ఆశాజ్యోతి, పేదల పక్షపాతి.. బీఆర్ అంబేద్కర్
అంబేద్కర్ జయంతి సందర్భంగా..
భారతీయ సమాజంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్యదైవం డా. భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్. సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు, గొప్ప మానవతావాది. ఈయన 1891 ఏప్రిల్ 14న నాటి సెంట్రల్ ఫ్రాన్సిస్ (నేటి మధ్యప్రదేశ్)లోని మౌ ప్రాంతంలోని మిలిటరీ కంటోన్మెంట్లో రామ్‌జీ మాలోజీ సక్పాల్ (మిలిటరీ సుబేదార్), భీమాబాయి ముర్బాద్కర్ సక్పాల్ దంపతులకు 14వ (చివరి) సంతానంగా జన్మించారు.
విద్యను ఆయుధంగా మార్చుకున్న మహనీయుడు
-అంబేద్కర్ కుటుంబ నేపథ్యం మరాఠీ సంస్కృతిలో భాగంగా కొనసాగింది. ఈయన సొంతూరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మందన్గఢ్ తాలూకా అంబవడే అనే గ్రామం.
-ఈ గ్రామం పేరే మొదట్లో అంబవడేకర్ అని ఇంటిపేరుగా ఉండేది. పాఠశాలలో చదివేటప్పుడు అంబేద్కర్ అంటే అమిత ప్రేమగల ఉపాధ్యాయుడు మహదేవ్ అంబవడేకర్గా ఉన్న ఇంటిపేరును అంబేద్కర్గా స్కూల్ రికార్డుల్లో రాశారు.
-సమాజంలో నిమ్నకులంగా భావించే మహర్ (దళిత) కులంలో జన్మించిన అంబేద్కర్ బాల్యంలో అనేక అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. పాఠశాలలో సైతం తోటి విద్యార్థులతో సమానంగా కనీస గౌరవం పొందలేకపోయారు.
-పాఠశాలలో మంచినీళ్లు తాగే సందర్భంలో కూడా అనేక విధాలుగా బాధపడిన సందర్భాలను తన రచన అయిన నో పీన్, నో వాటర్‌లో వివరించారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఏ సమాజం అయితే తనను ఇబ్బందిపెట్టిందో అదే సమాజంలో అందరికన్నా గొప్ప మేధావిగా ఎదిగారు. అందుకు రాత్రీపగలు తేడాలేకుండా నిరంతరం చదువులోనే జీవితాన్ని గడిపిన మహాశక్తి అంబేద్కర్.
-1894లో తండ్రి రామ్‌జీ పదవీ విరమణ పొందడంతో అంబేద్కర్ కుటుంబం సతారాకు వెళ్లి అక్కడ నివాసం ఉంది. అయితే కొంతకాలానికి తల్లి మరణించడంతో అంబేద్కర్ బంధువుల దగ్గర ఉంటూ చదువు కొనసాగించారు. 1897లో అంబేద్కర్ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది. అక్కడ ఎల్‌ఫన్‌స్టోన్ హైస్కూల్లో చేరిన ఆయన 1907లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు.
-1908లో అదే కాలేజీలో చేరి కాలేజీ విద్యను పూర్తిచేశారు. 1912లో బాంబే యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ పూర్తవగానే బరోడా సంస్థానంలో ఉద్యోగం సంపాదించారు.
-1913లో 22 ఏండ్ల వయస్సులో సయాజీరావ్ గైక్వాడ్-III (బరోడా గైక్వాడ్) ఆర్థిక సహకారంతో న్యూయార్క్‌లో కొలంబియా యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి అమెరికాకు పయనమయ్యాడు. 1915 జూన్‌లో ఎంఏ ఉత్తీర్ణుడైన ఆయన భారతదేశ వాణిజ్యంపై థీసిస్‌ను సమర్పించారు.
-ఈ యూనివర్సిటీలో పరిచయమైన నావల్ బాతీన అంబేద్కర్‌కు జీవితకాల మిత్రునిగా కొనసాగడం అంబేద్కర్ స్నేహానికి ప్రతీక.
-1916లో రెండో ఎంఏ (నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ) పూర్తిచేయడమే కాకుండా ఎకానామిక్స్‌లో పీహెచ్డీ కూడా సంపాదించారు.
-1956 అక్టోబర్‌లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరిన ఆయన 1917, జూన్‌లో బరోడా గైక్వాడ్ స్కాలర్షిప్ ఆగిపోవడంతో భారతదేశానికి తిరిగివచ్చారు. ఏదోవిధంగా 1921లో మాస్టర్ డిగ్రీని (ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రుపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్) 1923లో ఎకనామిక్స్‌లో డీఎస్సీ పూర్తిచేశారు.
-ఉన్నతవిద్యను పూర్తిచేసుకొని భారతదేశానికి తిరిగివచ్చిన అంబేద్కర్ బరోడా సంస్థానంలో మిలిటరీ సెక్రటరీగా నియామకమయ్యారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కుటుంబ నిర్వహణ కోసం చివరకు ప్రైవేట్ ట్యూటర్‌గా కూడా పనిచేశారు.
-1918లో ముంబైలోని సైదన్‌హమ్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో పొలిటికల్ ఎకానమీలో ప్రొఫెసర్‌గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.
నిరంతర పోరాటం
-నాటి బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేసినప్పుడు అంబేద్కర్ వాటిని అణగారినవర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేటట్లు నిరంతర పోరాటం చేశారు. భారత ప్రభుత్వ చట్టం-1919 రూపొందించేపరంపరలో నియమించిన సౌత్‌బరో కమిటీ ఆహ్వానం మేరకు అంబేద్కర్ తన మేథాశక్తిని కమిటీ ముందుంచాడు.
-అదేవిధంగా ఇతర మైనార్టీ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని బ్రిటిష్ అధికారులకు అనేక విజ్ఞాపనపత్రాలను ఇచ్చారు. మూక్ నాయక్ వారపత్రిక (1920) ద్వారా అణగారినవర్గాల్లో చైతన్యాన్ని నింపిన అంబేద్కర్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలని నిరంతరం తపించారు.
-నిమ్నజాతుల అభ్యున్నతి, సంక్షేమం కోసం బహషృత్ హితకారిణి సభను స్థాపించి వారి జీవనస్థితిగతుల మెరుగుదల కోసం నిరంతరం పోరాటం చేశారు. అంతేకాకుండా సైమన్ కమిషన్‌కు అణగారినవర్గాల సమస్యల గురించి సమగ్రమైన నివేదికను అందించి భవిష్యత్ ప్రభుత్వ పాలనలో ఈ వర్గాలకు తప్పనిసరిగా రక్షణ ఉండాలని కోరుకున్న ఆశాజ్యోతి అంబేద్కర్.
-అంటరానితనానికి వ్యతిరేకంగా 1927లో మహా ఉద్యమాన్ని ప్రారంభించిన అంబేద్కర్.. మంచినీరు, దేవాలయాల ప్రవేశం కోసం పెద్దఎత్తున ప్రజాపోరాటాన్ని కొనసాగించి మహద్‌లో మంచినీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. దేశంలో కులవ్యవస్థకు పునాదులు వేసిన సామాజిన అసమానతలకు మూలమైన మనుస్మృతిని వేలాదిమంది అనుచరులతో కలిసి 1927, డిసెంబర్ 25న తగలబెట్టాడు. 1930లో 15వేలమంది వాలంటీర్ల సహాయంతో కలరామ్ దేవాలయ ఉద్యమాన్ని ప్రారంభించి మిలటరీ బ్యాండ్ స్కౌట్ గ్రూప్, మహిళలంతా కలిసి క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని చేసి మొదటిసారి దేవున్ని దర్శించుకున్నారు. 1932లో కమ్యునల్ అవార్డును సాధించిన అంబేద్కర్ కొన్ని ప్రత్యేక కారణాల వ్ల పూణా ఒప్పందంతో రాజీపడాల్సి వచ్చింది.
రాజకీయాల్లోకి..
-1935లో ముంబైలోని ప్రభుత్వ న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులైన అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. వివిధ కారణాలవల్ల వాటిలో కొనసాగలేకపోయారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి 1937 బొంబాయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. అనంతరం ఆ పార్టీని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌గా మార్చారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. మహిళల ఆస్తిహక్కుకు సంబంధించిన హిందూకోడ్ బిల్లును పార్లమెంట్ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూమతాన్ని వదిలి వేలాదిమంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు.
ఉద్యమ కెరటం
-అంబేద్కర్ గొప్ప సామాజిక విప్లవకారుడే గాక అణగారిన వర్గాలకోసం జీవితాంతం పోరాటం చేసిన మహోన్నత ఉద్యమ కెరటం. దేశంలో జరిగిన దళిత ఉద్యమాల్లో అంబేద్కర్ పాత్ర అనిర్వచనీయం. ప్రముఖ చరిత్రకారిణి జిలియట్ అభిప్రాయం ప్రకారం అంటరానితనాన్ని, కులాలను ఆధునిక భారతీయ సమాజంలో అంతర్భాగం చేయడమే అంబేద్కర్ తలపెట్టిన దళిత ఉద్యమాల అంతిమ లక్ష్యం.
-సమకాలీన సామాజిక ఉద్యమాలకు కూడా ఆయన ప్రేరణ కల్పించారు. ఏ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన తాత్వికత (తత్వ సిద్ధాంతం) వ్యవస్థాపన వ్యూహాలు, ఆచరణ, నాయకత్వం, సామాజిక అంగీకారం వంటి అంశాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించిన గొప్ప ఉద్యమనేత. రాజకీయ సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ దళితులు ఆత్మగౌరవంతో జీవితం గడపడానికి సామాజిక అస్థిత్వం, ఆర్థిక సాధికారత తప్పనిసరి అని బలంగా నమ్మి వాటిని సాధించేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. గొప్ప మానవతావాది అయిన అంబేద్కర్ 1956, డిసెంబర్ 5న మరణించే వరకు నిత్యం అణగారిన వర్గాల సేవలేనే గడిపారు. ఆయన సేవలను గుర్తించిన భారతప్రభుత్వం దేశంలో అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న (1990)తో సత్కరించింది.
రాజ్యాంగ నిర్మాత
-అసమానతలు, అవమానాలు, అన్యాయాలను ఎదుర్కొన్న నిమ్న కులాలు, అణగారిన వర్గాలు నేడు సర్వమానవసమానత్వంతో సామాజిక గౌరవ, భద్రతతో జీవించడానికి ప్రధాన ఆధారమైన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ క్రియాశీలపాత్ర పోషించారు. రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మహిళలు, బాలలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మొత్తంగా సమాజంలో వేలాది ఏండ్లుగా దుర్భర జీవితాన్ని గడిపిన బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల రక్షణ, భద్రతను కల్పించారు.
-రాజ్యాంగ ప్రవేశికలో మొదట భారత ప్రజలమైన మేము (We the People of India) చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాము అని పేర్కొనడం ద్వారా భారత రాజ్యాంగానికి మూలం భారతీయ సమాజంలోని ప్రజలు అని అర్ధమవుతున్నది. ముఖ్యంగా ప్రవేశికలో పేర్కొన్న సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.
-రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తులకు అన్ని రకాల రక్షణను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 17 ద్వారా అంటరాన్నితనాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించారు. ఆదేశిక సూత్రాలు సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషిచేయాలని పేర్కొనడం వెనుక అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు