విష్ణుకుండిన సామ్రాజ్యం – విశేషాలు
శాతవాహనులు, ఇక్ష్యాకుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మరొక ముఖ్య వంశం విష్ణుకుండినులు. క్రీ.శ 358-569 మధ్య ప్రధానంగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణను ఉత్తరాంధ్రను పరిపాలించారు. విష్ణుకుండినులు నర్మదా నది వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి మూడు సముద్రాల (అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం) మధ్య దేశాన్ని కూడా కొంతకాలం పరిపాలించారు. వీరి చరిత్ర గురించి మనకు కీసరగుట్ట (రంగారెడ్డి), తుమ్మలగూడెం, ఏలేశ్వరం (నల్లగొండ), గొల్లగుడి, గుమ్మడం (మహబూబ్నగర్), నేలకొండపల్లి (ఖమ్మం)లో లభ్యమైన పురావస్తు ఆధారాలు, శాసనాలు, తుమ్మలగూడెంలో లభించిన సుమారు 2000 నాణేల ఆధారంగా తెలుస్తుంది. వీరి మొదటి రాజధాని అయిన అమరపురం నేటి మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రం. తదుపరి రాజధాని ఇంద్రపాల నగరం నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని తుమ్మలగూడెం గ్రామ శివార్లలో ఉంది. దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కూడా విష్ణుకుండిలను కొంతకాలం రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆధారాలు:
వీరి చరిత్రకు ప్రధాన ఆధారాలు శాసనాలు. వీరి కాలంలో వేయించిన శాసనాలు 13 కాగా, తర్వాత కాలంలో వేయించిన 8 శాసనాలు కూడా విష్ణుకుండినుల చరిత్రను తెలియజేస్తున్నాయి. ఈ శాసనాల్లో 16 రాగి రేకుల శాసనాలు కాగా, ఐదు శిలాశాసనాలు. ఇవే కాకుండా వీరు వేయించిన నాణేలు, కట్టించిన కోటలు, నగరాలు, గుహాలయాలు, తవ్వకాల్లో బయటపడిన అనేక వస్తువులు, పనిముట్లు వీరి గురించి తెలుపుతున్నాయి. వీరి కాలం నాటి జనాశ్రయఛందో విచ్ఛిత్తి, సేతుబంధ మొదలైన గ్రంథాలు కూడా ఆనాటి చారిత్రక పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతున్నాయి.
పరిపాలకులు: విష్ణుకుండినులు తమను తాము అమరపురీశులమని, శ్రీపర్వతస్వామి పాదానుధ్యానం వల్ల తమ రాజ్యం, శ్రీపర్వతం రెండు వైపులా విస్తరించిందని చెప్పుకోవడం జరిగింది.
ఇంద్రవర్మ (క్రీ.శ 358-370)
-ఇతడు విష్ణుకుండినుల వంశంలో మొట్టమొదటగా పేర్కొన్న రాజు.
-ఇతను రామతీర్థ శాసనాన్ని వేయించాడు.
-ఇతడు ఏలేశ్వరం, మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి, కీసర మొదలైన ప్రాంతాలను ఆక్రమించి ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
-తుమ్మలగూడెంలో లభించిన తామ్ర శాసనం ఆధారంగా వీరి రాజధాని ఇంద్రపుర అని తెలుస్తుంది.
మొదటి మాధవ వర్మ (క్రీ.శ. 370-398)
-ఇంద్రవర్మ తర్వాత అతని కుమారుడైన మొదటి మాధవవర్మ పాలించాడు.
-ఇతను రాజ్యాన్ని మహబూబ్నగర్, కొల్లాపురం, కరీంనగర్, ఖమ్మం జిల్లాల వరకు విస్తరించాడు.
-ఇతని కుమారుడైన గోవింద వర్మ వేయించిన శాసనంలో మాధవవర్మ గురించి ప్రస్తావన ఉంది.
-ఇతని బిరుదు విక్రమ మహేంద్ర మొదటి మహేంద్రవర్మ ఉండవల్లి, భైరవకోన, మొఘల్రాజపురంలో గుహలను చెక్కించాడు.
గోవిందవర్మ (క్రీ.శ. 398-440)
-మొదటి గోవిందవర్మ విష్ణుకుండినుల తొలి రాజుల్లో అగ్రగణ్యుడు.
-ఇతని రాజధాని ఇంద్రపాలపురం. ఇతను వేసిన ఇంద్రపాలనగర తామ్ర శాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం.
-గోవింద వర్మ తన భుజబలంతో విష్ణుకుండినుల రాజ్యాన్ని శ్రీపర్వతానికి (శ్రీశైలం-నాగార్జునకొండ) రెండు వైపులా విస్తరింపజేశాడు.
-ఇతడు పల్లవులను ఓడించి, గుండ్లకమ్మ నది వరకు ఆక్రమించాడు.
-అంతేకాకుండా కోస్తాంధ్రలోని బలవంతుడైన గుణపాశపురం పాలకుడైన మూలరాజు బిడ్డను పెళ్లి చేసుకొని, అతని సహాయంతో వేంగీ శాలంకాయనులను ఓడించి, వారి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొన్నాడు.
-గోవిందవర్మ పట్టమహిషి మహాదేవి. ఆమె బౌద్ధ మతాభిమాని ఆమె తన పేర ఇంద్రపురిలో చాతుర్ధదశౌర్య సంఘ భిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది.
-ఈ విహారానికి గోవిందవర్మ పేణ్కపుర గ్రామాన్ని (నల్లగొండ జిల్లా మోత్కూరు తాలూకాలోని పనకబండ గ్రామం) దానం చేశాడు.
-గోవింద వర్మ మొదట బౌద్ధమతాన్ని అనుసరించినప్పటికీ తర్వాత శైవమతాన్ని స్వీకరించాడు.
-ఇతను హైదరాబాద్లోని చైతన్యపురిలో మూసీనది ఒడ్డున తన పేరిట గోవింద విహారాన్ని నిర్మించి ప్రాకృత శాసనం వేయించాడు.
-ఇది తెలంగాణలో తొలి ప్రాకృత శాసనంగా పరిగణించబడుతుంది.
రెండో మాధవ వర్మ (క్రీ.శ. 440-495)
-ఇతను గోవిందవర్మ కుమారుడు
-ఇతను విష్ణు కుండినుల రాజుల అందరిలోకెల్లా గొప్పవాడు.
-ఈయన సుమారు వందకుపై యుద్ధాలు చేసి బహుశా అన్ని యుద్ధాల్లో విజయం సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసరగట్టుపైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్టించాడు.
-అంతేకాకుండా ఈయన విజయం సాధించిన ప్రతిచోట రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు.
-ఇలా ఇతను కట్టించిన రామలింగేశ్వర దేవాలయాలు వేల్పూరు, ఈవూరు, ఇంద్రపాలనగరం, కీసరగుట్టల్లో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి.
-గుణపాశపురం పాలకుడు, బంధువు కూడా అయిన ప్రభాకరుడి సహాయంతో కళింగను (ఉత్తర కోస్తాంధ్ర+దక్షిణ ఒడిశా) ఆక్రమించాడు.
-తన 33వ రాజ్యపాలనా కాలంలో పల్లవులపై దాడి చేసి మళ్లీ గుండ్లకమ్మ నది వరకు విష్ణుకుండినుల రాజ్యాన్ని విస్తరించాడు.
-పడమర దిక్కున మహారాష్ట్రలో శక్తిమంతులైన వాకాటకుల్లో చివరి రాజైన పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నాడు.
-పైన పేర్కొన్న విజయాలతో రెండో మాధవవర్మ ప్రాగ్దక్షిణాపథాంభోనిధి రేవా సరిత్సలివలయ భూమి భర్తయై అనేక సామాన్య మకుట మణిఖచిత చరణయుగళుడైనాడు.
-అంటే ఆయన రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర ఆరేబియా సముద్రం వరకు, దక్షిణాన పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన రేవా (నర్మద) నది వరకు విస్తరించింది. ఎంతోమంది సామంతరాజులు ఆయన పాదాలపై వాలారు అని అర్థం.
-ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాల్ని, 1000 క్రతువుల్ని నిర్వహించాడు.
-ఇతని బిరుదు త్రివర నగర భవనగత సుందరీ హృదయనందన (త్రివర నగరంలోని భవనాల్లో ఉండే అందగత్తెల హృదయాలను ఆనందింపచేశాడు.
-ఇతడు పల్లవుల దండయాత్రను అరికట్టే ఉద్దేశంతో రాజధానిని ఇంద్రపాలనగరం నుంచి వేంగీ సమీపంలోని దెందులూరురకు మార్చాడు. (అయితే అమరావతికి మార్చాడని కొందరి అభిప్రాయం)
-రెండో మాధవర్మ దేశంలోనే ప్రథమంగా నరమేధయాగం, పురుష మేధ యాగం చేశాడు. ఆ యాగం సందర్భంగా సినారక భట్టు అనే బ్రాహ్మణుడిని వధించాడు.
-ఇతని కాలంలో తన మొదటి రాజధాని అమరపురిలో తన పెద్దకొడుకు దేవవర్మను రాజప్రతినిధిగా నియమించాడు.
మొదటి విక్రమేంద్ర వర్మ (క్రీ.శ. 510-525)
-రెండో మాధవవర్మకు, వాకాటక మహాదేవికి పుట్టినవాడైనందున వికమేంద్ర వర్మకు విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ అనే నామాంతరం ఉంది.
-ఇతను ఇంద్రపాలనగర తామ్రశాసనం వేయించాడు.
-ఇతని బిరుదు మహాకవి.
-అమరపురిలో స్వతంత్రత ప్రకటించుకొని కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధవ బిరుదును ధరించిన దేవవర్మ కొడుకు మూడో మాధవ వర్మను అణచివేసి వికమేంద్రవర్మ దాదాపు విష్ణుకుండినుల రాజ్యాన్ని ఓ దశాబ్దిన్నర కాలం పరిపాలించాడు.
రెండో ఇంద్ర (భట్టారక) వర్మ (క్రీ.శ. 525-555)
-ఇతను విక్రమేంద్ర వర్మ కొడుకు
-ఇతని కాలంలో ఇతని దాయాది మూడో మాధవర్మ బాదామి చాళుక్యుల సహాయంతో దాడి చేశాడు.
-ఇందుకు నిదర్శనంగా మొదటి పులకేశి బిరుదు రణవిక్రయ అనే పదం చెక్కిన శాసనాలు ఏలేశ్వరంలో దొరికాయి.
-కళింగ సామంతుల కూటమిని ఇతడు ఓడించడం జరిగింది.
-ఇతడు కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటికను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఘటిక అనే విద్యా సంస్థలను ఏర్పాటుచేసిన మొదటిరాజుగా చెప్పవచ్చు.
-ఇతను ఈశనవర్మ శలిక (ఉత్తర భారత మౌఖరి రాజు) చేతిలో ఓడిపోయి తన కూతురు ఇంద్రభట్టారిక దేవిని, ఈశానవర్మ కొడుకిచ్చి వివాహం చేసి వారి మైత్రి సంపాదించాడు.
భార్య వాకాటక మహాదేవి ప్రోత్సాహంతో రెండో మాధవ వర్మ నిర్మించిన దేవాలయాలు
-అమరేశ్వర ఆలయం, రామేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం – ఇంద్రపాలనగరం (నల్లగొండ జిల్లా)
-రామలింగేశ్వర ఆలయం – కీసర
-జడల రామలింగేశ్వర ఆలయం – చెరువుగట్టు
-రామలింగేశ్వర ఆలయం – షాద్నగర్
-రామలింగేశ్వర ఆలయం – పులిగిళ్ల (వలిగొండ)
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






