Let’s check for cancer | క్యాన్సర్‌కి చెక్ పెడదామా..!
కచ్చితమైన కారణం తెలియదు… చిన్నాపెద్దా తేడా లేదు.. పేద, ధనిక, స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా అందరినీ కలవరపెట్టే మహమ్మారి క్యాన్సర్. దీన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొంతవరకుదూరంగా ఉంచడం సాధ్యమే. అవగాహన పెంపొందించుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా నివారించుకోవచ్చు. తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్సకు లొంగేట్టు చేసుకోవడం మనచేతుల్లోనే ఉంది.
మనదేశం క్యాన్సర్ మరణాల సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. దశాబ్ద కాలంలో క్యాన్సర్‌కు గురై మరణిస్తున్న వారి సంఖ్య రెండింతలయింది. మనదేశంలో పిల్లల క్యాన్సర్లు పెద్దవారితో పోలిస్తే 5 శాతం వరకు ఉంటాయి. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువైతే, పురుషుల్లో ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు సంబంధించినవి, కాలేయ క్యాన్సర్లు, వయసు పైబడినవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటున్నాయి. మనదేశంలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లివర్ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎక్కువే.
జీవం ఉండే ప్రతి కణం క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే జంతువులు, మొక్కలు కూడా క్యాన్సర్‌కు గురవుతూ ఉంటాయి. వయసైపోయిన కణాలను భర్తీ చేయడానికి జరిగే కొత్త కణాల పుట్టుక సహజ సిద్ధంగా, క్రమబద్ధంగా జరిగే ప్రక్రియలో తేడా వస్తుంది. తద్వారా పాతబడిన కణాలు మృతి చెందకుండా అనేక కొత్త కణాలు పుట్టుకువస్తాయి. దాంతో కణితులు ఏర్పడుతాయి. అపరిమితంగా పెరిగే ఈ కణాలు రక్తం ద్వారా ఇతర శరీర భాగాలకూ పాకుతూ ఉంటాయి. కణితి పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న శరీర భాగాలకు రక్తం, లింఫ్ ద్వారా ఏ శరీర భాగానికైనా వ్యాపిస్తాయి. ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, స్మోకింగ్, వృత్తిపరమైన కారణాలు, కాలుష్యం, కుటుంబ చరిత్ర, కొన్ని రకాల వైరస్లు, బాక్టీరియాలకు గురవడం, హార్మోన్లు అతిగా వాడడం, రేడియేషన్, అధిక బరువు, వయసు పైబడడం ఇలా అనేక కారణాలుంటాయి. కొన్ని మనచేతుల్లో లేనివైతే మరికొన్ని చేజేతులారా తెచ్చుకుంటాం.
వయసు
నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్సిఎల్) సర్వే ప్రకారం కొత్తగా కనుక్కునే క్యాన్సర్లలో 60 శాతం 65 ఏళ్లు పైబడినవారిలో కన్పించడమే గాక వీరిలో 70 శాతం వరకు మరణిస్తుంటారు. 60 ఏళ్లు పైబడినవారు చిన్న వయసు వారితో పోల్చుకుంటే 10 రెట్లకు పైగా క్యాన్సర్‌కు గురవుతూ ఉంటారు. కోలోరెక్టల్, ప్రొస్టేట్, పాంక్రియాస్, లంగ్, లివర్, మూత్రాశయం, పొట్ట, రొమ్ము క్యాన్సర్లు వయసు పైబడినవారిలో మరింత ఎక్కువ.
ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు
పొగతాగడం, లేదా పొగాకును ఏ రకంగా వాడడం ద్వారా అయినా క్యాన్సర్‌కు గురవ్వొచ్చు. పురుషుల్లో 50 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకం ద్వారా వచ్చేవే. స్త్రీ, పురుషుల్లో స్మోకింగ్ అలవాటు ఉంటే, హెడ్ అండ్ నెక్, లంగ్ క్యాన్సర్లే కాదు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. పొగతాగే అలవాటు ఉండే స్త్రీలు గర్భాశయ క్యాన్సర్‌కు గురవుతూ ఉంటారు. పొగ తాగడంతో పాటు ఆల్కహాల్ అలవాటు ఉంటే ఇక వీరిలో ఏ క్యాన్సర్ అయినా వచ్చే అవకాశం మరింత ఎక్కువ. దురదృష్టవశాత్తు ఈ అలవాట్లు కొంతకాలం ఉండి, తరువాత వాటికి దూరంగా ఉన్నా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెద్దగా ఏమీ తగ్గదు.
బరువు, ఆహారం
మాంసాహారం, నూనెలు, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకునేవాళ్లలో సమస్య ఎక్కువ. కోలన్, రెక్టమ్ క్యాన్సర్లు రెడ్‌మీట్ ఎక్కువగా తినేవారిలోనే అధికం. ఇటువంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలోనే ఊబకాయం కూడా ఉంటుంది. అధిక బరువుకు అనేక రకాల క్యాన్సర్లకు సంబంధం ఉన్నట్లు పరిశోధనలు తెలియజేశాయి. బరువు అధికంగా ఉండి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని తగ్గినవారు బరువు తగ్గనివారికంటే తక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నట్టు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
వంశపారంపర్య లక్షణాలు
కుటుంబచరిత్రలో మరీ దగ్గరి సంబంధీకులు రొమ్ము క్యాన్సర్‌కు గురైతే అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా తొలిదశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తే దాన్ని అదుపులో ఉంచడం సాధ్యమే. స్వయంగా పరీక్షించుకోవడంతో పాటు 40 ఏళ్ల నుంచే మామ్మోగ్రామ్ చేయించుకుంటే ఉంటే తొలిదశలోనే గుర్తించవచ్చు. అమ్మ, అమ్మమ్మ, అక్కచెల్లెళ్లలో ఎవరైనా ఈ క్యాన్సర్‌కు గురైతే జాగ్రత్త తప్పనిసరి. చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తీసుకోవడం, ఆడపిల్లలైతే పదేళ్లు నిండగానే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవడం, సమతులాహారం, అధిక బరువు లేకుండా చూసుకోవడం, రేడియేషన్‌కు దూరంగా ఉండడం, సంతానలేమికి హార్మోన్లు వాడాల్సి వస్తే జాగ్రత్తగా వాడడం, పొగతాగడం, ఆల్కహాల్‌ను దూరంగా ఉంచడం వంటి వాటితో క్యాన్సర్‌కు కొంతవరకైనా చెక్ పెట్టవచ్చు. వయసు పైబడ్డాక ఆకస్మికంగా కనిపించే ఏ మార్పునూ నిర్లక్ష్యం చేయవద్దు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?