ఉద్గారాల ప్రమాణాలు-నిబంధనలు
ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ (బీఎస్)- III వాహనాలను నిషేధించాలని తీర్పు ఇచ్చింది. దీంతో వాహన షోరూం యజమానులు ద్విచక్ర వాహనాలను అతి తక్కువ ధరకు అమ్మారు. బీఎస్-III వాహనాలను నిషేధిస్తున్నారు? ఎందుకు వాహన తయారీ ప్రక్రియలో భారీ మార్పులు తీసుకువస్తున్నారు? అసలు బీఎస్-III, బీఎస్-IV అంటే ఏమిటి? సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను ఎందుకు నిషేధించింది? అనే అంశాలు రోజు ప్రయాణించేవారే కాకుండా సామాన్య మానవుడు కూడా తెలుసుకోదగిన అతి ముఖ్య విషయం.
అసలేం జరిగింది?
-బీఎస్ 3 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్లను ఏప్రిల్ 1 నుంచి సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకాకుండా బీఎస్-IV వాహనాల నియమాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
-వాహనాల వాణిజ్యపరమైన లాభాలకంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకార బీఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బీఎస్ ప్రమాణాలు అంటే?
-వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలకు సంబంధించిందే ఈ బీఎస్.
-కేంద్రప్రభుత్వం ద్వారా వాహనాల నుంచి ఎంత పరిధిలో ఉద్గారాలు వెలువడాలి అని వెల్లడించే ప్రమాణాలనే భారత్ స్టేజ్ ప్రమాణాలు అంటారు.
-కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కాలానుగుణంగా, వివిధ ప్రమాణాల స్థాయితో ఈ బీఎస్ నియమాలను అమలుపరస్తుంది.
బీఎస్ ప్రమాణాలకు మూలం ఏమిటి?
-ఈ బీఎస్ ప్రమాణాలు యూరో నియమాలకు అనుగుణంగా రూపొందాయి.
భారత్ స్టేజ్ ప్రమాణాల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
-దేశంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ణయిస్తుంది (ఇది కేంద్ర వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది).
-దీని ప్రకారం ఈ ప్రమాణాలను మొదటిసారిగా 2000 సంవత్సరంలో మార్చారు.
-అలా సమయానుగుణంగా ప్రస్తుతం 33 పట్టణాల్లో బీఎస్-IV నియమాలు మిగతా పట్టణాల్లో బీఎస్-III ప్రమాణాలను అమలుచేస్తున్నారు.
-దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఏప్రిల్ 1 నుంచి బీఎస్-IV వాహనాలనే విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
భారత్ స్టేజ్ ప్రమాణాల చరిత్ర
-1991- దేశంలో మొదటిసారిగా వాహనాల ఉద్గారాలపై పరిమితులను విధించారు.
-1996- వాతావరణ నియమాలకు అనుగుణంగా మొదటిసారి చమురు నియమాల గురించి ఒక నోటిఫికేషన్ వెలువడింది.
-2000- 1996లో వెలువడిన నియమాలకు మరికొన్ని జోడించి 2000లో బీఎస్-I పేరుతో వెలువరించారు.
మషేల్కర్ కమిటీ (2002)
-2002లో ఏర్పాటైన మషేల్కర్ కమిటీ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని వివిధ ఫేజ్‌లలో ఎలా తగ్గించాలో కొన్ని సూచనలు చేసింది.
-దేశంలో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్, సల్ఫర్ ఏ స్థాయిలో ఉండాలో కూడా కొన్ని కీలక సూచనలు చేసింది.
-2003 : జాతీయ మోటార్ ఇంధన విధానంను ప్రకటించారు. దానికోసం ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా రూపొందించారు. దీని ప్రకారం 2005 ఏప్రిల్ నుంచి 13 పెద్ద పట్టణాల్లో బీఎస్-3 ప్రమాణాలు, మిగతా ప్రాంతాల్లో బీఎస్-2 ప్రమాణాలు పాటించాలని నిర్ణయించారు.
-2010 : ఫైవిధంగానే 2013 ఏప్రిల్ నుంచి 13 పెద్ద పట్టణాల్లో బీఎస్-4 ప్రమాణాలు, మిగతా ప్రాంతాల్లో బీఎస్-3 ప్రమాణాలను నిర్ణయించారు.
-2012: కేంద్ర ప్రభుత్వం సౌమిత్రాచౌదరి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి జాతీయ మోటార్ ఇంధన విధానాన్ని, మిషన్‌ను 2025 ముసాయిదాను తయారు చేయమని కోరింది.
-2014 : సౌమిత్రచౌదరి 2014 మేలో తమ నివేదికను సమర్పించారు. అదే నివేదికలో భారత స్టేజ్-IV, స్టేజ్-V మొదలైన ప్రమాణాలను ఫేజ్ పద్ధతిలో ఎలా అమలుచేయాలో వివరించి అది అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉండటానికి ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా రూపొందించింది. ఈ రోడ్ మ్యాప్ ప్రకారమే ఇప్పుడు 33 పట్టణాల్లో బీఎస్-4 ప్రమాణాలు అమలవుతున్నాయి. వాస్తవంగా ఉన్న కేంద్ర మోటార్ వాహనాల ఇంధన విధానం ప్రకారం..
-2017 వరకు బీఎస్-4 వాహనాలను దేశమంతా వాడాలి.
-2020 వరకు బీఎస్-5
-2024 వరకు బీఎస్-6 వాహనాలను వాడాలని ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.
ప్రస్తుత పరిస్థితి
-బీఎస్-4 వాహనాల ఇంధనం ఉత్పత్తి, సరఫరా చేసే స్థాయిలో ఫిల్లింగ్ స్టేషన్లుకానీ, మౌలిక సదుపాయాలు లేనందున కేవలం 33 పట్టణాల్లో బీఎస్-4ను, మిగతా ప్రాంతాల్లో బీఎస్-3ని అమలు చేస్తున్నారు.
-సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం మిగతా ప్రాంతాల్లో కూడా 2017 ఏప్రిల్ నుంచి బీఎస్-4 ప్రమాణాలను అమలుపరుస్తున్నారు.
-అదేవిధంగా 2020 లోపల ఉపయోగించాల్సిన భారత్స్టేజ్-Vను విస్మరించి డైరెక్ట్‌గా భారత్స్టేజ్-VI ప్రమాణాలను అమలుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-దీని ప్రకారం సల్ఫర్ పరిధిని తగ్గించి ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచి ఇతర కాలుష్య ఉద్గారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని వీలైనంత తగ్గించి ప్రజారోగ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది.
భారత్స్టేజ్-IV ప్రమాణాల అమలులో ఎదురయ్యే సవాల్లేంటి?
-భారత స్టేజ్-IV అంటే యూరో 14కి సమానం. అయినా ఇప్పటికీ వివిధ దేశాల్లో యూరో-VIని అమలు చేస్తున్నారు. అంటే ఇతర దేశాల విధానాల్ని మనం గమనిస్తే భారత్ స్టేజ్-IVని సులభంగానే అమలుచేయవచ్చు.
-ఇంజిన్‌లో తగుమార్పులు చేయాలి.
-వాహన డిజైన్లలో తగు మార్పులుచేయాలి. ఉదా : హెడ్‌లైట్ స్విచ్ బీఎస్-4 వాహనాల్లో ఉండదు.
-ఈ ప్రమాణాలను అందుకోవాలంటే బీఎస్-4కి వెళ్లే లోపల వాహన ఉత్పత్తిదారులపై రూ. 70,000 నుంచి రూ. 1,50,000 కోట్ల భారం అదనంగా పడే అవకాశం ఉంది. అది పరోక్షంగా వినియోగదారులపైనే పడవచ్చు.
-పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎంను) తగ్గించాలంటే వాహనాల్లో డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్లను పెంచాలి.
-కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంకా ఉన్నతమైన ప్రమాణాలతో, విడిభాగాలతో వాహనాలను తయారుచేయాల్సి ఉంటుంది.
-ఇంకా బీఎస్-3 నుంచి బీఎస్-4కి మారిన తర్వాత అంతే మొత్తంలో అంతే ప్రమాణాల స్థాయిలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇప్పుడు ఇంధన పరిశ్రమ సిద్ధంగా ఉందా? లేదా అనేది కూడా సందేహమే.
యూరో నియమాలు
-ఈ యూరో నియమాలు ఒక వాహనం నుంచి ఎంత మొత్తంలో కాలుష్య ఉద్గారాలు వెలువడాలన్న నియమాన్ని, పరిధిని నిర్ణయిస్తాయి.
-కాలుష్య ఉద్గారాలు అంటే- కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్.
-యూరో నియమాల పరిధి కాలుష్య ఉద్గారం చేసే వాహనాన్ని అమ్మాలి.
-దేశంలో ఈ యూరో నియమాలనే భారత్ స్టేజ్ ప్రమాణాల పేరుతో సమయానుగుణంగా అమలు చేస్తున్నారు.
బీఎస్-IV అంటే?
-యూరో నియమాలు 4కి అనుగుణంగా ఈ బీఎస్-IV నియమాలు ఉంటాయి. దీని ప్రకారం వాహనం ఇంజిన్, వేగం, దాని కాలుష్య ఉద్గారాల పరిధిలో మార్పులు తెచ్చి వాహనాన్ని ఉత్పత్తి చేయాలి.
-ఈ కాలుష్య ఉద్గారాల పరిధిలో కార్బన్ మోనాక్సైడ్, కాల్చని హైడ్రో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్లు ఎంత పరిధిలో వెలువడాలో ఈ బీఎస్-IV నిర్దేశిస్తుంది.
-అంటే బీఎస్-IIIలో వెలువడిన సల్ఫర్ కంటే బీఎస్-IVలో వెలువడే సల్ఫర్ పరిధి తక్కువగా ఉంటుంది. అలా అది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు
-ఇది ఒక చట్టబద్ధ సంస్థ
-ఇది వాతావరణ, అడవులు, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది.
-ఇది దేశంలో ఉన్నత సాంకేతిక విభాగం
-ఇది 1974 నీరు (నివారణ మరియ కాలుష్య నియంత్రణ) చట్టం ప్రకారం ఏర్పడింది.
-సీపీసీబీ నీరు కాకుండా 1981-గాలి చట్టం నియమాలను కూడా అమలుపరుస్తుంది.
-ఇంకా 1986 వాతావరణ చట్టానికి అనుగుణంగా సాంకేతిక సలహాలను క్షేత్రస్థాయిలో వివిధ చట్టాల అమలుకు సహకరిస్తుంది.
-ఇది రాష్ట్రస్థాయి కాలుష్య నియంత్రణ మండలిలో సమన్వయం ఏర్పరుస్తూ వాటికి సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుంది.
-ఇది కేంద్ర ప్రభుత్వం నియమించే చైర్మన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుత చైర్మన్ ఎస్పీ సింగ్ పరిహార్, ఐఏఎస్
-దీని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఏడు జోనల్ కార్యాలయాలు, ఐదు ల్యాబ్‌లు ఉన్నాయి.
-1999లో సుప్రీంకోర్టు దేశంలోని అన్ని బీఎస్-I, బీఎస్-II లేదా యూరో నియమాల ప్రకారం కాలుష్య ఉద్గారాలను వెల్లడించాలని తీర్పు ఇచ్చింది. దీనికనుగుణంగా బీఎస్-I, బీఎస్-II ప్రమాణాలను 2000లో అమలు పరిచారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు