భారత ఆర్థిక వ్యవస్థ – ప్రణాళికలు – నీతి ఆయోగ్
ప్రణాళిక
నిర్ణీత కాలంలో, నిర్ణీత లక్ష్యాలను ఒక ప్రాధాన్యతా క్రమంలో, ఒక వ్యూహం ప్రకారం సాధించడానికి రూపకల్పన చేసిన పథకాన్నే ప్రణాళిక అంటారు.
ప్రణాళిక సంఘం (Planning Commission) ప్రకారం లభ్యమయ్యే వనరులను సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగా కేటాయించి, నిర్దిష్ట లక్ష్యాలను సాధించే ప్రక్రియను ప్రణాళిక అంటారు.
విశ్వేశ్వరయ్య ప్రణాళిక (viswesvaraiah plan)
వృత్తి రీత్యా ఇంజినీర్, గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 సంవత్సరంలో తాను రంచించిన ‘భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థ’ (The Planned Economy For India) అనే గ్రంథంలో 10 సంవత్సరాల కాల వ్యవధి, 1000 కోట్ల పెట్టుబడితో వ్యవసాయ రంగంపై ఒత్తిడి తగ్గించి పారిశ్రామిక రంగంలో ఉపాధి పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించారు.
బాంబే ప్రణాళిక (Bomboy Plan)
బొంబైకి చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు 1943 సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళిక (A Plan of Economic Development for India) అనే పేరుతో రూపొందించి 1944 సంవత్సరంలో ముద్రించారు. దీన్ని బాంబే ప్రణాళిక అంటారు. ఇది 15 సం.రాల కాలవ్యవధి, రూ .10,000 కోట్ల పెట్టుబడితో మౌలిక పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంతో రూపొందించారు. ఈ బాంబే ప్రణాళికను పారిశ్రామిక ప్రణాళిక అని, టాటా-బిర్లా ప్రణాళిక అని కూడా అంటారు.
ప్రజా ప్రణాళిక (Peoples Plan)
భారత కార్మిక సమాఖ్యకు చెందిన ఎం.ఎన్. రాయ్ 1943 సం.లో ప్రజా ప్రణాళికను రూపొందించారు. ఇది 10 సంవత్సరాల కాలవ్యవధి, రూ.15,000కోట్ల పెట్టుబడితో వ్యవసాయానికి వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారు.
గాంధేయ ప్రణాళిక (Gandhian Plan)
గాంధేయ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని శ్రీమన్నారాయణ అగర్వాల్ 1944 సం.లో గాంధేయ ప్రణాళికను రూపొందించారు. దీన్ని 3,500 కోట్ల పెట్టుబడితో వ్యవసాయానికి చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారు.
ప్రణాళిక సంఘం (Planning Commission)
ప్రణాళికల రూపకల్పన వాటి అమలు, సమీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం రూపొందించినదే ప్రణాళికా సంఘం. భారత ప్రభుత్వం 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా సంస్థ. ప్రణాళికా సంఘం అధికార భవనం పేరు ‘యోజనా భవన్’ కాగా అధికార పత్రిక యోజన.
ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు. దీనికి ఉపాధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఇతర సభ్యులు ఉంటారు. మొదటి ప్రణాళిక సంఘం చైర్మన్గా జవహార్లాల్ నెహ్రూ ఉపా ధ్యక్షులుగా గుల్జారీ లాల్ నందా ఉన్నారు. చివరి ప్రణాళిక సంఘం చైర్మన్గా మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షులుగా మాంటెంక్ సింగ్ అహ్లువాలియా ఉన్నారు.
జాతీయాభివృద్ధి మండలి (National Develo pment Council -NDC)
జాతీయాభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరిగానే రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇందులో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రణాళికా సంఘం సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
కేంద్రీకృత ప్రణాళిక (Centralized Plan)
ప్రణాళిక రచన పైస్థాయి నుంచి కిందిస్థాయికి కదలడాన్ని ‘కేంద్రీకృత ప్రణాళిక’ అంటారు.
ఉదా: దేశం- రాష్ట్రం -జిల్లా
వికేంద్రీకృత ప్రణాళిక (Decentralization plan)
ప్రణాళిక రచన కింది స్థాయి నుంచి పై స్థాయికి కదిలే ప్రణాళికను వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
ఉదా: జిల్లా- రాష్ట్రం-దేశం
స్వల్పకాలిక ప్రణాళిక (Short Term Plan)
ఒక సంవత్సర కాలవ్యవధిలో రూపొందించే ప్రణాళికను స్వల్పకాలిక ప్రణాళిక అంటారు. దీనినే వార్షిక ప్రణాళిక అని, పిగ్మీ ప్రణాళిక అని అంటారు.
మధ్యకాలిక ప్రణాళిక (Middle Term Plan)
3,4,5,6 సంవత్సరాల కాలవ్యవధిలో రూపొందించిన ప్రణాళికను మధ్యకాలిక ప్రణాళిక అంటారు.
పంచవర్ష ప్రణాళిక (Five Years Plan)
ఐదేళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళికను పంచవర్ష ప్రణాళిక అంటారు.
దీర్ఘకాలిక ప్రణాళిక (Long term Plan)
10, 15, 20, 25 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించే ప్రణాళికను ‘దీర్ఘకాలిక/దీర్ఘదర్శి ప్రణాళిక’ అంటారు.
భౌతిక ప్రణాళిక (Physical Plan)
వివిధ వస్తువుల/ భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.
ఉదా: మొదటి ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 61 లక్షల టన్నులు
ఆర్థిక ప్రణాళిక (Economic Planning)
ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదికగా వివిధ పెట్టుబడి రంగాలకు ఆర్థిక వనరుల కేటాయింపులో రూపొందించిన ప్రణాళికను ఆర్థికప్రణాళిక అంటారు.
నిర్దేశాత్మక ప్రణాళిక (Imperative Plan) ఆదేశాత్మక ప్రణాళిక (Order planning)
పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ప్రణాళికలు అమలు పరిస్తే వాటిని నిర్దేశాత్మక ప్రణాళికలు అంటారు.
సూచనాత్మక ప్రణాళిక (Indicative Planning)
తన ఆధీనంలో లేని రంగాలకు లక్ష్యాలను నిర్దేశించి వాటి సాధనకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రణాళికను సూచనాత్మక ప్రణాళిక అంటారు. ఇవి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత తగ్గిస్తూ, ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత పెంచే ప్రణాళికలు, ఎటువంటి నిర్బంధాలు లేని ప్రణాళికలను సూచనాత్మక ప్రణాళికలు అంటారు.
స్థిర ప్రణాళిక (Fixed Plan)
ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళిక నిర్దేశించిన కాలవ్యవధి పూర్తయ్యేవరకు స్థిరంగా కొనసాగితే ఆ ప్రణాళికను స్థిరప్రణాళిక అంటారు.
నిరంతర ప్రణాళిక (Rolling Plan)
గత సంవత్సరాన్ని వదిలి వేస్తూ ప్రస్తుత/ రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరం కొనసాగే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు. నిరంతర ప్రణాళిక అనే భావనను గున్నార్ మిర్థాల్ తన ‘ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ బ్రాడర్ సెట్టింగ్’ అనే గ్రంథంలో సూచించారు. ఈ నిరంతర ప్రణాళికలను మొదట అమలు చేసిన దేశం నెదర్లాండ్స్ కాగా, జపాన్లో విజయవంతమయ్యాయి. ఈ నిరంతర ప్రణాళికలను భారతదేశంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైన ‘ఆచార్య లక్డావాలా’ సలహా మేరకు 1978 ఏప్రిల్ 1 నుంచి 1980 మార్చి 31 వరకు అమలు చేసింది.
సాధారణ ప్రణాళిక (General Plan)
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు వర్తించేటట్లు ప్రణాళికను రూపొందిస్తే దానిని సాధారణ ప్రణాళిక అంటారు.
ఉదా: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.
పాక్షిక ప్రణాళిక (Partial Plan)
ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలకే ప్రణాళికను రూపొందిస్తే దాన్ని పాక్షిక ప్రణాళిక అంటారు.
ప్రణాళిక విరామం (Plan Holiday)
మూడో పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రణాళికా సంఘం 1966-69 సంవత్సరం వరకు 3 వార్షిక ప్రణాళికలను అమలు చేసింది. ఈ మూడు వార్షిక ప్రణాళికల కాలాన్ని ‘ప్రణాళిక విరామం’ లేదా ప్రణాళిక సెలవు అంటారు?
నీతి ఆయోగ్
భారతదేశ స్వాతంత్య్రానంతరం ఏర్పడి 12 పంచవర్ష ప్రణాళికలను, 6 వార్షిక ప్రణాళికలను అంటే 65 సంవత్సరాల ప్రణాళికను రూపొందించి అమలు చేసింది ప్రణాళిక సంఘం.
ప్రణాళికా సంఘం స్థానంలో భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ (NITI AAYOG – National Institution for Transforming India) నీతిఆయోగ్ పేరుతో 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు.
‘బలమైన రాష్ర్టాలతో బలమైన దేశం’ అనే నినాదంతో ఒక మేధోకూటమిగా పనిచేస్తూ’ సబ్కా సాథ్-సబ్కా వికాస్’ లక్ష్యంతో పనిచేస్తూ అభివృద్ధి ప్రక్రియలో రాష్ర్టాలను భాగస్వాములుగా చేస్తుంది. శాస్త్రీయ, సాంకేతిక, మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో ప్రవాస భారతీయులతో కూడిన మూలధనాన్ని పెంపొందిస్తుంది.
నీతి ఆయోగ్ అధ్యక్షులుగా ప్రధానమంత్రి ఉంటారు. ఉపాధ్యక్షులు, 5 గురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు, పదవీ రీత్యా నలుగురు మంత్రులను ప్రధాని నియమిస్తారు. అన్ని రాష్ర్టాల ముఖ్య మంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత రాష్ర్టాల లెఫ్ట్నెంట్ గవర్నర్లతో కూడిన పాలక మండలి, ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఉంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) బాంబే పారిశ్రామిక వేత్తలు
సి) ఎం.ఎన్.రాయ్
డి) ఎస్.ఎన్. అగర్వాల్
2. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) గాంధేయ ప్రణాళిక- ఎస్.ఎన్.అగర్వాల్
బి) ప్రజా ప్రణాళిక – ఎం.ఎన్. రాయ్
సి) విశ్వేశ్వరయ్య ప్రణాళిక – బాంబే పారిశ్రామిక వేత్తలు
డి) సర్వోదయ ప్రణాళిక – జయప్రకాశ్ నారాయణ
3. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1950 మార్చి 1
బి) 1950 మార్చి 15
సి) 1951 ఏప్రిల్ 1
డి) 1951 మార్చి 15
4. ప్రణాళికా సంఘం ఒక ?
i) రాజ్యాంగ సంస్థ
ii) రాజ్యాంగేతర సంస్థ
iii శాసనబద్ధ సంస్థ
iv) శాసనేతర సంస్థ
ఎ) i, ii బి) i, iii
సి) ii, iv డి) పైవన్నీ
5. జాతీయాభివృద్ధి మండలికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) ఉపరాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి
డి) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
6. చివరి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) జవహార్లాల్ నెహ్రూ
బి) గుల్జారీ లాల్ నందా
సి) నరేంద్రమోదీ
డి) మాంటెంక్ సింగ్ అహ్లువాలియా
7. జాతీయాభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1951 ఆగస్టు 6
బి) 1951 మార్చి 6
సి) 1952 ఆగస్టు 6
డి) 1952 మార్చి 6
8. పిగ్మీ ప్రణాళికలు అని వేటిని పిలుస్తారు?
ఎ) వార్షిక ప్రణాళికలు
బి) పంచవర్ష ప్రణాళికలు
సి) స్వల్పకాలిక ప్రణాళికలు
డి) ఎ,సి రెండూ
9. ప్రణాళిక రచన కింది నుంచి పైకి పయనించే ప్రణాళిక?
ఎ) కేంద్రీకృత ప్రణాళిక
బి) వికేంద్రీకృత ప్రణాళిక
సి) సాధారణ ప్రణాళిక
డి) పాక్షిక ప్రణాళిక
10. నిరంతర ప్రణాళికను మొదట ప్రారంభించిన దేశం?
ఎ) రష్యా బి) జపాన్
సి) నెదర్లాండ్ డి) భారతదేశం
11. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను అమలు చేయాలని సూచించింది?
ఎ) జవహార్లాల్ నెహ్రూ
బి) మొరార్జీదేశాయ్
సి) విశ్వేశ్వరయ్య
డి) ఆచార్య లక్డావాలా
12. ప్రణాళిక విరామ కాలం?
ఎ) 1965-69 బి) 1966-69
సి) 1966-68 డి) 1965 -68
13. NITI(నీతి) అనగా…?
ఎ) National Institution for Trans form India
బి) National Institution for Trans forming India
సి) National Industrial for Trans form India
డి) National Industrial for Trans form India
14. ‘సబ్ కా సాథ్ సబ్కా వికాస్’ అనేది దేని లక్ష్యం?
ఎ) ప్రణాళికా సంఘం
బి) నీతి ఆయోగ్
సి) జాతీయాభివృద్ధి మండలి
డి) పైవన్నీ
జవాబులు
1.ఎ 2.సి 3.బి 4.సి 5.సి 6.డి 7.సి 8.డి 9.బి 10.సి 11.డి 12.బి 13.బి 14.బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు