మట్టిదిబ్బల కింద మహానగరాలు
చరిత్ర ఎంతో గొప్పది. అందులో తెలంగాణ చరిత్ర గర్భంలో ఎన్నో మహానగరాలు, నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే చరిత్రకు తెలియని కవులు, దేవస్థానాలు, శాసనాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇలాంటి కోవలోనే ఒక మహానగరం వేల ఏండ్ల నుంచే మునిగి మట్టి దిబ్బల్లో కూరుకుపోయింది.
అలాంటి నగరాల్లో ఒకటి కుండినాపురం (కౌండిన్యాపురం-కుండలీపురం). నాటి మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా)లోని కొండాపూర్ మట్టిదిబ్బలు ఒక మట్టి దిబ్బను 1900లోనే హెన్రీ కౌజెన్స్ అనే ఆంగ్ల పరిశోధకుడు (క్యూరేటర్) శాతవాహన నగరాన్ని కనిపెట్టారు.నేడు మూడు మట్టి దిబ్బల కింద మరో మహానగరం ఉన్నట్టుగా, చరిత్రపరంగా ఈ వ్యాసకర్త తాళపత్ర-తామ్ర (రాగిరేకుల) శాసనాల ద్వారా 1995లోనే కనుగొన్ననూ గుర్తింపు లేక నేడు వ్యాసంగా ముందుకు వస్తున్నది. ఇన్నేండ్ల తర్వాత ఈ గుప్త చరిత్ర ఒక ప్రత్యేకతను సంతరించుకొని వెలుగులోకి రానుంది.
యుగాల నాటి చరిత్ర కలిగిన పులాక రాష్ట్రం నేటి మెదక్ జిల్లాగా రూపాంతరం చెందింది. సంస్కృత నామం పులాకమైనప్పటికినీ చరిత్ర సత్యాలు చరిత్ర గర్భంలోనే మిగిలిపోకుండా కనపడుతూనే ఉంటాయి. అలా చరిత్రపరంగా, ఆశ్మకదేశంగా, కొ(గొ)ఱవి దేశంగా, నాగభూమి (శాతవాహనుల కాలం నాటి నామం)గా, మంజీరికాదేశంగా, కాసల నాడుగా గుల్షణాబాద్గా మెతుకుసీమ మెదక్గా అనే పూర్వనామాలలోనే పిలిచిన ఈ ప్రాంతం నేడు మెదక్సీమ (జిల్లా)గా పిలుస్తున్నారు. శాతవాహనుల చరిత్రను తన గర్భాల్లో దాచుకున్న జిల్లాలెన్నో ఉన్నప్పటికినీ మెదక్ జిల్లాలో మూడు ఉన్నాయి. ఒకనాటి విదర్భ రాజధాని అయిన అలనాటి భీష్మకుడను (రుక్మిణిదేవి తండ్రి) రాజు పరిపాలించిన కుండినపురమే (ప్రాకృతంలో కుండలీపురం) బౌద్ధుల కాలంలో కౌండిన్యాపురంగా, అలనాటి కుండినాపురమే నేటి కొండాపురంగా పిలుస్తున్న నేటి మట్టిదిబ్బలు క్రీ.పూ రెండో శతాబ్దంలోనే ఒక మహానగరంగా విలసిల్లడమే కాకుండా 149 చ.కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నది.
విదర్భ అనేది నేటి బీదర్ ప్రాంతం పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవికి నలమహారాజు భార్య అయిన దమయంతికి కుండినపురం నేటి ఈ కొండాపురమే పుట్టినిల్లు. ఇది యదార్థసత్యం. 96 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆరు మట్టి దిబ్బల కింద మహానగరాలు ఉన్నట్టు పురాణాల (శాసనాల) ద్వారా చరిత్ర వెల్లడైంది. ఒక మట్టి దిబ్బను 1900లో హెన్రీకౌజెన్స్ అనే విదేశీయ పురాతత్వ శాస్త్రవేత్త అన్వేషించి కనుగొన్నాడు. అలాగే కొండాపూర్ తేర్పోల్ గ్రామాల మధ్యన ఉన్న మరో మట్టి దిబ్బను 1940-42లో తవ్వకాలను జరుపగా క్రీస్తు శకారంభ (1-3) శతాబ్దాలకు చెందిన విలువైన నాణేలు, ఇతర వస్తువులు లభించాయి. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన ప్రాకృత (బ్రాహ్మీ+ఖరోష్టి) లిపి కూడా బయటపడింది.
ఇలా చరిత్ర గర్భంలో ఎన్నో నగరాలు, దేవస్థానాలు నేటికీ నిక్షిప్తమై ఉన్నాయి. కంవాయసౌ-లేక కంవాయసి అని చదవడానికి వీలుగా ఉన్నది. 15, 16 శతాబ్దివాడిగా చెబుతున్న సంస్కృత వ్యాఖ్యాయన పండితుడైన శ్రీమల్లినాథసూరి (మల్లినాథుడు) చెప్పినా ఎవరు పట్టించుకోకుండా ఉండిపోయింది. ఈయన మెదక్ జిల్లా కొల్చారం (కొలాచలం/కొలమచర్ల) నివాసి. మరుగునపడిన మహాకవి కాళిదాసుని ప్రపంచానికి పరిచయం చేసి అత్యంత ప్రాచుర్యం పొందిన, పంచ కావ్యాలకు తెలుగు వ్యాఖ్యానం రాసిన తొలి తెలుగు వ్యాఖ్యాన (వ్యాఖ్యాయడ్) చక్రవర్తి మెదక్ జిల్లా కొల్చారం వాడే. కానీ ప్రజలు, ప్రభుత్వాలు చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోలేక గుర్తించకపోతే, అవి చరిత్ర గర్భంలోకి పోవాల్సిందేనేమో.
ఒకప్పుడు శాత (సాత) వాహన చక్రవర్తులు నిర్మించిన, చుట్టూ కోటగోడతో ఆవరించిన మహానగరమే నేటి కొండాపూర్ నందలి ఆర్వా(ప్రా)చీన నివేశన స్థల సముదాయం. 1973-74లో మరొక స్థూపపు దిబ్బను హైదరాబాద్ పురావస్తు శాఖ (ఏఎస్ఐ సహకారంతో) వారు కనుగొన్నారు. అంతేకాకుండా మూడు మట్టిదిబ్బల కింద ఉన్న నగరాల చరిత్ర 2,800 ఏండ్లకు పూర్వం ఒక పెద్ద భూకంపం వచ్చి ధ్వంసమైందని సమాచారం. అయితే సహజంగా ఈ దక్కన్ పీఠభూమి (భద్రాచలం మొదలుకొని చివరి అంచు విదర్భ అదే నేటి బీదర్ వరకు పురాణాల శాసనాల చరిత్ర ప్రకారం)కి భూకంపాలు రావు. కానీ 800, 900 ఏండ్లకోసారి భూకంపం తప్పక వస్తుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దిబ్బ భాగం నుంచి వర్షాకాలంలో వర్ష ప్రభావం ఎక్కువైనప్పుడు పైభాగం నుంచి సొరంగం ఏర్పడి, ఆ సొంరంగంలో చిన్న చిన్న జంతువులు మట్టి దిబ్బలపైభాగం నుంచి లోపలికి కూరుకుపోయి చనిపోవడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం మట్టి దిబ్బల మీద ఎక్కడాన్ని నిషేధించింది.
బౌద్ధుల్లో చివరి వాడైన కౌండిన్యుడు కూడా ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పరుచుకున్నట్టుగా సాహిత్య శాసన చరిత్ర చెబుతున్నది. మరో బౌద్దభిక్షువు (బిక్కు) శరభాంకపాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బౌద్ధ క్షేత్రమైన కొండాపూర్లో తవ్వకాల్లో అష్టమంగళ ఫలకం, బౌద్ధ శిల్పం లభ్యమయ్యాయి. కుండినాపురం/కౌండిన్యాపురం-కొండాపూర్గా ప్రసిద్ధి చెందింది. నేటి తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఆ మూడు మట్టి దిబ్బల గురించి కేంద్రప్రభుత్వానికి (ఏఎస్ఐ) తెలిపి తవ్వకాలు జరిపిస్తే ఆ రెండు మహానగరాలు కూడా బయటకు వస్తాయన్న ఆశ ప్రతి చరిత్రకారుడికి ఉంటుంది. ఈ కొండపూర్నే శాత (సాత) వాహన రాజులు టంకసాలగా పిలిచేవారని చరిత్ర.
సిముఖ (చిముక) శాతవాహనునిచే ప్రతిష్టానం నందు (నేటి పైఠాన్) స్థాపితమై దక్కన్ పీఠభూమి ద్రవిడ దేశం ఆర్యావర్తంలో కొంత భాగం వరకు విస్తరించిన ఈ విశాల సామ్రాజ్య పరిపాలన చేసిన శాతవాహన చక్రవర్తులతో 1. సరిసాత (శాత)కర్ణి 2. పులోమావి 3. గౌతమీపుత్ర శాతకర్ణిలు గొప్ప ఖ్యాతినార్జించి మహా సామ్రాజ్యాన్ని నిర్మించి చుట్టూ కోటతో ఆవరించిన మహానగరమే కొండాపూర్ కుండలీ (కుండీనా)పురం నందలి ప్రాచీన మట్టిదిబ్బలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు