పేదరిక అంచనా ఎందుకు..? ఎలా!
పేదరిక భావనలు-ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర పేదరిక సామర్థ్య విధానం (మానవ పేదరిక సూచి), పేదరిక అంచనా, పేదరిక ధోరణుల అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.
-పై అంశాలకు సంబంధించి పేదరిక నిర్వచనం, దాని భావనల గురించి లోతుగా తెలుసుకోవాలి. దీంతోపాటు పేదరిక అంచనాకు వివిధ కమిటీలు- టెండూల్కర్, రంగరాజన్, సక్సేనా, అభిజిత్‌సేన్ మొదలైనవారు ఇచ్చిన అంచనా పద్ధతుల అధ్యయనం కూడా ముఖ్యమైనదే.
-పేదరిక అంచనాలకు సంబంధించి వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రచురించిన సూచీలు, వాటి ధోరణులు, వాటి మధ్య వ్యత్యాసాలు మొదలైనవన్నీ గ్రూప్స్ మెయిన్స్‌లో అత్యంత ముఖ్యమైనవి.
-పై అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని పేదరికం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు, వాటి మధ్య తేడా ఏమిటీ? వాటిని ఎలా నిర్వచిస్తారు? పేదరిక అంచనా పద్ధతులు మొదలైన అంశాలను ఇప్పుడు చర్చిద్దాం..
-పేదరికం కేవలం ఆర్థిక సమస్యగా కాకుండా సాంఘిక సమస్యగా చూసినప్పుడు మనం పేదరికాన్ని సరిగా అర్థం చేసుకోగలం. పేదరిక నిర్వచనాన్ని 1868లో దాదాబాయి నౌరోజీ ప్రారంభించినా నేటికీ పేదరికంపై సరైన నిర్వచనాన్ని పొందలేకపోతున్నాం. కాబట్టి ఎన్నో భిన్న కోణాలను పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని ఇలా నిర్వచించవచ్చు.
పేదరికం-ప్రభుత్వం
-దేశంలో ప్రతి ఐదేండ్లకోసారి పేదరికాన్ని అంచనావేస్తారు. దీన్ని ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) అంచనా వేసిన గణాంకాల ఆధారంగా సీఎస్ఓ (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్- కేంద్ర గణాంక సంస్థ) అంచనావేస్తుంది.
-ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల ఆధారంగా నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) పేదరిక అంచనాలను ప్రచురిస్తుంది.
-పేదరికాన్ని అంచనావేయడానికి వివిధ సందర్భాల్లో వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది.
పేదరికం రకాలు
పేదరికాన్ని రెండు రకాలుగా విభజించారు. అవి
1. నిరపేక్ష పేదరికం (Absolute Poverty)
ఎ. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్
బి. పావర్టీ లైన్
2. సాపేక్ష పేదరికం (Relative Poverty)
ఎ. లారెన్జ్ వక్రరేఖ (జీనీ ఇండెక్స్)
నిత్యజీవితంలో కనీస అవసరాలు కూడా తీర్చలేని ఒక సాంఘిక ఆర్థిక పరిస్థితినే పేదరికం అంటారు
నిరపేక్ష పేదరికం
-ఇది ప్రజల కనీస అవసరాలకు సంబంధించిన అంశం.
-కనీస అవసరాలను వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా విభజిస్తారు.
-కనీస అవసరాలకు మార్కెట్ ధరల్లో విలువను జోడించి వాటికి అనుగుణంగా తలసరి కనీస జీవనావసర వినియోగాన్ని (విలువను) నిర్ధారిస్తారు.
-ఎప్పుడైతే ప్రజల ఆదాయం ఈ తలసరి కనీస జీవనావసర వినియోగాన్ని కలిగి ఉండరో వారిని పేదలుగా పరిగణిస్తారు.
-ఇది ఎక్కువగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది.
-భారతదేశ పేదరికం నిరపేక్ష పేదరికం.
సాపేక్ష పేదరికం
-ప్రజల ఆదాయ పంపిణిని తులనాత్మకంగా అంచనా వేయడమే సాపేక్ష పేదరికం.
-అంటే ప్రజల్లో అధిక ఆదాయం గల (5-10 శాతం) జనాభా జీవన స్థాయిని, తక్కువ ఆదాయం గల (5-10 శాతం) జనాభా జీవన ప్రమాణ స్థాయిని పోల్చడమే సాపేక్ష పేదరికం అని అంటారు.
-దీన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా వాడుతారు.
-సాపేక్ష పేదరికాన్ని సమాజంలో అసమానతలను కొలవడం కోసం అధికంగా ఉపయోగిస్తారు.
-ఉదాహరణకు దేశంలో ఉన్న సంపన్న వర్గాలను, పేద వర్గాలను పోల్చి పేదరికాన్ని నిర్వచించడం. అంటే బిల్‌గేట్స్‌తో పోల్చినప్పుడు అజీమ్ ప్రేమ్‌జీ పేదవాడు. ఇలా సమాజంలో ఉన్న 10 శాతం సంపన్న వర్గాలను 10 శాతం ఉన్న పేద వర్గాలను పోల్చి అసమానతను కొలుస్తారు.
పేదరికపు రేఖ
-ప్రజల కనీస జీవనావసరాలను మార్కెట్ విలువకు సమానం చేసి (అంటే కనీస వ్యయం) దానికంటే తక్కువ ఆదాయం (వ్యయం) కలవారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారని, దాని కంటే ఎక్కువ వ్యయం చేసేవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారని పేర్కొంటారు.
-ఉదాహరణకు కనీస వ్యయం రూ. 30లు అనుకుంటే రూ. 30 కంటే ఎక్కువ వ్యయం చేసేవారిని పేదరిక రేఖకు ఎగువన, దానికంటే తక్కువ వ్యయం చేసేవారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా పరిగణిస్తారు.
-దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేనిని దారిద్య్రరేఖగా (కనీస వ్యయం) నిర్ణయించాలనే విషయంపై అనేక కమిటీలు సూచనలు చేసినప్పటికీ అది నేటికీ అస్పష్టంగానే ఉంది.
-పేదరిక రేఖను నిర్వచించనందుకే నేటికీ ప్రభుత్వ పథకాల్లో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటుంది.
-అందువల్ల లబ్ధిదారులకు చెందాల్సిన వివిధ పథకాలు అవినీతిపరుల చేతుల్లోకి చేరుతున్నాయి.
పేదరికాన్ని ఎలా కొలుస్తారు?
-పేదరికాన్ని కొలవడానికి దారిద్య్రరేఖ బుట్ట (Poverty Line Basket-PLB)ను నిర్వచిస్తారు. ఇందులో వివిధ ఆహార, ఆహారేతర వస్తువులు, విరివిగా వాడే వస్తువులు మొదలైనవి ఉంటాయి. పీఎల్బీని మార్కెట్ విలువకు సమానం చేసి, దాని పరిధిలోకి వచ్చే వారిని పేదలుగా లెక్కిస్తారు.
-ఉదాహరణకు ఎన్ఎస్ఎస్ఓ సర్వే వారు వివిధ ప్రశ్నలతో కొన్ని రోజులు గృహరంగాన్ని, ప్రజలను అడిగి వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలు సేకరించే సమయాన్ని రిఫరల్ పీరియడ్ అంటారు.
-ఇది కూడా వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. దీనికోసం ఎన్ఎస్ఎస్ఓ సర్వే, వివిధ రకాల రిఫరెన్స్ పీరియడ్లను తీసుకుంటుంది.
-ఈ డాటాను తలసరి కనీస వినియోగ వ్యయం, తలసరి కనీస ఆదాయం వ్యయం అని రెండు రకాలుగా సేకరిస్తారు.
-ఆదాయాన్ని కనీస అవసరంగా తీసుకుని, వినియోగాన్ని కనీస అవసరంగా తీసుకుని దారిద్య్రరేఖను లెక్కిస్తారు.
-కానీ దేశంలో తలసరి కనీస వినియోగ వ్యయాన్ని ఆధారంగా తీసుకుని పేదరికాన్ని కొలుస్తారు.
-ఆదాయ ఆధారిత పేదరికం Vs వినిమయ ఆధారిత పేదరికం
-కనీస వినియోగ వ్యయాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ఎస్ఎస్ఓ పేదరికాన్ని నిర్వచిస్తుంది. కానీ ఆదాయాన్ని కూడా కనీస అవసరంగా చేసుకుని పేదరికాన్ని లెక్కిస్తారు. ఇప్పటివరకు పేదరిక అంచనాలపై వేసిన ఎన్నో కమిటీలు కనీస వినియోగాన్ని ఆధారంగా చేసుకుని పేదరికాన్ని నిర్వచించారు. ఎందుకంటే…
దేశంలో ఎక్కువ మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండటంవల్ల వారికి క్రమానుగుణంగా ఆదాయం రాదు. అంటే స్వయం ఉపాధిదారులు, రోజువారీ కూలీలు మొదలైనవారు క్రమానుగుణంగా కాకుండా ఎప్పుడో ఒకసారి ఆదాయం పొందుతారు. అందువల్ల కనీస ఆదాయాన్ని ఒక రిఫరెన్స్ పీరియడ్ ఆధారంగా లెక్కించడం కష్టం. కానీ కనీస అవసరాలు మాత్రం లెక్కించవచ్చు.
-ఒకవేళ క్రమానుగతంగా ఆదాయం వచ్చిన వివిధ మార్గాల్లో వచ్చే ఇతర ఆదాయం (లంచాలు, అవినీతి వల్ల మొదలైనవి) లెక్కించడం కష్టం.
-ఉదాహరణకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం 100 రోజుల పనికల్పిస్తుంది. కానీ దీంతోపాటు ప్రజలు ఇతర మార్గాల్లో కూడా లంచాలు, అవినీతి కాకుండా వేరే కూలీ చేస్తూ కూడా ఆదాయాన్ని పొందుతారు.
-ఎన్ఎస్ఎస్ఓ వారు రిఫరెన్స్ పీరియడ్‌గా గత 30 రోజులను తీసుకునేవారు. కానీ ఆ చివరి 30 రోజుల్లో ఆ కుటుంబానికి ఎలాంటి ఆదాయం సమకూర్చకపోవచ్చు. కానీ కనీస వినియోగం మాత్రం ఉంటుంది.
-అందువల్ల దారిద్య్రరేఖను ఆదాయాన్ని బట్టి కాకుండా కనీ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు