పల్లె పల్లెకు ఉద్యమ జ్వాల
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం యూ టర్న్ తీసుకోవడంతో పల్లె పల్లెలో ఉద్యమ జ్వాల రగిలింది.. యావత్ తెలంగాణ ఎన్నడూలేనివిధంగా నిరసనహోరు తెలిపింది.. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థులు దీక్షలు చేపట్టారు.. చిన్నాపెద్దా తేడా అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా విద్యార్థులు వెనుకడుగు వేయలేదు.. పోలీసులతో దాడిచేయించినా భయపడలేదు.. తెలంగాణ సమాజం ఏకతాటిపైకి రావడంతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అటు తర్వాత అభిప్రాయ సేకరణకు అంటూ శ్రీకృష్ట కమిటీని నియమించింది.. ఈ పరిణామాలపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
-తెలంగాణ ఉద్యమ ఉధృతిలో అనతికాలంలోనే అన్నిస్థాయిల్లో టీజేఏసీలు ఆవిర్భవించి క్రమంగా గ్రామస్థాయివరకు విస్తరించాయి. ఇలా విరివిగా జేఏసీల ఆవిర్భావాన్ని సీమాంధ్ర నేతలు, కేంద్రప్రభుత్వం ఊహించలేకపోయాయి. తెలంగాణవాదులు ఏకం కాకుండా శక్తిగా ఎదగకుండా చేసి సీమాంధ్ర పాలకులు ఇంతకాలం విజయం సాధించారు. అయితే జెండాలు పక్కనపెట్టి తెలంగాణ పార్టీలన్నీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడటం ఉద్యమం సాధించిన గొప్ప విజయం.
-ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి జేఏసీ తొలిసారి తెలంగాణ బంద్‌కి 2009, డిసెంబర్ 30న పిలుపునిచ్చింది. ఈ విధంగా తెలంగాణ జేఏసీ చేపట్టిన బంద్‌లో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలు, పార్టీలు, సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి కుల, మతాలకతీతంగా ఏకమై గతంలో ఎన్నడూ చూడనివిధంగా బంద్ కొనసాగింది.
ఓయూ విద్యార్థుల ఆమరణ దీక్ష:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు 2009, డిసెంబర్ 24న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యార్థుల ఉద్యమ తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం మరోసారి డిసెంబర్ 28 నుంచి హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తూ సర్క్యులర్ జారీచేసింది.
-ఓయూ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) విద్యార్థులు సైతం డిసెంబర్ 28 నుంచి ఆమరణ దీక్షలు ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు సైతం ఆమరణదీక్షలకు దిగారు. ఇలా అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది.
-అయితే రోజురోజుకి విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు విషమిస్తున్నాయని ప్రభుత్వం గ్రహించి డిసెంబర్ 28న అర్ధరాత్రి దీక్షాశిబిరంపై పోలీసులతో దాడిచేయించింది. దీక్షలో కూర్చున్న 12 మంది విద్యార్థులను బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించింది.
-ఈ ఘటనపై తెలంగాణ రాజకీయ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ముఖ్యమంత్రిని కలిసి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. దీక్ష చేస్తున్న విద్యార్థులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా వారు ఆస్పత్రిలోనే తమ దీక్షను కొనసాగించారు.
-ఇలా 7 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న ఓయూ విద్యార్థుల ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలిసిన తెలంగాణ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు విద్యార్థులను గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు. డిసెంబర్ 30న మరింతగా విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినడంతో పోరాడి తెలంగాణ సాధిద్దాం అని కేసీఆర్ వారికి నచ్చజెప్పడంతో విద్యార్థులు దీక్ష విరమించారు. కానీ రిలే దీక్షలు మాత్రం కొనసాగాయి.
-తెలంగాణ యూనివర్సిటీల అధ్యాపకుల సంఘం: తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ పరిధిలోని తొమ్మిది యూనివర్సిటీల అధ్యాపకులు సికింద్రాబాద్‌లోని టీచర్స్హోంలో 2009, డిసెంబర్ 28న తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఈ సంఘం కన్వీనర్‌గా ఓయూ అధ్యాపకులు భట్టు సత్యనారాయణ, కో కన్వీనర్‌గా కేయూ అధ్యాపకులు పాపిరెడ్డి నియమితులయ్యారు.
-ఈ సంఘం ప్రధానంగా ఆయా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కొనసాగించే ఉద్యమానికి చేదోడువాదోడుగా నిలిచింది.
ఓయూ విద్యార్థి గర్జన:
రాజకీయంగా రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికి 2010, జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి రెండురోజుల ముందే ఓయూ జేఏసీ తమ బలాన్ని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అవసరాన్ని ప్రదర్శించడానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థి గర్జనకి పిలుపునిచ్చింది.
-ప్రభుత్వం, పోలీస్ బలగాలు ఎంత నిర్బంధం విధించినా, ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు తండోపతండాలుగా చేరుకొని సభను విజయవంతం చేశారు. ఓయూ విద్యార్థి గర్జన ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంతవరకు తెలంగాణ ఉద్యమం ఆగదని స్పష్టమైన సంకేతాలు పంపించారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు – సిఫారసులు
అఖిలపక్ష సమావేశం తెలంగాణలోని ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపర్చలేకపోయింది. ఫలితంగా తెలంగాణలో ఆందోళనలు ఎక్కువయ్యాయి. తెలంగాణ రాదేమోనన్న అనుమానంతో రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ పరిమాణాలతో తెలంగాణ ప్రాంతం అల్లకల్లోలంగా మారి రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. జరుగుతున్న ఆందోళనలు గమనించిన కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ముందు విస్తృత సంప్రదింపులు అవసరమనే సాకుతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. కమిటీని తెలంగాణవాదులందరూ తిరస్కరించారు. కమిటీ ఏర్పాటు లేకుండానే తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించాలని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. గతంలో ప్రణబ్‌ముఖర్జీ, రోశయ్య కమిటీలవల్ల తెలంగాణ ప్రజల్లో కమిటీలపట్ల నమ్మకం లేదని టీజేఏసీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జనవరి 5న జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొనసాగింపుగా జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని వర్గాలతోను విస్తృత సంప్రదింపులు జరిపేందుకు ఫిబ్రవరి 3న ప్రకటించింది.
కమిటీలోని సభ్యులు
-అధ్యక్షుడు: జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
-సభ్యులు: ప్రొఫెసర్ డాక్టర్ రణ్‌బీర్‌సింగ్, వీసీ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
-డాక్టర్ అబుసలే ఆరిఫ్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధన సంస్థ ఢిల్లీ.
-డాక్టర్ రవీందర్‌కౌర్, ఆచార్యులు, మానవ సామాజిక శాస్ర్తాల విభాగం ఐఐటీ ఢిల్లీ
-వినోద్ కె.దుగ్గల్, రిటైర్డ్ ఐఏఎస్, హోంశాఖ మాజీ కార్యదర్శి
-అయితే కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు శాంతియుత పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ కోదండరాం స్పష్టంచేశారు. ఫిబ్రవరి 7న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రెండు భారీ బహిరంగ సభలు జరిగాయి. అందులో ఒకటి జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో. రెండోది ఓయూ క్యాంపస్ నుంచి కేయూ క్యాంపస్ వరకు సాగిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా లక్షలాది విద్యార్థులతో కేయూ క్యాంపస్‌లో విద్యార్థి పొలికేక జరిగింది.
అఖిలపక్ష సమావేశం
-తెలంగాణలో డిసెంబర్ 30న జరిగిన బంద్ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులతో సహా అధికార విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ సభ్యుడిదాకా తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారు.
-ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వంలో కదలికవచ్చింది. తెలంగాణపై పార్టీల అభిప్రాయసేకరణ కోసం ఉమ్మడి ఏపీలో గుర్తింపుపొందిన ఎనిమిది (కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం) రాజకీయ పార్టీలను 2010, జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి పిలిచింది. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున రావాలని కేంద్ర హోంశాఖ రాజకీయ పార్టీలను కోరింది. తెలంగాణ రాజకీయ జేఏసీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అందుకోసం ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి రాజకీయ జేఏసీ పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
-కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 2010 జనవరి 5న జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఇరు ప్రాంతాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి హాజరయ్యారు. కానీ ఈ సమావేశంలో పార్టీ అభిప్రాయం కాకుండా వ్యక్తుల అభిప్రాయాన్ని కేంద్రప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు సమైక్యవాదం, మరొకరు తెలంగాణవాదం వినిపించారు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేయాలని కోరాయి. సీపీఐ, ఎంఐఎంలు తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం చెప్పాలని కోరాయి. ప్రజారాజ్యం రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని కోరింది. చివరికి కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష నిర్ణయం మేరకే కేంద్రప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో మాట మార్చిన పార్టీల వల్లనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై విస్తృతస్థాయి చర్చలు జరగాలని, అందుకోసం త్వరలో డిసెంబర్ 9, 23 ప్రకటనపై ఒక కమిటీ వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు