తెలుగు నేలపై ఇక్ష్వాకుల పాలన
ఇక్షాకులు (క్రీ.శ. 220-క్రీ.శ. 300)
శాతవాహనుల సామ్రాజ్య పతనానంతరం వీరి సామంతుల్లో ఒకరైన ఇక్షాకులు తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. చివరి శాతవాహన రాజైన నాలుగో పులోమావిని ఇక్షాకు రాజు శ్రీశాంతమూలుడు తొలగించి స్వతంత్ర రాజుగా ప్రటించుకున్నాడు.
-వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి వీరి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ వరకు విస్తరించింది. వీరు నాగార్జునకొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకున్నారు. ఇక్షాకుల రాజ చిహ్నం సింహం.
ఇక్షాకుల చరిత్రకు ఆధారాలు
-ఈ వంశంలో ఏడుగురు రాజులు ఉన్నారని పురాణాల్లో ఉంది. కానీ శాసనాలను బట్టి నలుగురి పేర్లే తెలుస్తున్నాయి.
పురావస్తు ఆధారాలు: నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి మొదలైన చోట్ల దొరికిన శాసనాలు వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు. ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. అయితే ఎహువల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. ఇక్షాకుల నాణేలు నాగార్జునకొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డమాను, ఏలేశ్వరం మొదలైన చోట్ల లభించాయి. నాగార్జునకొండ తవ్వకాల్లో ఇక్షాకుల కాలం నాటి కోట, బౌద్ధ స్థూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి ఎన్నో బయటపడ్డాయి. సాహిత్య ఆధారాల్లో మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాలు ఇక్షాక రాజుల పేర్లు, వారి పరిపాలనా కాలాన్ని వివరిస్తున్నాయి. పురాణాలు వీరిని శ్రీపర్వతీయులు, ఆంధ్రభృతులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి. నాగార్జునకొండ నుంచి ప్రారంభమై, శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమల కొండల వరకు గల పర్వతశ్రేణిని శ్రీపర్వతమని పురాణాలు, బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి.
ఇక్షాకు పాలకులు: వీరి శాసనాల ఆధారంగా నలుగురు రాజుల గురించి మాత్రమే సమాచారం లభిస్తుంది. వీరు వాసిష్టీపుత్ర శాంతమూలుడు, మరాఠీపుత్ర వీర పురుష దత్తుడు, ఎహువల శాంతమూలుడు, రుద్ర పురుషదత్తుడు. ఇక్షాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల నుంచి స్వీకరించారు. వీరు శాతవాహనుల దగ్గర మహాతలవరులుగా పనిచేశారు.
వాసిష్టీపుత్ర శాంతమూలుడు (క్రీ.శ.220-233)
-ఇతడు స్వతంత్ర ఇక్షాక రాజ్యస్థాపకుడు.
-ఇతడు హిరణ్యకులు, పూగేయ వంశీయులతో కలిసి చివరి శాతవాహన రాజు నాలుగో పులోమావిని తొలగించి తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో స్వతంత్రను ప్రకటించుకున్నాడు.
-ఇతడి శాసనాలు రెంటాల, దాచేపల్లి, కేశనపల్లి వద్ద దొరికాయి.
-శాంతమూలుడి గొప్పతనాన్ని గురించి అతడి కుమారుడైన వీర పురుషదత్తుడి నాగార్జునకొండ శాసనాల ద్వారా, శాంతమూలుడి సోదరీమణులైన హర్మ్యశ్రీ, శాంతశ్రీలు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది.
-శాసనాల్లో ఇతడిని అవేక గోహల శతసహ్ర వదయిశగా పేర్కొన్నారు. అంటే వ్యవసాయాభివృద్ధి కోసం శాంతమూలుడు కోట్ల కొలది బంగారు నాణేలను, వేలకొలది గోవులను, ఎద్దులను, నాగళ్లను, భూమిని దానంగా ఇచ్చాడని అర్థం.
-శాంతమూలుడు అశ్వమేథ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలు చేశాడు.
-ఇతని బిరుదు మహారాజు, శాంతమూలుడు సమకాలీన రాజవంశాలైన ధనిక, పూగీయ కుటుంబాలతో వివాహ సంబంధాలను ఏర్పర్చుకొని బలపడ్డాడు.
-శాంతమూలుడు వైదిక మతావలంబికుడు. ఇతడు ఉజ్జయినిలోని స్కంధ కార్తికేయుని (మహాసేనుడు) భక్తుడు.
-శాంతమూలుడి ఇద్దరు సోదరణీమణులు మాత్రం బౌద్ధ మతావలంబికులు.
మఠరీపుత్ర శ్రీవీరపురుష దత్తుడు (క్రీ.శ 233-253)
-ఇతడు శాంతమూలుడి కుమారుడు. ఇక్షాక వంశంలో గొప్పవాడు.
-వీర పురుషదత్తుని కాలం ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం.
-అందువల్లనే ఇతడిని దక్షిణాది అశోకుడు అంటారు.
-ఇతడి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పు గుండూరు, అల్లూరుల్లో దొరికాయి.
-వీరపురుషదత్తుడు సమకాలీన రాజవంశాలతో వైవాహిక సంబంధాలను ఏర్పర్చుకొని వారి మద్దతుతో సుస్థిర రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు.
-నాగార్జునకొండ శాసననాన్ని అనుసరించి ఇతడికి ఐదుగురు భార్యలు ఉన్నారు.
-ఇతని మేనత్త హర్మ్యశ్రీ కూతుళ్లు బపిశ్రీ, షష్టిశ్రీ, మరో మేనత్త శాంతశ్రీ కూతురును వివాహం చేసుకున్నాడు.
-ఈ విధంగా మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సంప్రదాయాన్ని దక్షిణ భారతదేశంలో వీరపురుషదత్తుడు ప్రవేశపెట్టాడని చెప్పవచ్చు.
-ఇతడి నాలుగో భార్య శక క్షాత్రప రాకుమారి రుద్రభట్టారిక మహాదేవి, ఐదో భార్య మహాదేవి భట్టిదేవి.
-ఇతడి ఏకైక కూతురు కొడ బలిశ్రీని చుటు వంశానికి చెందిన బనవాసి రాజు శివానంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు.
-వీరపురుష దత్తుడు మొదట శైవుడు. ఇతడి మేనత్త శాంతిశ్రీ ప్రభావంతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
-ఇతడి కాలంలో ఇతడి మేనత్త శాంతిశ్రీ నాగార్జునకొండపై అనేక బౌద్ధ నిర్మాణాలను చేపట్టింది.
-ఈమె వీరపురుషదత్తుడి ఆరో రాజ్య సంవత్సరంలో బుద్ధుడి ధాతువుని నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించింది.
-నాగార్జునకొండ శాసనం ప్రకారం శాంతిశ్రీ బ్రాహ్మణులు, శ్రమణులు, పేదప్రజల పట్ల ఎంతో ప్రేమకలిగి ఉండి వారి క్షేమాన్ని కోరింది.
-శాంతిశ్రీ తన అల్లుడైన వీరపురుషదత్తుని 18వ పాలనా సంవత్సరంలో అతడి విజయాన్ని, ఆయురారోగ్యాలను కోరుతూ మరో శాసనాన్ని వేయించింది.
-అమరావతిలోని భాండారికుని కుమార్తె ఉపాసిక బోధిశ్రీ వీరపురుషదత్తుని కాలంలో చెప్పుకోదగ్గ మరో మహిళ.
-ఇతడి కాలంలో ఉపాసిక బోధిశ్రీ బౌద్ధమత వ్యాప్తికి తీవ్రంగా కృషిచేసి తనపేరు మీదుగా ఉపాసిక బోధిశ్రీ శాసనాన్ని వేయించింది. ఇందులో తను చేసిన పనులను వివరించింది.
-ఈమె బౌద్ధమతవ్యాప్తి కోసం బౌద్ధ సన్యాసనులను శ్రీలంక, కశ్మీర్, టిబెట్లకు పంపింది. అంతేకాకుండా చుళదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది.
-ఈమె పూర్వశైలంపై తటాక మంటపశాల, కంటకశాల మహాచైత్య ప్రాగ్దారంలో శిలామంటపాన్ని నిర్మించింది.
ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 253-277)
-ఇతడినే వాసిష్టీపుత్ర బహుబల శాంతమూలుడు, రెండో శాంతమూలుడు అంటారు.
-ఇతడు మహాదేవి వాసిష్టీభట్టిదేవ, వీరపురుషదత్తుల కుమారుడు.
-తాతపేరు పెట్టుకునే సంప్రదాయం ఇతడి నుంచే ప్రారంభమైంది. తర్వాత ఈ సంప్రదాయాన్ని గుప్తులు, వాకాటకులు, పల్లవులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు అనుసరించారు.
-ఇతడి కాలంలో వైదిక, బౌద్ధమతాలు వ్యాప్తిచెందాయి.
-ఇతడి కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది.
-ఇతడు నాగార్జుకొండ వద్ద సంస్కృత శాసనం వేయించింది.
-ఎహువల శాంతమూలుని పదకొండో రాజ్య సంవత్సరంలో అతడి సేనాని ఎలిశ్రీ ఒక శాసనం వేయించాడు.
-ఈ శాసనం ప్రకారం శాంతమూలుడు చేసిన ఒక ముఖ్యమైన యుద్ధంలో పాల్గొన్న అతడి సేనాని ఎలిశ్రీ కార్తికేయుని కృపవల్ల విజయం సాధించినట్లు తెలుస్తుంది.
-ఈ విజయానికి గుర్తుగా ఎలిశ్రీ ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించి సర్వదేవాధివాసంమనే పేరుమీద ఒక ఆలయాన్ని నిర్మించాడు.
-ఎహువల శాంతమూలుడు వైదిక మతాభిమాని స్వామి మహాసేనుని భక్తుడు.
-ఇతడు విజయపురిలో కార్తికేయాలయం, పుష్పభద్రస్వామి ఆలయం, నొడిగిరీశ్వరాలయం, దేవీ ఆలయం మొదలైన ఆలయాలను నిర్మించాడు.
-ఇతని కాలంలోనే నవగ్రహ, కుబేర, కార్తికేయ ఆలయాలు వెలిశాయి.
-ఈ విధంగా దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజుగా ఎహువల శాంతమూలుడిని పేర్కొంటారు.
రుద్ర పురుషదత్తుడు (క్రీ.శ. 283-300)
-గురజాల, నాగార్జునకొండ, ఫణిగిరిలో దొరికిన నాణేలపై గల లిపి ఆధారంగా, శాసనాలపై గల పేరుని బట్టి, రుద్రపురుషదత్తుడు చివరి ఇక్ష్వాక రాజని చరిత్రకారులు గుర్తించారు.
-ఇతడు ఎహువల శాంతమూలుడి కుమారుడు.
-ఇతడి నాలుగో పాలనా సంవత్సరకాలంలో నోదుకశ్రీ అనే వ్యక్తి తన దైవమైన హలంపురస్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడని శాసనంలో ఉంది.
-రుద్ర పురుషదత్తుని కాలంలో పల్లవరాజు సింహవర్మ ఇక్ష్వాకులపై దాడిచేశాడు.
-దీని గురించి సింహవర్మ వేయించిన మంచిగల్లు (గుంటూరు) శాసనంలో ఉంది. ఇది ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం.
-తర్వాత పల్లవ రాజైన శివస్కంధవర్మ ఇక్ష్వాక రాజ్యంపై దాడి చేసి కృష్ణానది దక్షిణాన ఉన్న ప్రాంతాలను ఆక్రమించి ఇక్ష్వాకులను అంతం చేశాడు. దీని గురించి శివస్కంధవర్మ మైదవోలు శాసనం ద్వారా తెలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు