ISRO ‘solid’ successes | ఇస్రో గ‘ఘన’విజయాలు
వరుస రాకెట్ ప్రయోగ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రపంచ దృష్టిలో తన స్థానాన్ని సమున్నతంగా నిలబెట్టుకుంటూనే ఉంది.
2020 -భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో తొమ్మిది నెలల నుంచి షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయాయి. సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా శనివారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి) సి-49 ప్రయోగం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం మధ్యాహ్నం 3.12 నిమి షాలకు ప్రయోగం జరిగింది. తొలుత మధ్యాహ్నం 3.02 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉంది. షార్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం రావడంతో ప్రయోగానికి ఆటంకం కలిగింది. దాంతో పది నిమిషాలు ప్రయోగం వాయిదా వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారం భమైంది. ఇది 26 గంటలు నిరంతరాయంగా కొనసాగింది. షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయింది. మాస్టర్ కంట్రోల్ రూం నుంచి ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్‌తోపాటు, వివిధ విభాగాల డైరెక్టర్లు ప్రయోగాన్ని పరిశీలించారు. ప్రతిసారి వీక్షకులు, మీడియాతో కళకళలాడే షార్ కేంద్రం కరోనా కారణంగా వెలవెల బోయింది. కేవలం అతిముఖ్యమైన శాస్త్రవేత్తలు, అధికారులు మాత్రమే షార్కువచ్చారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లునడుమ ప్రయోగం సాగింది.
2022: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క భూ పరిశీలన ఉపగ్రహం EOS-04 మరియు రెండు చిన్న ఉపగ్రహాలను PSLV-C52 రాకెట్ సోమవారం, ఫిబ్రవరి 14న విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఘనతను సాధించిన ఇస్రో ఇది ఒక “అద్భుతమైన విజయం” అని పేర్కొంది. అంధప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి ఉదయం 5.59 గంటలకు అంతరిక్ష సంస్థ యొక్క వర్క్‌హోర్స్ లాంచ్ వెహికల్ PSLV మూడు ఉపగ్రహాలను ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
సుమారు 19 నిమిషాల ప్రయాణం తర్వాత, ఉపగ్రహాలను దాని ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది, ఈ సంవత్సరపు తొలి మిషన్ ప్రయోగాన్ని నిశితంగా పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
2016 మే 23న ఉపగ్రహ ప్రయోగాల వ్యయం గణనీయంగా తగ్గించగల పరిజ్ఞానంగల ఆర్ఎల్వీ- టీడీ (రీయూజబుల్ లాంచ్ వెహికల్- టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్)ను విజయవంతంగా పరీక్షించింది. ఇదే తరహాలో వాతావరణంలోని ఆక్సిజన్‌ను వినియోగించుకొని ఇంధనాన్ని సమర్థమంతంగా మండించగల స్క్రాంజెట్ ప్రొపల్షన్ సిస్టాన్ని 2016 ఆగస్టు 28న ప్రయోగించి మరో విజయాన్ని నమోదు చేసుకుంది. స్క్రాంజెట్ పరిజ్ఞాన అభివృద్ధితో ఆక్సిడైజర్లను వినియోగించకుండానే రాకెట్ ప్రయోగాలు జరుపవచ్చు.
-ఈ విధమైన విజయవంతమైన ప్రయోగాల పరంపరలో మరో విజయాన్ని 2016 సెప్టెంబర్ 8న అందుకుంది ఇస్రో. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారీ ఉపగ్రహం ఇన్శాట్- 3డీఆర్‌ను, భూస్థిర ఉపగ్రహాల ప్రయోగం వాహక నౌక (జీఎస్ఎల్వీ- ఎఫ్ 5) ద్వారా షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4:50 గంటలకు ప్రయోగించారు.
ఇన్శాట్ వంటి భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి అత్యధిక శక్తిమంతమైన ప్రయోగ వాహక నౌకలను వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం అభివృద్ధిపర్చిన జీఎస్ఎల్వీ ప్రయోగాల వరుసలో ప్రస్తుత ప్రయోగం పదోది. మిషన్ ప్రారంభమైన 17 నిమిషాల వ్యవధిలోనే ఇన్శాట్- 3డీఆర్ ఉపగ్రహాన్ని 170 కి.మీ. పెరీజి, 35,975 కి.మీ. అపోజి కలిగిన భూ సమతాస్థితి బదిలీకక్ష్య (జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టింది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఉపగ్రహ సౌరఫలకాలు విచ్చుకున్నాయి. తరువాత ఉపగ్రహం కక్ష్యపెంపు కార్యక్రమాలను హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ చేపడుతుంది.
జీఎస్ఎల్వీ- ఎఫ్05
-ఇది 49.13 మీటర్ల పొడవు, 414 టన్నుల బరువుగల మూడంచెల ప్రయోగ వాహక నౌక. మొదటి అంచెలోని ప్రధాన ఇంజిన్‌లో ఘనస్థితిలోని హైడ్రాక్సెల్ టెర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్ను, రెండో అంచెలోను, మొదటి దశలోనిస్ట్రాపాన్ మోటర్లు (నాలుగు ఎల్ 40 రకానికి చెందిన మోటర్లు), ద్రవస్థితిలోని యూహెచ్ 25 (అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్, 25Xహైడ్రజీన్ హైడ్రేట్ల మిశ్రమం), ఆక్సిడైజర్‌గా నైట్రోజన్ టెట్రాక్సైడ్ను వాడతారు. ఇక అతిముఖ్యమైన మూడో దశలో అతిశీతల ఉష్ణోగ్రతలు కలిగిన ద్రవరూప ఆక్సిజన్ (-183 డిగ్రీ సెంటీగ్రేడ్), ద్రవరూప హైడ్రోజన్ (-253 డిగ్రీ సెంటీగ్రేడ్)లను వినియోగిస్తారు. అందుకే ఈ దశను క్రయోజనిక్ దశగా పరిగణిస్తారు. దీనిలో పూర్తి దేశీయంగా రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్‌ను వాడారు. ఈ ఇంజిన్ వెలువరించే అధిక శక్తి వలన ఉపగ్రహాలను సుదూరంలోని భూస్థిర కక్ష్యల్లోకి ప్రవేశపెట్టవచ్చు. తాజా ప్రయోగం, స్వదేశీయంగా తయారైన క్రయోజనిక్ అప్పర్ స్టేజీ ఇంజిన్ (సీఈ-7)ను వాడిన మొదటి కార్యాచరణ ప్రయోగం.
-ఇంతకుముందు దీన్ని జీఎస్ఎల్వీ- డీ05, డీ06 అనే అభివృద్ధి ప్రయోగాల్లో వాడారు. వీటి ద్వారా జీశాట్- 14, జీశాట్-6 ఉపగ్రహాలను ప్రయోగించారు. స్వదేశీ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్ నేటి వరకు మూడుసార్లు వాడారు. ప్రస్తుత ప్రయోగంలో సుమారు 720 సెకన్ల కాలం పాటు ఈ ఇంజిన్ పనిచేసింది.
ఇన్శాట్- 3డీఆర్
-ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత ఆధునిక వాతావరణ ఉపగ్రహం. సమర్థమంతమైన వాతావరణ అధ్యయనం కోసం మెరుగైన ఇమేజింగ్ వ్యవస్థ, సౌండర్ వ్యవస్థలను అమర్చారు. మిగిలిన ఇన్శాట్ ఉపగ్రహాలతో పోలిస్తే ఇన్శాట్- 3డీఆర్‌లో ఆధునిక వ్యవస్థలు ఉన్నాయి.
1. రాత్రి సమయాల్లో మేఘాలు, పొగమంచు ఆవరించినప్పుడు సైతం నాణ్యమైన చిత్రాలను అందించగల మధ్యస్థ పరారుణ కిరణాలను ఇందులో అమర్చారు.
2. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కచ్చితంగా అంచనావేయడానికి దీనిలో రెండు థర్మల్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లను అమర్చారు.
3. దృశ్య, ఉష్ణ పరారుణ బ్యాండ్ల వలన అధిక విస్తరణ (రిజల్యూషన్) సాధ్యమవుతుంది.
జీఎస్ఎల్వీ
-ఇన్శాట్ వంటి భారీ (2000-2500 కేజీలు) ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యల్లో ప్రవేశపెట్టడానికి వాడే వాహక నౌక- జీఎస్ఎల్వీ
-దీని పొడవు 49 మీ., బరువు 414 టన్నులు (లిఫ్ట్ ఆఫ్ సమయంలో ఇంధన బరువుతో కలిపి)
-ఇది మూడంచెల ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక
-మొదటి అంచెలో S125 తరహా బూస్టర్ రాకెట్‌కు నాలుగు ఎల్ 40 రకపు స్ట్రాపాన్ మోటర్లను అమర్చుతారు.
-మొదటిదశలో ఇంధనంగా ఘనస్థితిలోని హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీడైబ్యూటడైఈన్ (హెచ్టీపీబీ)ను వాడతారు.
-రెండోదశలో యూడీఎంహెచ్ (ద్రవస్థితి)ను ఇంధనంగా, ఆక్సిడైజర్‌గా N2O5ను వాడతారు. ఈ దశలో వాడే ఇంజిన్- వికాస్.
-మూడో దశ క్రయోజనిక్ దశ. క్రయోజనిక్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత అని అర్థం. ఈ దశలో ఇంధనంగా ద్రవహైడ్రోజన్ (-2530C), ఆక్సిడైజర్‌గా ద్రవ ఆక్సిజన్ (-1830C) వినియోగిస్తారు.
-క్రయోజనిక్ ఇంధనాలు ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే అధిక శక్తిని విడుదల చేస్తాయి. అందుకే భారీ ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి ప్రయోగించడానికి ఈ నౌకలు అనువైనవి.
-జీఎస్ఎల్వీ ప్రాజెక్టు 1990లో ప్రారంభంకాగా మొదటి ప్రయోగం షార్ కేంద్రం నుంచి 2001, ఏప్రిల్ 18న జరిగింది.
-జీఎస్ఎల్వీ- డీ1 ద్వారా 1540 కిలోల బరువుగల జీశాట్-1ను ప్రయోగించారు.
-జీశాట్-2 (1825 కేజీలు)ను జీఎస్ఎల్వీ-డీ2 ద్వారా 2003 మే 8న ప్రయోగించారు.
-ఎడ్యుశాట్ (1950 కిలోలు)ను జీఎస్ఎల్వీ- ఎఫ్1 ద్వారా 2004 సెప్టెంబర్ 20న నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.
-ఇన్శాట్- 4సీ ఉపగ్రహాన్ని 2006 జూలై 10న జీఎస్ఎల్వీ- ఎఫ్2 ద్వారా ప్రయోగించగా ఇన్శాట్-4సీఆర్ ఉపగ్రహాన్ని 2007 సెప్టెంబర్ 2న జీఎస్ఎల్వీ- ఎఫ్4 ద్వారా ప్రయోగించారు. అయితే పై రెండు ప్రయోగాలు విఫలం అయ్యాయి.
-2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్వీ- డీ3 ద్వారా జీశాట్-4ను ప్రయోగించారు. జీశాట్-5పీ ఉపగ్రహాన్ని 2010 డిసెంబర్ 25న జీఎస్ఎల్వీ- ఎఫ్6 ద్వారా ప్రయోగించగా ఈ రెండు ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి.
-తరువాత జరిపిన జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్లను వాడారు.
-1982 కిలోల బరువుగల జీశాట్- 14 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ- డీ5 ద్వారా 2014 జనవరి 5న విజయవంతంగా నింగిలోకి పంపగా, 2132 కిలోల బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-డీ6 ద్వారా 2015 ఆగస్టు 27న శ్రీహరికోటలోని షార్ కేంద్రం ద్వారా విజయవంతంగా ప్రయోగించారు.
జీఎస్ఎల్వీ నౌకల రకాలు
-జీఎస్ఎల్వీ మార్క్-I లేదా జీఎస్ఎల్వీ ఎంకే-I: ఈ రకపు నౌకల్లో రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజిన్లను వాడారు. ఈ తరహా నౌకలద్వారా జీశాట్-1, జీశాట్-2, జీశాట్-3, ఇన్శాట్- 4సీ, జీశాట్-5పీ, ఇన్శాట్-4సీఆర్లను ప్రయోగించారు.
-జీఎస్ఎల్వీ మార్క్-II లేదా జీఎస్ఎల్వీ- ఎంకే2: ఈ నౌకల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజనిక్ ఇంజిన్‌ను వినియోగించారు. ఈ తరహా నౌకల ద్వారా జీశాట్-14, జీశాట్-6 ఉపగ్రహాలను ప్రయోగించారు.
-జీఎస్ఎల్వీ మార్క్-III లేదా జీఎస్ఎల్వీ ఎంకే3: ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ నౌక 4000 కిలోల భారీ ఉపగ్రహాలను సైతం భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. దీని బరువు ప్రయోగ సమయంలో 630 టన్నులు కాగా పొడవు 42.4 మీ. 2016 సెప్టెంబర్ 8 వరకు 10 జీఎస్ఎల్వీ ప్రయోగాలు జరిగాయి. కావున ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని నాటీ బాయ్‌గా పిలుస్తారు.
జీఎస్ఎల్వీ ప్రయోగాలు
1. జీఎస్ఎల్వీ-డీ1- జీశాట్-1- 2001 ఏప్రిల్ 18 విఫలం
2. జీఎస్ఎల్వీ-డీ2 – జీశాట్-2- 2003 మే 8 విజయవంతం
3. జీఎస్ఎల్వీ-ఎఫ్1 – ఎడ్యుశాట్ – 2004 సెప్టెంబర్ 20 విజయవంతం
4. జీఎస్ఎల్వీ-ఎఫ్2 – ఇన్శాట్-4సీ – 2006 జూలై 10 విఫలం
5. జీఎస్ఎల్వీ-ఎఫ్4 – ఇన్శాట్-4సీఆర్ – 2007 సెప్టెంబర్ 2 పాక్షిక విఫలం
6. జీఎస్ఎల్వీ-డీ3 – జీశాట్-4 – 2010 ఏప్రిల్ 15 విఫలం
7. జీఎస్ఎల్వీ-ఎఫ్6 – జీశాట్-5పీ – 2010 డిసెంబర్ 25 విఫలం
8. జీఎస్ఎల్వీ- డీ5 – జీశాట్-14 – 2014 జనవరి 5 విజయవంతం
9. జీఎస్ఎల్వీ-డీ6 – జీశాట్-6 – 2015 ఆగస్టు 27 విజయవంతం
10.జీఎస్ఎల్వీ-ఎఫ్05 – ఇన్శాట్-3డీఆర్ – 2016 సెప్టెంబర్ 8 విజయవంతం
ఇన్శాట్- 3డీఆర్లోని పేలోడ్స్
ఇమేజర్
-వాతావరణ పరిశీలనలకోసం, మల్టీ స్పెక్ట్రల్ ఇమేజర్‌ను అమర్చారు. ఇది 6 రకాల తరంగదైర్ఘ్యాలుగల వికిరణాల సాయంతో (దృశ్య, షార్ట్వేవ్, మధ్యస్థ పరారుణ, నీటి ఆవిరి, రెండు ఉష్ణ పరారుణ వికిరణాలు) భూస్థిర కక్ష్య నుంచి (సుమారు 36,000 కి.మీ.) వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.
డేటా రిలే ట్రాన్స్పౌండర్ (డీఆర్టీ)
-దేశవ్యాప్తంగా వాతావరణ, జల సంబంధ, సముద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించడానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) 3000కు పైగా డేటా కలెక్షన్ ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటుచేశారు. (ఉదా: ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ రెయిన్గేజెస్, ఆగ్రోమెట్ స్టేషన్స్). వీటి ద్వారా లభించే సమాచారం ఆధారంగా తుఫానులు, వరదలు, కరువులకు సంబంధించిన అంచనాలు సులభం అవుతాయి. ఈ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి సమాచార సేకరణ, సంబంధిత విభాగాలకు అందజేత డీఆర్టీ ప్రాథమిక విధి.
సౌండర్
-ఉష్ణోగ్రత, ఆర్థ్రత, ఓజోన్ సంబంధ సమాచారాన్ని అందించగల 19 చానళ్ల సౌండర్ను అమర్చారు. ఇవి షార్ట్వేవ్, మధ్యస్థ, లాంగ్ వేవ్ పరారుణ చానళ్లు, దృశ్య చానల్. ఈ చానళ్ల ఆధారంగా ప్రతి గంటకు ఒకసారి భారత భూభాగాన్ని, ప్రతి ఆరుగంటలకోసారి సముద్ర ప్రాంతాలను పరిశీలించి, వాటి సమగ్ర సమాచారాన్ని అందుకోవచ్చు.
శాటిలైట్ ఆధారిత శోధన, రెస్క్యూ ట్రాన్స్‌పాండర్
-విమానయానం, నౌకాయానం, భూతల ప్రయాణికులు, సిబ్బందికి ఆపత్సమయాల్లో సహాయం కోసం వెలువరిచే సిగ్నళ్లను ఇండియన్ మిషన్ కంట్రోల్ సెంటర్‌కు అందిస్తుంది. (ఇది ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరులో ఏర్పాటైంది).
-దేశ ఉపగ్రహ ఆధారిత శోధన, రెస్క్యూ సర్వీసులను ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, రక్షణశాఖ, జాలర్లకేగాక పొరుగుదేశాలకు కూడా అందించవచ్చు.
-ఇన్శాట్ ఉపగ్రహాలు అందించే సమాచారం ఆధారంగా వాతావరణ పరిస్థితుల ముందస్తు అంచనాల కోసం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో, ఇస్రోవారు, ఇన్శాట్ వాతావరణ సమాచార పరిశీలనా వ్యవస్థ (ఇన్శాట్ మెటియోరాలజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టం- ఐ ఎండీపీఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత సమాచారాన్ని ఐఎండీ న్యూఢిల్లీ, వాతావరణ, సముద్ర సంబంధ ఉపగ్రహ సమాచార నిల్వకేంద్రం (మెటియోరాలజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ శాటిలైట్ డేటా ఆర్చీవల్ సెంటర్) వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు.
-ఇన్శాట్- 3డీఆర్ బరువు- 2211 కేజీలు (ఇంధనం బరువు 1255 కిలోలు), వ్యయం రూ. 250 కోట్లు.
-జీవితకాలం – 10 ఏండ్లు
-దీనిలోని సోలార్ ప్యానళ్లు 1700W విద్యుత్తును జనింపచేస్తాయి.
-సౌర సెన్సార్లు, నక్షత్ర సెన్సార్లు, గైరోస్కోప్, రియాక్షన్ వీల్స్, మాగ్నటిక్ టార్కల్స్, థ్రస్టర్స్ సాయంతో ఉపగ్రహాన్ని కక్ష్యలో స్థిరంగా ఉండేలా చూస్తారు.
బహుళ ప్రయోజనాల రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ
దేశ ఉపగ్రహాలు
-నేటి వరకు భారత్ వివిధ అవసరాలకోసం పలు ఉపగ్రహాలను విదేశాల సాయంతో స్వదేశీ వాహకనౌకల ద్వారా ప్రయోగించింది.
-ప్రధాన ఉద్దేశాల ఆధారంగా, ఉపగ్రహాల అవసరాల ఆధారంగా భారత ఉపగ్రహాలను పలు రకాలుగా విభజింవచ్చు.
1. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు
2. ఇన్శాట్ వ్యవస్థల్లోని ఉపగ్రహాలు
3. దిక్సూచీ వ్యవస్థలోని ఉపగ్రహాలు
4. ఇతర ఉపగ్రహాలు
రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ
-రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు లేదా భూపరిశీలనా వ్యవస్థలోని ఉపగ్రహాలు
-1988లో దేశంలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగంతో ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
-భారత భూపరిశీలనా వ్యవస్థ లేదా భారత రిమోట్ సెన్సింగ్ సంబంధిత కార్యకలాపాలను నేషనల్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (NNRMS) నిర్వహిస్తుంది. ఈ సంస్థ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
-రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు పంపే సమాచారాన్ని స్వీకరించడానికి, దాన్ని ప్రాసెస్ చేసి సమర్థవంతంగా భావితరాల ప్రయోజనార్థం వినియోగించడానికి హైదరాబాద్‌లోని జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA) పనిచేస్తుంది. దీని ఉపకేంద్రాలు- డెహ్రాడూన్, బెంగళూరు, నాగ్‌పూర్, ఖరగ్‌పూర్, జోధ్‌పూర్‌లో ఉన్నాయి.
-NNRMS కార్యకలాపాల్లో సహాయం చేయడానికి 10 స్టాండింగ్ కమిటీలు కలవు. అవి.. 1) వ్యవసాయం, నేలలు 2) జీవ వనరులు 3) భూగర్భ, ఖనిజ వనరులు 4) జలవనరులు 5) సముద్ర వనరులు 6) కార్టోగ్రఫీ అండ్ మ్యాపింగ్ 7) పట్టణ నిర్వహణ 8) గ్రామీణాభివృద్ధి 9) సాంకేతికత, శిక్షణ 10) వాతావరణ సలహా కమిటీ
-భూమిపై గల వస్తువులు తమపై పడిన సూర్యకాంతిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వెదజల్లుతాయి. అయితే వేర్వేరు వస్తువులు వెదజల్లే తరంగాలు వేర్వేరుగా ఉంటాయి.
-ఆ విధంగా వివిధ వస్తువులు తమపై పడిన సూర్యకాంతిని విద్యుదయస్కాంత రూపంలో వెదజల్లినప్పుడు ఆ తరంగాల ఆధారంగా ఆ వస్తువుల స్వరూప స్వభావాలను గుర్తించే ప్రక్రియను రిమోట్ సెన్సింగ్ అంటారు.
రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు
-ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ ద్వారా దేశంలో లభ్యమయ్యే, అందుబాటులో ఉన్న సహజవనరులు, పర్యావరణాన్ని అంచనా వేయవచ్చు.
-వ్యవసాయం, అటవీ సంపద, భూగర్భం, జలవనరులు, సముద్రాలకు సంబంధించిన వనరుల మ్యాపింగ్, అధ్యయనం, పరిశీలన, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు సులభతరం అవుతాయి.
-పట్టణ ప్రణాళికలో భాగంగా పలు పట్టణాభివృద్ధి కార్యక్రమాలను (ఏరియల్ సర్వే, రోడ్డు, రైలు మార్గాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణం మొదలైనవి) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సాయంతో సమర్థవంతంగా చేపట్టవచ్చు.
-దేశంలోని జీవవైవిధ్యప్రాంతాల గుర్తింపు, వాటి సంరక్షణ మొదలైన కార్యక్రమాలు చేపట్టవచ్చు.
-ప్రకృత్తి విపత్తుల సమయాల్లో సహాయం అవసరమైన ప్రాంతాల గుర్తింపు తద్వారా సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల ద్వారా జరిగిన నష్టం అంచనాలు రూపొందించడం చేయవచ్చు. పలు విపత్తు ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం ద్వారా తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టవచ్చు.
-కరువు ప్రాంతాల పరిశీలన, వ్యవసాయానికి అనువైన శీతోష్ణస్థితిగల ప్రాంతాల మ్యాపింగ్, సాయిల్ మ్యాపింగ్, భూ వినియోగం లేదా ల్యాండ్ కవర్ మ్యాపింగ్ వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
-పంటల విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలు రూపొందించవచ్చు.
-సముద్ర వనరుల మ్యాపింగ్ ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అనువైన చర్యలు తీసుకోవచ్చు.
-అటవీ విస్తీర్ణాన్ని గుర్తించి, అడవులు అంతరించి పోకుండా తగుజాగ్రత్తలు చేపట్టవచ్చు.
-భారీ డ్యాంల నిర్వహణ, నాణ్యత పరీక్షలు చేపట్టవచ్చు.
-తీరప్రాంత అధ్యయనం చేపట్టవచ్చు.
-కాలుష్య అంచనాలు, సంప్రదాయ శక్తివనరులకు సంబంధించిన అంచనాలు రూపొందింవచ్చు.
-సహజ నివాస ప్రాంతాల మ్యాపింగ్ ద్వారా జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు.
-ఇంటిగ్రేటెడ్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (1992)లో భాగంగా భూ, జల వనరుల అభివృద్ధి కార్యక్రమాలు 174 జిల్లాల్లో ప్రారంభమయ్యాయి.
దేశంలో రిమోట్ సెన్సింగ్
-భాస్కర-1 (1979), భాస్కర-2 (1981) ప్రయోగాలతో భారత్‌లో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోజనాలు పొందడం ప్రారంభమైంది.
-1974-75లో పంటతీరు, నేలతీరు అధ్యయనాల కోసం అనంతపురం (ఆంధ్రప్రదేశ్), పాటియాలా (పంజాబ్)లలో అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఇన్వెంటరీ అండ్ సర్వే ఎక్స్పెరిమెంట్ (ARISE) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-ARISE కార్యక్రమాన్ని ఇస్రో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌లు సంయుక్తంగా చేపట్టాయి.
-ప్రస్తుతం దేశంలో కింది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నాయి.
1. ఐఆర్ఎస్-1ఎ – 1988 మార్చి 17 – వోస్తోక్ యూఎస్ఎస్ఆర్- కాలపరిమితి పూర్తయింది.
2. ఐఆర్ఎస్-1బీ – 1991 ఆగస్టు 29 – వోస్టోక్, యూఎస్ఎస్ఆర్- కాలపరిమితి పూర్తయింది.
3. ఐఆర్ఎస్-పీ1 – 1993 సెప్టెంబర్ 20 – పీఎస్ఎల్వీ-డీ1 – విఫలం
4. ఐఆర్ఎస్-పీ2 – 1994 అక్టోబర్ 15 పీఎస్ఎల్వీ-డీ2 – కాలపరిమితి పూర్తయింది.
5. ఐఆర్ఎస్-1సీ – 1995 డిసెంబర్ 28 – మోల్నియా, రష్యా – కాలపరిమితి పూర్తయింది.
6. ఐఆర్ఎస్-పీ3 – 1996 మార్చి 21 – పీఎస్ఎల్వీ- డీ3 – కాలపరిమితి పూర్తయింది.
7. ఐఆర్ఎస్-1డీ – 1997 సెప్టెంబర్ 29 – పీఎస్ఎల్వీ సీ1 – కాలపరిమితి పూర్తయింది.
8. ఐఆర్ఎస్-పీ4 – 1999 మే 20 పీఎస్ఎల్వీ-సీ2 – కాలపరిమితి పూర్తయింది. (ఓషన్‌శాట్-1)
9. టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ (TES), 2001 అక్టోబర్ 22 – పీఎస్ఎల్వీ-సీ3
-పై తొమ్మిది ఉపగ్రహాల కాలపరిమితి పూర్తికాగా ప్రస్తుతం 12 ఉపగ్రహాలు సర్వీసులు అందిస్తున్నాయి.
10. ఐఆర్ఎస్- పీ6 (రిసోర్స్ శాట్-1) – 2003 అక్టోబర్ 17 – పీఎస్ఎల్వీ- సీ5
11. ఐఆర్ఎస్- పీ5 (కార్టోశాట్-1) – 2005 మే 5 – పీఎస్ఎల్వీ- సీ6
12. ఐఆర్ఎస్- పీ7 (కార్టోశాట్-2) – 2007 జనవరి 10 – పీఎస్ఎల్వీ- సీ3
13. కార్టోశాట్-2 – 2008 ఏప్రిల్ 28 పీఎస్ఎల్వీ- సీ9
14. ఇండియన్ మినీ శాటిలైట్ (ఐఎంఎస్1) – 2008 ఏప్రిల్ 28 పీఎస్ఎల్వీ- సీ9
15.ఓషన్ శాట్-2 – 2009 సెప్టెంబర్ 23 – పీఎస్ఎల్వీ- సీ14
16. కార్టోశాట్-2బీ – 2010 జూలై 12 – పీఎస్ఎల్వీ- సీ15
17. రిసోర్స్ శాట్2 – 2011 ఏప్రిల్ 20 – పీఎస్ఎల్వీ- సీ16
18. మెఘాట్రాపిక్స్ – 2011 అక్టోబర్ 12 – పీఎస్ఎల్వీ- సీ18
19. రిశాట్-1 – 2012 ఏప్రిల్ 26 – పీఎస్ఎల్వీ- సీ19
20. సరళ్ – 2013 ఫిబ్రవరి 25 – పీఎస్ఎల్వీ- సీ20
21. కార్టోశాట్-2సీ, – 2016 జూన్ 22 – పీఎస్ఎల్వీ- సీ34
-అన్ని ఉపగ్రహాలు ధృవానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తాయి.
-భవిష్యత్తులో రిసోర్స్‌శాట్-3, కార్టోశాట్-3, ఓషన్‌శాట్-3ల ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది.
-2013 మార్చి 17 నాటికి భారత ఐఆర్ఎస్ వ్యవస్థకు 25 ఏండ్లు పూర్తయ్యాయి.
ఇన్శాట్ వ్యవస్థ
-దీన్నే ఇండియన్ నేషనల్ శాటిలైట్ వ్యవస్థ అంటారు.
-భారత టెలికమ్యూనికేషన్స్ ప్రసారాలు, వాతావరణ అధ్యయనం, శోధన, సహాయక కార్యకలాపాల కోసం 1983లో ఇన్శాట్ వ్యవస్థ రూపుదిద్దుకుంది.
-ఈ తరహా ఉపగ్రహాలు బహుళ ప్రయోజనాలు కలిగి భూస్థిర కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాలు. వీటిని జీఎస్ఎల్వీ నౌకల ద్వారా ప్రయోగిస్తారు.
-ఇన్శాట్ వ్యవస్థ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థ.
-ఇన్శాట్ అనేది అంతరిక్ష విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత వాతావరణ శాఖ, ఆలిండియా రేడియో, దూరదర్శన్ల సంయుక్త భాగస్వామ్యంలో రూపొందింది.
-ఇన్శాట్ ఉపగ్రహాల్లో టెలివిజన్, కమ్యూనికేషన్ అవసరాల కోసం సీ బ్యాండ్, ఎస్ బ్యాండ్, ఎక్స్టెండెడ్ సీ బ్యాండ్, కే4 బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అమర్చారు.
-కొన్ని ఉపగ్రహాల్లో దిక్సూచి, ఖగోళ పరిశోధక పేలోడ్లను కూడా అమర్చారు.
-మొత్తం 24 ఉపగ్రహాలను ప్రయోగించగా ప్రస్తుతం 10 ఇన్శాట్ ఉపగ్రహాలు మాత్రమే సేవలందిస్తున్నాయి.
-కొన్ని ఉపగ్రహాల్లో ట్రాన్స్పాండర్లతోపాటు వెరీ హై రిజల్యూషన్ రేడియో మీటర్ (VHRR) (అంతరిక్షం, భూమిల నుంచి వచ్చే పరావర్తనాలను 5 బ్యాండ్ల తరంగాల రూపంలో గ్రహించగలిగే సెన్సార్), చార్జ్కపుల్డ్ డివైన్ (సీసీడీ), కెమెరాలు అమర్చి ఉంటాయి.
-ఇన్శాట్-1 శ్రేణి ఉపగ్రహాల తయారీ బాధ్యత ఫోర్డ్ ఏరోస్పేస్ (అమెరికా) చేపట్టగా, ఇన్శాట్-2 శ్రేణి నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ ప్రారంభమయింది.
ముఖ్యమైన ఇన్శాట్ ఉపగ్రహాలు
1) ఇన్శాట్-2ఈ – ఏరియన్ రాకెట్ – ఫ్రెంచిగయానా – 1999 ఏప్రిల్ 3
2) ఇన్శాట్-3బీ – ఏరియన్ రాకెట్ – ఫ్రెంచిగయానా – 2000 మార్చి 22
3) ఇన్శాట్-3సీ – ఏరియన్ రాకెట్ – ఫ్రెంచిగయానా – 2002 జనవరి 24
4) కల్పన-1 (మెట్శాట్-1) – పీఎస్ఎల్వీ-సీ4 – 2002 సెప్టెంబర్ 12
5) ఇన్శాట్-3ఏ – ఏరియన్ – ఫ్రెంచిగయానా – 2003 ఏప్రిల్ 10
6) జీశాట్-2 జీఎస్ఎల్వీ-డీ2 – 2003 మే 8
7) ఇన్శాట్-3ఈ – ఏరియన్ – ఫ్రెంచిగయానా – 2003 సెప్టెంబర్ 28
8) ఎడ్యుశాట్-2ఈ – జీఎస్ఎల్వీ ఎఫ్1 – 2004 సెప్టెంబర్ 20
9) ఇన్శాట్ 4ఏ – ఏరియన్ – ఫ్రెంచిగయానా – 2005 డిసెంబర్ 22
10) ఇన్శాట్ 4బీ – ఏరియన్-5 – ఫ్రెంచిగయానా – 2007 మార్చి 12
11) ఇన్శాట్ 4సీఆర్ – జీఎస్ఎల్వీ ఎఫ్4 – 2007 సెప్టెంబర్ 2
12) జీశాట్-8 – ఏరియన్-5 – ఫ్రెంచిగయానా – 2011 మే 21
13) జీశాట్ 12 – పీఎస్ఎల్వీ సీ17 – 2011 జూలై 15
14) జీశాట్ 10 – ఏరియన్-5 – 2012 సెప్టెంబర్ 29
15) జీశాట్ 16 – ఏరియన్-5 – 2014 డిసెంబర్ 6
16) జీశాట్ 6 – జీఎస్ఎల్వీ డీ6 – 2015 ఆగస్టు 27
భవిష్యత్తు జీఎస్ఎల్వీ ప్రయోగాలు
1. 2018లో జీశాట్-9ను జీఎస్ఎల్వీ-ఎఫ్9 (మార్క్-2) ద్వారా ప్రయోగిస్తారు.
2. 200 కేజీల బరువుగల సార్క్ ఉపగ్రహాన్ని 2017 మార్చిలో జీఎస్ఎల్వీ-ఎఫ్7 (మార్క్-2) ద్వారా ప్రయోగిస్తారు.
3. 2018లో జీఎస్ఎల్వీ-ఎఫ్10 ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించడానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది.
IRNSS (భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ)
-నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ లేదా నావిక్‌గా ప్రధానిచే నామకరణం చేయబడిన భారతదేశ దిక్సూచి వ్యవస్థను తొలుత భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థగా పిలిచేవారు.
-ప్రపంచంలో వివిధ దేశాలు ఏర్పర్చుకున్న ఈ వ్యవస్థలనే శాటిలైట్ నావిగేషన్ లేదా శాట్నాట్లుగా వ్యవహరిస్తారు.
-ఈ వ్యవస్థలను మిలిటరీ, పౌర ప్రయోజనార్థం, భూ, జల, వాయుమార్గాల్లో మార్గనిర్దేశనం కోసం వినియోగిస్తారు.
-కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా తన జీపీఎస్ సేవలు భారత్‌కు అందించడానికి నిరాకరించడంతో స్వీయ టెక్నాలజీతో సొంత దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని భారత్ నిర్ణయించింది.
చంద్రయాన్‌తో చరిత్ర లిఖించిన ఇస్రో
-కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా తన జీపీఎస్ సేవలు అందించడానికి నిరాకరించడంతో స్వీయ టెక్నాలజీతో సొంత దిక్సూచి వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని భారత్ నిర్ణయించింది.
-ఈ క్రమంలో 7 ఉపగ్రహాల శ్రేణి గల (అదనంగా మరో రెండు స్టాండ్‌బై అవసరాల కోసం) దిక్సూచి వ్యవస్థ నావిక్‌గా రూపొందింది. మొదటి ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏను 2013 జూలై 1న ప్రయోగించగా, చివరిది, ఏడోదైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీని 2016, మార్చి 28న ఇస్రో జవనాశ్వం పీఎస్ఎల్వీ-సీ33 35వ యాత్రలో దిగ్విజయంగా కక్ష్యలోకి చేర్చింది.
-ప్రయోగించిన ఏడు ఉపగ్రహాల్లో 4 భూఅనువర్తన కక్ష్యలో, 3 ఉపగ్రహాలు (ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ, 1ఎఫ్, 1జీ) భూస్థిర కక్ష్యల్లో పరిభ్రమిస్తాయి.
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లోని పేలోడ్లు
-ప్రతి ఉపగ్రహంలో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి.
నావిగేషన్ పేలోడ్
-ప్రామాణిక దిక్సూచి సేవలు అందించడానికిగాను ఎల్5 బ్యాండ్ (1176.5 మెగాహెర్ట్), ఎస్ బ్యాండ్ (2492.028 మెగాహెర్ట్)ల్లో పనిచేసే నావిగేషన్ సాధనాలను అమర్చారు.
రేంజింగ్ పేలోడ్
-దూరాలను కచ్చితంగా కొలవడానికి సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌ను అమర్చారు. లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్రెట్రో రిఫ్లక్టర్ను అమర్చారు.
-ఈ రకమైన పేలోడ్ల వల్ల భారత భూభాగంతో పాటు, దేశ సరిహద్దులకు ఆవల సుమారు 1500 కి.మీ.ల మేర స్టాండర్డ్ పొజిషనింగ్ సేవలు అందించవచ్చు.
-మిలిటరీ అవసరాలకు 10 మీటర్ల రిజల్యూషన్, సాధారణ పౌర అవసరాలకు 20 మీటర్ల రిజల్యూషన్ కచ్చితత్వంతో సేవలను పొందవచ్చు.
-సమయాన్ని కచ్చితంగా గణించడానికి రుబీడియం పరమాణు గడియారాలు అమర్చారు.
వ్యయం
-పూర్తిస్థాయిలో నావిక్ సేవలు అందించడానికిగాను ఒక్కో ఉపగ్రహంపై సుమారు రూ. 150 కోట్లు, వాహక నౌకలకు ఒక్కోదానికి సుమారు రూ. 130 కోట్లు, భూతల విభాగంలో ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్లను అందుకోవడానికి, విశ్లేషించడానికి కావాల్సిన కేంద్రాల వ్యయంతో కలిపి సుమారు రూ. 2000 కోట్లపైనే వ్యయం కానుంది.
నావిక్ సేవల కోసం ఏర్పాటైన వ్యవస్థలు
1. 24/7 విధానంలో దేశవ్యాప్తంగా 13 ఇండియన్ రేంజ్ అండ్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. భవిష్యత్తులో మరో రెండు ఏర్పాటవుతాయి.
2. ఒక ఐఆర్ఎన్ఎస్ఎస్ నెట్వర్క్ టైమింగ్ సెంటర్ (ఐఆర్ఎన్డబ్ల్యుటీ) ఏర్పాటు కాగా, మరో కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
3. ఇస్రో నావిగేషన్ సెంటర్ (ఐఎన్‌సీ) ఒకటి ఏర్పాటైంది. మరొకటి ఏర్పాటుచేస్తారు.
4. సమాచార ప్రసార నెట్‌వర్క్‌తో కూడిన స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎన్సీఎఫ్) కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. మున్ముందు మరో కేంద్రం ఏర్పాటు కానుంది.
ప్రయోజనాలు
-జీపీఎస్ తరహాలో రూపొందించిన ప్రత్యేక పరికరాలు, మొబైళ్ల సాయంతో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నాణ్యమైన దిక్సూచి సేవలందించడం నావిక్ వ్యవస్థ ప్రత్యేకత.
-ఈ వ్యవస్థ ద్వారా మిలిటరీ అవసరాలకు రిస్ట్రిక్టెడ్ సర్వీస్‌లను, సాధారణ పౌరులకు స్టాండర్డ్ పొజిషన్ సర్వీసుల రూపంలో నావిగేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు.
-విమానాలు, నౌకలు తదితరాలు నేటివరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన రాడార్ల పరిధిలోనే దూరం, సమయం ఎక్కువైనా ప్రయాణించక తప్పని పరిస్థితి.
-నావిక్‌తో ఈ ఇబ్బంది తొలగి దూరం, ఖర్చుతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
-వాహనాల గమనాన్ని పర్యవేక్షించడానికి నేవీకి సంబంధించిన ప్లేట్ల నిర్వహణలో దిక్సూచి సేవలు మిక్కిలి ఉపయోగం.
-ప్రకృతి విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో సహాయం అవసరమైన ప్రాంతాలకు, వ్యక్తులకు ఆయా సేవా వ్యవస్థలు త్వరగా చేరుకొనేలా దారిచూపి బాధితులకు సత్వర సహాయం అందేలా చేయవచ్చు.
-మిసైల్ టెక్నాలజీలో మిసైల్స్‌కు అవసరమైన నావిగేషన్‌ను అందించి వాటి కచ్చితత్వాన్ని పెంపొందించవచ్చు.
-మొబైల్ ఫోన్లతో అనుసంధానమైన జీపీఎస్ తరహా మ్యాపుల సాయంతో పర్యాటకులకు సహాయకారిగా ఉంటూ పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. దేశ, విదేశీ పర్యాటకులకు గమననిర్దేశ సౌకర్యాలను అందిస్తూ, వారు తక్కువ సమయంలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా చేస్తూ మధురానుభూతులను పంచవచ్చు.
-సహజవనరులను వెలికితీసే రిమోట్ సెన్సింగ్ వ్యవస్థతో నావిక్ వ్యవస్థను అనుసంధానించి ఆయా ప్రాంతాలకు సులభంగా చేరుకొనేందుకు సహాయపడుతుంది.
-మత్స్యకారులకు చేపలు అధికంగా దొరికే ప్రాంతాలను చూపిస్తూ, ఆ ప్రాంతాలకు తక్కువ సమయంలో, వీలైన దగ్గరి దారుల్లో చేరుకొనేలా సూచనలందిస్తుంది.
-పర్వతారోహకులకు, అడవుల వంటి వివిధ ప్రాంతాల్లో సాహసయాత్ర నిర్వహించే బృందాలకు గమన నిర్దేశణలో సహాయకారిగా ఉంటుంది.
భారత నావిగేషన్
-విమానయానంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల నియంత్రణ, సమన్వయానికి వీలుగా రీజినల్ నావిగేషన్ సిస్టం అభివృద్ధికి ఇస్రో, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా కృషి చేశాయి. దీనిలో భాగంగా ప్రధాన విమానాశ్రయాల్లో 2007లో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ సిస్టంను ఏర్పాటు చేశారు.
-దీనికిగాను గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్) అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
-ఇందుకోసం గగన్ పేలోడ్లను జీశాట్-6, జీశాట్-10, జీశాట్-15 ఉపగ్రహాలతో పాటు అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగాలు 2011 మే 21, 2012 సెప్టెంబర్ 29, 2015 నవంబర్ 10న జరిగాయి.
ఇతర ఉపగ్రహాలు
-ప్రత్యేక అవసరాల కోసం ప్రయోగించిన ఉపగ్రహాలు ఈ రకానికి చెందినవి.
1. చంద్రయాన్-1
2. మంగళ్యాన్
3. ఆస్ట్రోశాట్
చంద్రయాన్-1
-బరువు – 1380 కిలోలు
-ప్రయోగ తేదీ- 2008, అక్టోబర్ 22
-ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది.
-1380 కిలోల భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి మొదటిసారిగా పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ శ్రేణి నౌకను వినియోగించారు.
-పీఎస్ఎల్వీ-సీ11 తన 14వ యాత్రలో భాగంగా చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.
-పీఎస్ఎల్వీ-సీ11 పొడవు – 44.4 మీ
-బరువు-320 టన్నులు
-ప్రయోగం ప్రారంభమైన 18 నిమిషాలు 20 సెకన్లలో చంద్రయాన్-1 ఉపగ్రహం 22,866 కి.మీ. అపోజి 256 కి.మీ పెరీజి కలిగిన కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది.
-తదుపరి కక్ష్యపెంపు సంబంధ కార్యక్రమాలు చేపట్టడానికి, బెంగళూరులోని బ్యేలాలు వద్ద 18 మీటర్ల వ్యాసం ఉన్న ఒక భారీ యాంటెనాను డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటుచేశారు.
-భూమ్యాకర్షణ పరిధిని దాటిన మొట్టమొదటి ఉపగ్రహం చంద్రయాన్-1 కావడం విశేషం.
-చంద్రయాన్-1 ప్రయోగ విజయంతో, చంద్రుడి యాత్రను చేపట్టిన దేశాల వరుసలో భారత్ 6వ దేశంగా అవతరించింది.
-చంద్రుడు స్థావరంగా, భవిష్యత్తు రోదసీ కార్యక్రమాల రూపకల్పన, చంద్రుడి ఆవిర్భావాన్ని తెలుసుకోవడం కోసం చంద్రయాన్-1ను ప్రయోగించారు.
-పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 5 పేలోడ్లతో పాటు మొత్తం 11 పేలోడ్లను ఉపగ్రహంలో అమర్చారు. అవి
స్వదేశీ పేలోడ్లు
టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా (టీఎమ్సీ)
-దీని బరువు 7 కిలోలు
-చంద్రుడి త్రిమితీయ అట్లాస్‌ను రూపొందించడం దీని ప్రధాన విధి.
హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ (HySI)
-చంద్రుడి ఉపరితలం, లోపలి పొరల్లో లభ్యమయ్యే ఖనిజాలు, వాటి సంఘటనం గురించి పరిశోధిస్తుంది.
-ఇస్రో తయారుచేసిన ఈ ఉపగ్రహ పేలోడ్ బరువు 4 కిలోలు
ల్యూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ (ఎల్ఎల్ఆర్ఐ)
-చంద్రుడిపైనున్న శిలల అధ్యయనానికి ఉద్దేశించింది.
-చంద్రుడిపై గురుత్వాకర్షణను, క్రస్ట్‌లో సాంద్రత గూర్చి అధ్యయనం చేస్తుంది.
హైఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హెచ్ఈఎక్స్)
-కఠిన ఎక్స్ కిరణాల (30 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ – 250 కిలో ఎలక్ట్రాన్స్ వోల్ట్ సాయంతో చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది.
-ప్రాథమికంగా చంద్రుడి ఉపరితల ప్రాంతంలో యురేనియం-238, థోరియం-232ల ఉద్గారాలను పరిశీలించడానికి ఇస్రో తయారుచేసింది. బరువు 16 కిలోలు.
-చంద్రుడి ధ్రువప్రాంతాల వద్ద నీటి నిల్వలను పరిశీలిస్తుంది.
మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐవీ)
-చంద్రుడి ఉపరితలంపై కావాల్సిన లేదా ఎంచుకున్న ప్రాంతాల్లో ప్రోబ్ వంటి వాహనాలను దించడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంఐపీ తయారు చేశారు. బరువు 25 కిలోలు.
-2008, నవంబర్ 14న చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద షెకల్టన్ అనే క్రేటర్ వద్ద ఈ ప్రోబ్ దిగింది.
విదేశీ పేలోడ్లు
చంద్రయాన్-1 ఇమేజింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సీఐఎక్స్ఎస్)
-ఈ యూకే తయారీ పేలోడ్ బరువు 5.2 కిలోలు
-చంద్రుడి మెగ్నీషియం, అల్యూమినియం వంటి లోహాల విస్తరణను ఉపరితలంపై సమృద్ధిగా ఉన్న ఎక్స్ కిరణాల సాయంతో పరిశీలిస్తుంది.
-ఎక్స్‌రే ప్రతిదీప్తి విధానాన్ని ఉపయోగించి తన విధులను నిర్వర్తిస్తుంది.
-యూకేలో రూథర్ ఫర్డ్ ఆపిల్టన్ ల్యాబ్వారిచే వృద్ధి చేయబడింది.
స్మార్ట్ నియర్-ఇన్ఫ్రారెడ్ స్పెక్టోమీటర్ (ఎస్ఐఆర్-2)
-జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ సొసైటీ వల్ల వృద్ధిపరచబడింది.
-చంద్రునిపై ఖనిజ వనరుల మ్యాపింగ్, చంద్రుడి క్రస్ట్‌లోని వివిధ పొరల ఏర్పాటుపై అధ్యయనం చేస్తుంది.
మినీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ ఎస్ఎఆర్)
-నాసావారిచే తయారుచేయబడింది.
-చంద్రుని ధ్రువ ప్రాంతాల వద్ద నీటి జాడలను గుర్తించడానికి ఉద్దేశించబడింది.
సబ్ Kev ఆటం రిఫ్లెక్టింగ్ అనలైజర్ (ఎస్ఎఆర్ఏ)
-స్వీడన్‌లోని స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్చే తయారుచేయబడింది.
-చంద్రుడి ఉపరితలం అయస్కాంత క్షేత్రంపై సౌర పవనాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?