తెలంగాణ సాహిత్యం.. కుతుబ్ షాహీలయుగం
-కందుకూరి రుద్రకవి: ఈ యుగంలోని అగ్రశ్రేణి కవుల్లో ఒకడు. విశ్వబ్రాహ్మణుడు. వేటూరి, ఆరుద్రలు ఇతనిది నేటి ప్రకాశం జిల్లా కందుకూరి అని అన్నారు. కానీ అనేక ఆధారాలను బట్టి ఇతను నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కందుకూరికి చెందినవాడని తెలుస్తోంది. ఇతని రచనలు 1) సుగ్రీవ విజయం 2) నిరంకుశోపాఖ్యానం 3) జనార్దనాష్టకం 4) బలవదరీ శతకం 5) జనార్దనాష్టక స్తోత్రం మొదలైనవి. కాళికావరప్రసాదంచే తనకు కవిత్వం అబ్బినదని చెప్పుకున్నాడు. ఇబ్రహీం కుతుబ్షా నుంచి రెంటచింతలను అగ్రహారంగా పొందాడు.
-సుగ్రీవ విజయం: తెలుగులో లభిస్తున్న యక్షగానాల్లో ఇది మొదటిది. దీనిని కందుకూరిలో వెలసిన జనార్దన దేవునికి అంకితమిచ్చాడు. శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం ఇందులోని ఇతివృత్తం. రుద్రకవి దీనిని కరుణభాసుర యక్షగాన ప్రబంధం అని పేర్కొన్నాడు.
-నిరంకుశోపాఖ్యానం: దీనిని కందుకూరిలో వెలసిన సోమేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. నిరంకుశోపాఖ్యాన కథకు మూలం కథాసరిత్సాగరంలోని విక్రమాదిత్యుని కథకు ఉప కథ అయిన ఠింఠాకరాళుని వృత్తాంతం. ఇందులోని నిరంకుశుడు గుణనిధి, నిగమశర్మలాంటి పాత్ర.
-జనార్దనాష్టకం : ఇది శృంగారాత్మకమైనది. దనుజమర్ధన! కందుకూరి జనార్దనా అనే మకుటంతో రాశాడు. దీనిని కందుకూరి జనార్దనునికి అంకితమిచ్చాడు.
-పోశెట్టి లింగకవి : ఇతని రచనలు నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకరదాసమయ్య చరిత్ర, వీర సంగమయ్యదేవ చరిత్ర, శిష్యప్రబోధం అనే ద్విపద కావ్యం.
-మరింగంటి సింగరాచార్యుడు (క్రీ.శ. 1520-1590):
తెలుగు సాహిత్యంలో తొలి త్య్రర్థి, చతురర్థి కావ్యాలను రాశాడు. ఇబ్రహీం కుతుబ్షాను మెప్పించి వాడపల్లి అగ్రహారాన్ని పొందాడు. ఇతడు పదహారో యేట రచించిన నాలుగర్థాల కావ్యం నలయాదవ రాఘవ పాండవీయం. ఇతర రచనలు వరదరాజస్తుతి, శ్రీరంగ శతకం, రామకృష్ణ విజయం (ద్వర్థి కావ్యం), దశరథరాజనందన చరిత్ర (నిరోష్ఠ్య రామాయణం), సీతాకల్యాణం, శ్రీకృష్ణ శతానందీయం, కృష్ణతులాభారం, రతిమన్మథాభ్యుదయం, రామాభ్యుదయం మొదలైనవి.
-సిద్దరామ కవి: ఇతను గంగాధరుని సమకాలికుడు. ఇతడు రచించిన వేదాంత వచన గ్రంథం ప్రభుదేవర వాక్యం.
-మహ్మద్ కులీకుతుబ్షా (క్రీ.శ. 1580-1612): ఇతను తొలి ఉర్దూ రాజ కవి. ఉర్దూ కవుల్లో కులీకుతుబ్షా ప్రథముడు కాకపోయినా ఒక సంపుటంగా పుస్తకరూపంలో వెలువడటం ఈయనతోనే మొదలైంది. ఇతను పార్శీ, తెలుగులో కూడా కవిత్వం రాశాడంటారు కానీ అవి లభ్యం కావడంలేదు. ఇతని కవితల సంకలనం దివాన్ పేరుతో ఇతని అల్లుడు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా వెలువరించాడు. ఇతని కవిత్వంలో పర్షియన్, భారతీయ సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది.
-కామినేని మల్లారెడ్డి: ఈ రాజ కవి మెదక్ దుర్గానికి సమీపంలోని బిక్కనవోలును రాజధానిగా గోల్కొండ సుల్తానుల కింద సామంతుడుగా పరిపాలించిన రాజవంశంలోనివాడు. ఇతని రచనలు 1) షట్చక్రవర్తి చరిత్ర 2) శి వధర్మోత్తర ఖండం 3) పద్మ పురాణం. మల్లారెడ్డి తన రచనలను సిద్దరామేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. శివధర్మోత్తర ఖండానికి మూలం స్కాంద పురాణంలోని ఇతివృత్తం. శైవమత ధర్మం ప్రధానంగా చెప్పిన కావ్యం ఇది. పద్మ పురాణంలో రామాయణ కథలతో పాటు శివలింగ పూజాక్రమం, శివపూజా మహాత్మ్యం వివరించాడు.
-చిత్రకవి పెద్దన (16వ శతాబ్దం): ఇతని స్వస్థలం కొల్లాపురం సంస్థానంలోని వెల్లటూరు గ్రామం. ఇతని రచనలు లక్ష్మణసార సంగ్రహం, హనుమంత శతకం, హనుమోదాహరణం.
-చిత్రకవి అనంతకవి: ఇతను రచించిన కావ్యం హరిహరశ్లేషోదాహరణం.
-చిత్రకవి వెంకటరమణ కవి: ఇతని రచన సాంబ విలాసం.
-నౌబతి కృష్ణమంత్రి (క్రీ.శ. 1580-1612): ఇతను కులీకుతుబ్షా మంత్రి, ఆస్థాన కవి, మిత్రుడు. గోల్కొండ సమీపంలోని సిద్దలూరు ఇతని జన్మస్థలం. ఇతని రచన రాజనీతి రత్నాకరం నాటి రాజకీయ, సాహిత్య చరిత్రలను తెలుపుతుంది.
-రెండో ఎల్లారెడ్డి: ఇతని రచనలు వాసిష్ఠం, లింగ పురాణం ఇవి అలభ్యం. ఇతను పట్టమట్ట సోమనాథుడు రచించిన బ్రహ్మోత్తర ఖండాన్ని అంకితంగా పొందాడు.
-గవాసి: ఇతను సుల్తాన్ అబ్దుల్లా కులీకుతుబ్షా ఆస్థాన కవి. ఇతను సంస్కృతంలో రాసిన శుకసప్తతిని తోతినామా పేరుతో పార్శీ భాషలోకి అనువదించాడు.
-సుల్తాన్ అబ్దుల్లా కులీకుతుబ్షా : ఇతను ఉర్దూ భాషకు చాలా సేవ చేశాడు. ఇతని పాలనాకాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగం వంటిది. ఇతను కవి పండిత పోషకుడేకాక స్వయంగా కవి. అబ్దుల్లా పేరుతో కవితలు వెలువరించాడు.
-సురభి మాధవరాయలు : ఈయన పాలమూరు జిల్లాలోని జటప్రోలు పాలకుడు. క్రీ.శ. 1650 ప్రాంతానికి చెందినవాడు. ఇతని రచన చంద్రికా పరిణయం అనే ప్రబంధంలో చంద్రిక, సుచంద్రుల ప్రేమ వివాహ కథ ప్రధానమైనది. ప్రబంధ యుగానంతరం వచ్చిన అనేక పిల్ల వసుచరిత్రలకు ఈ ప్రబంధం నాంది పలికింది.
-కాసె సర్వప్ప (16వ శతాబ్దం) : ఇతను సిద్దేశ్వర చరిత్ర అనే చారిత్రక గ్రంథాన్ని ద్విపదలో రాశాడు. ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే ద్విపదలో ఉన్నాయి. మిగిలిన భాగం వచనంలో ఉంటుంది. తెలుగులో వెలువడిన తొలి చారిత్రక పద్యకావ్యం సిద్దేశ్వర చరిత్ర. దీనికి సిద్దేశ్వర మహాత్మ్యం, ప్రతాప చరిత్రం, కాకతీయ రాజవంశావళి అని పేర్లున్నాయి. ఇది ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రను అనుసరించి రాయబడింది. రెండో ప్రతాపరుద్రుడు తురుష్కుల చేతిలో బందీయై ఢిల్లీకి తీసుకుపోతుంటే మార్గమధ్యంలో నర్మదానదిలో దూకి మరణించాడన్న వృత్తాంతం సిద్దేశ్వర చరిత్రలోనే ఉంది. కాకతీయుల సాంఘికాచారాలను, మతం, సంప్రదాయాలను ఈ కావ్యం తెలుపుతుంది.
-ఎలకూచి బాలసరస్వతి (క్రీ.శ. 1600-1650): ఇతను జటప్రోలు సంస్థాన పాలకుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. సంస్కృతంలో నన్నయ రచించిన ఆంధ్రశబ్ద చింతామణికి రెండు పరిచ్ఛేదాల్లో టీకను రాశాడు. ఇతని అసలు పేరు ఎలకూచి వెంకటకృష్ణయ్య. మహా మహాపాధ్యాయ బిరుదాంకితుడు. ఇతని రచనలు 1) చంద్రికా పరిణయం 2) మల్లభూపాలీయం 3) భర్తృహరి త్రిశతి అనువాదం. చంద్రికా పరిణయాన్ని సరస్వతికి అంకితమిచ్చాడు. మల్లభూపాలీయాన్ని సురభి మాధవరాయల తండ్రి మల్లభూపాలునికి అంకితమిచ్చాడు. భర్తృహరి త్రిశతిని తెలుగులోకి అనువదించినవారు ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. బాల సరస్వతి యాదవ రాఘవపాండవీయం అనే త్య్రర్థి కావ్యాన్ని రచించి వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు.
-పొన్నగంటి తెలగన్న (క్రీ.శ. 1520-1580): ఇతను అచ్చ తెలుగులో యయాతి చరిత్ర అనే కావ్యాన్ని రాశాడు. ఇది తెలుగులో మొట్టమొదట రాయబడిన అచ్చ తెలుగు కావ్యం. దీనిని అమీన్భాను అనే ఇబ్రహీంకుతుబ్షా సామంత రాజుకు అంకితమిచ్చాడు. యయాతి చరిత్రకు మూలం నన్నయ రచించిన ఆంధ్రమహా భారతం ఆదిపర్వంలోని తృతీయ ఆశ్వాసంలోని వృత్తాంతం. యయాతి దేవయాని, శర్మిష్ఠలను వివాహమాడిన వృత్తాంతం ఇందులోనిది.
-సారంగు తమ్మయ్య (16వ శతాబ్దం): పరమ వైష్ణవుడగు సారంగు తమ్మయ్య విప్రనారాయణ కథను వైజయంతీ విలాసం అనే పేరుతో నాలుగు ఆశ్వాసాల శృంగార ప్రబంధాన్ని రచించి తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రను రచించిన తర్వాత రాసిన గ్రంథమిది. ఇతడు మహమ్మద్ కుతుబ్షా కాలంలో గోల్కొండ కరణంగా పనిచేశాడు. సారంగు తమ్మ య్య గురువు కందాల అప్పలాచార్యులు.
-అద్దంకి గంగాధరుడు : మల్కీభరాముని (ఇబ్రహీం కుతుబ్షా) ఆస్థాన కవి. రామరాజ భూషణునితో పోల్చదగిని ప్రతిభావంతుడైన కవి. ఇతడు కేదారగురుని శిష్యుడు. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానం అనే శృంగార ప్రబంధాన్ని రచించి ఇబ్రహీం కుతుబ్షాకు అంకితమిచ్చాడు. ఇందులో ఇబ్రహీంకుతుబ్షాను మల్కీభరామునిగా కీర్తించాడు. సంవరణుడనే రాజు సూర్యుని కుమార్తె తపతిని వలచి వివాహమాడిన వృత్తాంతం ఈ ప్రబంధమునందలి వస్తువు. దీనికి మూలం మహాభారతంలోని ఆదిపర్వం. తపతీ సంవరణోపాఖ్యానం వసుచరిత్రకు అనుసరణమని కొర్లపాటి శ్రీరామమూర్తి అభిప్రాయపడ్డారు. కానీ వసుచరిత్ర కంటే ముందే తపతీసంవరణోపాఖ్యానం రాశారని తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయుల కథను నంది తిమ్మన పారిజాతాపహరణంలో తెలిపితే, గంగాధరుడు ఈ కావ్యంలో మల్కీభరాముని ప్రేమకథను తెలిపాడు.
-ప్రజలచే మల్కీభరాముడిగా పిలువబడిన నవాబు -ఇబ్రహీం కుతుబ్షా
-దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు – ఇబ్రహీం కుతుబ్షా
-ఇబ్రహీం కుతుబ్షా ఆస్థానంలోని తెలుగు కవులు – కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగనార్యుడు (తెలగన్న)
-తపతీ సంవరణోపాఖ్యానం అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితమిచ్చినదెవరు – అద్దంకి గంగాధరకవి
-యయాతి చరిత్ర రచించినది ఎవరు – పొన్నగంటి తెలగనార్యుడు
-నిరంకుశోపాఖ్యానం రచయిత – కందుకూరి రుద్రకవి
-శివధర్మోత్తర, షట్ చక్రవర్తుల చరిత్ర రచించినది ఎవరు – కామినేని మల్లారెడ్డి
-మహమ్మద్ కులీ కుతుబ్షా రచించిన గీతాలు – కులియాత్ కులి గీతాలు
-వాగ్గేయకారుడు క్షేత్రయ్య ఎవరి ఆస్థానాన్ని దర్శించెను – అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా
-భక్తరామదాసుగా ఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ గోల్కొండ నవాబుకు సమకాలికుడు – అబుల్ హసన్
-తెలుగులో యక్షగానం ఏ వంశపాలకులతో అంతరించింది – కుతుబ్షాహీ
-ఆంధ్రలో కుతుబ్షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నాట్యరీతి – కూచిపూడి
-అబ్దుల్లా కుతుబ్షా ఆస్థానంలోని ప్రముఖ ఉర్దూ కవి – గవాసి
-తౌసల్ నామా కావ్యాన్ని రచించినది ఎవరు – ఫిరోజ్
-తోతినామా రచించినదెవరు – గవాసి
-తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం – యయాతి చరిత్ర
-పొన్నగంటి తెలగనార్యుడు ఏ కుతుబ్ షాహీ కులానికి చెందినవాడు – ఇబ్రహీం కుతుబ్ షా
-కందుకూరి రుద్రకవి రచనలు – నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, యక్షగానం, జనార్దనాష్టకం
-వైజయంతీ విలాసం రచయిత – సారంగు తమ్మయ్య
-దశరథ రాజనందన చరిత్రను రచించింది – మరింగంటి సింగరాచార్యుడు
-కంచర్ల గోపన్న రచన – దాశరథీ శతకం
-రాజనీతి రత్నాకరం రచయిత – నౌబతి కృష్ణయామాత్యుడు
-కుతుబ్షాహీ కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు ప్రజాకవి – వేమన
-కుతుబ్షాహీల కాలంలో ఆంధ్రలో రాజభాష – పర్షియన్
1) తెలుగులో లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది?
1) సౌభరీ చరిత్ర 2) సుగ్రీవ విజయం
3)కనకతార 4) మాయా సుభద్ర
2) తొలి నిరోష్ఠ్య రచన చేసిన కవి?
1) కందుకూరి రుద్రకవి
2) మరింగంటి నరసింహాచార్యులు
3) పోశెట్టి లింగకవి 4) సిద్దరామకవి
3) వైజయంతీ విలాసంలోని కథ?
1) రామ కథ 2) కృష్ణ కథ
3) పార్వతి కథ 4) విప్రనారాయణ కథ
4) కామినేని మల్లారెడ్డి రచన?
1) షట్చక్రవర్తి చరిత్ర 2) శివధర్మోత్తర ఖండం 3) పద్మపురాణం 4) పైవన్నీ
సమాధానాలు :1-2, 2-2, 3-4, 3-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు