Social factors in Group-1 and Group-2 exams | గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సామాజిక అంశాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సామాజిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సమాజంపట్ల, సామాజిక సమస్యలపట్ల అవగాహన కలిగిన అధికారులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయగలరు కాబట్టి.. టీఎస్పీఎస్సీ సిలబస్‌లో భారతీయ సామాజిక నిర్మితి, సామాజిక సమస్యలు, సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి అనేక అంశాలను పేర్కొన్నారు. అందుకే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించాలంటే సామాజిక అంశాలపట్ల విస్తృతస్థాయి అవగాహన, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, సమస్యలపట్ల స్పందించే మనస్తత్వం, సృజనాత్మకత, తార్కికత, ఆశావాద దృక్పథం, ముఖ్యంగా ప్రభుత్వ పనితీరుపట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
గ్రూప్-1లో..
l గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 11వ అంశమైన సామాజిక వెలి, మహిళలు, కులం, తెగ, వికలాంగుల హక్కులకు సంబంధించిన అంశాలు, సమ్మిళిత విధానాలకు సంబంధించిన అంశాలపై దాదాపు 10 ప్రశ్నలు వస్తాయి. భారతదేశ సామాజిక అభివృద్ధి (5వ అంశం), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు (10వ అంశం) సంబంధించి దాదాపు 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. మెయిన్స్ ఎంపికలో 1:50 నిష్పత్తి పాటిస్తే ప్రిలిమ్స్ కటాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో సామాజిక అంశాల గురించి లోతుగా అధ్యయనం చేయాలి.
గ్రూప్-1 మెయిన్స్‌లో..
-ఈసారి గ్రూప్-1 ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూ లేనందున మెయిన్స్‌లో రాసే ప్రతి సమాధానం చాలా ముఖ్యమైనది. సామాజిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు శాస్త్రీయ పద్ధతిని అవలంభించగలిగితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
-పేపర్-1 జనరల్ ఎస్సే సెక్షన్-1లో సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు, ఆర్థికవృద్ధి, న్యాయ అంశాలకు సంబంధించి 50 మార్కులకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
– పేపర్-3 సెక్షన్-1లో భారతీయ సామాజిక నిర్మితి-అంశాలు, సామాజిక ఉద్యమాలకు సంబంధించి 5 యూనిట్లలో అనేక అంశాలను పేర్కొన్నారు. తొలి యూనిట్లో భారతీయ సమాజం, విశిష్ట లక్షణాలు, సామాజిక నిర్మితిలో భాగమైన వివాహం, కుటుంబ బంధుత్వం, కులం, మతం వంటి సామాజిక సంస్థల గురించి.. రెండో యూనిట్లో సామాజిక వెలి, బలహీన వర్గాల సమస్యల గురించి (గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఈ అంశం గురించి ప్రత్యేకంగా ఇచ్చారు), మూడో యూనిట్లో భారతదేశంలో ప్రధాన సామాజిక, ఆర్థిక పర్యావరణ సంబంధిత సమస్యల గురించి పేర్కొన్నారు.
– నాలుగో యూనిట్లో తెలంగాణలో సామాజిక సమస్యలు, సామాజిక ఉద్యమాల గురించి పేర్కొనగా.. ఐదో యూనిట్లో భారతదేశం, తెలంగాణలో సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి పేర్కొన్నారు.
ఇతర పేపర్లలో..
-మెయిన్స్ పేపర్-2 సెక్షన్-1లో భారతదేశ చరిత్రకు సంబంధించిన యూనిట్-4లో కులవ్యతిరేక ఉద్యమాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, ఆత్మగౌరవ ఉద్యమాలు, యూనిట్-5లో గిరిజన ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, మతతత్వం.. సెక్షన్-2 యూనిట్-4లో ఆదిహిందూ ఉద్యమం-భాగ్యరెడ్డి వర్మ, మహిళా ఉద్యమాలు అభివృద్ధి, గిరిజన తిరుగుబాట్లు, రామ్జీగోండు, కుమ్రం భీమ్ గోండు తిరుగుబాటు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సెక్షన్-3 యూనిట్-4లో గిరిజన విధానాలు, పేపర్-4 సెక్షన్-1 యూనిట్-2లో పేదరికం, నిరుద్యోగం వంటి అంశాలను సామాజిక, ఆర్థిక నేపథ్యంలో సిలబస్‌లో ప్రస్తావించారు.
గ్రూప్-2లో
– పేపర్-1 జనరల్ స్టడీస్‌లో 7వ అంశం తెలంగాణ సమాజం, 8వ అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, 9వ అంశం సామాజిక వెలి, హక్కులు, సమ్మిళిత విధానాలు ఉన్నాయి. పేపర్-2 సెక్షన్-1 (భారతదేశ, తెలంగాణ చరిత్ర) యూనిట్-3లో భారతదేశంలో సామాజిక ఉద్యమాలు, జ్యోతిబాఫూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, అంబేద్కర్, యూనిట్-5లో వెట్టి, మహిళల స్థానం, తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు, ఆదిహిందూ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, రామ్‌జీ గోండు, కుమ్రం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వంటి వాటిని సిలబస్‌లో పేర్కొన్నారు. సెక్షన్-2 యూనిట్-8లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మహిళలు మైనారిటీల కోసం ప్రత్యేక నియమాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ గురించి ఇచ్చారు.
-సెక్షన్-3లో సామాజిక నిర్మితి-అంశాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఐదు యూనిట్లను సిలబస్‌లో పేర్కొన్నారు. యూనిట్-1లో భారతీయ సామాజిక వ్యవస్థ నిర్మాణం, సామాజిక సంస్థలు, తెలంగాణ సమాజం-సామాజిక సాంస్కృతిక లక్షణాలు, యూనిట్-2లో సామాజిక అంశాలు, సామాజిక వెలి, యూనిట్-3లో సామాజిక ఉద్యమాలు, యూనిట్-4లో తెలంగాణ ప్రత్యేక సామాజిక అంశాలు, యూనిట్-5లో సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలను ప్రస్తావించారు.
– పేపర్-3 సెక్షన్-1 (భారత ఆర్థిక వ్యవస్థ) యూనిట్-3లో పేదరికం, నిరుద్యోగం, యూనిట్-4లో సమ్మిళిత వృద్ధి, సెక్షన్-3 (అభివృద్ధి, మార్పు), యూనిట్-1లో సామాజిక అసమానతలు, కులం, తెగ, లింగభేదం, మతం, వలస, పట్టణీకరణ, యూనిట్-3లో పేదరికం, అసమానతలు, సామాజిక మార్పు, సామాజిక భద్రత వంటి అంశాలను సిలబస్‌గా పేర్కొన్నారు.
సమాజమే వేదిక
-పోటీ పరీక్షల ప్రధాన ఉద్దేశం ప్రజల సమస్యలకు ప్రభుత్వం తరఫున పరిష్కార మార్గం చూపే అధికారులను ఎంపికచేయడం. కాబట్టి సిలబస్‌లో సామాజిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సమాజ నిర్మాణం, సమాజంలోని ప్రధాన సమస్యలకుగల కారణాలను, సమస్యలవల్ల తలెత్తే పర్యవసానాలను, సమస్యలకు పర్యవసానాలను, సమస్యలకు పరిష్కార మార్గాలను అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక అభ్యర్థి ఉద్యోగిగా మారితే దాదాపు 30 ఏండ్లపాటు సమాజాన్ని వేదికగా చేసుకుని ప్రభుత్వ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి సమాజం గురించి ఎంత ఎక్కువ అవగాహన, పరిజ్ఞానం ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది. టీఎస్పీఎస్సీ రూపకల్పన దశలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన విధానంలో సిలబస్‌ను విడుదల చేశారని భావించవచ్చు.
నూతనకంటి వెంకట్
పోటీపరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు