జాతీయ చిహ్నాలు-విశేషాలు
జాతీయజెండా
-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం జమీందారు వద్ద పనిచేసినప్పుడు మధ్యలో రాట్నంతోగల మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ జెండాను 1931లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ నాయకులకు చూపించగా వారు ఆమోదించారు.
-స్వాతంత్య్రం సిద్ధించాక భారత ప్రజల్లో జాతీయ భావనను పెంపొందించేందుకు భారత్‌కు జాతీయ పతాక అవసరాన్ని గుర్తించారు. ఇందుకు రాజ్యాంగసభ 1947, జూన్ 23న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, సరోజినీ నాయుడు, కేఎం ఫణిక్కర్, కేఎం మున్షీ, రాజాజీ, అంబేద్కర్లతో కమిటీని నియమించింది.
-ఈ కమిటీ ఆనాటి కాంగ్రెస్ పతాకాన్నే కొద్దిమార్పులతో రాట్నం స్థానంలో అశోకచక్రాన్ని చేర్చి 1947, జూలై 22న జాతీయజెండాగా ఆమోదించగా 1947, ఆగస్టు 15న ఆవిష్కరించారు.
జెండా నియమావళి
-జాతీయజెండాకు పైనగాని, జెండాకు కుడివైపునగాని ఏ ఇతర జెండాలను లేదా చిహ్నాలను ఎగురవేయరాదు.
-ఒకే వరుసలో జెండాలను ఎగురవేసినప్పుడు లేదా అమర్చినప్పుడు ఇతర జెండాలన్నీ జాతీయజెండాకు ఎడమవైపునే ఉండాలి.
-ఇతర జెండాలను ఎగురవేసినప్పుడు జాతీయజెండాను మిగిలిన అన్ని జెండాలకంటే ఎత్తులో ఉంచి ఎగురవేయాలి.
-హైకోర్టులు, సెక్రటేరియట్లు, కలెక్టరేట్లు, కమిషనర్ కార్యాలయాలు, రాయబార కేంద్రాలు, జైళ్లు మొదలైన ప్రభుత్వ భవనాల్లో మాత్రమే జాతీయజెండాను ఎగురవేయాలి.
-స్వాంతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, గాంధీ జయంతి రోజుల్లో, ప్రత్యేక సందర్భాలు, జాతీయ ప్రాముఖ్యతగల రోజుల్లో జెండాను ఎగురవేయడానికి ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు.
-తప్పనిసరిగా జాతీయజెండాను సాయంత్రం అవనతం చేయాలి.
జాతీయ పతాక వివాదం
-నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త తన కార్యాలయ భవనంపై జాతీయజెండాను ఎగురవేయగా అధికారులు అడ్డుకొని జెండాను స్వాధీనం చేసుకొన్నారు. దీంతో నవీన్ జిందాల్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దేశ పౌరుడిగా జాతీయజెండాను ఎగురవేసే హక్కు తనకు ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు జాతీయజెండాకు ఎటువంటి అవమానాలు కలుగనిరీతిలో ఎవరైనా ఎగురవేయొచ్చని, ప్రకరణ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు లభించిన హక్కుఅని 2004, జనవరి 23న తీర్పునిచ్చింది. దీంతో జాతీయజెండా నిబంధనలను సవరించి రూపొందించిన కొత్త నిబంధనలు 2002, జనవరి 26నుంచి అమల్లోకి వచ్చాయి.
నూతనజెండా నిబంధనలు
-జాతీయజెండాను ఇండ్లపైన, కార్యాలయాలపైన, దుకాణాలపైన ఎగురవేయవచ్చు.
-ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు జాతీయజెండాను ప్రదర్శించవచ్చు. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడల సమయాల్లో పేపర్‌తో చేసిన జెండాలను మాత్రమే వినియోగించాలి. అన్ని రోజుల్లో జెండాను ఎగురవేయవచ్చు.
-వేదికను అలంకరించడానికిగాని, అలంకారంగాగాని, దుస్తులుగాగాని, వాణిజ్య అవసరాల కోసంగాని జాతీయజెండాను ఉపయోగించకూడదు.
-కానీ జాతీయజెండాను దుస్తులుగా ఉపయోగించరాదనే నిబంధనను కేంద్రమంత్రిమండలి 2005, జూలై 5న ఉపసంహరించింది. అదేవిధంగా చేతితొడుగులు, రుమాళ్లు, న్యాప్కిన్లు, అండర్వేర్లు, తలదిండ్లు, దుస్తులపై ఎంబ్రాయిడరీగాగాని, ప్రింటింగ్ చేయడంగాని నిషేధించింది.
-జాతీయజెండా నేలనుగాని, నీళ్లనుగాని తాకరాదు.
జాతీయ చిహ్నం: నాలుగు సింహాల తలాటం
-ఈ నాలుగు సింహాల తలాటాన్ని సారనాథ్‌లోని అశోకస్తంభం నుంచి తీసుకున్నారు. ఈ సింహాలు ఒకదానివెనుక ఒకటి కూర్చున్నట్లు ఉంటాయి. కానీ మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సింహాల కింద ఉన్న పీఠం మధ్యభాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు గుర్రం, ఎడమవైపు ఎద్దు బొమ్మలు ఉంటాయి. దానికింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. దీనిని జాతీయచిహ్నంగా రాజ్యాంగం 1950, జనవరి 26న ఆమోదించింది.
జాతీయగీతం: జనగణమన
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రాసిన జనగణమన గీతాన్ని హిందీలోకి అనువదించి జాతీయగీతంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రాజ్యాంగం 1950, జనవరి 24న ఆమోదించింది. ఈ గీతాన్ని మొదటగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఈ విషయం 1912, జనవరిలో తత్వబోధిని పత్రికలో భారత విధాత అనే శీర్షికన ప్రచురితమైంది.
జాతీయగేయం: వందేమాతరం
-ఈ గేయాన్ని బంకించంద్రచటర్జీ సంస్కృతంలో రాశారు. ఇది చటర్జీ రాసిన ఆనంద్‌మఠ్ అనే బెంగాలీ నవలలోనిది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఈ గేయాన్ని ఆలపించారు. రాజ్యాంగ పరిషత్ ఈ గేయాన్ని జాతీయగేయంగా 1950, జనవరి 24న ఆమోదించింది.
ప్రతిజ్ఞ
-రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు భారత్, చైనా యుద్ధసమయంలో విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి 1962, సెప్టెంబర్ 17న ఈ ప్రతిజ్ఞను రాశారు. దీన్ని మొదటిసారిగా 1963లో విశాఖలోని ఒక పాఠశాలలో చదివారు. దీనిపై చాగ్లా అధ్యక్షతన కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ 1964 బెంగళూరులో సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో చర్చించి అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో దీన్ని చెప్పించాలని సూచించింది. దీంతో కేంద్రప్రభుత్వం 1965, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చింది.
జాతీయ జంతువు: పెద్దపులి
-దీన్ని కేంద్రప్రభుత్వం 1972లో జాతీయ జంతువుగా గుర్తించి 1973 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు టైగర్ అనే పులుల సంరక్షణ పథకాన్ని చేపట్టింది. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. పులి శాస్త్రీయనామం పాంథెరాటైగ్రిస్.
జాతీయ జలచరం: రివర్ డాల్ఫిన్
-జాతీయ నది అయిన గంగానదితోపాటు బ్రహ్మపుత్ర, సింధు, సింధు ఉపనదుల్లో ఈ రివర్ డాల్ఫిన్ కనిపిస్తుంది. దీని శాస్త్రీయనామం ప్లాటానిస్టా గాంగెటికా. కేంద్రప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ను 2009, అక్టోబర్ 5న నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా గుర్తించింది.
జాతీయ క్రీడ: హాకీ
జాతీయ పుష్పం: తామర. దీని శాస్త్రీయనామం నెలుంబో నూసిఫెరా.
జాతీయ వారసత్వ జంతువు: ఏనుగు. దీని శాస్త్రీయనామం (ఎలిఫస్ మాక్సిమస్)
జాతీయ వృక్షం: మర్రిచెట్టు. దీని శాస్త్రీయనామం ఫైకస్ బెంగాలెన్సిస్.
జాతీయ ఫలం: మామిడిపండు. దీని శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా.
జాతీయ భాష: హిందీ. రాజ్యాంగంలోని 343 ప్రకరణ ప్రకారం హిందీని జాతీయభాషగా గుర్తించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు