశం తేదీ, ఎన్నికల తేదీలు
2. సర్వసభ్య సమావేశం అనుమతించిన మిగులు వినియోగ ప్రణాళిక
3. కార్యక్రమాల వార్షిక నివేదిక
4. రాష్ట్ర చట్టంలోని ప్రొవిజన్లకు సంబంధించి రిజిస్ట్రార్‌కు కావల్సిన ఏదైనా సమాచారం
5. ఆడిట్ చేసిన ఖాతాల నివేదిక
6. సంఘం ఉప చట్టాలకు సంబంధించిన సవరణల పట్టిక
-సంఘం తప్పులకు శిక్షలు, జరిమానాలు: సహకార సంఘాలు చేసే తప్పులు లేదా నేరాలకు విధించే శిక్షలు లేదా జరిమానాలకు అసెంబ్లీ నిబంధనలు నిర్దేశిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు